ఒంగోలులో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ
తెలుగు నాటక సౌధానికి తలమానికంగా నిలిచిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ 23-12-19, సోమవారం సాయంత్రం ఒంగోలులోని సి.వి.యన్ రీడింగ్ రూం లో ‘శ్రీ నాగినేని నరసింహరావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ‘ ఆధ్వర్యంలో జరిగింది. సభకు సంస్థ అధ్యక్షులు మిడసల మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు.ఈసందర్భంగా నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డా.నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ బలిజేపల్లి వారు 1881డిసెంబర్ 23వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా లోని ఇటికంపాడులో ఆదిలక్ష్మమ్మ, నరసింహ శాస్త్రి దంపతులకు జన్మించారని,ఆయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్ళి అక్కడే ఈసందేశాత్మకమైన నాటకం “సత్య హరిశ్చంద్ర” ను రచించారని అన్నారు.అనంతరం రంగస్థల నటులు కనమాల రాఘవులు మాట్లాడుతూ ఈనాటకాన్ని శతాధికకవులు నాటకంగా రాసినప్పటికీ బలిజేపల్లి వారి నాటకమే అజరామరంగా నిలిచిందని పేర్కొన్నారు.కవితాశక్తితో పాటు దేశభక్తి కూడా ఆయనకు ఎక్కువగా ఉందని,ఆయన పద్యాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని డా.నూనె అంకమ్మరావు,కుర్రా ప్రసాద్ బాబులు తెలుపగా,బలిజేపల్లి వారి పద్యాలను రాగయుక్తంగా భువనగిరి పురుషోత్తం,ఆశీర్వాదంలు చక్కగా ఆలపించారు.
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అందించిన హరిశ్చంద్ర నాటకం తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు ప్రేరణ. రంగస్థల కళాకారులు, పద్య, గద్య రచయితలు బలిజేపల్లి పేరును మరిచిపోలేరు. నిత్య సత్యవంతుడు హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి కథ ఆధారంగా బలిజేపల్లి 1912లో ‘హరిశ్చంద్రీయము’ నాటకం తన 31వ యేట రాశారు. ఈ నాటకంలో హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు పాత్రలను లక్ష్మీకాంతమే పోషించారు. ఇందలి పద్య రచన ఒక జలపాతం. పండిత, పామరుల్ని అలరింప జేశాయి. పంటచేలల్లో పనులు చేసుకునే వారి నాలుకలపై సైతం నర్తించాయి. బలిజేపల్లి వారు చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహంతో చిత్ర సీమలోకీ అడుగు పెట్టారు. అనసూయ (1936), జరాసంధ (1938), వరవిక్రయం (1939), భూకైలాస్ (1941), బాల నాగమ్మ (1944) వంటి పదికి పైబడిన సినిమాలలో మాటలు, పాటలు, సంభాషణలు వంటివి రాశారు. కొన్ని సినిమాల్లో పాత్రలు వేశారు. శివానందలహరి శతకం, స్వరాజ్య సమస్య పద్య కృతి, బ్రహ్మ రధం, మణి మంజూష నవలలు, బుద్థిమతి విలాసం, ఉత్తర రాఘవీయం నాటకాలు రాశారు. 1923లో చల్లపల్లి రాజా సహకారంతో గుంటూరులో చంద్రిక ముద్రణాలయాన్ని స్థాపించారు. 1926లో ఫస్ట్ కంపెనీ పేరిట నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1930లో రంగూన్ తెలుగువారు ‘కవితా కళానిధి’ బిరుదుతో సత్కరించారు. 1942లో చలనచిత్ర రంగం ‘పుంభావ సరస్వతి’ బిరుదుతో సన్మానించింది. శేష జీవితాన్ని కాళహస్తిలో గడిపి 1953లో కన్నుమూశారు.