“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”
… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.
నేను ఆయనకు ఒక్కటే చెప్పాను…
మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి 50 ఏళ్ళ పాటు నిత్య ఉత్సాహంగా హుందాగా క్లాసిక్ గా రిచ్ గా కార్యక్రమాలు నిర్వహించడం ఒక్క వంశీ రామరాజు గారికే సాధ్యం. మరో వైపు కుంట్లూరులో వేగేశ్న వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది దివ్యాంగులకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిస్తున్న విద్యాదాత ఆయన. ఆ ప్రాంగణంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయంతో పాటు ఘంటసాలగారికి ప్రత్యేక గుడి కట్టించి నిత్య పూజలు చేయిస్తున్న గొప్ప ఆధ్యాత్మిక వేత్త ఆయన. నటులను, గాయకులను, కళాకారులను, సాహితీ వేత్తలను ఎందరినో ప్రోత్సహించి సత్కరించిన కార్యనిర్వాహణ దక్షుడు ఆయన. అంతెందుకు బాలుగారిని హైదరాబాద్ లో లలిత కళాతోరణంలో తొలి సారి సత్కరించింది వంశీ సంస్థనే. బాలు బృందం చే తొలి సంగీత విభావరి ఏర్పాటు చేసింది ఆయనే. బాలుగారిని ఎన్నో సార్లు పలు అవార్డులతో సత్కరించిన ఘనత కూడా అయనదే. బాలు గారితో ఆయనకు వున్న అనుబంధం అంతా ఇంతా కాదు.
అక్కినేని నాగేశ్వరరావు గారు తన పేరిట అవార్డు నెలకొల్పి కేవలం నటులనే సన్మానించలేదు. వివిధ రంగాల్లోని ప్రముఖులను సత్కరించేవారు. ఆ స్ఫూర్తి తోనే ప్రాగ్నిక ఆర్ట్స్ ప్రవీణ్ కుమార్ గారు బాలు స్మారక పురస్కారం కోసం వంశీ రామరాజు గారిని ఎంపిక చేయడం జరిగింది” అని వివరించాను.
ఆ పెద్దాయన ఇదంతా విని…”అయ్యో వంశీ రామరాజు గారు ఇంత సేవ చేస్తున్నారా? తెలియదండి, నిజ్జంగా ఆయనకు బాలు పురస్కారమే కాదు, భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించాలండి”” అన్నారు.
ఆనాటి రచయిత్రి లతగారి నవల వంశీ నచ్చి ఆ పేరిట ఆయన వంశీ సంస్థను ప్రారంభించారు. ఆయన ఇంటిపేరు రామరాజు. వంశీ రామరాజుగా ముద్ర పడిపోయారు. అసలు పేరు రామరాజు పురుషోత్తం దాస్ టాండన్.
సాంస్కృతిక సంస్థను 50 సంవత్సరాలుగా నడిపించడం గొప్ప స్ఫూర్తి అని, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్న “కళాబ్రహ్మ” వంశీ రామరాజు జీవితం ధన్యం అని ముఖ్య అతిధిగా విచ్చేసిన దూరదర్శన్ పూర్వ డైరెక్టర్ శ్రీమతి శైలజ సుమన్ అభినందించారు.
హైదరాబాద్, సిటీ కల్చరల్ సెంటర్ లో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కె.వి.ఎల్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత ఎస్. పి. బాలు గారికి 12 గంటలపాటు స్వర నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా వంశీ రామరాజుగారిని బాలు స్మారక పురస్కారంతో సన్మానించారు. ఈ వేడుకలో శ్రీ దైవజ్ఞ శర్మ, డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ ఎన్. పురుషోత్తం, శ్రీమతి అఖిల పాల్గొన్నారు. పి.ఎం.కె. గాంధీ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణ. శ్రీ ప్రవీణ్ కుమార్, శ్రీమతి పారిజాత పర్యవేక్షించారు.
-మహ్మద్ రఫీ
ఫోటోలు : శ్రీ శ్రీనివాస్ కంచె