చింతామణి నాటకం నిషేధం…!

“అత్త వారిచ్చిన అంటు మామిడి తోట”
“కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు”

ఇలాంటి అద్భుత పద్యాల ఆణిముత్యం చింతామణి నాటకం ఇక కనిపించదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఈ నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది నుంచి ఈ నాటకం పై నిషేధం తాత్కాలికంగా అమలులో ఉంది. ఇప్పుడు పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం జివో విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య సంఘాలతో పాటు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హర్షం వెలిబుచ్చారు. కళాకారులు, అభిమానులు మాత్రం అవాక్కయ్యారు. నాటక నిషేధం పై మరోసారి పెద్ద మనసు తో అలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కొండొకచో కొందరు కళాకారులూ నిరసనలకు సన్నాహం అవుతున్నారు.

నిజానికి చింతామణి సాంఘిక నాటకం అద్భుతం. సామాజిక సమస్యలను, పురుషుడి బలహీనత లను ఎత్తి చూపించిన నాటకం. వేశ్యా వృత్తి దురాచారం. పై దునుమాడిన నాటకం! ఆద్యంతం నవ్విస్తూనే గొప్ప హిత బోధ చేసిన అద్భుత నాటకం.

మహాకవి కీర్తిశేషులు కాళ్ళకూరి నారాయణరావుగారి అత్యద్భుత సృజన. తొలి ప్రచురణ వచ్చిన 1923 నాటికే 500 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న నాటకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించి ఒక కుదుపు కుదిపేసిన సంచలన నాటకం చింతామణి.

గత ఏడాది ఏలూరులో చింతామణి నాటక శతజయంతి ఉత్సవాలు నిర్వహించే సమయంలో వైశ్య సంఘాలు నిరసన తెలియ చేశాయి. ప్రభుత్వం స్పందించి గత ఏడాది ఫిబ్రవరిలో చింతామణిని బ్యాన్ చేసింది. ఇవాళ ఇక పూర్తిగా నిషేధిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

నిషేధం సబబేనా ?!

చింతామణి నాటకం నిషేధించేంత ఏమి లేదు కానీ, అందులో సుబ్బిశెట్టి పాత్రను మరీ అధ్వాన్నంగా వెకిలిగా ప్రదర్శిస్తూ ఆయా పాత్రను పోషించే కళాకారులు ఎబ్బెట్టుగా మార్చేశారు. ఆర్య వైస్యుల మనోభావాలను దెబ్బ తీసేలా ప్రదర్శించడం అలవాటుగా మారిపోయింది. ఇది రచయిత కాళ్ళకూరి గారికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. ఆ పాత్రను పోషించే కళాకారుల పైత్యమే. ఫలితం ఒక అద్భుత నాటకం కాలగర్భంలో కలిసిపోయింది.

ఇప్పటికి అయినా కళాకారులు మేల్కోవాలి. సుబ్బిశెట్టి పాత్ర ను వెకిలి తనం లేని హాస్య పాత్రలో చూపించేలా మలచుకోవాలి. అవసరం అయితే ఆ పాత్ర ను పూర్తిగా తొలగించడం లేదా నిడివి తగ్గించు కోవాలి. ఎవరి మనోభావాలు దెబ్బ తీసే హక్కు ఎవ్వరికి లేదు. ఈ మేరకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి! ఎందుకంటే, సుబ్బిశెట్టి పాత్ర ను మినహాయిస్తే అదొక అద్భుత సందేశాత్మక నాటకం. చింతామణి నాటకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

  • డా.మహ్మద్ రఫీ
    _____________________________________________________________________
  • ‘చింతామణి’ నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలి

(విజయవాడలో కళాసంస్థల సమావేశం)

“చింతామణి” నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని నిరసిస్తూ..
ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ వివిధ సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో
ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో 19.1.2022 (బుధవారం) ఉ. 10.30 గంటలకు విజయవాడ బాలోత్సవ్ భవన్ లో (రాఘవయ్య పార్క్ సమీపంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం– ఎంబీవీకే పక్కనే- హెల్ప్ హాస్పిటల్ రోడ్) సమావేశం జరుగుతుంది.
కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా కళాకారులు, అభ్యుదయ కాముకులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి.
సమావేశానంతరం ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలోని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాలని ప్రతిపాదన. సమావేశం నిర్ణయం ప్రకారమే తదుపరి కార్యాచరణ.
……………………………………………………………………………………………………………….

నిన్నటి రోజున చింతామణి నిషేధపు ఉత్తర్వుల పై చర్చ జరిపిన వారందరికీ ముందుగా నా నమస్కారాలు.

నిన్నటి విస్తారమైన చర్చ తర్వాత నా అభిప్రాయాన్ని మీ ముందుంచుతున్నాను.

చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ నిన్న జీవో వెలువడటం- తాత్కాలికంగా స్తబ్దత రూపాన్ని సంతరించుకున్న తుఫాను తిరిగి తీరాన్ని తాకటమే! ఈ జీవో ఒకటి రాబోతోందన్న నేపథ్యంలో కూడా వేడి వేడి చర్చలు జరిగి చల్లబడ్డాక,నిన్నటి ఫైన్ మార్నింగ్ నివురుగప్పిన నిప్పు రూపంలో మళ్లీ తన విజృంభణ చూపింది.

ఈ మధ్య కాలంలో కూడా మళ్లీ వార్తల్లోకి వచ్చి సెన్సేషన్ అయిన నాటకం చింతామణి- యధాతధంగా-బూతు నాటకంగా నిశ్శబ్దంగా, దొంగ తన పని తాను కానిచ్చినట్లు, ప్రదర్శనలు జరిగాయి. ఎవరు అడ్డుకోలేదు. దాంతో బాధిత సామాజికవర్గం ఇప్పుడు తిరిగి కీలెరిగి వాత వడ్డించారు, ప్రభుత్వ ఉత్తర్వు రూపంలో.

ప్రస్తుత ప్రభుత్వం కళాకారుల, నాటకరంగం పట్ల వేసిన శీతకన్ను- కళాకారుల అర్హమైన బకాయిల చెల్లింపు, కరోనా కాలంలో కళాకారుల కోసం సహాయక చర్యలు, రాష్ట్ర స్థాయి నాటక పోటీలు వంటి వాటి విషయమై నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఏ విధమైన తన స్పందన తెలియ చేయలేదు.

నాయకులు కొందరు కొన్ని వేదికలపైన ప్రభుత్వం నాటక రంగంపై పట్ల శ్రద్ధ పెడుతున్నది, పెడుతుంది.. అని చెప్పిన మాటలు కంటితుడుపే అయ్యాయి అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే

ఈ రోజు ప్రభుత్వమనే కొండచిలువ నోట్లోకి నిరసన, అభ్యర్థన పత్రాలు.. సమర్పించడం వంటి- ఈగలను తొలే ప్రయత్నం చేస్తామంటున్నారు.(ఇవి నిందా వాక్యాలు కావు) ప్రయత్నం చేయాల్సిందే కానీ, అసలు సమస్య పై ఫోకస్ పడలేదు. ఆగిపోయిన జీవో రావడానికి కారణమైన అశ్లీల లేదా ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వికృత రూపాన్ని సంతరించుకున్న “మాస్ మసాలా” ప్రదర్శనలు అడపాదడపా జరుగుతున్న నేపథ్యంలో- ప్రభుత్వం ఎప్పటిలా ఆలోచించకుండా, చర్చించకుండానే, నిషేధం విధించి చేతులు దులుపుకుంది.

నా విన్నపం ఒకటే- కళాకారుల సత్తా ఏమిటో తెలిసిన ప్రభుత్వం స్పందిస్తుంది అనుకోను. అయితే ఈ ప్రయత్నం ద్వారా ప్రభుత్వాన్ని, సదరు “సామాజిక వర్గం వారిని” శాంతింప చేయాలి,జీవోను ఉపసంహరింపచేయాలి, అంటే- ఎవరైతే నిషేధానికి కారణమో, వారి చేత అలాంటి నాటకాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన, ఇస్తున్న వారిని ముందుకు తెచ్చి,ఇకపై అలా ప్రదర్శించబోము అని ఆయా కళాకారులతో హామీ ఇప్పించగలిగితే, ఈనాటి ప్రయత్నం సఫలం కాగలదు అని నా అభిప్రాయం.

లేదా నీళ్ళలోంచి పైకెగిరిన చేప (జీవో) మళ్లీ నీటిలో మునిగి, తన పని తాను చేసుకుంటుంది

నా మాటలు నచ్చని వారు నాకు సమాధానం ఇవ్వడంపై కంటే, తమ కార్యాచరణపై దృష్టి పెట్టడం మేలు. నా ఆలోచన సమర్థనీయం అని మీరు అనుకుంటేనే చెప్పండి.

మల్లేశ్వరరావు ఆకుల

SA:

View Comments (2)

  • విజయవాడలో బుధవారం నాటి సమావేశాన్ని దిగ్విజయం చేద్దాం.

  • ప్రేక్షకులు ఆధరిస్తున్నారని మంచి సందేశాత్మక నాటకాన్ని బూతు నాటకంగా మార్చడం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి...
    నిరసన సబబే...