విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావులను జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 41
బాపు రాసే అక్షరం ప్రత్యేకం
బాపు గీసిన బొమ్మ ప్రత్యేకం
బాపు తీసే చలనచిత్రం ప్రత్యేకం
ఇలా బాపు ప్రదర్శించే కళానైపుణ్యంలో ప్రత్యేకతలు అనేకం
న్యాయవాది కావలసిన బాపు
చిత్రకళ లో విలక్షణతకు ఓ పునాదిగా మారారు…
బాపు కలానికి, కుంచెకు వేదికయ్యింది తెలుగునేల
బాపు కాలానికి పరవశించింది తెలుగునేల…
తెలుగుతల్లి గళసీమలో ఆణిముత్యాలహారం బాపు అక్షరమాల…
బాపు గీసిన చిత్రాలు చూపరులను కట్టిపడేస్తాయి
బాపు తీసిన చలనచిత్రాలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి…
బాపు కార్టూన్లు నవ్వుల జల్లులు కురిపిస్తాయి
అందుకే కదా బాపు చిత్రకళా కౌశలానికి ప్రపంచస్థాయి…
బాపు బహుముఖ ప్రతిభకు వారి చలన ‘చిత్రా’లే సాక్షి
సౌందర్య ఆరాధకుడయిన బాపు ఆరాధ్యదైవం ‘అందాల రాముడు ‘
ఆరోగ్యకరమైన చలనచిత్రాలు తీసిన ‘బుద్ధిమంతుడు’ బాపు
బాపు రాతలు-గీతలు తెలుగు వాకిళ్ళలో చెరగని ‘ముత్యాల ముగ్గులు ‘
చిత్ర కళామతల్లికి బాపు దేహమే ఓ’దేవాలయం ‘
అందుకే అయ్యాడు బాపు ‘కళాప్రపూర్ణుడు ‘
చిత్రకళలో బాపూది ఓ శకం.. సృజనలో వారిదో యుగం
నిత్యనూతనం బాపు గీసిన బొమ్మల సోయగం
పదహారణాల తెలుగుదనానికి బాపు ‘అక్షర ‘సాక్ష్యం
బాపూ లా బొమ్మలు గీయాలన్నదే వర్థమాన చిత్రకారుల లక్ష్యం
ఇదే అమర చిత్రకారుడైన బాపు చిత్రకళా వైభవానికి భౌతిక సాక్ష్యం
(ఆగస్ట్ 31 న బాపు గారి వర్థంతి సందర్భంగా..)
Super sir