డిశంబర్ 15న హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో బాపు-రమణ అకాడమీ (ఆత్రేయపురం-హైదరాబాద్) ఆధ్వర్యవంలో బాపు జయంతి ఉత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ప్రముఖ ‘ముఖ’ చిత్రకారులు శంకర్ నారాయణకు బాపు పురస్కారంతో, ప్రముఖ సినీ దర్శకులు వంశీకి ‘రమణ’ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సినీనటుడు శ్రీతనికెళ్ళభరణి, శ్రీఓలేటి పార్వతీశం, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీనటి దివ్యవాణి, శ్రీవేమూరి సత్యనారాయణ, శ్రీమతిగాయత్రి భార్గవి తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా.కె.వీ.రమణాచారిగారు మాట్లాడుతూ-తెలుగు సంస్కృతి ఉన్నంతవరకు బాపురమణలు ఉంటారన్నారు. మన అందరి మనసుల్ని జివ్వున లాగే సేంత గొప్పగా, ఎన్నటికీ మరిచిపోలేనంత మధురమైన చిత్రాలనందించిన బాపూ రమణల జోడినే కాదు… బాపురమణ అకాడమీని, దాన్ని ఆవిష్కరించిన ఆత్రేయపురాన్ని ఇంకెలా అభివర్ణించ గలం? అన్నారు. ఈ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వేవేల గ్రామాలవారూ, తమ గ్రామాల్లోని విశిష్ట వ్యక్తుల సత్కారంతో ముందుకొచ్చే స్ఫూర్తిని కలిగించిన బాపూరమణ అకాడమీని ఘనంగా అభినందించారు. వారీ విధంగా నెలకొల్పిన ఉన్నతాదర్శాన్ని గొప్పగా శ్లాఘించారాయన. అవార్డు గ్రహీతలు వంశీ, శంకర్‌నారాయణగారు మాట్లాడుతూ- ఆత్రేయపురంతో ఉన్న అనుబంధాలను వేదిక మీద పాలు పంచుకున్నారు. వంశీ మాట్లాడుతూ ఆత్రేయపురం పరిసరప్రాంతాల్లో ఉన్న కృష్ణం రాజుగారి హోటల్ తదితర ప్రాంతాలను గుర్తు చేసుకున్నారు.
బాపు, రమణ జంట శాశ్వత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుందని చెప్పారు. తెలుగుదనానికి ఓ ట్రేడ్ మార్క్ గా నిలిచిన బాపు, తెలుగు మహిళను అందంగా చూపగలగటం ఆయనకే చెల్లిందని అన్నారు
ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ళ భరణి. బాపు రమణ అకాడమీ వారు ఆత్రేయపురం నుంచి హైదరాబాదు కొచ్చి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళావేదిక మీద కనువిందు చేసిన జంట పురస్కార వేడుక, బాపు రమణల్లాగే చాలా అరుదైన అద్భుతంగా అభివర్ణించారాయన. – ‘కళామిత్ర’ వేగిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ – బాపూరమణ అకాడమీ వివిధ కళారంగాల్లోని విశిష్ట ప్రముఖుల్ని సత్కరించాలని సంకల్పించి, ఆ సత్కార్యానికి శ్రీకారం చుట్టామని, ప్రతీ ఏటా ఇరువురు మహనీయులు బాపు, రమణలను స్మరించుకుంటూ వివిధరంగాలలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న ఇద్దరికీ ఈ వీరిరువురి పేరున అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ మారుమూల గ్రామమైన తమ ఆత్రేయపురం గ్రామీణ కథాంశాల చిత్రాలకు శ్రీకారం చుట్టిందని, ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో భాసిల్లుతున్న వారున్నారని అన్నారు. బాపు, రమణలతో తమ ఆత్రేయపురానికి కేవలం పూతరేకుల అనుబంధమే కాదు. ప్రత్యేక అనుబంధముందని, ఆ అనుబంధమే అకాడమీ ఏర్పాటు చేసేలా చేసిందని చెప్పారు. వారి పేరుతో వివిధ రంగాల ప్రముఖులను సత్కరించు కోవడం మరింత ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.
బాపురమణ అకాడమీ, పూల గుచ్ఛాలకు బదులుగా ఆత్రేయపురం పూతరేకులను, అలాగే కార్టూనిస్టుల రూపురేఖలు, ఆనాటి వానచినుకులు పుస్తకాలను అతిథులకు బహూకరించారు.