
విశాఖపట్నం నగరంలోని బర్మా కేంపు గురించి రాసిన అత్యద్భుతమైన కథలు. తప్పక చదవాల్సినవి. వీటిలో హాస్యం ఉంది. వ్యంగ్యం ఉంది. విషాదం ఉంది. తోటి మనుషుల మీద ప్రేమ, మమకారం ఉంది. ఇది నిండైన బతుకు పుస్తకం.
బర్మాకేంపుకథలు ఒకనాటి చరిత్రనీ, వలసబతుకులనీ, ప్రాంతీయ అస్తిత్వాన్నీ కలుపుకున్న గాథలు. చిన్న చిన్న కథలుగా విడగొట్టబడ్డ ఓ ప్రాంత చరిత్ర. నవ్విస్తూ, ఏడిపిస్తూ, అబ్బురపరుస్తూ, భాషని, యాసనీ కలుపుకున్న ఒక ప్రత్యేక రచన .వైజాగు ప్రాంతం వాళ్లైతే బర్మాకేంపు మార్పులను గుర్తు చేసుకుంటారు. ఇతర ప్రాంతాల వాళ్లైతే బర్మాకేంపు మీదా అక్కడి ప్రజల మీదా, వాళ్ల భాష మీదా ప్రేమ పెంచుకుంటారు.

రచయిత హరి వెంకట రమణ తను పుట్టిన భూమికీ, అక్కడి ప్రజలకూ. వేలకిలోమీటర్లు నడిచిమరీ రంగూన్ నుంచి భారతదేశానికి వలసకాండ్రుగా తిరిగివచ్చి ఇక్కడ బర్మాకేంపుగా ఏర్పడ్డ పూర్వీకులకూ ఇచ్చిన నివాళి ఈ పుస్తకం. .
కాస్త దుఃఖమూ, కొంత నవ్వులతో పాటు ఒక ప్రత్యేక ప్రాంతం గురించి కొత్తవిషయాలు తెలుసుకున్నామన్న సంతృప్తినిచ్చే రచన ఇది. ఊరి సాహిత్యం ఎంతగా వస్తే మన సాహిత్యం అంతగా ప్రజాస్వామికం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని వలస జీవితాలు తెలుగువారికి ఉన్నాయి అంటారు. అటువంటి జీవితాల ప్రదర్శన ఈ కథల్లో చూడవచ్చు.
జీవితపు దుఃఖాన్ని చెలిమ అడుగున ఉంచి సున్నితమైన హాస్యాన్ని పైన తేట నీరుగా చూపించటం రచయిత రైటింగ్ టెక్నిక్ కి ఒక ఉదాహరణ.
ఉత్తరాంధ్ర సాహిత్యంలో ఊరి, బాల్య నొస్టాల్జియా రచనలు తక్కువనే చెప్పాలి. ఆ లోటుని పూర్తి చేయటానికి ఈ కథలు ఉన్నాయని అనుకోవొచ్చు.విశాఖ నగరంలోని ‘బర్మాకేంపు’ ప్రాంత చరిత్రను, అక్కడి మనుషులను.. అక్కడి సంస్కృతిని, ఆ మనుషుల జీవితాలను అక్షరబద్ధం చేశారు రచయిత, కార్టూనిస్టు హరి వెంకట రమణ. ఇందులోని పందొమ్మిది కథల్లో నిండైన జీవితం ఉంది. బాల్యంలోని జ్ఞాపకాల గమనం ఉంది. సగటు మనిషి బతుకు పయనం ఉంది.
-సృజన
బర్మాకేంపు_కథలు
రచయిత : హరి వెంకట రమణ
పుస్తకం ప్రచురణ: రేగి అచ్చులు
పేజీలు : 116, ప్రతులకు: 9866084124