భాస మహాకవి గొప్పసృష్టి ‘దూత ఘటోత్కచము’

నాటక ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో భాసుడి ప్రతేకత మెచ్చుకోదగ్గది. భారత కథలో.. ఘటోత్కచుడిని దూతగా.. శాంత మూర్తిగా మలచి పంపించడంలో.. భాసుడి నేర్పు నిజంగా ప్రశంసనీయం.

ఇదీ ఒక చిన్న నాటిక వంటిదే.
ఒకే అంకం. ఒకే రంగస్థలం.
ప్రదర్శనకు ఎక్కువ అనుకూలం.
ప్రదర్శనకు ఒక గంట సమయం పడుతుంది.. ఎక్కువ చర్చ, ఎక్కువ సంఘర్షణ ఉండవు.
సులభంగా నడుస్తాయి.
కథ అంతా సహజంగా కనిపిస్తుంది. పాత్రలూ అంత సహజంగానే కనిపిస్తాయి.

యుద్ధంలో అభిమన్యుడి మరణం గురించి విన్న ధృతరాష్ట్రుడు.. గాంధారీ దుఃఖంతో.. భయంతో వణికిపోతారు.
అభిమన్య మరణానికి కారకుడైన తన భర్త సైంధవుడు. అర్జునుడి వాడి బాణాలకు గురై మరణించక తప్పదు
అని గ్రహించిన దుస్సల ఎంతగానో విలపిస్తుంది.
నూరుగురు కౌరవులకు ఒక్కతే చెల్లెలు. ఆమే దుస్సల. సైంధవుడి భార్య.

ఇంతలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వస్తారు. వారిని చూసి ధృతరాష్ట్రుడు చాలా బాధ పడతాడు. వారు ప్రగల్భాలు పలుకుతారు. అదే సమయానికి ఘటోత్కచుడు శ్రీకృష్ణ దూతగా వచ్చి.. కౌరవులకు సర్వనాశనం తప్పదని హెచ్చరిస్తాడు.
ఇలా.. రాక్షసుడైన ఘటోత్కచుడిని దూతగా పంపడమే భాస మహాకవి గొప్పదనం.
పైగా ఘటోత్కచుడి మాటల్లో, చేతల్లో గొప్ప వినయం, గౌరవం కనిపిస్తాయి.
అయితే దుర్యోధనుడు.. శ్రీ కృష్ణుడిని అవమానించి తూలనాడినప్పుడు గట్టి సమాధానం చెబుతాడు.
మహాకవి భాసుడి నాటకాన్ని తెలుగు చేసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యాలు చాలా బావున్నాయి. సంభాషణలు కొంత సాధారణంగా ఉన్నాయి.
ఈ నాటకంలో రెండు స్త్రీ పాత్రలు, ఆరు పురుష పాత్రలు ఉన్నాయి.
నాటకానికి నాయకుడు ఘటోత్కచుడు.
ఇలా ప్రసిద్ధ పౌరాణిక పాత్రలతో కథని కల్పించి రసవత్తరంగా నాటకాన్ని వేల ఏళ్లకు పూర్వమే రచించిన మహాకవి భాసుడుకి వినయంతో నమస్కరిద్దాం.
వచ్చే వ్యాసంలో భాస మహాకవి ప్రఖ్యాత నాటకం “ఊరు భంగం” చూద్దాం.
మిత్రులు అందరికీ శరన్నవ రాత్రుల శుభాకాంక్షలు.

తెలుగు నాటకం మరెంతో వర్ధిల్లాలి!

వాడ్రేవు సుందర్రావు

SA: