బ్లాక్ అండ్ వైట్ బొమ్మ-అందాల బతుకమ్మ

ప్రకృతికి భగవంతుడు ప్రసాదించిన రెండు అద్భుత వరాలు పుష్పం, పడతి, పుష్పాలు వన ప్రకృతికి కారణమైతే. జన ప్రకృతికి కారనమౌతారు పడతులు. పుష్పాలు లేనప్పుడు వనాలకు ఆస్కారం లేదు. అలాగే పడతుల్లెనిదే జనాలకు ఆస్కారం లేదు. పుష్పాలు వనప్రక్రుతికి సౌందర్యాన్నిసమకూరిస్తే, పడతులు జన ప్రకృతికి సౌందర్యాన్ని చేకూరుస్తారు. రెండూ సౌందర్య కారకాలు మాత్రమే కాదు ప్రగతి కారకాలు కూడా. అందుకే అటు పుష్పం, ఇటు పడతీ జనావళికి అందం ఆనందంతో ఒక సౌందర్యానుభూతి కూడా కలిగేలా చేస్తాయి.

తెలంగాణా సంస్కృతిలో అలా ఇంతి చామంతులతో పెనవేసు కున్న గొప్ప పూల పండుగ బతుకమ్మ. ప్రతియేటా ఆశ్వయుజ మాసంలో అమావాష్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే ఈ బతుకమ్మ సంభారాలలో రోజూ ప్రకృతిలో లబించే ప్రతీ పువ్వు ఏరికోరి తెచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తమ ఆటపాటలతో గౌరీ దేవిని పూజిస్తూ అందరూ కలిసి ఆడే ఆ బతుకమ్మ ఆటల దృశ్యాలు నిజంగా ఎంతో రమణీయంగా వుంటాయి. అలాంటి కమనీయమైన దృశ్యాలను తనదైన శైలిలో ఎంతో రమణీయంగా చిత్రించారు బ్లాక్ అండ్ వైట్ చిత్రణలో ప్రసిద్ది గాంచిన చిత్రకారుడు బాలకృష్ణ.

ఈ బతుకమ్మపండుగ సందర్భంగా ఈ నెల 27 న తెలంగాణా రాష్ట్రం నందలి ఖమ్మం లకారం టాంక్ బ్యాండ్ ఆర్ట్ గేలరీలో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంబించిన చిత్రకళా ప్రదర్శన తొమ్మిది రోజులూ సాగుతుంది. ఈ ప్రధర్శనలో వుంచిన దాదాపు ముప్పై బతుకమ్మ చిత్రాలు ప్రతీ రోజూ ఎందరినో ఆహ్లాద పరుస్తున్నాయి. జి. బాలకృష్ణ వేసిన ఆ చిత్రాలు అన్ని దాదాపు నలుపు చిత్రాలుగా కనిపిస్తాయి. కానీ వాటిని పూర్తిగా నలుపు చిత్రాలే అని చెప్పలేము అలాగని పూర్తి వర్ణ చిత్రాలనీ చెప్పలేము. నలుపు తెలుపు సమ్మిళితమైన చిత్రాలుగా చెప్పవచ్చు. కారణం ఈ చిత్రముల నందలి ప్రధాన అంశాలలో ఒకటైన బతుకమ్మను రంగుల్లోనూ ఆ బతుకమ్మను మోస్తున్న ఇంతులను నలుపు తెలుపు రంగుల్లోనూ ఆయన చిత్రించడంతో ఒకవిధమైన వింత శోభను ఆ చిత్రాలకు చేర్చడం జరిగిందని చెప్పవచ్చు. కారణం చీకటి లో వున్నప్పుడే వెలుగుకి శోభ నిస్తుంది. అలాగే వర్నరహితమైన పెద్ద చిత్రంతో పెనవేసుకున్న చిన్న వర్నచిత్రం ఎక్కువ శోభతో మనకు కనిపిస్తుంది. కారణం ఏక వర్ణం కంటే వర్ణ వైవిధ్యం కంటికి హాయిగా వుండడమే గాక మనసుకూ కూడా ఆహ్లాదకరంగా వుంటుంది. ఇదే సూత్రాన్ని ఈ చిత్రకారుడు బతుకమ్మ సందర్భంగా వేసిన చిత్రాలలో అనుసరించి క్రుతక్రుత్యుడయ్యాడని చెప్పవచ్చు.

బాలుగా ప్రసిద్దిగాంచిన జి. బాలకృష్ణ పూర్వీకులది ఆంధ్ర ప్రదేశ్ నందలి కడప జిల్లా కాని బాలకృష్ణ పుట్టిన తర్వాత ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం నందలి ఒక పల్లెటూర్లో సెట్టిల్ అయినట్టుగా చెప్పుకొచ్చారు. దాదాపు పన్నెండేళ్ళ క్రితమనుకుంటాను బాలకృష్ణ గురించి ఈనాడు న్యూస్ పేపర్లో వార్త చదివాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో వీరు చంద్రబాబు గారి వివిధ రూప చిత్రాలను పెన్సిల్ షేడ్ తో వేసిన చిత్రాలతో ప్రదర్శన చేసినప్పుడు అది ఈనాడు పేపర్లో వార్తగా వచ్చినప్పుడు ఈ చిత్రకారుడు బాలు గురించి తొలిసారిగా విన్నాను. కాని ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. మొన్న ఇక్కడ బతుకమ్మ చిత్రాల ప్రదర్శన పెట్టిన రెండో రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి తన ప్రధర్శనగురించి తెలియజేసి తప్పనిసరిగా రావాలని కోరిన ఆహ్వానం మేరకు ఆఫీసు పని ముగిసిన తర్వాత ఆ చిత్రప్రదర్శనశాలకు వెళ్ళి చూడడం జరిగింది. సందర్భోచితంగా వేసిన అతని బతుకమ్మ చిత్రాలు చూపరులను బాగానే ఆకర్షిస్తున్నాయి. కొన్ని కాన్వాస్ మరికొన్నిహేండ్ మేడ్ డ్రాయింగ్ షీట్స్ పై చార్కోల్ తో వేసిన చిత్రాల్లో దాదాపు అన్ని ఏక రూప చిత్రాలే. బతుకమ్మను మోస్తున్న మహిళా చిత్రాన్ని వివిధ బంగిమల్లో చూపించడం జరిగింది, వాటిల్లో కొన్ని గిరిజన మహిళల రూపాలను చూపగా రాజకీయంగా తెలంగాణా రాష్ట్రంలో ఈ పండుగకు ప్రాచుర్యం కల్పించడంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్న ముఖ్యమంత్రిగారి కూతురు రాజ్యసభ సభ్యురాలు కల్వకుంట్ల కవితను గారిని కూడా ఈ బతుకమ్మ చిత్రాల్లో చూపించిండం జరిగింది.

Batukamma art by Balakrishna

వీరి చిత్ర రచనా క్రమాన్ని గమనించినట్లయితే ప్రత్యేకంగా ఒక గురువుదగ్గర తాను చిత్రకళను నేర్వలేదని బాల్యం నుండి ఆసక్తితో స్వయం సాధనతోనే చిత్రకళను నేర్చుకున్నట్టుగా చెప్తారు, వర్ణ చిత్రాలకంటే బ్లాక్ అండ్ వైట్ లోనే అందునా ఎక్కువగా రూపప్రదాన చిత్రరచన దానిలో కూడా విస్తృతమైన సామూహిక రచనల కంటే ఏకరూప చిత్రరచననే వీరి చిత్రాల్లో నేను గమనించడం జరిగింది. గతంలో ముఖ్యమత్రి, చంద్రబాబు నాయుడు, వై. వైస్. జశేఖర రెడ్డి, జగన్ ఇంకా కె.సి.ఆర్. ల గురించి ఎన్నో చిత్రాలను వేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఆంద్ర ప్రదేశ్ రెండుగా విడి పోయిన తర్వాత నవ్యాన్ద్రప్రదేశ్ లో చిత్రకారుల కోవలో తొలి కళారత్న అవార్డ్ చంద్రబాబుగారి చేతులమీదుగా అందుకున్నారు అలాగే మరి కొందరి ప్రముఖుల నుండి వివిధ పురష్కారాలను అందుకున్నారు.

కేవలం తాను మాత్రమే కాక తన ఇరువురు కుమార్తెలు కూడా మంచి చిత్రకారులే అని రాబోయే గాంధీజీ జయంతికి తన కుమార్తె గాంధీజీ గురించి వేసిన చిత్రాలతో మరో ప్రదర్శన చేయబోతున్నట్టు తెలియజేశారు. తనతో బాటు తన అమ్మాయిలూ కూడా ఈ కళలో స్వయంగా ప్రదర్శన చేసే స్థాయికి తీసుకు రావడం గొప్ప విషయం. ఇలాగే బాలుగారి కుటుంభం చిత్రకళా రంగంలో రాణించి మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుందాం.

వెంటపల్లి సత్యనారాయణ
9491378313

artist balu with writer ventapalli
SA: