
అడుగు ఎప్పుడూ ముందుకే పడాలి వెనకకి కాదు। ‘గమనం’ అంటే గమ్యస్థానం వైపు జరిపే పయనమే – అది పురోగమనమే; తిరోగమనం కాదు! కానీ, సుదీర్ఘంగా సాగే ఈ జీవనయానంలో కొన్ని మజిలీలుంటాయి. అలా ఒక్కొక్క మజిలీలో ఆగినప్పుడు, సేదతీరుతున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. ఎన్నెన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులూ మనల్ని పలకరిస్తాయి. ఆ సంఘటననో, సందర్భాన్నో జ్ఞాపకానికి తెచ్చి, మనలో పులకింతలు పుట్టిస్తాయి!
కొత్తగా అందరికీ అందుబాటులోకి రానున్న ‘దైనందిన జీవితానికి భగవద్గీత” అనే కొత్త గ్రంథం నాకు అందివచ్చి నప్పుడు నేను ఆరు పదుల కాలం వెనక్కి నడిచాను. బంగారు బాల్యం నన్ను పరివేష్టించి ఉన్న రోజులు. “బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భాగవతం..- ఇవన్నీ ఒక్కుమ్మడిగా నా జ్ఞాపకాల్లోకి చొరబడ్డాయి. అమ్మ చెప్పిందో, అమ్మమ్మ చెప్పిందో గానీ, ఆ కథలన్నీ నాకు మాత్రం బొమ్మలు చెప్పిన కథలుగా గుర్తున్నాయి. అక్షరం అక్కర్లేకుండానే ఆ కథలు నా మానసయవనికపైన ముద్రలు ఏర్పరచుకున్నాయి.
ఇప్పుడు ఈ రంగుల బొమ్మల గ్రంథం అందుకొన్నాక, ఈ బొమ్మలు నాకు కథలు చెప్పడం లేదు నాకు భావగంధాన్ని అలదుతున్నాయి; అభ్యసించవలసిన జీవనరీతిని, ఆచరించవలసిన నియమాల నీతిని నాముందు ఆవిష్కరిస్తున్నాయి. నిజానికి భగవద్గీతను స్వయంగా తన గొంతుతో పలికించినవాడు నారాయణుడు. అందుకే భగవద్గీతకు లభించిన వైశిష్ట్యం మరే గ్రంథానికీ లభించలేదు! భగవద్గీతపైన ఇప్పటికే వందలాది వ్యాఖ్యానాలు వచ్చాయి. ఎవరి అవగాహన మేరకు వారు తమతమ వాణిని వినిపించారు. కానీ, ఇప్పటి ఈ ప్రయత్నం వేరు. వందలాదిగా విస్తరించిన భగవద్గీత శ్లోకాలలో ముఖ్యమైన నూట ఒక్కింటిని ఎంపిక చేసుకుని, కల్లూరి సత్యరామ ప్రసాద్ అందించిన సరళమైన, భావనిర్భరమైన వ్యాఖ్యానానికి ఖరిడేహాల్ భీమారావు గారు కల్పించిన రంగుల చిత్రాలతో అలంకరించి, ఈ గ్రంథాన్ని రూపొందించారు.
శ్లోకానికి తాత్పర్యం, దానిగురించిన లఘువ్యాఖ్యానం, ఆంగ్లంలో ఈ రెండింటి అనువాదం, వీటన్నింటిపైన వర్ణసమ్మిళితమై, భావస్ఫోరకమైన చిత్రం- ఈ పద్ధతిలో ఈ గ్రంథాన్ని సంతరించారు. గ్రంథకర్తలు ఎంపిక చేసుకుని, ఏర్పాటు చేసుకున్న క్రమంలో 6/19 శ్లోకం “యథా దీపో నివాతస్టో…” అంటూ సాగుతుంది. ఇక్కడ వ్యాఖ్యాత చాలా వివేచన కలిగించే నాలుగు మాటలు చెప్పారు. ఇంద్రియాలనే వాకిళ్ళనుంచి, విషయవాంఛ అనే గాలి చొరబడుతుందట. అటువంటి సందర్భంలో మనస్సుని నిగ్రహించాలంటాడు. అప్పుడు గాలి లేని చోట వెలిగే దీపకళికలా, ఆ దీపం నిటారుగా పైకి వెలిగినట్లు సాధకుడి మనస్సు ఊర్ధ్వముఖమై, పరమాత్మవైపు మరలుతుందట! ఈ భావనకు భీమారావు గారు అందమైన చిత్రాన్ని పరికల్పన చేశారు. నర, నారాయణులను క్రిందా, మీదా చిత్రీకరించి, మధ్యలో సాధకుడిని, అతడిముందు నిలకడగా వెలిగే దీపపు కుందెను చిత్రించారు. రేఖలతోనే భావానువాదం చేసిన అపురూప సందర్భం ఇది.
ఇలా ప్రతి శ్లోకానికి ఆలోచనాత్మకమైన వ్యాఖ్య, దానిని ఇనుమడింపజేసేలా చిత్రకల్పన సంస్తవనీయంగా ఉంది.
భగవద్గీతకు “గీతోపనిషత్తు’ అని నామాంతరం ఉంది. అజ్ఞానమయమైన భౌతికజీవనయానం సాగిస్తున్న మానవజాతిని ఉద్దరించడమే గీత సారాంశం. రెండు వర్ణాలూ, మరొక రెండు గీతలూ సమ్మిళితంచేసి, సౌందర్యవిలసితంగా, సౌవర్ణభావవిభ్రాజితంగా భీమారావు గారు రూపు కట్టించిన ఈ అపురూప గ్రంథం వర్తమానతరానికీ, ప్రవర్ధమానం కానున్న తరానికీ కూడా కరదీపికలా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
–డా. వోలేటి పార్వతీశం
దైనందిన జీవితానికి భగవద్గీత
వెల: రూ. 950/-
ప్రతులకు: చిత్రకారుడు భీమారావు (9848444841)
Thank you kalasagar garu ,for introducing my book