తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. 73 ఏళ్ళ వయసులో గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కె. భాగ్యరాజ్ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు కె. రామకృష్ణన్, భారతీరాజా వద్ద అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిద చిత్తరంగల్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా ’16 వయతినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు)లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన, ఎన్నో చిత్రాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే గాక, కథా రచయిత, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో చూడు చూడు) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించాయి. తెలుగులో రాశి మూవీస్ బ్యానర్‌పై నరసింహారావు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్ నటించిన అబ్బాయి గారు సినిమాకు, అల్లరి నరేష్ నటించిన ‘పెళ్ళైంది కానీ’ సినిమాలకు భాగ్యరాజ్ కథను అందించారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, అనిల్ కపూర్ నటించిన ‘వో 7 దిన్’ చిత్రాలకు ఆయన కథ అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన ’35 చిన్న కథ కాదు’, ‘కుబేర’ వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మరణం తమిళ చిత్రసీమను తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సినీ ప్రముఖుల సంతాపం
భాగ్యరాజ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశారు. “ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మొన్న గోవాలో భాగ్యరాజ్ కుమార్తె పెళ్లి వేడుకలో మేమంతా కలిసి సఖ్యతతో, సరదాగా మాట్లాడుకుంటూ, ఫోటోలు దిగుతూ ఎంతో ఆనందంగా గడిపాం. భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అలాంటి ఆయన ఈ ఉదయం ఇక లేరనే వార్త వినడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అద్భుతమైన దర్శకుడు, అసాధారణమైన స్క్రీన్ ప్లే రచయిత, గొప్ప నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ గారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. పూర్ణిమ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన మిత్రమా… మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.” అంటూ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. మెగాస్టార్‌తో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు భాగ్యరాజ్ మరణంపై సంతాపం ప్రకటించారు.
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంతాప సందేశం!
అక్షర నివాళి….
స్క్రీన్ ప్లే మహారాజుకు సుమ సున్నిత విమర్శక నయనాల శ్రద్ధాంజలి!!
కథల నవాబు ! కానరాని లోకాలను తరలి పోయావా?
వెండితెరపై సామాన్యుడి నాడిని పట్టిన వినోద వైద్యు వీడ్కోలు!!
సున్నితమైన హాస్యంతో సమాజాన్ని నవ్వించిన విజ్ఞాన విధి!!
మలగని సినీ జ్ఞాన దీపిక!
చిరునవ్వు వెనుక భావోద్వేగాల లోతును చూసిన దర్శక దార్శనిక చక్రవర్తి!!
సినిమా కథనానికి కొత్త శైలిని నేర్పిన చిత్ర వాల్మీకి!!
ఖాళీ అడుగులోనే సూపర్ ఇల్లా చిత్తంగలో అన్నావు!!
ప్రేక్షకుల హృదయ ఫలకాలపై చెరగని చిత్రాల్లోని జ్ఞాపక. మూడు ముళ్ళు బంధాన్ని ‘ముందనై ముడిచ్చు’గా మలచి నేడు, నేటి తరాలకు సరికొత్త స్క్రీన్ ప్లే పాఠాలు నేర్పావు. నటుడిగా మెప్పించావు, దర్శకుడిగా అద్భుత చిత్రాలను వెండి తెరకు మలిచిన అమర శిల్పి!!
రవయితా ప్రతి గుండెను సున్నితంగా స్పృశించు. నువ్వు సృష్టించిన ప్రతి పాత్ర ఒక సజీవ సాక్ష్యం, చిత్రసీమలో నీ ప్రయాణం ఎప్పటికీ ఒక ఆదర్శం. సినిమా విమర్శకుల కలాలకు నువ్వు ఒక అద్భుత సవాలు, రాసే ప్రతి సమీక్షలోనూ కల్పితంగా నిలిచే మెరుగైన దీపినీవు!!
నువ్వు లేని లోటు తీరనిది, పూడ్చలేనిది. నీవు విడిచిన జ్ఞాపాల ప్రయాణం తరగని జ్ఞాననిధి భౌతికంగా నువ్వు మా మధ్య లేకపోయినా, నీ కథలు, నీ దృశ్యాలు. నీ ట్రెండ్ ఎప్పటికీ సజీవమే.
స్క్రీన్ ప్లే చక్రవర్తి కె. భాగ్యరాజ్ గారికి, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరపున ఇదే మా అశ్రునయనాల అక్షర స్వచ్ఛాంజలివారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఇట్లు
అధ్యక్షులు -బత్తుల జె వి ప్రసాద్ రావు
ప్రధాన కార్యదర్శి -సురేష్ కొండేటి
