భక్త ప్రహ్లాద త్రయం

భారతదేశంలో విడుదలైన తొలి టాకీ సినిమా 1928లో అమెరికాలో యూనివర్సల్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘మెలొడీ ఆఫ్ లవ్’ అనే ఇంగ్లిష్ చిత్రం. ఆర్చ్ హెల్త్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి ప్రపంచ యుద్ధానంతరం ఒక గేయకవికి, కోరస్ పాడే యువతికి మధ్య జరిగిన ప్రేమకథానేపథ్యంలో నడుస్తుంది. 1929లో ఈ చిత్రం మనదేశంలో మొదటిసారి కలకత్తాలోని ఎలిఫిన్ స్టన్ ప్యాలెస్ లొ ప్రదర్శితమైంది. మాట్లాడే బొమ్మలతో కూడిన ఈ సినిమా చూసేందుకు జనం ఎగబడ్డారు. అలా భారతీయ నిర్మాతలకు టాకీ చిత్రాలు నిర్మించాలనే ఉత్సాహం పెరిగింది. అలా అర్దేషిర్ ఇరాని శబ్దగ్రహణ యంత్రాన్ని జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని 1931లొ హిందీలో ‘ఆలం ఆరా’ సినిమానిర్మించి టాకీ చిత్ర నిర్మాణానికి నాంది పలికాడు. ఈ చిత్రం 14, మార్చి 1931 న బొంబాయి నగరంలోని మెజెస్టిక్ థియేటర్ లో విడుదల చేశారు. అర్దేషిర్ ఇరాని వద్ద సహాయకుడుగా పనిచేస్తూ కొన్ని మూకీ సినిమాలకు దర్శకత్వం వహించిన హెచ్. ఎం. రెడ్డికి తెలుగు, తమిళ భాషల్లో టాకీ చిత్రాలు నిర్మించే పనిని అర్దేషిర్ ఇరాని అప్పగించారు.

తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద కు శ్రీకారం
తెలుగునాట పౌరాణిక నాటకాలకు మంచి స్పందన ఉండడంచేత హెచ్.ఎం.రెడ్డి ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘భక్త ప్రహ్లాద’ నాటకాన్ని కథావస్తువుగా ఎంపికచేసి వాటిని విరివిగా ప్రదర్శిస్తున్న సురభి నాటక సమాజం లోని నటీనటులచేతనే నటింపజేసి టాకీ చిత్రంగా మలిచారు. ఈ చిత్రాన్ని బొంబాయి కృష్ణా మూవీటోన్ స్టూడియోలో కేవలం ఇరవై రోజుల్లోనే చాలాగోప్యంగా నిర్మించారు. ప్రభాత్ స్టూడియోలో సంగీత శాఖలో పనిచేస్తున్న హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రికి సంగీత సారధ్య బాధ్యతలను అప్పగించారు. చందాల కేశవదాసు చేత రెండు మూడు పాటలు రాయించారు. మిగతా పద్యాలు, పాటలు ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాసినవే. ఇందులో హిరణ్యకశిపుడుగా మునిపల్లె సుబ్బయ్య(వల్లూరి వెంకటసుబ్బారావు), లీలావతిగా సురభి కమలాబాయి, ప్రహ్లాదుడుగా సింధూరి కృష్ణారావు, చండామార్కులుగా చిత్రపు నరసింహారావు, మొద్దబ్బాయిగా ఎల్.వి. ప్రసాద్ నటించారు. ప్రసాద్ ఈ చిత్రానికి హెచ్.ఎం. రెడ్డి కి సహాయకుడుగా కూడా పనిచేశారు. 1932 ఫిబ్రవరి 6 న ‘భక్త ప్రహ్లాద’ సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఆ సినిమా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం దురదృష్టం. కానీ, ఆ రోజుల్లో ఈ సినిమాను చూసిన కొందరు ప్రత్యక్ష సాక్షుల అనుభవాల ప్రకారం, ఈ సినిమా నాటకాన్ని చూసినట్లు వున్నదని, చిత్రీకరణలో, శబ్దగ్రహణంలో నాణ్యత లోపించిందని తెలిసింది. ఆరోజుల్లో కొన్ని పత్రికలు ఈ నూతన ప్రయోగాన్ని విమర్శించాయి కూడా. ప్రముఖ సాహిత్య మాసపత్రిక ‘భారతి’ లో ఒక వ్యాసం ప్రచురిస్తూ అందులో ‘భక్తప్రహ్లాద’ టాకీలో నటన అపరిపక్వంగా వుందని, మాటలు అస్పష్టంగా వున్నాయని, శబ్దగ్రహణం లోపభూయిష్టంగావుందని గట్టిగా విమర్శించింది. కొన్ని పత్రికలు టాకీ ప్రయోగాన్ని ఒక అంటరాని కళగా కూడా అభివర్ణించాయి. ఈ సినిమా నెగటివ్ లభ్యతలేదు. ఏదేమైనా ‘భక్త ప్రహ్లాద’ చిత్రం తొలి తెలుగు టాకీ చిత్రంగా రికార్డులకెక్కడమే కాకుండా మరో రెండుసార్లు అదే పేరుతో పునర్నిర్మాణమై విజయవంతమైంది.

శోభనాచల వారి భక్త ప్రహ్లాద
ఈ సినిమాను రెండవసారి 1942లో మీర్జాపురం రాజా తన శోభనాచల పిక్చర్స్ బ్యానర్ మీద చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో నిర్మించారు. పసుమర్తి యజ్ఞనారాయణశాస్త్రి రచించిన సురభి వారి నాటకం ఆధారంగానే ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వేమూరి గగ్గయ్య హిరణ్యకశిపుడుగా, రాజేశ్వరి లీలావతిగా, రామకృష్ణశాస్త్రి నారదుడుగా, కుంపట్ల చండామార్కులుగా, పరిపూర్ణ 1వ ప్రహ్లాదుడుగా, జి. వరలక్ష్మి 2వ ప్రహ్లాదుడుగా నటించారు. మోతీబాబు సంగీతదర్శకత్వం నిర్వహించారు. ఇందులో ఎవరి పాటలు వారే పాడుకున్నారు. పోతన భాగవతం నుంచి ‘మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు వోవునే మదనములకు’, ‘కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మభస్త్రి గాక’’, ‘చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు’, ‘ఇందుగలడండుదులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు’ వంటి పద్యాలను ఇందులో సందర్భోచితంగా వాడుకున్నారు. సినిమా బాగా ఆడింది.

ఏ.వి.యం వారి భక్త ప్రహ్లాద
ముచ్చటగా మూడవసారి … అంటే 1967లో ఎ.వి.ఎం సంస్థ అధిపతి మెయ్యప్ప చెట్టియార్ ‘భక్త ప్రహ్లాద’ చిత్రాన్ని రంగుల్లో నిర్మించి 1932, 1942 లో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాలకన్నా అఖండ విజయాన్ని సాధించారు. ఈ చిత్రం ద్వారా రోజారమణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వెండితెరకు పరిచయమయ్యారు. పెద్ద మనుషులు, దొంగరాముడు, రాముడు-భీముడు వంటి సాంఘిక చిత్రాలకు రచయితగా పనిచేసిన నరసరాజు ఈ మూడవ ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి రచయితగా పనిచేయడం విశేషం. అయితే ‘’భాగవత కథకు నరసరాజు రచన చేయడమా’’ అంటూ కొందరు నిర్మాతలు, సినీ ప్రముఖులు పెదవి విరచారు. వారి అంచనాలను తారుమారు చేస్తూ ఎ.వి.ఎం వారి ‘భక్త ప్రహ్లాద’ అనూహ్య విజయాన్ని సాధించిపెట్టింది. హిరణ్యకశిపుని పాత్రలో ఎస్.వి. రంగారావు ఆ పాత్ర ఆంతర్యంలోని మానవత్వాన్ని, మనసు మమతను మహాద్భుతంగా ప్రదర్శించగా, ప్రహ్లాదుని పాత్రకోసమే తను పుట్టినట్టు బేబీ రోజారమణి అపూర్వంగా నటించి ఆదరణ చూరగొంది. చిత్రపునారాయణ మూర్తి, నరసరాజుల మేలుకలయికతో నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 1967 న విడుదలై అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది…అనేక బహుమతులను గెలుచుకుంది. ఇర్తవై ఐదేళ్ళ తరవాత కూడా చిత్రపు నారాయణమూర్తే ఈ సినిమాకు దర్శకత్వం నిర్వహించటం వెనుక మెయ్యప్ప చెట్టియార్ ప్రోత్సాహం, వితరణ వున్నాయి! మెయ్యప్ప చెట్టియార్ తమిళంతో బాటు తెలుగులో కూడా ఈ సినిమాకు ముందు కొన్ని చిత్రాలు నిర్మించారు. 1950లో ‘జీవితం’ సినిమా ద్వారా వైజయంతిమాలను పరిచయం చేశారు. తరవాత ‘వదిన’, ‘సంఘం’, ‘భూకైలాస్’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాలు ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో తెలుగులో సినిమాలు నిర్మించడం మీద శ్రద్ధ చూపలేదు. తమిళంలో విజయవంతమైన ‘నానుం ఒరు పెణ్’ సినిమాను ఎస్వీ రంగారావు తెలుగులో ‘నాదీ ఆడజన్మే’ పేరుతో సినిమాగా నిర్మించినప్పుడు మెయ్యప్ప చెట్టియార్ కూడా అందులో భాగస్వామిగా వున్నారు. ఆ సినిమా అఖండ విజయం సాధించడంతో తెలుగులో ‘భక్త ప్రహ్లాద’, ‘అవేకళ్ళు’ సినిమాలను రంగుల్లో ఏకకాలంలో నిర్మించారు. ఆర్ధికంగా గడ్డుస్థితిలో వున్న చిత్రపు నారాయణమూర్తికి అవకాశం ఇచ్చి ఆదుకున్న వితరణశీలి మెయ్యప్ప చెట్టియార్.

‘భక్త ప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రానికి సముద్రాల గారితో కాకుండా డి.వి. నరసరాజు చేత కథ, మాటలు రాయించేందుకు కారణం మెయ్యప్పని నరసరాజు అడిగితే “నాకు కావలసింది పండితుడు కాదు. పురాణ కథలను ఆధునికంగా, నాటకీయంగా రాయగల అధునాతన నాటకకర్త. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను” అని జవాబిచ్చారు. అంతేకాదు నారాయణమూర్తి కి “నిన్ను ప్రహ్లాద తీయమంటే పాతికేళ్ళ క్రితం తీసినట్లే తీస్తావు. నరసరాజు మోడరన్ డ్రమెటిస్టు. పురాణ గాధను ఆయన ఎలా మలుస్తాడో గమనించు. ఆయన చెప్పింది విను. నీ పాత అభిప్రాయాలు ఆయనమీద రుద్దకు” అంటూ సలహా కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి, హిందీలోకి డబ్ చేసారు. ముఖ్యంగా చండామార్కులు హిరణ్యకశిపుని వద్దకు వచ్చి మాట్లాడే సీన్లను తమిళ వర్షనుకు తమిళ కమెడియన్స్ తోనూ, హిందీ వర్షన్ కు హిందీలోని పాపులర్ కమెడియన్స్ తోనూ రీషూట్ చేయించారు. చండామార్కుల ఆశ్రమం సీన్లను కూడా రీషూట్ చేయించారు. తెలుగులో ఆ పాత్రలను రేలంగి, పద్మనాభం పోషించారు. ప్రహ్లాదుని పాత్రకోసం పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ‘సినిమారంగం’ పత్రిక సంపాదకుడు జి.వి.జి, మద్రాసులోనే వున్న సత్యం కూతురు రోజారమణిని ఆ పాత్రకు సిఫారసు చేశారు. ఆమె తండ్రి సత్యం అప్పట్లో ‘సినిమారంగం’ పత్రికలో ప్రచార విభాగంలో పనిచేసేవారు. అలా రోజారమణి ప్రహ్లాద పాత్రకు ఎంపికైంది. చిత్రం మొత్తమంతా ప్రహ్లాద పాత్ర శరీరం పైభాగానికి నగలు, హారాలేగానీ దుస్తులుండవు. రోజారమణి బక్కగా ఉండడంతో డాక్టర్ ను పిలిపించి ప్రత్యేక ఆహార నియమాలు పాటించి పాత్రకు తగిన శరీరాకృతి వచ్చేలా చేశారు. ఆమెకు రంగూన్ రామారావు సంభాషణలు పలకడం మీద శిక్షణ ఇచ్చారు. ఆమె ఏకసంతగ్రాహి కావడంతో ఎలా చెబితే అలా డైలాగులు పలికింది, పద్యాలకు అద్భుతంగా లిప్ మూవ్మెంట్ ఇచ్చింది. ఎస్వీఆర్, అంజలీదేవిల అభిమానాన్ని చూరగొంది.

Posters

ఈ సినిమా స్క్రిప్టు పనులు 1965 మే నెలలోనే పూర్తయినా, పైగా స్టూడియో సొంత ప్రొడక్షన్ అయినా కూడా, ఈ సినిమా నిర్మాణానికి ఒకటిన్నర సంవత్సర కాలం పట్టింది. అందుకు కారణం చెట్టియార్ కుమారులు మురుగన్, కుమరన్, శరవణన్ లు. వారు ‘అవేకళ్ళు’ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలుగు, తమిళ భాషల్లో కలర్ లో నిర్మించడం ప్రధాన కారణం. వారికి ప్రహ్లాద సినిమా మీద నమ్మకం లేదు. కళాదర్శకుడు శేఖర్ స్కెచ్ తయారు చేసి యే ఫ్లోర్ లో సెట్ వేద్దామని ప్రయత్నించినా దానిని క్యాన్సిల్ చేసి ‘అవేకళ్ళు’ సెట్ కు ప్రాధాన్యత కల్పించేవారు. దీనితో నటీనటులు, టెక్నీషియన్లు కూడా విసిగిపోయిన సందర్భాలున్నాయి. ఇక క్లైమాక్స్ సన్నివేశంలో నరసింహస్వామి హిరణ్యకశిపుని పైకెత్తి నడిచేటప్పుడు డూప్ తో చిత్రీకరించారు. చెట్టియార్ కు ఆ చిత్రీకరణ సంతృప్తినివ్వక పోవడంతో ఎస్వీ రంగారావును ఒప్పించి క్లోజప్ షాట్లను రీషూట్ చేశారు. చిత్ర సమర్పకుడు మెయ్యప్ప చెట్టియార్ విజ్ఞప్తి మేరకు ప్రముఖ సంగీత విద్వాసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ చిత్రంలో నారదుని పాత్రను పోషించి మెప్పించారు. ఈస్టమన్ కలర్ లో నిర్మించిన ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా నటించిన రోజారమణికి జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటి అవార్డు లభించగా ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతి దక్కింది. అలనాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రత్యేకంగా ఈ సినిమాను తిలకించడం విశేషం. రోజారమణి, ఎస్వీ రంగారావు రాష్ట్రపతి ప్రశంసలకు పాత్రులయ్యారు.

‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా రాజగోపాల్, కృష్ణన్ సహకారం అందించారు. సముద్రాల ఐదు పాటలు రాయగా మిగతా పాటలను సినారె, కొసరాజు, పాలగుమ్మి పద్మరాజు, జూనియర్ సముద్రాల రాశారు. ధర్మరక్షణ కోసం అవతారాలను దాల్చిన శ్రీమన్నారాయణుని స్తుతిస్తూ నారదుడు పాడే “వరమొసగే వనమాలీ నా వాంఛితమ్ము నెరవేరునుగా” ను బేహాగ్ రాగఛాయల్లో బాలమురళి అద్భుతంగా గానం చేశారు. ప్రహ్లాదుడు తోటి రాక్షస బాలకులతో కలిసి పాడే “నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం” పాటను సుశీల బృందం ఆలపించింది. అలాగే సముద్రాల(సీ) మరో పాట “కనులకు వెలుగువు నీవే కావా” ను మోహన, అభేరి రాగఛాయల్లో స్వరపరచగా సుశీల, జానకి ఆలపించారు. ఈ పాటను రోజారమణి, అంజలీదేవి మీద చిత్రీకరించారు. అన్నిటికన్నా బహుళ ప్రజాదరణ పొందిన పాట సుశీల ఆలపించిన సమద్రాల గీతం “జీవము నీవే కదా… దేవా బ్రోచే భారము నీదే కదా”. ఈపాటలో ప్రహ్లాదుని చిత్రహింసలకు గురిచేస్తారు. ఏనుగులతో తొక్కించడం, కొండమీదనుంచి త్రోయించడం, పాములతో కరిపించడం, విషాహారాన్ని తినిపించడం వంటివన్నమాట. రాగమాలిక లో స్వరపరచిన ఈ పాట భావరంజకంగా అమరింది. పద్మరాజు విరచిత “జననీ వరదాయనీ త్రిలోచని నీ పదదాసిని కావగదే” పాటను జానకి ఆలపించగా అంజలీదేవి మీద చిత్రీకరించారు. సముద్రాల(జూ) రచించిన “అందని సురసీమ నీదేనోయి, అందరు ఆశించు అందాల హాయి’’ పాటను సుశీల, జానకి, రాజ్యలక్ష్మి ఆలపించగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల మీద చిత్రీకరించారు. బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం నుండి “మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు”, “కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక”, “కలడంభోధి కలండు గాలి..కలదాకాశంబునన్ కుమ్భినిన్”, “ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు” వంటి అద్భుతమైన పద్యాలు చిత్రానికి శోభను చేకూర్చాయి.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

SA:

View Comments (1)

  • భక్త ప్రహ్లాద చిత్ర విషయాలు బాగా వివరించారు. రచయిత కు ధన్యవాదాలు