“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ

ఆయన …వృత్తి రీత్యా…చార్టెర్డ్ అకౌంటెంట్
ప్రవృత్తి రీత్యా… తొలుత నాటక రచయిత…
ఆ పిదప సినీ రచయిత నాటక రచయితగా,
తెలుగు నాటక రంగంలోసంచలనం సృష్టించారు.
ఆయన – ఇంకెవరో కాదు, భమిడిపాటి రాధాకృష్ణ గారే!
ప్రఖ్యాత హాస్య నాటక రచయిత ‘హాస్యబ్రహ్మ ‘ బిరుదాంకితులైన భమిడిపాటి కామేశ్వరరావు గారి పుత్రుడుగా, పుట్టడమే రాధాకృష్ణగారి అదృష్టమేమో! వారికి కూడా నాటక రచయితగా, చిరకీర్తి లభించింది. తండ్రి గారి నుంచి, నాటక రచననువారసత్వ సంపదగా పుణికి పుచ్చుకొని, నాటక రచనలో తండ్రికి తగ్గ తనయుడైనారు. తనదైన వొరవడితో రాణించినారు.

హాస్య,కరుణ రసాలను మేళవించి సందేశాత్మక రచనలతో సంచలనం సృష్టించిన రాధాకృష్ణ గారు 1931 నవంబరు 14 న తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లో జన్మించారు. రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలోను విద్యాభ్యాసం చేశారు. 1950 లో బి.ఎస్.సి. డిగ్రీ పొంది, ఆ తరువాత చార్టర్డ్ అకౌంట్స్ పూర్తి చేశారు.

దంతవేదాంతం, భజంత్రీలు, మనస్తత్వాలు, అంతా ఇంతే, పెళ్లి పందాలు వీరి ప్రసిద్ధ నాటికలు. ఇదేమిటి, కీర్తిశేషులు, దైవశాసనం ప్రేక్షకాదరణ పొందిన నాటకాలు. కీర్తిశేషులు నాటకం, వీరి రచనలలో కెల్లా తలమానికంగా నిలిచింది. రాధాకృష్ణ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సముపార్జించి పెట్టింది. 1960 వ సంవత్సరం ఫిబ్రవరిలో తణుకు లో జరిగిన 21 వ ఆంధ్రనాటక కళా పరిషత్తులో, ఉత్తమ ప్రదర్శన బహుమతిని, అదే ఏడాది మేనెలలో నరసాపురంలో జరిగిన నాటక కళాపరిషత్తులో ఉత్తమ రచనకు ఎంపికపై అత్యంత ప్రజాదరణపొందింది ‘కీర్తిశేషులు’ నాటకం. ఈ నాటకాన్ని నాటి నాటక సమాజాలు పోటీ పడి ప్రదర్శించాయి. ఈనాటకంలో ‘మురారి’ పాత్రను, రావు గోపాలరావు గారు, అత్యద్భుతంగా – అద్వితీయంగా పోషించి ఆ పాత్రను, తెలుగు సాంఘిక నాటకరంగంలో చిరస్మరణీయం చేశారు. కె. వేంకటేశ్వరరావు గారు కూడా మురారి పాత్రలో జీవించారు. ప్రేక్షకులను మైమరపించారు.

రాధాకృష్ణ గారు నాటక రచయిత గానే కాక, సినీ రచయితగా కూడా రాణించారు.
వీరు జ్యోతిష శాస్త్ర, సంఖ్యా శాస్త్ర పండితులు కూడా.

సినిమా రంగం కంటే, నాటక రంగంలో నే ఎనలేని కీర్తిప్రతిష్టలు ఆర్జించిన వీరు, 2007 సెప్టెంబరు 4 న కన్నుమూసారు.

SA: