‘భారతరత్న’ సత్యజిత్ రే

భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతితెచ్చిన సినీ దర్శకుడు సత్యజిత్ రే జన్మదిన సందర్భంగా…

సత్యజిత్ రే భారతదేశం గర్వించదగ్గ గొప్ప బెంగాలీ సినీ దర్శకుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి. 20వ శతాబ్దపు ప్రపంచ సినిమా చరిత్రలో అత్యుత్తమ దర్శకులలో ఒకరిగా ఆయన సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం: 1921, మే 2న కలకత్తాలోని ఒక ప్రముఖ కళాకారుల కుటుంబంలో సత్యజిత్ రే జన్మించారు. ఆయన కుటుంబం ఓ పెద్ద కళలకణాచి. సాహితీ నిలయం. తాతయ్య ఉపేంద్ర కిషోర్ రాయ్ సాహితీపరుడు. తండ్రి సుకుమార్ రాయ్ చిల్డ్రన్ లిటరేచర్ కం నాన్సెస్ రైమ్ రైటర్. వీరి ఫ్యామిలీకి ‘యు రే అండ్ సన్స్’ అనే ప్రింటింగ్ ప్రెస్ వుండేది. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో సాగింది. అనంతరం, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లోని ‘విశ్వభారతి విశ్వవిద్యాలయం’లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.

సినీ ప్రస్థానం – స్ఫూర్తి: తొలినాళ్లలో ఒక వాణిజ్య కళాకారునిగా (Commercial Artist) తన కెరీర్ ప్రారంభించిన సత్యజిత్ రే, ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు జీన్ రెన్వా (Jean Renoir) ను కలకత్తాలో కలవడం ఆయన జీవితంలో ఒక కీలక మలుపు. ఆ తర్వాత ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు ఇటాలియన్ నియో-రియలిస్టిక్ చిత్రం ‘బైసికిల్ థీవ్స్’ (Bicycle Thieves) చూశారు. ఆ సినిమా ఆయనపై తీవ్ర ప్రభావం చూపి, వాస్తవికతకు అద్దం పట్టే చిత్రాలను తీయాలనే ఆసక్తిని ఆయనలో రగిలించింది.

బహుముఖ ప్రజ్ఞ: తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో రే ఫీచర్ ఫిల్మ్స్, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలుపుకొని మొత్తం 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

తొలి అడుగులోనే సంచలనం: ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పథేర్ పాంచాలీ’. ఈ అద్భుత సృష్టి కేన్స్ చలనచిత్రోత్సవంతో సహా 11 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటింది.

సినిమాపై సంపూర్ణ పట్టు: రే కేవలం దర్శకుడు మాత్రమే కాదు, సినిమాలోని పలు కీలక విభాగాలపై ఆయనకు అపారమైన పట్టు ఉండేది. తన సినిమాలకు స్క్రీన్ ప్లే, కాస్టింగ్, సంగీతం, ఛాయాగ్రహణం (Cinematography), కళా దర్శకత్వం, కూర్పు (Editing) మరియు పబ్లిసిటీ డిజైన్ వంటి బాధ్యతలను సైతం స్వయంగా ఆయనే పర్యవేక్షించేవారు.

సాహిత్య రంగం: సినిమా రంగంతో పాటు సాహిత్య రంగంలోనూ రే విశేష కృషి చేశారు. ఎన్నో కథలు, వ్యాసాలు, పుస్తకాలను రచించారు. తన తాతగారు ప్రారంభించిన బెంగాలీ పిల్లల పత్రిక ‘సందేశ్’ (Sandesh) ను పునరుద్ధరించి, దానికి సంపాదకుడిగా, ప్రచురణకర్తగా అనేక సంవత్సరాల పాటు సేవలందించారు. మన దేశంలో మొదటి ‘ఫిలిం సొసైటీ’ (కలకత్తా ఫిలిం సొసైటీ) స్థాపకులలో ఆయన కూడా ఒకరు.

పురస్కారాలు-గుర్తింపు: సత్యజిత్ రే ప్రతిభకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ఢిల్లీ, ఆక్స్‌ఫర్డ్, లండన్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లు, డి.లిట్. డిగ్రీలతో సత్కరించాయి.

ముఖ్యమైన పురస్కారాలు:
పద్మశ్రీ (1959)
పద్మవిభూషణ్ (1976)
ఆస్కార్ అవార్డు (1992 – జీవితకాల సాఫల్య పురస్కారం)
భారతరత్న (1992 – భారత ప్రభుత్వం చే అత్యున్నత పౌర పురస్కారం)

-కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap