కనువిందు చేసిన భారతీయం

నాకు అటు ఇటు ఉండి, నన్ను ఆశీర్వదించి సత్కరించిన ఇద్దరూ ఇద్దరే. వారి రంగాల్లో ఘనాపాఠీలు. ఒకరు ఎస్.వెంకట నారాయణ గారు, ఆసియా ఖండంలో ఖ్యాతి చెందిన పాత్రికేయ శిరోమణి. స్వాతి పొలిటికల్ కాలమ్ నుంచి ఖలిస్థాన్ టైమ్స్ వరకు 20 కి పైగా దేశాల్లో ఉన్న పత్రికల్లో ఢిల్లీ కేంద్రంగా ఇప్పటికి వార్తలు రాస్తూనే ఉన్నారు. ఆయన వయసు 78. మరొకరు డాక్టర్ తాడేపల్లి లోకనాథ్ శర్మగారు. శాస్త్రీయ సంగీతం లో మహా మేటి గాయక శిరోమణి. ప్రతిష్టాత్మక కలైమామణి బిరుదాంకితులు. చెన్నై నుంచి విచ్చేసారు. ఆమె వయసు 78.

మార్చి 24న హైదరాబాద్, రవీంద్రభారతిలో ఈ మహానుభావులు ఇద్దరూ కలసి నన్ను ఆత్మీయంగా సత్కరించారు. భారతీయం పేరిట ఆజాది అమృత మహోత్సవ వేడుక నిర్వహించాం. కళ పత్రిక, కథక్ కళాక్షేత్ర, కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కనుల పండువగా ఈ వేడుక జరిగింది.
ఎస్. వెంకట నారాయణగారిది జనగాం. 1968 లోనే ఢిల్లీ వెళ్లారు. క్వీన్ ఎలిజిబెత్ మహారాణి నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ, జియా ఉల్ హాక్, ఖలీదా, మండేలా, బెనజీర్ వరకు అందరిని ఇంటర్వ్యూ లు చేశారు. ఇందిరాగాంధీ విదేశ పర్యటనల్లో తప్పనిసరిగా నారాయణగారు ఉండేవారు. రాష్ట్రపతులు నీలం సంజీవ రెడ్డి నుంచి ప్రణబ్ ముఖర్జీ వరకు అందరితో సాన్నిహిత్యం ఉంది. పి.వి. నరసింహారావు, మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్, వాజపేయ్, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు అందరూ ఆయనకు ఆత్మీయులే. ఇంతటి మేధావి, అంతటి సంగీత విద్వాంసులు… ఇద్దరూ మా భారతీయంలో పాల్గొని సరికొత్త శోభను చేకూర్చారు.

ఐఎఎస్లను తీర్చిదిద్దుతున్న సి ఎస్ బి ఐఎఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి బాల లత మల్లవరపు గారిని ప్రైడ్ అఫ్ ఇండియా అవార్డుతో సత్కరించాం. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మజా రెడ్డి గారిని ఆత్మీయంగా సన్మానించాం. వీరిద్దరూ కూడా హేమా హేమీలే. బాలలత గారు రెండు సార్లు సివిల్స్ లో ర్యాంకులు సాధించి ఏకంగా ఐఎఎస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఎందరినో ఐఎఎస్, ఐపిఎస్ లుగా తీర్చిదిద్దుతున్నారు. పద్మజా రెడ్డి గారు ప్రణవ్ నృత్య అకాడమీ మూడు నృత్య స్కూల్స్ నిర్వహిస్తూ వేలాది శిష్యులను కూచిపూడి నాట్యం వైపు అడుగులు వేయిస్తూ సంస్కృతిని కాపాడుతున్నారు. ఇద్దరూ ఇద్దరే.

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన ఈ వేడుకలో ఎస్.నారాయణ (ఢిల్లీ), డాక్టర్ తాడేపల్లి లోకనాథ్ శర్మ (చెన్నై), డాక్టర్ రామరాజు శ్రీనివాస్ (గుంటూరు), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, పర్యాటక జాయింట్ సెక్రటరీ కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Bharateeyam Dance Festival

హరి మంగళంపల్లి శిష్యులు భరత నాట్యం, శ్రీమతి రోహిణి ప్రసాద్ శిష్య బృందం కూచిపూడి, శ్రీమతి అనితా పీటర్ బృందం మోహినియాట్టం, ప్రకాష్ బృందం పేరిణి నాట్యం, పండిట్ అంజుబాబు శిష్య బృందం కథక్ నాట్యాలతో భిన్నత్వంలో ఏకత్వం భారతీయ తత్వాన్ని చాటిచెప్పారు. కళ పత్రిక సిబ్బంది తో పాటు, కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ, కథక్ కళాక్షేత్ర డైరెక్టర్ పండిట్ అంజుబాబు పర్యవేక్షించారు. పిఎంకె గాంధీ, శ్రీమతి శోభా గుప్తా వ్యాఖ్యానం చేశారు.

  • డాక్టర్ మహ్మద్ రఫీ
SA: