2౦ సంవత్సరాలు…
ఆయన పాట పుట్టి…
ఆయన మాయ చేయడం మొదలు పెట్టి..
ఆయన అక్షరాలు .. మనల్ని ఆనందింపచేయడం మొదలు పెట్టి…
ఆయన పాటలకి మన మనసులు మురిసిపోవడం మొదలుపెట్టి…
ఆయన పల్లవి కి మనం పరవశించడం మొదలుపెట్టి..
ఆయన చరణాలకి మనం చిందులు వెయ్యడం మొదలుపెట్టి…
ఆయన పాటకి మన కళ్ళు చెమర్చడం మొదలుపెట్టి
ఆయన పాటకి మన సంతోష పట్టాభిషేకం మొదలయి…
ఇలా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది..
మన హృదయాలను ఆయన అలరించడం జరుగుతూనే ఉంటుంది…
“బొమ్మను గీస్తే నీలా వుంది… దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది… అంటూ భావకవిత్వం రాస్తాడు…
“ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ” అని కుర్రకారును వెర్రెక్కిస్తాడు…
“ఈ గుండె నాదయినా … వుండేది నువ్వేలే ” అంటూ … ప్రేమకు కొత్త భాష్యం చెప్తాడు…
“ఈ తప్పులు .. ఈ తిప్పలు మన పొట్టలకోసమే …” అని జీవన పోరాటాన్ని సరికొత్తగా నిర్వచిస్తాడు…
“సత్తే ఏ గొడవా లేదు… ” అంటూ వేదాంతం చెప్పగల సమర్థుడు ఈ గోదావరి కుర్రాడు …
“నా దమనుల్లో, శిరంలో రక్తం కాదు ప్రవహించేది … గోదావరి నీళ్ళే
నా దేహం – దేహమంతా గోదావరితో నిండిపోయింది…
నా జ్ఞాపకాల్లో గోదావరి ఎపుడూ ఇరిగిపోని మంచి గంథమే…వాడి పోని పారిజాతమే…” అంటాడు భాస్కరభట్ల.
సినీ గీత రచయితగా భాస్కరభట్లకు ఇరవై యేళ్లు ఇవాళ్టితో నిండాయి. భాస్కరభట్ల తొలిగీతం రాసిన ‘గొప్పింటి అల్లుడు’ చిత్రం సరిగ్గా ఇరవై యేళ్ళ క్రితం ఇవాళే విడుదలైంది. నందమూరి బాలకృష్ణతో ఇ.వీ.వీ. సత్యనారాయణ తెరకెక్కించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… దర్శకుడు పూరి జగన్నాథ్, సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి లాంటి వాళ్ళ సహకార ప్రోత్సాహాలతో భాస్కరభట్ల తెలుగు చిత్రసీమలోని అగ్ర గీతరచయితల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు. ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో విజయాన్ని అందుకొన్నారు. అక్కడ్నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు.
1974 జూన్ 5న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన రాజమండ్రిలో పెరిగారు. తాత అరవెల్లి రాజగోపాలాచార్య నుంచి సాహిత్యాభిలాషని పుణికి పుచ్చుకున్న భాస్కరభట్ల రవికుమార్ చిన్నప్పుడే కవితా పఠనంపై దృష్టిపెట్టారు. బి.ఎ (తెలుగు) పూర్తి చేసిన అనంతరం సినీ పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. రాజమండ్రి, హైదరాబాద్‌ల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సినీ పాటల రచయితగా స్థిరపడ్డారు. వరంగంల్‌కి చెందిన లలితని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు భాస్కరభట్ల. ఆ దంపతులకి ఇద్దరమ్మాయిలు అమంత, సంహిత ఉన్నారు. గీత రచయితగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న భాస్కరభట్ల కలం నుండి మరెన్నో మంచి పాటలు రావాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేస్తుంది 64కళలు.కాం
-కళాసాగర్
I love your songs , congrats sir