సాహిత్య పఠనం ఎలాంటి వ్యసనమో, ట్రెక్కింగ్ -కొండలు అడవులు చుట్టి రావడం కూడా అలాంటి అభిరుచే! అయితే దీనికి కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అవి శారీరక దారుఢ్యంతో పాటు మనోస్థైర్యం, అనుకోని కష్టాలని సహనంతో ఓర్పుతో భరించే శక్తి, సమూహంలో కలిసికట్టుగా ఉండడం.. ముఖ్యంగా అడవుల్లో తిరిగేటప్పుడు ప్రకృతి ప్రియులైన వారైతే, తప్పక అక్కడి జీవజంతుజాలంపై ప్రేమ, మనుషులతో మమేకం కావాల్సి ఉంటుంది.
భూమన్ అలాంటి ఒక సాధారణ ట్రెక్కర్.. అంతేనా!? కాదు ఆలస్యంగా ట్రెకింగ్ రుచి చూసి దాన్ని తన జీవితంలో, జీవిత భాగస్వామితో కలిసి భాగం పంచుకుంటూ, ఎందరెందరినో.. యువత నుంచి విశ్రాంత ఉద్యోగుల వరకు ఈ యాత్రలో కలుపుకుంటూ దేశ విదేశాల్లోనూ, మరీ ముఖ్యంగా శేషాచలం నల్లమల కొండలలో విస్తృతంగా ట్రెక్కింగ్ చేసిన అనుభవశాలి. ఈరోజుకి ట్రెక్కింగ్ భారంగా ముగిసినా మళ్లీ ఉదయం లేవడంతోనే ఎప్పుడెప్పుడు కొత్త ప్రదేశాల ట్రెకింగ్ కి వెళ్ళాలో ప్రణాళికలు వేసి కలిసి వచ్చే మిత్రులను కలుపుకొని ఆ యాత్రలు విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చి ఇప్పుడు శేషాచలం కొండ కోనల్లో అన్న ఒక అందమైన పుస్తకాన్ని ప్రచురించారు. ఎంటర్ప్రైజ్ మైండ్స్ వారి సహకారంతో.
భూమన్, చార్మినార్ వారసత్వపు నడకల దగ్గర నుండి లండన్ లో మార్క్స్ హెరిటేజ్ వాక్ దాకా, చైనా గోడ, టైగర్స్ నెస్ట్, హిమాలయ సానువుల వరకు, ఇంకా అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో మొదలైన కొండలు అడవుల దాకా ఆ ప్రయాణం సాగింది.
తిరుపతిలోని ‘మొజైక్ అడ్వెంచర్ కమ్యూన్ సన్రైజ్’ ట్రెక్కర్స్ ద్వారా తన ట్రెక్కింగ్ యాత్రలకు పరిపూర్ణత సిద్ధించిందని చెబుతారు. కరోనా పుణ్యమా అని శేషాచలంఅడవులతో పాటు శ్రీకాళహస్తి కార్వేటి నగరం లంకమల నల్లమల కొండ కోనలు విస్తృతంగా తిరిగే వీలు దొరికింది. శ్రీకాకుళం అడవుల్లో తిరిగినా ములుగు అడవులు చుట్టి వచ్చినా ‘రాయలసీమ కరువుబండ’ యాత్ర చేసినా.. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయిలో అడవులు సెలయేళ్లు జలపాతాలు కొండ కోనలు తిరగటం మాత్రం ఈ ట్రెక్కింగ్ ద్వారానే. దారులు లేని చోట దారులు చేసుకుని తాళ్లతో ఎక్కుళ్లను ఎక్కించిన మిత్రులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రాంతాల వైనాన్ని పసిగట్టే స్థానియతను పదిలపరుచుకోవాలని వారి ఆశంస. ట్రెకింగ్ జీవితంలో ఒక భాగం అయితే అదొక సామాజిక వికాసానికి తోడ్పడుతుందన్న తాత్వికమైన నమ్మిక కూడా ఆయనకు ఉంది. అందుకే ఆయన తన యాత్రలను కొనసాగించేందుకు సహకరిస్తున్న తన కాళ్లకు తానే ‘శతకోటి పాదాభివందనం’ చేసుకోవడం ఎంతో అర్థవంతమైనదే!
తిరుపతికి, ఆ మాటకొస్తే యూత్ హాస్టల్ అసోసియేషన్(అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా దేశవ్యాప్తమైన ట్రెకింగ్ అనుభవం ఉన్న బివి రమణ ఇందులో తన ముందుమాటలో ‘రాహుల్ సాంకృత్యాయన్ శతజయంతి సందర్భంగా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు రాహుల్ ప్రయాణించిన మార్గంలో ఒక ట్రెక్కింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానికి దేశవ్యాప్తంగా ఎనిమిది మంది సభ్యుల్ని ఎంపిక చేస్తే.. తిరుపతి నుంచి ఎంపికైన వారిలో ఒకడీయన.. తిరుపతిలో పరిసర ప్రాంతాల్లో ‘ఫొటోగ్రఫి ట్రెక్కింగ్ పితామహుడి’గా కూడా ఆయన్ని ముద్దుగా పిలుచుకుంటారు ట్రెక్కర్స్. ట్రెక్కింగ్ అంటే జ్ఞానం పట్ల ప్రగాఢ అనురక్తికి రాహుల్ సాంకృత్యాయన్ ‘ సంచార సంప్రజ్ఞత’కు ఒక ఉదాహరణగా చెబుతుంటారు. గౌతమ బుద్ధ మహావీర నానక్, చైతన్య ప్రభు, నైనార్లు ఆళ్వార్లు.. తదితర మహానుభావులు కూడా తమ జ్ఞాన విస్తృతికి యాత్ర మాధ్యమాన్ని ఎన్నుకున్నారు’ అని ఆయన వ్యాఖ్యానిస్తారు. ఆధునిక కాలంలో ట్రెక్కింగ్ గా,హైకింగ్, బ్యాక్ ప్యాకింగ్ గా పరిగణన పొంది దేశ కాలాలకు అతీతమైనది ఈ ‘పాంథ ప్రజ్ఞ’ అంటారు రమణ. అంతర్ ప్రకృతి- బాహ్య ప్రకృతి అని మనకు రెండు రకాలు విభజన ఉంది. ప్రకృతి పరిసరాల్లోకి ప్రవేశించి అంతర్దృష్టి సాధించడమే ట్రెక్కర్ల పరమావధి. తన సహ పరిసరాలు ప్రాణులు పట్ల సానుకూల దృక్పథం కలిగిన వాడు, కులమతాలు వర్గాలు, వివక్షలు ఆడంబరాల అడ్డుగోడలు లేని వాడు.. అసలు సిసలైన వసుధైక కుటుంబీకుడు అతడే’ అంటారు. దీక్షగా చేస్తే, శారీరక మానసిక భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడే ‘అసాధారణమైన సాధనా పనిముట్టు ట్రేకింగ్’ అని నిర్వచిస్తారు. “కొండల కండలను గుహల గుండెలను చెట్టు చేమల చెమ్మని జలపాతాల మర్మర ధ్వని వాగు వంకల వాగ్దాటిని చిరుగాలుల షెహనాయి సంగీతాన్ని, గుదిగుచ్చి పుస్తక రూపంలో ఓ పరిమళభరిత పూల గుత్తిగా చేసి అందించిన పుస్తకమే “శేషాచల కొండ కోనల్లో” అన్నది ఆయన నిగ్గుదేల్చిన నిశ్చితాభిప్రాయం. ఈ పుస్తకాన్ని ‘శేషాచల విపిన సీమ రెప్లికా’ అని కూడా ఉపనామం ఇచ్చారు.
తిరుపతిలో గతంలో గోగుల విజయ్ కుమార్ స్థాపించిన తిరుపతికి ట్రెక్కింగ్ అనే పదాన్ని పరిచయం చేసినట్లు చెబుతారు. శేషాచలం నడిబొడ్డు అయిన యుద్దగళ తీర్థం లోని ఆదిమానవుడి చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ బృందమే! ప్రయాణించడానికి కష్టమైన కంటకావృత మార్గాలు పులులు అడవి ఏనుగులు, విషసర్పాలు ప్రతికూల వాతావరణ స్థితిగతులు ఉన్న ప్రాచీన కాలంనాటి పరిస్థితుల్లో యాత్రికులు ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటూ యాత్రలు చేసి ఉంటారో ఊహించుకోమంటారు. ఇప్పుడు మనకు అందివచ్చిన సాధనాలతో అది ఎంత తేలికగా, ఎందరికో అడవి తల్లి ఒడిని ఆటల బడిగా మార్చివేసిందో చెబుతారు. తిరుమల కేంద్రంగా 108 దివ్య తీర్థాలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే తిరుమల మరో పేరుతో తీర్ధాద్రి అంటారని కూడా పేర్కొంటారు. తిరుపతి నగర పరిసరాల్లో ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాలైన తాటికోన మల్లెపల్లి పాండవగుడి ఘంటా మండపం జెర్రిపోతుల కోన తదితర అనేక స్మృతి చిహ్నాలు సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని చెబుతారు. అన్నమయ్య తాళ్లపాకవులు తరిగొండ వెంగమాంబ యతి మలయాళ స్వామి లాంటి మహామహుల నడకతో పునీతమైన ప్రాంతాల్లో, ప్రదేశాల్లో ట్రెకింగ్ సాగించడం ఒక వర్ణించలేని అనుభూతి.
ట్రేకింగ్ వెళ్లాలంటే సరైన గైడ్లు ఉండాలి వంట చేసి పెట్టేవారు ఉండాలి అనుకోని ప్రమాదం ఎదురైతే ఢీకొట్టగల ధైర్యవంతులు ఉండాలి సరుకు సరంజామా మోయగల పోర్టర్లు అనుసరించాలి. ఎగుడుదిగుళ్ల మార్గాల్లో చాకచక్యంతో వాహనాలు నడపగలిగిన చాకులాంటి డ్రైవర్లు ఆసరాగా నిలవాలి’ అని ఒక చిన్న సూచీని మనతో పంచుకుంటారు,రమణ. అంతేకాకుండా ఎన్నో అంశాలపై అవగాహన సమర సన్నద్ధత సౌందర్య దృష్టి అత్యంత ఆవశ్యకం అంటారు. ఈ ట్రెక్కింగ్ వల్ల అంతర్గత శక్తుల శుద్ధి, ఉద్దీపన జరుగుతుందని షట్ చక్రాలు ఉత్తేజితమవుతాయని రమణ అంటారు. స్మగ్లర్లు ఎర్రచందనపు చెట్లకు చేసిన గాయాలని చూసి తన మేని నుంచి శ్రవించే రసాయనం- మనిషి నెత్తురు ఒకటే అని చాటి చెప్పి ఎర్రచందన చెట్ల స్మగ్లింగ్ అరికట్టడంలో ట్రెక్కర్లు చేయగలిగిన సహాయం ఏదైనా ఉందా? అని కూడా ఆలోచించమంటారు. అరణ్య ట్రేకింగ్ ను ఆచరణాత్మక సూక్తిగా ధరించిన సంస్థ దేశంలో కెల్లా పిరమిడ్స్ సొసైటీ ఒకటేనేమో!? అని కూడా ఒక తీర్మానికి వస్తారు. తిరుపతి మొజైక్ సన్రైజ్ సంస్థ వల్ల ఇక్కడి తుంబురు తలకోన ట్రెక్ లు నేషనల్ లెవెల్ ట్రెక్కింగ్ లుగా గుర్తింపు పొందడం విశేషం. ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ట్రెకింగ్ వైకుంఠం- తిరుపతి. తుంబురు తీర్థంలోనే తుంబురు తీర్థం అన్న పుస్తక ఆవిష్కరణ నోచుకోవడం కూడా తనకు మిగిలిన ఒక మధురానుభూతి అంటారు. రాయలసీమ అధ్యయన సంస్థ ద్వారా ఎన్నో ఉపన్యాసాలు ప్రసంగాలు చేసిన భూమన్ ఈ పుస్తకంలో ప్రతి పేజీ దుమికే జలపాతాన్ని ఉరికే సెలయేరును ఉరిమే ఉత్సాహరూపాన్ని ఉద్వేగ ఋతువుల గమనాన్నీ కళ్ళకు కడుతుంది’ అంటూ ఈ పుస్తకం ఒక “అరణ్యవాచకం, శేషాచల చందస్సు, భావోద్వేగాల ప్రాస” అంటారు. ట్రెక్కింగ్ కు ఇది ఒక అందమైన హ్యాండ్ బుక్ గా చెబుతూ. చివరగా ట్రెకింగ్ అంటే- ఇవాళ యూట్యూబ్ వాట్సాప్ ఇంస్టాగ్రామ్ ల గుర్తింపు పిచ్చిగానో, ఫోటోల రీల్స్ ఫ్యాషన్ సెషన్ గానో మారిపోతే అదో ‘నగర నాగరికాధిక్య అహంకార ప్రక్రియలో ఒకటిగా’ మిగిలిపోతుంది. అప్పుడది అరణ్య ట్రెక్కింగ్ కాదు ఆర్భాటపు టక్కరి ట్రెకింగ్ అని కూడా కొంత ఆవేదన మిశ్రితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.
ఇక తిరుపతి కథలు, కొండ కతలు, తిరువీధులు, తిరుపతి గంగజాతర మొదలైన పుస్తకాలు రాసిన రచయిత ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి “ట్రెకింగ్ అంటే- చాలా దూరం పాదాలపై ఆనందం కోసం నడవడం” అని నిఘంటువులు చెబుతున్నాయి అంటూ మనిషి నిటారుగా నడవడానికి పూనుకున్నప్పటి నుండి మానవుడు నిలువెత్తు మనిషయ్యాడు. జలాశయాలను నదులను వెతుక్కుంటూ అనువైన ప్రాంతాలకు సుదూర నడకను ప్రారంభించాడు. నచ్చిన చోట ఆహార కొరత రాదనుకున్నచోట ఇండ్లను కట్టుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకున్నాడు. సంచార జీవనాన్ని- ఒక చోట స్థిరంగా ఉండలేనితనంతో, కొండ కోనల్ని అడవుల్ని వదిలిపెట్టలేక ఆటవికులుగా ఆదివాసులుగా కూడా కొందరు మిగిలిపోయారు’ అంటారు. నడవడం- ఋతువుల్లాగానే ఆరోగ్యం ఆహ్లాదం అనుభూతి ఉల్లాసం ఉత్తేజం మనశ్శాంతి ఇస్తాయి’ అంటారు పేటశ్రీ. ట్రెకింగ్ మత్తు ఎలాంటిదంటే మనమూ, మనతో ఉన్నవారు మాత్రమే ఈ ప్రపంచం అనిపిస్తుంది’. ప్రాణాలకు తెగించి అడవుల్లో సంచరించి తాను పొందిన అనుభూతుల్ని చక్కనైన భాషతో ఆకట్టుకునే రీతిలో వ్యాసాలను సచిత్రంగా మలిచి తేవడం అంటే ఆషామాషి అయిన పని కాదు. అక్కడి పక్షులు జంతువులు జీవరాసులు, జలపాతాలు సెలయేటి గల గలలు, లతలు, చెట్టంత తీగలు ఊడలు రాళ్లు రప్పలు, వానలు ఎండలు ఈతలు రాత్రిపూట నిద్రలో తిండ్లు వెన్నెల రాత్రులు వంటి వాటిని గురించి.. అభిమానంతో అడవిని జయించిన భూమన్ ఎంతో కవితాత్మకంగా హృద్యంగా ఈ పుస్తక రచన చేశారంటారు. భూమన్ తో పాటు వారి శ్రీమతి ఆచార్య కుసుమకుమారి గారు కూడా పీకలోతు నీళ్ళల్లో కూరుకుపోయి నడుస్తున్న దృశ్యాన్ని చూసి అవాక్కైపోయాను’ అంటారు పేటశ్రీ. తిరుమల అడవి అనే ప్రకృతి పొలానికి భూమన్ దే మొదటి మడక. ఆ మడక వెనకాలే మరికొంతమంది మడకలు అనుసరించి ప్రకృతి అందాలను దున్ని కమనీయ దృశ్య కావ్యాలను పండిస్తున్నారు’ అంటారు పేటశ్రీ.
ఇక ‘లంకమల దారుల్లో’ అన్న గ్రంథ రచయిత వివేక్ లంకమల, కోయిలను తొలకరి చినుకుల వసంత శోభను లోకానికి చాటేదిగా వర్ణిస్తూ ప్రయాణం పరిశీలన అనుభూతుల కలయిక మనిషిని ప్రకృతిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. సంపాదన కోసమో అభిరుచివల్లో.. కారణం ఏదైనా మనిషి ఒక నిత్యసంచారి’ అని కూడా నొక్కి చెబుతారు. శేషాచల మహాత్మ్యం ప్రకారం ఆ కొండ కోనల్లో 1008 తీర్ధాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికాను చూసిన కళ్ళతోనే అన్నమయ్యను అబ్బురంగా చూశారు భూమన్. గోదావరి తీరాన్ని స్పృశించిన చేతులతోనే వొట్టిపోయిన పెన్నా, చెయ్యేటిల ఇసుకను మనస్ఫూర్తిగా తడిమారు. ఎన్నో లోతట్టు ప్రదేశాలను బయట ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి భూమన్’ అంటారు వివేక్ లంకమల.
200 పేజీలు ఉన్న ఈ సచిత్ర పుస్తకంలో మొత్తం 64 వ్యాసాలు ఉన్నాయి.. అనుబంధంలో, కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా అడవులు కొండలు శిఖరాలలో అందమైన ప్రయాణం’ అన్న అనుబంధంతో సహా. ఇప్పుడు ఈ పుస్తకంలోని కొన్ని ట్రెక్కింగ్ వ్యాసాల నుంచి స్థాలీపులాకంగా కొన్ని మాటలు ఎత్తిచూపుతూ వ్యాసాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను.
వాగేటి కోన చేరుకోవడం ఒక అనుభూతి. చేరుకున్నాక, కలిగే అనుభూతి మరో రకం అంటూ ఆ చోటును వర్ణించ వీలుగాని ఆ సౌందర్యరాశుల మధ్య నన్ను నేను పోగొట్టుకున్నాను అంటే నమ్మండి అంటారు. ఈ కోన దారిలో వచ్చే చివరి గుండం చాలా పెద్దది. శేషాచలం అడవులలో నేను చూసిన అన్ని గుండాల్లో కన్నా పెద్దది’ అంటారు భూమన్.
ట్రెక్కింగ్ ఒక అలవాటుగా మారిన తర్వాత ఆరోగ్యం గురించి కాకుండా ఇంకేదో ఆలోచనకు అన్వేషణకు దారి తీసినట్టుగా ఉంది’ అంటూ నువ్వేమిటో కనుగొనమని ప్రశ్నిస్తుంది ఆ తాత్విక చింతన, యావ. మనం సంచరించే సమాజాన్ని సంస్కరించమని ఆరోగ్యప్రదంగా ఉంచమని చెబుతుంది. ఈ కోనలు బండలు, పేర్లు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు ‘బామ్మర్ది బండలు’. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక గిరిజన గూడెం.. దాన్లో పెద్ద కుటుంబం. ఒకసారి ఎలుగుబంట్లు దాడి చేసి గూడెం పెద్ద, బామ్మర్దిని చంపేశాయట. అంతే! ఆ నేలకు బామ్మర్ది బండలనే పిలుపు వచ్చిందట. ఒకప్పుడు అడవి నిండా గూడేలు గూడేలుగా ఉన్న అడవి బిడ్డలు మాయమై ఇప్పుడు ఎర్రచందనం కసాయి గాళ్లు మిగిలి ఉండటమే నేటి వైచిత్రి’ అంటారు మానవీయ సహజ స్పందనతో.
156వ సూర్యోదయ ట్రెక్కింగ్-బాలరాజు బండలో. అప్పటికే 7000 మందికి పైగా సభ్యులు ఉన్న ఈ సంస్థలో ప్రతివారం 50 మందికి తక్కువ కాకుండా, కొన్ని మార్లు వందల్లో పాల్గొనడం ఈ గ్రూపు విజయానికి నిదర్శనం అంటారు ఈ కమ్యూన్ గురించి చెబుతూ. పాండవ గుళ్ళు-ఇక్కడి రాక్షస గూళ్ళు 3000 సంవత్సరాల క్రితం ఆదిమానవుడు గీచిన బొమ్మలు రాతలు ఉన్నాయి. మన ప్రాచీన సోదరుడి చేతిరాతను చూసి ఉబ్బితబ్బిబ్బై పొయ్యారు భూమన్. ఎవరైనా చనిపోతే మళ్ళీ బతుకు ఉంటుందని నమ్మి శవాన్నో పెద్ద కుంట తయారుచేసి అందులో పెట్టి ఆకులు నార్లతో, మట్టి భూమిలో పాతిపెట్టే వారని పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఆ శవాన్ని ఏదీ పీక్కు తినకుండా పెద్దపెద్ద రాళ్లను అడ్డం పెట్టేవారట. శవంతో పాటు అతడు వాడిన వస్తువులు తిండి కూడా ఉంచే వారట. వీటినే పాండవ గుళ్ళు, రాక్షస గుళ్ళు అని అంటారు. తాను లండన్ కు పోయినప్పుడు అక్కడి ‘స్టోన్ హెంజ్’ చూసి ఎంత ఆశ్చర్యపడ్డారో! రోజుకు కనీసం అక్కడ 20,000 మంది వాటిని చూడడానికి వస్తారట. 3000 సంవత్సరాల క్రితం స్టోన్ హెంజ్ ఒకానొక బ్రిటిష్ ప్రతీక-ఐకాన్. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదలో ఉంది.
కొన్ని గుట్టల మార్గాల్లో నడిచేటప్పుడు గోతులు కనిపిస్తాయి. అవి ప్రాచీన కాలంలో రాజులు ఎవరైనా సంపదను ఇక్కడ దాచారా అన్న దాని కోసం. ఉందో లేదో ఖచ్చితంగా తెలియని ఆ సంపద కోసం తవ్విన గోతులు అవి. ప్రాచీన గుళ్ళు ఉన్న ప్రాంతాల్లోకి ప్రజలు పండుగల రోజుల్లో రావడం మంచిదే గాని దాని వల్ల జరిగే నష్టం మాత్రం పెద్ద ఎత్తున ఉంది. వారు వాడిపడేసిన విస్తర్లు ప్లాస్టిక్ వస్తువులు సీసాలు ఆ ప్రదేశాలలో మిక్కిలి ఎక్కువగా కనిపిస్తాయి.
‘కోన అంటే కొండ శిఖరం మీద ఒక చదునైన ప్రాంతంలో ఒక నీటి బుగ్గ వెలిసి ఉంటుంది. బుగ్గ నుంచి పెల్లుబికే నీళ్ళు, సెలయేరై, జలపాతమై సమీపంలోని ఏట్లోకి పారుతుంటాయి. ప్రతి బుగ్గ దగ్గర ఒక గుడి ఉంటుంది. ఇదే కోన’. ప్రతి కోన వెనుక ఒక కథ ఉంటుంది. అగస్తీశ్వర కోన రంగనాయకుల కోన గురిగింజ కోన చండ్రాయుని కోన, ఇలా.. ఎన్ని కోనలో. కోనలు- “రాయలసీమ సిగ్నేచర్” అంటారు భూమన్.
‘బిలం గుహ’ అన్న వ్యాసంలో – అడవి ప్రకృతిలో ప్రయాణం అంటే మనిషి తనలోకి తాను ప్రయాణించడమే’ అంటూ లంకమల అడవుల్లోని బిలం గుహ గురించి చెబుతూ లంకమల అడవులు అటు శేషాచలానికి- నల్లమలకు వారధి లాంటివి అంటారు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ట్రెకింగ్ పార్టీతో వచ్చిన అటవీ ఉద్యోగి ఒకరు చెప్పిన సంగతి- వాళ్ళ శిక్షణలో భాగంగా వీళ్ళని జంతువుల బోనులో ఉంచి, జంతువుల కదలికలను వాటి మనస్తత్వాన్ని అధ్యయనం చేయమంటారట’ అని తెలిసినప్పుడు శిక్షణ ఎవరిలోనైనా ఎంత నైపుణ్యాన్ని,సదవగాహనను పెంచుతుందో అన్నదానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బెలుం గుహలు- అరకు గుహలు, మేఘాలయ గుహలు చైనా గుహలు చూసినా, ఈ బెలుం గుహలు చూడటానికి ఒక ప్రత్యేకత ఉన్న గుహలు అంటారు. ఈ గుహ ‘గబ్బిలాల అభయారణ్యం’ అని అనడం మంచి పోలిక.
ట్రెకింగ్ ప్రదేశాన్ని బట్టి జీపుల్లో మోటార్ సైకిల్ మీద కూడా వెళ్లిన ప్రాంతాలు ఉన్నాయి. ఈ శేషాచలంకు ప్రదక్షిణ మార్గంలో ‘అడవిలో ఏదీ ఎందుకు కోయకూడదు, తినకూడదు అంటే.. అడవి అక్కడి జంతువుల పక్షుల ప్రపంచం. మనం ఆ పళ్ళు కోసుకుని చెట్లను విరిచేస్తే వాటికి కానీయకుండా చేసినట్లు. వాటి నోళ్లు కొడుతున్నామన్న గిరిజనుల భావన- చాలా ఉదాత్తమైనది.
శేషాచల జీవ వైవిధ్యం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడే బంగారు బల్లి, నక్షత్ర తాబేలు వీటి ఉనికికి ప్రసిద్ధి పొందింది. మరొక పాదయాత్రలో తరిగొండ వెంగమాంబ ధ్యానం చేసిన మారెళ్ళ గవిని చూసి రావాలని వెళ్ళారు. తరికుండ అంటే పెరుగు చిలికే కుండ. తరికుండ క్రమంగా తరిగొండ గా మారిందనీ, కుండలో నుండే లక్ష్మీనరసింహస్వామి శిలా విగ్రహం బయటపడిందని చెప్పుకుంటారు.
ఈ వ్యాసపరంపరలో చివరిది “రారమ్మని పిలిచే నీరా”. ఆల్కహాలు కాని సహజసిద్ధమైన ఆరోగ్య ద్రావణం. ఎన్నో రకాల ఔషధ గుణాలున్న నీరా ఎన్నో వ్యాధులను నివారించే ఆరోగ్య ప్రదాయిని. నీరా సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్. శక్తినిచ్చే పానీయమే కాదు జీర్ణ కోశ సంబంధిత ఔషధం. నీరా లో ఉన్న అనేక రకాలైన మినరల్స్ రక్త కణాలను మెరుగుపరుస్తాయి. సహజసిద్దమైన చక్కెర విటమిన్ సి ప్రోటీన్ విలువలు కలిగిన నీరా ఐరన్ లోపాన్ని సరిచేస్తుంది. 17 రకాలైన అనిమో ఆసిడ్స్ ఇందులో ఉన్నాయని శాస్త్రీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. ఇది చెట్టు నుండి తీసే మకరందం. దీనిని ఆంగ్లంలో ‘పామ్ నెక్టర్’ అంటారు. తాటి ఈత కొబ్బరి చెట్లతో పాటు ఖర్జూర బేరిక చెట్ల నుంచి కూడా నీరా ఉత్పత్తి అవుతుంది. అలా పలుచోట్ల పలు రకాల నీరా దేశ విదేశాల్లో టేస్ట్ చేసిన అనుభవాన్ని కూడా చెప్పి నీరా ప్రయోజనాలను ప్రస్తుతిస్తారు భూమన్. ఆరు గ్లాసుల టెంకాయ నీళ్ల కన్నా అధికంగా పోషకాలు కలిగిన ఒక గ్లాసు నీరాను ప్రభుత్వం కుటీర పరిశ్రమగా ప్రోత్సహించాలి అంటారు.
‘ఖాళీగా ఉంటే కాళ్ల నొప్పులు వస్తాయి. శ్రమ చేస్తే గుండెల్లో ఉత్తేజం, కాళ్లకు సత్తువ చేకూరుస్తుంది’ అన్న శివ రాచర్ల, భూమన్ మాటల కోట్ తో ఈ వ్యాస సంపుటి ముగుస్తుంది.
మొట్టమొదటి పేజీలో ట్రెక్ శ్రీనూ..’భూమన్ రాసిన ట్రెక్కింగ్ వ్యాస సిరీస్ లో ఇంకా ఎన్నో రుచికరమైన తిళ్ళగురించి, కట్టడాలు ప్రాచీన వారసత్వపు ఆనవాళ్లు గురించి చాలానే రాశారు. అవన్నీ సమయం చూసుకొని ప్రచురిస్తాం. వాటిని సంపుటీకరించే అపురూప అవకాశం తనకు దక్కినందుకు భూమన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ భూమన్ -ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ “బీయింగ్ హ్యూమన్” అంటారు ఆయనతో గల సుదీర్ఘ సహచర్య అనుభవంతో.
దీని వెల. 999/. (9885151357 సంప్రదించవచ్చు)
మల్లేశ్వరరావు ఆకుల
79818 72655
