విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 23
భారతీయ శాస్త్రీయ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతి ఆపాదించి పెట్టిన భారత రత్నాల్లో బిస్మిల్లాఖాన్ ఒకరు. ఈ షెహనాయి షెహన్ షా బిసిల్లాఖాన్ భారత రత్న బిరుదు అందుకున్న సంగీతజ్ఞులలో మూడవ వాడు. బీహర్ సంస్థానంలోనూ, కాశీ విశ్వనాథుని ఆలయంలోనూ కులమతాలకతీతంగా సంగీత ప్రస్థా నాన్ని సాగించారు. అల్లాను ఆరాధించాడు. అలాగే సరస్వతిని, కాశీ విశ్వనాథుని ఆరాధించిన ఆదర్శపురుషుడు. అఖిల భారతీయ కలకత్తా సంగీత సభలో షెహనాయి వాయించి దానికి భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఓ వేదిక కల్పించాడు. ప్రపంచంలో భారతీయ సంగీతానికి, భారతీయతకు ప్రతీకగా నిలుస్తాడు బిస్మిల్లా. 1947 ఆగష్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన శుభతరుణంలో ఎర్రకోట నుంచి షెహనాయి వాయించి తల్లి భారతి ఋణం తీర్చుకున్నాడీ ఉత్తమ భారతీయుడు. ఈయన ప్రతిభకు ప్రభావితులైన అమెరికా విశ్వవిద్యాలయం వారు ఖాన్ గారిని అక్కడికి రమ్మని పిలువగా తన వెంట మన గంగానదిని తీసుకువస్తే వారి వెంట నడుస్తానని చెప్పిన గాంగేయుడు ఈ బిస్మిల్లా ఖాన్. తన సంగీతాన్ని ప్రపం చంలో అన్ని ప్రముఖ నగరాల్లో వినిపించి పలువురి మెప్పులూ, బిరుదులూ అందుకున్నాడు. హిందూ ముస్లిం ఐక్యతకు సాక్ష్యంగా నిలిచి సంగీతానికి భాషా బేధాలు, కులమతాలు అడ్డుకావన్న సత్యాన్ని నిరూపించిన “పద్మభూషణ్”, “పద్మవిభూషణ్”, “భారతరత్న”డా. బిస్మిల్లాఖాన్ నేటికీ మన ధృవతార.
(బిస్మిల్లాఖాన్ జన్మదినం 21 మార్చి 1916)