తెలుగు సినిమాకు దాదాఫాల్కే… బి.ఎన్. రెడ్డి

నవంబరు 8 బి.ఎన్. రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం….

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే తెలియకపోవచ్చేమోగాని బి.ఎన్. రెడ్డి అంటే అటు సినీ జగత్తులోనూ, ఇటు ప్రేక్షక జనాలలోను తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన 1975లోనే దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి, అంతకు ముందే పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారతీయుడు…. పద్మభూషణుడు. తమాషా ఏమిటంటే ముప్పై ఏళ్ళ సినిమా అనుభవంతో బి.ఎన్. రెడ్డి నిర్మించిన సినిమాలు కేవలం పన్నెండు మాత్రమే అంటే నమ్ముతారా? కారణం బి.ఎన్. రెడ్డి ఏనాడూ బాక్సాఫీసు సూత్రాలను దృష్టిలో వుంచుకొని సినిమాలు తీయలేదు. ‘’సినీ ప్రేక్షకుని మదిలో భావప్రేరణ కలిగించేదే నిజమైన సినిమా’’ అని బి.ఎన్.రెడ్డి నమ్మేవారు. సినిమాలు కేవలం కాసులు రాల్చే సాధనాలు కావని, వాటిని సందేశం ఇచ్చే కళారూపాలుగా విశ్వసించాలనే సదాశయం కలిగిన ఆదర్శ నిర్మాత, దర్శకుడు బి.ఎన్. రెడ్డి. ఆయన బయటి సంస్థలకు నిర్మించిన చిత్రాలు కేవలం రెండే. అవి పొన్నలూరి బ్రదర్స్ వారి ‘భాగ్యరేఖ’, శంభూ ఫిలిమ్స్ వారి ‘పూజాఫలము’. మిగతావి వాహినీ సంస్థ సొంత చిత్రాలు. బి.ఎన్. రెడ్డి సంప్రదాయవాది. ఆయన సినిమాలలో మహిళ పాత్రలు వివిధ మనస్తత్వాలు కలిగివుంటాయి. ఒక పాత్ర అష్టకష్టాలు పడి చివర్లో సిరిసంపదలు అనుభవిస్తే, మరో పాత్ర ఆడంబరాలు, అతిశయాలతో మెలుగుతూ చివర్న నానా ఇక్కట్లూ పడుతుంది. ఈ పాత్రలు సహజత్వాన్ని సంతరించుకుంటాయి. మనసున మల్లెల మాలలూగించిన దేవులపల్లి కృష్ణశాస్త్రిని ‘మల్లీశ్వరి’ సినిమా ద్వారా పరిచయం చేసిన ఘనత బి.ఎన్. రెడ్డిదే. బి.ఎన్. రెడ్డి నిర్మించిన ‘బంగారుపాప’, ‘భాగ్యరేఖ’, ‘రంగులరాట్నం’ చిత్రాలకు జాతీయ బహుమతులు రాగా, 1974లో పద్మభూషణ్, పురస్కారం బి.ఎన్. రెడ్డి అందుకున్నారు. నవంబరు 8 బి.ఎన్. రెడ్డి వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు…

BN Reddy Postal Stamp

బి.ఎన్.రెడ్డి పూర్వాపరాలు…
1908 నవంబరు 16న కడప జిల్లా పులివెందుల పరిధిలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లి అనే కుగ్రామంలో బి.ఎన్.రెడ్డి జన్మించారు. తల్లి ఎరుకలమ్మ, తండ్రి నరసింహారెడ్డి. తండ్రి ‘ర్యాలిస్’ కంపెనీకి వేరుశనగలు సరఫరా చేసేవారు. నెమ్మదిగా వ్యాపారం వృద్ధిచెంది విదేశాలకు ఉల్లిపాయలు, మిరపకాయలు, ధాన్యం వంటి ఆహార వస్తువులను ఎగుమతి చెయ్యడం ప్రారంభించారు. దాంతో నరసింహారెడ్డి గారి కుటుంబం మద్రాసుకు మకాం మార్చింది. బి.ఎన్.రెడ్డి మాత్రం పొట్టిపాడు గ్రామంలో వున్న మాతామహుల ఇంటిలోనే పెరిగారు. తరవాత ప్రొద్దుటూరు వెళ్లి హైస్కూలులో చేరారు. తండ్రి మద్రాసుకు మకాం మార్చడంతో బి.ఎన్.రెడ్డి గోవిందప్ప నాయకన్ వీధిలోని హైస్కూలులో చేరారు. అక్కడే బ్రిజ్ మోహన్ దాస్ బి.ఎన్.రెడ్డికి సహాద్యాయిగా ఉంటూ సన్మిత్రుడయ్యారు. అక్కడి పాఠశాలలో చదివే రోజుల్లోనే ‘ఆటమ్ ఫెస్టివల్’ అనే రవీంద్రుని నాటకంలో గాలిపటాలు ఎగురవేసే పాత్రను పోషించారు. రవీంద్రుని మరో నాటకం ‘శాక్రిఫైజ్’ లో, ‘చంద్రగుప్త’, ‘బొబ్బిలియుద్ధం’ నాటకాల్లో చిన్నపాత్రలు పోషించి రక్తి కట్టించారు. అలా నాటకరంగం మీద ఆసక్తి చిన్నతనంలోనే మొదలైంది. ముత్యాలపేట హైస్కూలులో చదువుతుండగా వత్కృత్వ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. గోవిందరాజుల సుబ్బారావు నటించిన ‘ప్రతాపరుద్రీయం’ నాటకం చూశాక నాటకాలమీద మరింత మక్కువ పెరిగింది. ఆంద్ర నాటక సభలో సభ్యుడిగా చేరి నటుల అభినయం, వాచకం శ్రద్ధతో గమనిస్తూ చిన్నచిన్న వేషాలు వేశారు. 1928లో పచ్చియప్ప కళాశాలలో చేరి ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేశారు. అప్పుడే బి.ఎన్. రెడ్డికి వివాహం జరిగింది. తరవాత వ్యాపార నిమిత్తం కలకత్తా వెళ్ళిన బి.ఎన్.రెడ్డి బెంగాలీ బాబులు శశిధర్ బహాదూరీ, ఆహిన్ చౌదరి, ధనీబాబు ప్రదర్శించే నాటకాలను క్రమంతప్పకుండా చూసేవారు. కొన్నాళ్ళు రవీంద్రుని ‘శాంతినికేతన్’ లోకూడా గడిపారు. తరవాత వ్యాపారం నిమిత్తం రంగూన్ (బర్మా/మియన్మార్) వెళ్లినప్పుడు గాంధి మహాత్ముని దండి సత్యాగ్రహం మొదలైంది. బర్మాలో కూడా జాతీయోద్యమం మొదలైంది. తను కూడా విదేశీ వస్త్రాలను వదలిపెట్టి ఖద్దరు ధోవతి, లాల్చి ధరించడం మొదలెట్టారు. మద్రాసు వచ్చి చార్టర్డ్ అకౌంటెన్సి పూర్తిచేసి కొంతకాలం శాస్త్రి అండ్ షా కంపెనీ లో ఆడిటర్ గా సేవలు అందించారు. వారి ఆఫీసుకు దగ్గరలో ‘ప్రజామిత్ర’ పత్రిక కార్యాలయం వుండేది. గూడవల్లి రామబ్రహ్మం సంపాదకత్వంలో అక్కడ సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు సందడి చేస్తుండేవారు. అక్కడే బి.ఎన్.రెడ్డికి నార్ల వెంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు నాయుడు, అడవి బాపిరాజు వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. నిర్మాత హెచ్.ఎం.రెడ్డి తో ఏర్పడిన స్నేహ ప్రభావంతో సినిమారంగంలోకి అడుగిడడం జరిగింది. బి.ఎన్.రెడ్డి వుండే ఇంటి పైభాగంలో తాపీ ధర్మారావు నాయుడు, ప్రక్కఇంటిలో సముద్రాల రాఘవాచార్య ఉండడంతో సినిమా ప్రభావం గట్టిపడింది. అప్పటినుంచే బళ్ళారి రాఘవ, పారుపల్లి సుబ్బారావు, యడవల్లి సూర్యనారాయణ, నాగయ్య వంటి నాటకరంగ ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. గూడవల్లి రామబ్రహంతో కలిసి సినిమాల గురించి బి.ఎన్.రెడ్డి చరిస్తూ వుండేవారు. రామబ్రహ్మం సలహామీద బి.ఎన్.కె ప్రెస్ ను స్థాపించారు. తన సోదరుడు బి. నాగిరెడ్డి ప్రెస్ పనులు చూస్తుండేవారు. అలా కొందరు చిత్రరంగ ప్రముఖులు బి.ఎన్.రెడ్డికి ఈ ప్రెస్ ద్వారా పరిచయమయ్యారు. గూడవల్లి రామబ్రహ్మం ద్వారా ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ నిర్మాత పారుపల్లి శేషయ్యతో బి.ఎన్.రెడ్డికి పరిచయం కలిగింది. ఆయన బి.ఎన్.రెడ్డిని వేల్ స్టూడియోలో ‘కనకతార’ (1936) చిత్రనిర్మాణం జరుపుతున్న హెచ్.ఎం.రెడ్డి కి పరిచయం చేశారు. హెచ్.ఎం.రెడ్డి ‘రోహిణీ పిక్చర్స్ లిమిటెడ్’ అనే సినీ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తూ బి.ఎన్.రెడ్డికి కొంత భాగస్వామ్యం కలిపించారు. హెచ్.ఎం.రెడ్డి ఏర్పాటుచేసిన ఈ సంస్థలో బి.ఎన్.రెడ్డితోబాటు మూలా నారాయణస్వామి కూడా భాగస్వామిగా వుండేవారు.

వాహినీ ఆవిర్భావం…
హెచ్.ఎం.రెడ్డి ‘గృహలక్ష్మి’ చిత్రాన్ని గ్రీన్ వేస్ రోడ్డులో వున్న కార్తికేయ స్టూడియోలో నిర్మిస్తున్నప్పుడు ఆ స్టూడియో భాగస్వాములు రామనాథ్, ఎ.కె. శేఖర్ లు బి.ఎన్.రెడ్డికి పరిచయమయ్యారు. ‘గృహలక్ష్మి’ షూటింగులో వేశ్యపాత్ర ధరించిన కాంచనమాల, హీరో ముక్తేవి రామానుజాచారి మధ్య అశ్లీలమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు బి.ఎన్.రెడ్డి అభ్యంతరం తెలిపి ఆ షూటింగును బహిష్కరించారు. అంతే కాకుండా రోహిణీ సంస్థలో తన వాటా తీసేసుకొని బయటకువచ్చి, తన మిత్రులైన మూలా నారాయణ స్వామి మరికొందరితో కలిసి 1939లో వాహినీ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు బి.ఎన్.రెడ్డితోబాటు మూలా నారాయణస్వామి, తమ్ముడు బి. నాగిరెడ్డి, దర్శకుడు కె.వి.రెడ్డి, బ్రిజ్ మోహన్ దాస్, సముద్రాల రాఘవాచార్య, చిత్తూరు నాగయ్య మూల స్తంభాలుగా నిలిచారు. కార్తికేయ స్టూడియో మూతపడడంతో ఆ స్టూడియో అధినేతలైన రామనాథ్, ఎ.కె. శేఖర్ లను బి.ఎన్.రెడ్డి వాహినీ సంస్థలోకి ఆహ్వానించారు. ఇలియట్స్ బీచ్ లో అందరూ కూర్చుని చక్కని సినిమాలు నిర్మిద్దామని ప్రమాణం చేశారు. సినిమా రచన భారాన్ని సముద్రాల, ముఖ్య పాత్రతోబాటు సంగీత నిర్వహణ బాధ్యతను నాగయ్య, ఛాయాగ్రహణ బాధ్యతను రామనాథ్, కళా దర్శకత్వం మరియు శబ్దగ్రాహణ బాధ్యతలను ఎ.కె.శేఖర్ స్వీకరిస్తూ తొలిచిత్రం ‘వందేమాతరం’(1939) నిర్మాణానికి పూనుకున్నారు. బ్రిజ్ మోహన్ దాస్ కంపెనీ సెక్రెటరీగా, తదనంతర కాలంలో అద్భుత దర్శకుడుగా ఎదిగిన కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు. నాగయ్య హీరోగా, కాంచనమాల హీరోయిన్ గా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ‘వందేమాతరం’ సినిమా తయారైంది. స్వాతంత్ర్య సముపార్జనకోసం ఉద్యమాలు జరుగుతుండడంతో బి.ఎన్.రెడ్డి ముందు చూపుతో ఈ చిత్రానికి ‘మంగళసూత్రం’ అనే ట్యాగ్ లైను జతచేశారు. ఇందులో నిరుద్యోగ, వరకట్న సమస్యలను ప్రస్తావించడం జరిగింది. వాహినీ సంస్థకు మొదటి సినిమాతోనే మంచిపేరు వచ్చింది. ఈ సినిమా పొరుగు రాష్ట్రాలలో కూడా బాగా ఆడి శతదినోత్సవం చేసుకుంది.

విజయపరంపర…
‘వందేమాతరం’ సినిమా శతదినోత్సవం చేసుకుంది. ఆ వేడుకకోసం బి.ఎన్.రెడ్డి ఏలూరు వెళ్ళారు. అక్కడ మాలతి ని చూసి తదుపరి సినిమాలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. టీచరుగా పనిచేస్తున్న ‘గిరి’ అనే అవసరాల శేషగిరిరావును హీరోగా నియమించి బాల్యవివాహ వ్యవస్థ నేపథ్యంలో రామనాథ్ రాసిన స్క్రిప్టుతో ‘సుమంగళి’ (1940) చిత్రాన్ని నిర్మించారు. అయితే వై.వి. రావు ‘మళ్ళీపెళ్ళి’ అనే సినిమా తీసి ఈ సినిమాకు పోటీకి నిలిపారు. ‘మళ్ళీపెళ్ళి’ సినిమా ఆర్ధిక విజయాన్ని సాధించగా ‘సుమంగళి’ చిత్రం మాత్రం నష్టాన్ని మూటకట్టింది. ఆరోజుల్లోనే ‘సుమంగళి’ చిత్రానికి బి.ఎన్.రెడ్డి లక్ష రూపాయలకు పైగా వెచ్చించారు. ‘సుమంగళి’ చిత్రం అపజయం పాలైనా లెక్క చేయకుండా 1941లో ‘దేవత’ చిత్రాన్ని నిర్మించారు. ఉన్నత విద్యావంతుడైన హీరో కాలుజారి ఒక పెళ్ళికాని అమ్మాయిని అనుభవించడం, తనవారిని కూడా మోసగించడం, మరలా జ్ఞానోదయమై ఇల్లుచేరడం ఈ సినిమా నేపథ్యం. అనూహ్యంగా ఈ సినిమా జయభేరి మోగించి, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రజతోత్సవాలు జరుపుకొని, ‘సుమంగళి’ మిగిల్చిన నష్టాలను పూడ్చి లాభాల బాటను పట్టించింది. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి మధ్య వున్న ఒప్పందం ప్రకారం వాహినీ బ్యానర్ మీద తరవాత నిర్మించిన ‘భక్తపోతన’ (1942) చిత్రానికి కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా బి.ఎన్.రెడ్డి పర్యవేక్షకుడిగా పనిచేశారు. ఈ సినిమా తరవాత రెండవ ప్రపంచ యుద్ధం మూలంగా దేశంలో పరిస్థితులు తారుమారై మద్రాసులో ముడిఫిలిం కొరత వలన ప్రభుత్వం ఏ సినిమాకూడా 11వేల అడుగుల నిడివి దాటరాదనే నియమం ప్రవేశపెట్టడంతో చిత్రనిర్మాణం కుంటుపడింది. అదే సమయంలో రామనాథ్, శేఖర్ లు జెమినీ చిత్రనిర్మాణ సంస్థకు వెళ్ళిపోయారు. ‘భక్తపోతన’ చిత్రానికి కంపెనీలో పెట్టుబడికంటే దాదాపు పాతికవేలు అధికంగా ఖర్చు కావడంతో వాహినీ పిక్చర్స్ సంస్థను పంపిణీ వ్యవహారాలకు పరిమితంచేసి, మూలా నారాయణ స్వామి సహకారంతో రెండు లక్షల మూలధనంతో ‘వాహినీ ప్రొడక్షన్స్’ చిత్రనిర్మాణసంస్థను స్థాపించారు. నూతన బ్యానర్ మీద బి.ఎన్.రెడ్డి 1945లో ‘స్వర్గసీమ’ చిత్రాన్ని పదివేల ఆరువందల అడుగుల నిడివితోనే నిర్మించారు. ఈ చిత్రానికి జార్జ్ బెర్నార్డ్ షా నాటకం ‘ది పిగ్మాలియన్’ ఆధారం. స్వర్గసీమ చిత్రం విజయవంతంగా ఆడి తొలిసారి భారతదేశపు ఎల్లలు దాటి వియత్నాం ఫిలిం ఉత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది. గాయకుడుగా ఘంటసాల పరిచయమైన చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు చక్రపాణి కథ సమకూర్చగా సముద్రాల మాటలు, పాటలు రాశారు. ‘స్వర్గసీమ’ బి.ఎన్.రెడ్డి కి మంచిపేరు తెచ్చిపెట్టడమే కాకుండా తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టింది. స్వర్గసీమ చిత్ర నిర్మాణ సమయంలో ఇతర స్టూడియో వాళ్ళతో ఇబ్బందులు పడలేక వాహినీ సంస్థ సొంతంగా ఒక స్టూడియో కట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచన బి.ఎన్.రెడ్డికి ఉండేది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే వాహినీ స్టూడియో ఆవిర్భవించబోతున్నదనే విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటించారు.

వాహినీ స్టూడియో నిర్మాణం…
మూడేళ్ళకొకసారి సినిమా నిర్మించడమంటే బి.ఎన్.రెడ్డికి అదోలా అనిపించి ఏడాదికి ఒక సినిమా అయినా నిర్మించాలనే అభిప్రాయంతో 1947లో స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు. మూలా నారాయణస్వామి పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా మద్రాసులో అధునాతన వాహినీ స్టూడియో రూపుదిద్దుకుంది. కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగివేమన’ (1947) తరవాత బి.ఎన్.రెడ్డి వంతు వచ్చినా, స్టూడియో నిర్మాణంలో తలమునకలై ఉన్నందున 1949లో ఈ నూతన స్టూడియోలోనే కె.వి. రెడ్డి దర్శకత్వంలో ‘గుణసుందరి కథ’ చిత్రనిర్మాణం జరిగింది. ఈ సినిమా ఎంత జనాదరణ పొందిందో సినీ అభిమానులకు తెలుసు. ఆ సమయంలోనే వాహినీ సంస్థలో ప్రధాన పెట్టుబడిదారు మూలా నారాయణస్వామి వ్యాపారంలో దెబ్బతిని, ఆదాయపన్ను వర్గాలనుంచి చిక్కుల్లో ఇరుక్కోవడం, దానితో ఆయన ఆరోగ్యంకూడా దెబ్బతినడంతో వాహినీ స్టూడియో అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని అధిగమించేందుకు స్టూడియోని విజయా సంస్థకు గుత్తకు ఇవ్వాల్సిన అగత్యమేర్పడింది. ఆ తరవాత బి.ఎన్.రెడ్డి వాహినీ సంస్థలో బాధ్యతలు తగ్గించుకొని దర్శకనిర్మాతగా సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చేశారు. బి.ఎన్.రెడ్డికి ఆరోజుల్లో కళాత్మక కావ్యం లాంటి సినిమా తీయాలనే ఆశగా వుండేది.

Vijaya Vauhini studios

మల్లీశ్వరి సినీకావ్యం…
ఒకసారి ‘వందేమాతరం’ సినిమా ఔట్ డోర్ షూటింగు కోసం బి.ఎన్. రెడ్డి హంపికి వెళ్ళారు. హంపీ నగరం దర్శించాక శ్రీకృష్ణదేవరాయలు మీద వున్న ఆరాధనాభావంతో బి.ఎన్.రెడ్డి రాయలవారి నేపథ్యంలో ఒక సినిమా నిర్మించాలని ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. రచయిత శివరాజు బుచ్చిబాబు తన ‘రాయలవారి కరుణకృత్యం’ నాటికకు రాసిన పరిచయ వాక్యాలను, ఇల్లస్త్రేటెడ్ వీక్లీలో వచ్చిన కథను సమన్వయం చేస్తూ 13వ శతాబ్దపు నేపథ్యంలో ఒక కథను అల్లారు. ఆ కథను కృష్ణశాస్త్రి అభివృద్దిచేసి, స్క్రిప్టు తయారు చేశారు. మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్యగానాలను మారువేషంలో ఉన్న రాయలు, అల్లసాని పెద్దన చూసినప్పుడు అల్లసాని మల్లీశ్వరిని ఆశువుగా ఓ పద్యంలో మెచ్చుకునే సన్నివేశం వుంది. అల్లసానివారి అల్లిక జిగిబిగి అనే నానుడి వుండడంతో, అదే ధోరణిలో పద్యం రావాలని చెప్పి బి.ఎన్. రెడ్డి కృష్ణశాస్త్రి చేత వంద పద్యాలు రాయించి అందులోంచి “భళిరా ఎన్నడు జారె నీ భువికి రంభా రాగిణీ రత్నమేఖలయో నిర్జర వల్లభ ప్రియవధూ కంఠస్రవథ్ధామమో…” అనే పద్యాన్ని ఖరారు చేశారు. చిత్రీకరణ విషయంలో బి.ఎన్. రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దేవులపల్లి మాటలతోబాటు, ఇందులో రాసిన పాటలన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. పాటలన్నీ కథా సంబంధంగా రాసినవి కావడం విశేషం. ఈ సినిమాలో కథాంశాలైన ప్రణయం, అనురాగం, విజయనగర వైభవం, వేదన వంటి కోణాల్లో సాలూరు రాజేశ్వరరావు దేవులపల్లి గీతాలకు అద్భుతమైన సంగీతం అమర్చారు. ఆరోజుల్లోనే ఈ చిత్రానికి ఎనిమిది లక్షలు ఖర్చయ్యాయి. 1951లో ‘మల్లీశ్వరి’ చిత్రం విడుదలైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగా, గొప్ప దృశ్యకావ్యంగా ‘మల్లీశ్వరి’ ఖ్యాతిగాంచింది. కమ్యూనిస్టు దేశమైన చైనాలో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది! రాబడి పెద్దగారాకపోయినా పెట్టుబడులకు డోకారాలేదు.

ఇతర సినిమాలు…
‘మల్లీశ్వరి’ చిత్ర్తంతో బి.ఎన్.రెడ్డి ఖ్యాతి విశ్వవిఖ్యాతమైంది. తరవాత జార్జి ఇలియట్ రాసిన ‘సైలాస్ మార్నర్’ నవలను బి.ఎన్.రెడ్డి మన నేటివిటీకి అనుగుణంగా మలచి ‘బంగారుపాప’ (1954) చిత్రాన్ని నిర్మించారు. అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రం సత్యజిత్ రాయ్ నిర్మించిన ‘పథేర్ పాంచాలి’ చిత్రానికి ధీటుగా నిలిచింది. కరడుగట్టిన కసాయి గుండెను కదిలించి, సున్నితంగా మార్చగలిగిన శక్తి పసితనపు అమాయకత్వానికి వుందని హృద్యంగా తెలియజెప్పిన చిత్రమిది. యస్.వి. రంగారావు చలనచిత్ర చరిత్రలోనే మాస్టర్ పీస్ గా ఎన్నదగిన చిత్రమిది. ఈ చిత్రాన్ని చూసిన బెంగాలి దర్శక నిర్మాత, బి.ఎన్ కు ఏకలవ్య గురుతుల్యులవంటి దేవకీబోస్ ఈ సినిమాను బెంగాలీలో పునర్నిర్మించారు. సినీ పండితుల నీరాజనాలను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లాపడింది. అది బి.ఎన్.రెడ్డి కి వ్యాకులతను పెంచింది. ఆ దశలో బి.ఎన్ సాహసించి మరో సొంత సినిమా తీయలేకపోయారు. అయితే బి.ఎన్. రెడ్డి సమర్ధత మీద నమ్మకమున్న తారాచంద్ బరజాత్యా వంటి బాలీవుడ్ నిర్మాతలు తమకు సినిమాలు నిర్మించమని అడుగుతూ వుండేవారు. కానీ ఎందుకో హిందీ చిత్రరంగానికి వెళ్ళాలనే ఉద్దేశ్యం బి.ఎన్.రెడ్డి కి లేదు. అదేసమయంలో నెల్లూరు పట్టణానికి చెందిన పొన్నలూరి వసంతకుమారరెడ్డి సోదరులు బి.ఎన్.రెడ్డి ని సంప్రదించి మొదటి సినిమా ఆయనచేత తీయించుకోవాలని కోరిక వెలిబుచ్చడంతో బి.ఎన్.రెడ్డి సరే అనక తప్పలేదు. ‘బంగారుపాప’ సినిమా స్క్రిప్టు రూపొందించకముందే బి.ఎన్. రెడ్డి పాలగుమ్మి పద్మరాజు చేత మరొక కథను కూడా రాయించి స్క్రిప్టు తయారు చేసి ఉంచారు. అయితే ఆ కథ బి.ఎన్. రెడ్డి కి అంతగా నచ్చక మొదట ‘బంగారుపాప’ ను నిర్మించారు. కానీ, వసంతకుమారరెడ్డికి పద్మరాజు రాసిన కథ నచ్చడంతో దానినే ‘భాగ్యరేఖ’ (1957) చిత్రంగా మలిచారు. బాగా నమ్మకముంచిన ‘బంగారుపాప’ నిరాశ పరిస్తే భాగ్యరేఖ సినిమా సూపర్ హిట్టయింది. ‘బంగారుపాప’ చిత్రాన్ని నిర్మించిన బి.ఎన్. రెడ్డికి మంచిపేరు, అవార్డు అయితే వచ్చాయి…కానీ ఆర్ధిక విజయం సాధించలేదు. కొందరు శ్రేయోభిలాషులు ఏదైనా డబ్బులు వచ్చే సినిమా తీయమని సలహా ఇచ్చారు. దాంతో డి.వి. నరసరాజు ను పిలిపించి ఒక జానపద చిత్ర కథ రూపొందించమని బి.ఎన్. రెడ్డి సూచించారు. నరసరాజు ‘రాజమకుటం’ చిత్రకథను, సన్నివేశాలను రూపొందించి, సంభాషణలు రాశారు. బి.ఎన్. రెడ్డి, పాలగుమ్మి పద్మరాజు, బి.ఎస్. రామయ్య కూర్చుని సినిమా రూపకం తయారుచేశారు. అందులో హీరో రామారావు ముసుగువేషంలో వచ్చి విలన్ మనుషులతో తలపడతాడు. అతడికి ‘నల్లత్రాచు’ అని మారుపేరు పెట్టారు నరసరాజు. సినిమా టైటిల్ కూడా ‘నల్లత్రాచు’ అని పెడదామని బి.ఎన్.రెడ్డికి నరసరాజు సూచించారు. కానీ బి.ఎన్. రెడ్డి కొందరు జ్యోతిష్కుల సూచనమేరకు ‘రాజమకుటం’ అనే టైటిల్ ని ఖాయం చేశారు. ‘రాజమకుటం’ అంటే ఎవరికి అర్ధమవుతుందని నరసరాజు చెప్పినా సినీ ప్రేక్షకులను అంత తక్కువగా అంచనా వేయలేమని బి.ఎన్. రెడ్డి సమాధానపరచారు. ‘రాజమకుటం’ చిత్రం 24 ఫిబ్రవరి 1960 న విడుదలైంది. ప్రేక్షకుల స్పందన యెలా వుందో తెలుసుకోవడానికి బి.ఎన్. రెడ్డి విజయవాడ వెళ్లి, వాహినీ బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను వెంటబెట్టుకొని ఏలూరు వెంకట్రామా టాకీసు బెంచ్ తరగతి ప్రేక్షకుల మధ్య కూర్చుని చూస్తున్నారు. బి.ఎన్.రెడ్డి అక్కడ వున్నట్టు ఎవరికీ తెలియదు… హాలు యజమాని వెంకట్రామయ్యకు తప్ప. ‘మల్లీశ్వరి’, ‘బంగారుపాప’ వంటి బి.ఎన్ ఛిత్రాలు చూసి బి.ఎన్. రెడ్డి ప్రతిభకు మురిసిపోయిన అభిమాని ఒకడు పక్కవాడితో “ఈ బి.ఎన్. రెడ్డికి ఇదేం పొయ్యేకాలంరా. ఇటువంటి సినిమాలు తీస్తున్నాడు?” అన్నాడు. ప్రక్కవాడు వెంటనే “అది సరే… మకుటం అంటే ఏమిట్రా” అని అడిగాడు. మొదటివాడు “మకుటమంటే తెలియదట్రా… మకుటమంటే పట్టాకత్తిరా” అంటున్నాడు. అది వింటున్న బి.ఎన్.రెడ్డికి తలతీసేసినట్లయింది. వెంటనే విజయవాడ ప్రోగ్రాం రద్దుచేసుకొని మద్రాసు వచ్చేశారు. ఇరవయ్యేళ్ళుగా తను సంపాదించుకున్న పేరుప్రతిష్ఠలు ఈ ఒక్క సినిమాతో మట్టికొట్టుకుపోయాయని చాలా బాధపడ్డారు. ‘రాజమకుటం’ తరవాత బి.ఎన్. రెడ్డి మరో జానపద చిత్రం తీసేందుకు సాహసించలేదు. అయితే ఈ సినిమాకి నష్టాలు మాత్రం రాలేదు. మంచిపేరు, అవార్డు అయితే వచ్చాయి… కానీ ఆర్ధిక విజయం సాధించలేదు. తరవాత శంభూ ఫిలిమ్స్ నిర్మాత దగ్గుబాటి లక్ష్మినారాయణ చౌదరి కోరగా మునిపల్లె రాజు నవల ‘పూజారి’ ఆధారంగా ‘పూజాఫలము’(1964) అనే చిత్రానికి బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా వసూళ్ళ విషయంలో నిరాశ పరచింది. అయితే 1966 లో చంద్రమోహన్ ను హీరోగా పరిచయం చేస్తూ వాహినీ స్టూడియోలో బి.ఎన్.రెడ్డి నిర్మించిన ‘రంగులరాట్నం’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. జాతీయ స్థాయిలో ఉత్తమచిత్రంగా, రాష్ట్రస్థాయిలో బంగారు నంది పురస్కారాలను అందుకుంది. చివరిగా బి.ఎన్.రెడ్డి 1969లో ‘బంగారుపంజరం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిలింఫేర్ బహుమతిని పొందడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతి కూడా పొందింది.

ఆదర్శప్రాయుడు…
చిత్రనిర్మాణంలోనే కాకుండా బి.ఎన్.రెడ్డికి ఇతర వ్యవస్థల్లో కూడా భాగస్వామ్యం వుండేది. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనమండలిలో బి.ఎన్.రెడ్డి సభ్యులుగా వున్నారు. ఎన్నో సలహా సంఘాల్లో కూడా బి.ఎన్.రెడ్డి సభ్యులే. వాటిలో మద్రాసు నాటక అకాడమీ, కాఫీబోర్డు, పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్ సలహా సంఘం, బాలల చిత్రాల సలహా మండలి, ఆల్ ఇండియా రేడియో మొదలైనవి వున్నాయి. భారత ప్రభుత్వం బి.ఎన్.రెడ్డికి పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలను ప్రదానంచేసి సత్కరించింది. భారతీయ తపాలా శాఖ బి.ఎన్.రెడ్డి స్మారక పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసింది. సి.నారాయణరెడ్డి రాసిన ప్రసిద్ధ గేయకావ్యం ‘కర్పూర వసంతరాయలు’ ని సినిమాగా తీయాలనే కోరిక బి.ఎన్ కు వుండేది. అలాగే బీనాదేవి నవల ‘పుణ్యభూమీ కళ్ళుతెరు’ ను, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవలను కూడా సినిమాగా నిర్మించాలని బి.ఎన్ తలచారు. కానీ అవి కార్య రూపం దాల్చలేదు. కేవలం అరవై ఎనిమిదేళ్ళ వయసులో బి.ఎన్.రెడ్డి నవంబరు 8, 1977 న మద్రాసులో కన్నుమూశారు.

-ఆచారం షణ్ముఖాచారి
(9492954256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap