‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

బ్నిం అనేపేరు పెట్టుకున్నది కార్టూన్లు వేయడానికే! నా అసలు పేరు బి.ఎన్. మూర్తి. పుట్టింది తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో. అమ్మ విజయలక్ష్మి, నాన్న భమిడిపల్లి సూర్యనారాయణ మూర్తి (28-10- 1957 న పుట్టాను ) చిన్నప్పన్నుంచీ నాకు అన్నిరకాల రచనలతోబాటు హాస్యరచనలు మరీ ఎక్కువ ఇష్టంగా చదవడటం అలవాటయింది.

అందులో ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు మా ఫ్రెండ్సందరి తోనూ సామూహిక పఠనం చేసేవాళ్ళం. అందులో బుడుగు బొమ్మ నన్ను కార్టూనిస్ట్ కమ్మని శాసించింది! నిజానికి అది బాపు అనే అబ్బాయి వేశారని నాకప్పట్లో తెలీదు కూడా!
అయితే మొదట్లో మావూరు డ్రాయింగ్ మాస్టారు ఎం. సింహాచలం గారి దగ్గర కలర్ పెయింటింగ్ అభ్యాసం మొదలెట్టాను. స్టిల్ లైఫ్, లాండ్స్కేప్, పెన్సిల్తోనూ, రంగుల్తోనూ వేయడం. గ్రాఫ్ గీసుకొని పేట్రన్ డెజైన్ వేయడం – లైఫ్ స్కెచ్చింగ్లో యాంగిల్స్… ప్రాక్టీసు చేస్తుండేవాణ్ణి ..

కొన్ని చిన్నపిల్లల పోటీల్లో (వెల్లటూరు, సిద్ధిపేట… లాంటివి) బహుమతులు కూడా వచ్చాయి. ఇలా వుండగానే … ఇవన్నీ కాదు… ఇన్ని రంగులు లేకుండా … ఇంత టైము పట్టకుండా … కేవలం రేఖల్తో … ఒక్క రంగులో అద్భుతంగా కనిపిస్తున్న బాపు బొమ్మల పైన ఆరాధన పెరుగుతుంది. అప్పుడు బొమ్మ కింద పేర్లు చూడ్డం – పేర్లు చూడక్కర్లేకుండా ఆబొమ్మలు ఎవరు వేశారో పోల్చుకోగల టేలంట్ వంట బట్టింది. అలాగా… కార్టూన్స్ వేయాలన్న ధ్యాస పెరిగింది.

కానీ… ఎలా ? అప్పుడు… శశిధర్ అనే పేరున్న కార్టూనిస్ట్ పరిచయం అయ్యారు. (మా మావయ్య ద్వారా) ఆయన కార్టూన్స్ వేయడం మీద పోస్టల్ కోచింగ్ ఇచ్చారు. అలా తెల్సింది… ఇండియన్ ఇంక్ సంగతీ .. కార్టూన్స్ గీసే పద్ధతీ . ఎక్స్ ప్రెషన్స్ చిన్న స్ట్రొక్స్ తో ఎలా మారిపోతాయో… హెయిర్ స్టయిల్ తో  వయస్సు  ఎలా మార్చెయ్యచ్చో …. జస్ట్.. సున్నా వేసుకొని కళ్ళూ, ముక్కూ, మూతి కొన్ని చిన్న గీతల్తో ఎంత తేడా ఎక్స్ ప్రెషన్స్ వేయొచ్చో తెల్సింది.

అప్పుడు సొంత అయిడియాలు పుట్టాయి. పుట్టినవి పేపరు కెక్కి గడప దాటి.. పత్రికల తలుపుతట్టి… గోడకి కొట్టిన బంతుల్లా వచేస్తూండేవి వెనక్కి. కారణం తెలియటంతో .. బొమ్మలు ఇంకా నేర్వాలన్న ఇంగితం బోధపడింది.

ఆ రోజుళ్ళోనే క్రోక్విల్ న్యూస్ లెటర్ హైదరాబాద్ నుంచీ, ‘ప్రభవ ‘ మాసపత్రిక విజయవాడ నుంచీ ఒకే నెల నా కార్టూన్లు అచ్చులో చూచుకునే యోగంపట్టించాయి. 76– 77 అనుకుంటా!

ఇంక బొమ్మలొస్తే తిరుగులేనంతగా అయిడియాలు ఇంకా ఇంకా పుట్టుకురావడం ఎక్కువయింది. వచ్చిన అయిడియాలని బొమ్మని చెయ్యాలంటే ఇంక ఏకలవ్య సాధన పెంచాల్సిందే… అనుకునేంతలో ఏదో పత్రికలో బాపు గారి ఫోటో అచ్చయింది.
అలా.. ఏకలవ్యుడికి ద్రోణస్వరూపం చిక్కింది. ఇంక ఆయన అడ్రస్ సంపాదించాలి అన్న కోర్కేరేగింది! నూజివీడు కాలేజీ లెక్చరర్ (మా బంధువు) టీ.ఎన్.ఎం. గారి ద్వారా ఆ ముచ్చట తీరింది. (ఈయన ఎంవీయల్ గారి కొలీగ్).
బాపు గారికి నా బొమ్మలు తో పాటు ఓ మంచి లెటర్ రాసి పంపించాను. ఆయనకి నా లెటర్ నచ్చింది. బొమ్మలు ఎలా వెయ్యాలో మార్చి వేసి.. బొమ్మలు వేయడానికి ఉపయోగించే ఓల్డ్ మాస్టర్ పెయింటింగ్స్ పుస్తకాలు గట్రా పంపి సూచనలు చేశారు. ప్రాక్టీస్ చేస్తుండండి – నేను కాలర్ ఎత్తుకు తిరిగేంత గొప్ప ఆర్టిస్టవ్వాలని ఆశీర్వదించేశారు.( ఆ తర్వాత ధైర్యంగా ఆయన కాలర్ లేని లాల్చీలు వెయ్యటం ప్రారంభించారనుకోండి…)

ఇలా బాపు గారి .. ఆపాటి పరిచయం తోనే నవోదయ రాంమోహనరావు, శంకు, ఎంవీయల్ గార్లలాంటి పెద్దవాళ్ళ సర్కిల్ లోకి ఎంట్రీ దొరికింది. తద్వారా బాధ్యత పెరిగింది. బొమ్మల (కార్టూన్స్) ప్రాక్టీసు పెరిగింది.

ఆత్రేయపురంలో ఉండగా ‘స్నేహలత కల్చరల్ అసోసియేషన్ ‘  పెట్టి, లిఖిత పత్రిక వెలువరించే వాళ్ళం. ఆ పత్రిక ముస్తాబు కోసం కార్టూన్స్, కార్టూన్ కవితలూ, డిజైన్ చేస్తూ అన్ని పత్రికలకీ కార్టూన్స్ పంపుతుండటం… అవి 60 శాతం ప్రచురణ అవడం మొదలయ్యింది. లిఖిత పత్రిక నాలోని క్రియేటివిటీని పెంచింది. ఆ సంస్థ కార్యకలాపాల్లో చెప్పుకోదగ్గది బాపు బొమ్మల కొలువు! నవోదయ (విజయవాడ)కి పెద్దపెట్టెల్లో ఉండే బాపు ఒరిజినల్ డ్రాయింగ్స్ ‘డిస్ ప్లే బోర్డులు ‘ తెప్పించి ప్రదర్శన పెట్టాం!
ఆ ఒరిజినల్స్ చూడడం ఒక గొప్ప ఎడ్యుకేషన్ – ఆ ఒరిజినల్లో వేగమయిన గీతల్తో ఒక్క వైట్ టచ్ (కరెక్షన్) కూడా లేని అద్భుతం కనిపించింది. ఆ బొమ్మల్ని ఒక్కొకటే… చూస్తూ ప్రదర్శన కోసం బొమ్మలు మావూళ్ళో ఉన్నన్నాళ్ళూ గడిపాను. కళ్ళతో స్కేన్ చేసుకున్నాను. ప్రతీ గీతా చదువుకున్నాను.

ఆ తర్వాత బాపు గారు (19-14-78  న ) మా ఇంటికి రావటంతో ఇంకా ఆశక్తి పెరిగింది. ఇక అప్పుడూ.. అప్పుడూ.. ఓ 50 కార్టూన్స్ దాకా అచ్చయ్యాక… ధైర్యం పెరిగి ఆత్రేయపురాన్ని వదలి హైదారాబాద్ చేరుకోవాలని అనుకోవడం… మా అన్నయ్యకి హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో విశాల కళాప్రపంచంలోకి అడుగు పెట్టాను.

పని నేర్చుకోవడానికి ఒక కంపెనీలో (వికాస్ ఎడ్వర్టైజర్) కళ పెంచుకోవడానికి కొన్ని పత్రికల్లో (ఆంధ్రభూమి, సుప్రభాతం, కృష్ణాపత్రిక వగైరాల్లో) ఉద్యోగిస్తూ… దాదాపు 3000 కార్టూన్స్ దాకా వేశాను.

ఆతర్వాత్తర్వాత..  కార్టూనిష్టు గా .. రైటర్ గా  కాస్తంత కదలికలు వచ్చాక, కళ. నన్ను . కొత్త దారుల్లోకి మళ్ళించింది. కథలు, టీవీ ఎపిసోడ్స్, పాటలు, సీరియళ్ళూ-నృత్యరూపకాలు రచించటంతో కార్టూన్స్ వేయడానికి సమయం దొరికే చాన్స్ లేకుండా అయిపోయింది.

‘దీపం ‘ మాత్రం కార్టూనిస్ట్ ‘బ్నిం ‘ దే .. అయినా కిరణాలు చాలా అయిపొతున్నాయి. అయినా ‘దీపం ‘ ప్రభావం.. ప్రకాశాలకి ముందే ఉంటుంది కదా!

నేను ఏ కవిత రాసినా, కథ రాసినా, పాట రాసినా కార్టూనిస్ట్ తాలూకు ‘ వ్యంగ్యోక్తి ‘ కనిపిస్తూనే వుంటుంది. కార్టూన్స్ తగ్గించినా కార్టూనింగ్ మీద మమకారం… నవనవోత్సాహంతోనేవుంది.  కార్టూనిస్టుల మీద ఇష్టం పెరుగుతునేవుంది!

అందుకే…’ బాపురమణ అకాడెమీ ‘ (అత్రేయపురం -హైదరాబాద్) స్థాపకాధ్యక్షత-

ప్రతీ సంవత్సరం బాపు గారి పుట్టినరోజున ఓ కార్టూనిస్టుని బాపు ఆవార్డ్ తోనూ, ఓ రచయితని రమణ అవార్డ్ తోనూ సత్కరించే సత్కార్యం నడుస్తోంది

. అపరిమితమయిన కార్టూన్ వ్యామోహం వల్ల మే 20న తలిశెట్టి రామారావు పుట్టిన రోజున సోదర కార్టూనిస్టుల సమాలోచనతో ‘తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం ‘ జరపడానికి ప్రముఖమయిన నిర్వాహక పాత్ర తీసుకోవటం అందరికీ తెల్సినదే.
అలాగే ‘అక్షజ్ఞ పబ్లికేషన్ ‘ అనే ప్రచురణ సంస్థ సలహాదారుడిగా ప్రముఖ చిత్రకారుడు, పెన్సిల్ పోట్రైట్ ఆర్టిస్ట్ సత్తిరాజు శంకరనారాయణ గారు పెన్సిల్తో చిత్రించిన ‘మన కార్టూనిస్టుల రూపురేఖలు ‘ పుస్తకానికి సంపాదకత్వం నిర్వహించిన అదృస్టం కూడా నాదే.

కార్టూనిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి హంస అవార్డ్, టీవీ ధారావాహికలకు… కథ, స్క్రీన్ ప్లే, మాటలు విభాగాలకు నాలుగు నందులు అందుకున్నాను.

ఇక కార్టూనిస్టు గా  నేను గర్వించే భాగ్యం మాత్రం ఒకటే – ‘బాపు కార్టూన్లు-2 ‘ పుస్తకాన్ని ఒక మిత్రునితో బాటు నేనూ బాపూగారిచేత అంకితంగా పొందటం. ఇది ఏ శిష్యుడికీ ఏ గురువూ చేయని పట్టాభిమానం. ఇది కార్టూన్ సాగరంలో ఓ చిరు అల .. ‘బ్నిం ‘ కథ!

3 thoughts on “‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

  1. సకల కళా వల్లభులు బహువిధ కళా కారులు బినీం గారిని గూర్చిన మంచి ఆర్టికల్ అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap