
తెనాలి లోని సిపిఐ కార్యాలయంలో అభ్యుదయ కళాసమితి, తెనాలి వారి ఆధ్వర్యంలో జరిగిన అభ్యుదయ భావకుడు బొల్లిముంత శివరామకృష్ణ గారి 21 వ వర్ధంతి (7-6-2025, శనివారం) సభలో తెనాలికి చెందిన సాహితీవేత్తలతో సంస్మరణ సభను నిర్వహించి, ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్బంగా జరిగిన కవి సమ్మేళనంకు అధ్యక్షత వహించిన డా. రంగిశెట్టి రమేష్ (గంగా శ్రీ) ప్రసంగిస్తూ, తెనాలి సాహితీ శిఖరమైన కీర్తిశేషులు కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ గారి కాంశ్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్ పై నిర్మించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని, ఈ సంస్మరణ సభలో తీర్మానించినట్లు, అతి త్వరలో అభ్యుదయ కళాసమితి సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులను కలసి మెమోరాండం సమర్పించనున్నట్లు తెలిపారు. ఇంకా కవి సమ్మేళనంలో ప్రముఖ కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ డా. ఆళ్ళ నాగేశ్వరరావు (కమల శ్రీ), అభ్యుదయ కళాసమితి అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయలు యం.వి. రఘునాధరావు, ప్రముఖ కవి, రచయిత, నటులు కె. విజయ సారధి బాబు, ప్రముఖ కళాకారులు వినుకొండ శ్రీరామమూర్తి, నటుడు, కళాకారుడు కన్నేగంటి మధు, విశ్రాంత ఉపాధ్యాయుడు, కమ్యూనిష్టు భావకుడు కనపర్తి బెనహర్ తదితరులు పాల్గొని, కవితాంజలులు సమర్పించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో కీర్తిశేషులు బొల్లుముంత శివరామకృష్ణ చిత్ర పటానికి పూల ధారణ గావించి ఘన నివాళులు సమర్పించారు. బొల్లిముంత కృష్ణ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.