తెలుగు కార్టూన్ రంగంలో సీనియర్ కార్టూనిస్టులలో బొమ్మన్ ఒకరు. వీరి కార్టూన్లతో బొమ్మన్ కార్టూన్లు పేరుతో పుస్తకం వెలువడింది. కార్టూన్ అభిమానులను అలరించే కార్టూన్లతో ప్రచురించిన ఈ పుస్తకం గురించి ప్రముఖకార్టూనిస్ట్ జయదేవ్ గారి రాతల్లో చదువువుదాం.
ఒక కార్టూన్ ఊహ తళుక్కుమన్నప్పుడు, అది అందించే ఆనందం పొందిన కార్టూనిస్టు, చెట్టు కొమ్మకి కట్టిన ఉయ్యాల పలకమీద ఆకాశమంత ఎత్తుకి ఎగురుతాడు. పలక ఊగే ఊపుకి గాలి. పాట పాడి గుండెలో మధుర స్మృతులను నింపుతుంది. ఈ వింత అనుభూతితో కార్టూనిస్టు తన పనికుపక్రమిస్తాడు. పని సాంతం, ఉయ్యాల ఊగుతూనే వుంటుంది. గాలి, పాట పాడుతూనే వుంటుంది. చెట్టుకొమ్మ, రాగాలు పలుకుతూనే వుంటుంది. పని పూర్తయ్యాక కార్టూనిస్టు పలక మీద నుంచి అడుగు నేల మీదికి ఆనిస్తాడు. దీవిలోకం నుంచి భువిలోకం లోకి దిగిన అనుభూతి పొందుతాడు.
కార్టూన్ కళ అందరికీ అబ్బదు. అది ఒక వరం. తపస్సు చేసి పొందాలి. తపస్సప్పుడు రంభలూ, మేనకలూ, ఊర్వసులు చెడగొడుతుంటారు. ఎడిటర్లు కార్టూన్లను చెత్త బుట్టల పాలు చేస్తారు. పాఠకులు పెదవులు విరుస్తారు. బొమ్మ బాగోలేదు. వ్యాఖ్య అర్ధం కాలేదు, హాస్యం కొరవడింది, పరమ వేస్టు అంటారు. వీటినన్నీ తట్టుకోని, విక్రమార్కుడి గట్టి గుండెతో సాధన చేస్తూనే వుండాలి. తపస్సు కొనసాగిస్తూనే వుండాలి.
ఈ పుస్తకం అచ్చువేసుకున్న ఈ చిత్రకారుడి బొమ్మలూ, వ్యాఖ్య సహిత, వ్యాఖ్య రహిత కార్టూన్లు నాలుగున్నర దశాబ్దాలుగా చూస్తూనే వున్నాను. తరగని గనిలా, ఆగని తరంగాల సముద్రంలా, తన ఉహాలోక ద్వారాలని తెరిచి తన సామర్ధ్యాన్ని, వీక్షకులకి ఐమాక్స్ తెరమీద ప్రదర్శిస్తూ ముందుకి సాగిపోతున్నాడు. అందమైన బొమ్మలు, తేట తెలుగు పదాల గుండ్రటి అక్షరాల వ్యాఖ్యలు, ఇతడి గుప్పెట్లో ఇమిడిన సరస్వతిదేవి కటాక్షాలు. తెలుగు పాఠకలోకం మెచ్చిన అగ్రశ్రేణి కార్టూనిస్టుల్లో ఒకడైన బొమ్మన్ నిగర్వి, సౌమ్యశీలి, మరియు నిరాడంబరుడు.

నా అనుంగు మిత్రుడు, ప్రముఖ కార్టూనిస్టు, కీర్తిశేషులు ఎమ్.ఎస్. రామకృష్ణగారి కుమార్తె సౌభాగ్యవతి సునిత గారు చేశారు. ఇరువురికీ నా అభినందనలు, ధన్యవాదాలు.
112 పేజీల ఈ పుస్తకంలో రెండువందలు పైచిలుకు కార్టూన్లు హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, సందేశాలని కలబోసి నవ్వుల వాన చినుకులను కురిపించి వీక్షకుడిని మురిపిస్తాయి.
ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ తనే హీరోగా నటిస్తే పోలా, ఖర్చు తగ్గుతుంది కదా అనుకున్నాడు. పాపం. ఫెయిల్ అయ్యి మునిగిపోయాడు. ఒక ప్రజానాయకుడు, రైతులు వ్యవసాయం వదిలేస్తు న్నారంటే కోటీశ్వరులైనట్లే కదా లెక్క అంటాడు. బిచ్చగాడికి ఆకలి. అది తెలియని వాడికి, టైం కి మెక్కాలనిపించి పండ్లు తింటున్నాడు. మొగుడు ఉరితాడు బిగించుకుంటున్నాడు… త్వరగ కానీయండి, స్టూలు కావాలి, పనుంది అంటుంది పెళ్ళాం. ఒక పెద్దాయన తన పర్సనల్ లైబ్రరీ గురించి, “ఇవన్ని నా రచన్లు. అవన్నీ నా రచనని తిడుతూ ఇతర్లు రాసిన రచన్లు!” అంటాడు. బొమ్మ చూస్తే నవ్వు ఆగదు. స్టాక్ మార్కెట్ ఉద్యోగి ఎలా నడుస్తాడో…! తల్లి దండ్రులు పిల్లలు పెద్ద చదువులు చదవాలని ఆశిస్తారు, అందుకు వారు చేసే సాయం ఏమిటి? మచ్చుకి ఈ కొన్ని కార్టూన్లు ఉదహరించాను. బొమ్మ చూస్తే కానీ అర్ధం కావీ కార్టూన్లు. ఈ పుస్తకంలోని కార్టూన్లు అన్నీ ఈలాంటివే. వాటిల్లో నాకు మూడు రకాలు కనిపించాయి.
నవ్వు కార్టూన్లు, దెప్పిపొడుపు కార్టూన్లు, తిక్క కార్టూన్లు. కొంచెం విడమర్చి చెప్పాలంటే, హాస్యం, వ్యంగ్యం, నాన్సెన్స్వి అన్నమాట. నవ్వు కార్టూన్ల రకాలు చాలా వున్నాయి. పొట్ట పగిలే నవ్వు, పెదవి నవ్వు, హు..హి..హీ.. నవ్వు, ఓహెు నవ్వు, ప్స్ నవ్వు లాంటివి. దెప్పి పొడుపు కార్టూన్లు అంటే పెదవి విరిచేవి. వీటినే తిట్టు కార్టూన్లు అని కూడా వర్ణించవచ్చు. చురక కార్టూన్లు, సెంటిమెంట్ కార్టూన్లు ఈ కోవకి చెందినవే.
ఇకపోతే నాన్సెన్స్ కార్టున్లు. తెలుగులో వీటిని తిక్క కార్టూన్లు, అర్ధం పర్ధం లేనివి అంటాం గానీ, నిజానికి వీటిల్లో చిచ్చుబుడ్డిలో కూర్చినంత మందు సామాను వుంటుంది. వ్యాఖ్య వుండదు. మనకి మనమే రాసుకోవాలి. ఆలోచించుకోవాలి. కొందరు వీటిని తెలివి కార్టూన్లని పొగడుతారు.
ఈ కార్టూనిస్టు అన్ని రకాలూ తన పుస్తకంలో మనకి పంచిపెట్టి అలరించాడు. మొత్తానికి ఈ పుస్తకం ఒక కార్టూన్ నిఘంటువు!
ఈ కార్టూనిస్టుది ప్రత్యేకమైనముద్ర. ఎనాటమీ కానివ్వండి, ముఖ భావనలు కానివ్వండి, లావుపాటి పిన్నీలు, అందమైన అమ్మాయిలూ పిల్లలూ, పెద్దలూ, ముసిలీ ముతకా బొమ్మలన్నీ కొత్తగా కనిపిస్తాయి, ఎవరినీ అనుకరించని అద్భుతమైన తీరులో, సంతకంతో సహా. పైపెచ్చు, ప్రతీ బొమ్మలో చలనం ప్రత్యేకించి దర్శనమిస్తుంది. నిరంతర సాధనతో పరిపక్వత పొందితే గానీ ఈ అంశం సాధ్యం కాదు. ఒక్క మాటలో ఇతడు టాప్ క్లాస్ కార్టునిస్టు. హేట్సాఫ్ టు యూ, బొమ్మన్. అభినందనలూ, ఆశీస్సులూ.
-జయదేవ్
ప్రతులకు:
బొమ్మన్ కార్టూన్లు
పేజీలు: 112, వెల: రూ.200/-
బొమ్మన్ : 8919458468 / 9849630637
