కళారంగంలో దాదాగిరి-మంచిర్యాల బొనగిరి

బొనగిరి రాజారెడ్డి గారు మంచిర్యాల జిల్లాలో పేరెన్నికగన్న కవి, రచయిత, నటుడు, పుస్తక సంకలనకర్తగా, సామాజిక సమస్యలపై గళమెత్తే నాయకునిగా భిన్న రంగాల్లో, విభిన్న రీతుల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంమైన మంచిర్యాల సాహితీ రంగానికి ఎనలేని సేవలందిస్తున్నారు.

దేశానికి స్వాతంత్రం రాకముందు 14 నవంబర్ 1944 లో ఒక సామాన్య రైతు బొనగిరి చంద్రయ్య – లచ్చమ్మల కళల పంటగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట దగ్గరలో ఇల్లంత కుంట త్రోవలో రామన్న పల్లె గ్రామంలో జన్మించారు. 1969 నుండి 1979 వరకు ఒక దశాబ్దం పాటు APSEB లో హెల్పర్ గా పని చేసారు. తరువాత 1979 – 2004 వరకు సింగరేణిలో ఫిట్టర్ గా బాధ్యతలు నిర్వహించి 2004 లో పదవీవిరమణ చేశారు.

బొనగిరి రాజారెడ్డి గారు 1959 లో “వెర్రి గారాబము” నాటకం ద్వారా అరంగ్రేటం చేశారు. విద్యార్థి దశ నుండి నాటకాలు వేస్తూ; “లగాయత్, బంగారు భూమి, రేపేంది, నరకం మరెక్కడో లేదు, నాగులు తిరిగే కోనలో, సర్ప యాగం, కప్పలు, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, భజంత్రీలు, వాపస్, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, తీర్పు – దొంగెవరు, రంగ అలంకరణ, కీర్తిశేషులు, మనషులు – మనసులు తదితర 100 కు పైగా నాటకాల్లో నటించి, తన ప్రతిభను కనబరిచి లబ్ధ ప్రతిష్టుల మన్ననలు అందుకున్నారు. సుందరి – సుబ్బారావు, విద్యార్థి అనే నాటకాలు, అనేక ఏకాంకికలు రచించి విద్యార్థులతో నటింప చేసేవారు. “బంగారు భూమి, అందరి ఆనందం” నాటకాల్లో స్త్రీ పాత్ర ధరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అప్పటి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ నటి (ఉత్తమ స్త్రీ పాత్రధారి) పురస్కారం పొందటం విశేషం. బొ.రా. గారు ఒక నటునిగా, మేకప్ ఆర్టిస్టుగా, నాటకరంగ పర్యవేక్షకునిగా, భాషా సంరక్షణ సమితి అధ్వర్యంలో బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు భాషా అభివృద్ధికి ఎనలేని సాహిత్య సేవ చేశారు, ఇప్పటికి ఎనిమిది పదుల వయస్సులో ప్రతి సాహితీ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

1970 లో మంచిర్యాలలో “యువ కళాసమితి” అనే సాంస్కృతిక సమాఖ్యను, తదనంతరము “మంచిర్యాల నాటక కళా సమితిని” స్థాపించారు. “యువ కళాసమితి” ద్వార దాదాపు 17 పుస్తకాలు ప్రచురించ బడినాయి.1987 నుండి 1991 వరకు మంచిర్యాల జిల్లా సాంసృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షులుగా ఉన్న సమయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కవులు రచించిన కవితలను సేకరించి “కాలం నవ్వుతోంది”, “తెలంగాణ గొంతుకలు” అనే పుస్తక సంకలనాలను ప్రచురించారు. బొ.రా. గారు 1959 ప్రాంతంలో మిత్రుడు లక్ష్మీపతి ప్రోత్సాహంతో కవితలు వ్రాసేవారు. అప్పట్లో మద్రాసు నుండి వెలువడే “చిలుక” అనే పత్రికలో బొ.రా. కవితలు ప్రచురిత మయ్యేవి, పారితోషికం కూడా ముట్టేది. స్వీయ రచనగా “విత్తనాల్లో అలజడి” నానీలు ప్రచురించారు. ఉన్నదున్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆయన మనస్తత్వం అతని రచనల్లో కూడా కనిపిస్తుంది. 2017 లో “సాలెనుక సాలు”; 2018 లో “ఉన్నదున్నట్టు”, “నేనింతే” అనే కవితా సంపుటిలను వ్రాసి ఆవిష్కరింప చేసారు.

సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే కవులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వారి రచనలను ప్రచురించడం, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని లబ్ధ ప్రతిష్టులైన నాటక సమాజం వారి నాటకాలను మంచిర్యాలలో ప్రదర్శించేవారు.

సామాజిక సేవ రంగంలో 1964 లో మంచిర్యాలలోని గాంధీ పార్కులో గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆనాటి నాయకుల సహాయం తీసుకొని రక్త కన్నీరు నాగభూషణం ద్వార “రక్త కన్నీరు” నాటకాన్ని రెండుసార్లు ప్రదర్శింప చేసి, వచ్చిన డబ్బు ద్వార గ్రంథాలయ నిర్మాణానికి తోడ్పడడం జరిగింది. మంచిర్యాలలోని 1974 లో హామాలి వాడలో ప్రభుత్వ పాఠశాల స్థాపన కొరకు శ్రమించి, దాని అభివృద్ధికి కృషి చేశారు. 1960-61 ప్రాంతంలో గోలి సోడా సెల్లెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. వారి సామాజిక అభివృద్ధికి చేయూతనిస్తూ, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఎన్రోల్ చేసారు. 1980 ప్రాంతంలో మంచిర్యాల ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. ఫుట్ పాత్ వర్తక సంఘం 1992 లో స్థాపించి, వారి అభ్యున్నతికి పాటుపడ్డారు. రెడ్ క్రాస్ సొసైటి సభ్యుడిగా రక్తదాన శిబిరాలు, పరిశుభ్రతలపై సాహితి ప్రక్రియలను ఉపయోగించి అవగాహన కల్పించారు.

సింగరేణిలో విధులు నిర్వహిస్తూనే “కనువిప్పు” తెలుగు టెలి ఫిలింలో రాజారెడ్డి నటించిన తండ్రి పాత్రకు ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది. ఆయన నటించిన స్వాతి చినుకులు, మాయల మరాఠి, ఆత్మ యాత్ర, అన్నా – వదిన, సాగరతీరాలు మొదలైన సీరియళ్ళు T.V. లో ప్రసారమయ్యాయి. నాగబాల (దండనాయకుల) సురేష్ గారు నిర్మించి, దర్శకత్వం వహించిన “వీర భీమ్” సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

2011 లో ఆదిలాబాద్ జిల్లా సాంసృతిక సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ పార్థసారధి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, హాస్య నటుడు శివారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

రాజారెడ్డి గారి ఇంట్లోకి అడుగుపెట్టగానే పాతకాలపు నాటి అల్మారా కనిపిస్తుంది. అది తెరిస్తే చాలు వెయ్యికి పైగా అమూల్యమైన చారిత్రక గ్రంథాలు, కథల పుస్తకాలు, సాహితీ సంబంధ తెలుగు పుస్తకాలు కనిపిస్తాయి. ఇతర రచయుతలు వ్రాసిన పుస్తకాలు చదివి విమర్శ, సద్విమర్శతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వడం బొనగిరి ప్రత్యేకత.

సాహిత్యం, సమాజ సేవ రెండు రంగాల్లో బొనగిరి రాజారెడ్డి గారు అందించిన సేవలకు విశిష్ట కళా రత్న, తెలంగాణ రత్న, కార్మిక సేవా రత్న, సాహిత్య కళా బందు, కళా భూషణ, ధార్మిక శ్రేష్ఠ, విశిష్ట పురస్కార గ్రహీత, ప్రజా మిత్ర బిరుదులతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు, సన్మానాలు పొందారు. నిక్కచ్చిగా మాట్లాడుతూ, నిజాయితీగా ఉంటూ అటు సాహితీ రంగంలో, ఇటు సామాజిక సేవల్లో ఎనభై ఏళ్ల వయస్సులో చురుక్కా పాల్గొంటున్న బొనగరి రాజారెడ్డి గారి జీవితం ఎంతోమంది వర్ధమాన కళాకారులకు స్ఫూర్తిదాయకం.

ఎల్గం సుధాకర్ (9963105066)

1 thought on “కళారంగంలో దాదాగిరి-మంచిర్యాల బొనగిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap