పుస్తక మహోత్సవంలో గొబ్బిపాటలు పుస్తకావిష్కరణ

‘గొబ్బిపాటలు’ పుస్తకాన్ని రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఆవిష్కరించారు.
విజయవాడ స్వరాజ్యమైదానంలో నిర్వహిస్తున్న 31వ పుస్తకమహోత్సవంలో 6వరోజు (08-01-2020) బుధవారం శ్రీ చక్రవర్తుల రాఘవాచారి సాహిత్యవేదికపై రాష్ట్ర తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య పపేట శ్రీనివాసుల రెడ్డి రాసిన ‘గొబ్బిపాటలు’ పుస్తకాన్ని రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి, ఇగ్నో అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ ప్రసాదబాబులు సభలో వక్తలుగా పాల్గొన్నారు. రాఘవేంద్ర పబ్లిషర్ అధినేత దిట్టకవి రాఘవేంద్రరావు సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ కప్పగంతు రామకృష్ణ పుస్తకాన్ని సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రసాదబాబు మాట్లాడుతూ..మనందరం చాలా సాధారణంగా భావించే గొబ్బిపాటలు వెనుక ఎంత సాహిత్యమూ, చరిత్ర ఉందో ఆసక్తితో అధ్యయనం చేసి గ్రంధస్తం చేసిన రచయితను అభినందించారు. రాష్ట్రంలో తెలుగు అకాడమీ త్వరలోనే చైతన్యవంతంగా పూర్తిస్థాయి సేవలందించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
డా. వెలగా జోషి మాట్లాడుతూ… ప్రామాణిక పాఠ్యపుస్తకాలను అందించడంలో తెలుగు అకాడమీ మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశించారు.
నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ…తెలుగు భాష చరిత్రను, విశిష్టతను వివరించారు. తెలుగుకు మాధుర్యాన్ని అద్దిన వాటిలో జానపద సాహిత్యం ఒకటన్నారు. తెలుగు జానపద సాహిత్యం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో గొబ్బిపాటలు పుస్తకం ఒక మంచిసాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రాచీన కాలం నుంచి అనేకానేక రాజభాషల ధాటిని తట్టుకుంటూ తెలుగుభాషను కాపాడిన ఘనత జానపదులకే దక్కుతుందన్నారు. మళ్లీ ఆ జానపదుల నుంచే ప్రత్యక్షంగా పాటలను సేకరించి, విషయ విభజన చేసి, నీతిబోధకాలుగా అందించిన శ్రీనివాసరెడ్డిగారు ధన్యులన్నారు. కప్పగంతు రామకృష్ణ పుస్తక సమీక్ష చేసారు.

SA: