ప్రముఖ చిత్రకారులు, కవి, రచయిత అయిన ఆత్మకూరు రామకృష్ణ గారి కలం నుండి వెలువడిన మరో గ్రంథం సమీక్షాక్షం. తనను సమీక్షించమని పంపిన ఇతర రచయితల గ్రంథాల గురించి ఆత్మకూరు రామకృష్ణ గారు చేసిన సమీక్షల సమాహారమే ఈ సమీక్షాక్షం. అక్షరామృతంకై భ్రమరాన్వేషణ అనేది ట్యాగ్ లైనుగా పెట్టడంలోనే ఆయన అంతరార్ధం అవగతమౌతుంది. పుష్పమునందలి మకరందాన్ని గ్రోలడానికి ఒక తుమ్మెద అన్వేషించిన విధంగా అక్షరాలలోని అమృతాన్ని ఆస్వాదించడానికి చేసిన అన్వేషణగా ఆయన పేర్కొనడం జరిగింది. కేవలం పేర్కొనడమే కాదు నిజంగా ఈ పుస్తకాన్ని చదువుతున్న మనకూ కలిగే అనుభూతి అదే. తన ముందు మాటలో ఒక చోట “ఒక సమీక్ష చేయాలి అంటే ముందు ఆ సమీక్షకుడు సమీక్షించదలచుకున్న గ్రంథాన్ని ఆమూలాగ్రం పఠనం చేయాలి. ఆ పఠనం సాధారణ పాఠకుడి యొక్క పుస్తక పఠనానికి భిన్నమైనదిగా ఉంటుంది. కారణాం ఒక పుస్తక సమీక్ష చేస్తున్నాము అంటే మనము ఆ పుస్తకము యొక్క తొలి పాఠకుల వరుసలో మనమున్నట్లు కనుక మరింతమంది పాఠకులను ఆ పుస్తకానికి తెచ్చే భాద్యత ఆ సమీక్షకునికి ఉంటుంది” అని చెబుతారు. అయితే ఇది చాలామటుకు సత్యమైన విషయమే కాని, పూర్తి సత్యమైనది కాదు. కారణం. పుస్తకం గొప్పదైనప్పుడు దానిగురించి సమీక్ష కూడా సాధారణంగా గొప్పగా ఉండి వారు పేర్కొన్నట్లే ఎక్కువ పాఠకులచే చదివించేలా చేస్తుంది కాని, పుస్తకంలో విషయం లేనప్పుడు సమీక్ష కూడా అందుకు విరుద్దంగా ఉండేందుకు ఆస్కారం ఉండదు. కనుక మరింతమంది పాఠకులను ఆ పుస్తకానికి తెచ్చే భాద్యతను సమీక్షకుడు తీసుకోలేడు.
ఇక పుస్తక విషయానికి వచ్చినట్లయితే ఇందులో రామకృష్ణ గారు మొత్తం 15 గ్రంథాల సమీక్షలు పేర్కొనడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఎంచుకున్న గ్రంథం శ్రీహస్త గారు రచించిన “మనసున్న కవి మాకినీడి” అన్న గ్రంథం. నిజానికి ఇది శ్రీహస్త గారు మాకినీడి సూర్యభాస్కర్ గారు రచించిన “కలల పెదవుల నవ్వుల్లోకి” అన్న కవితా సంపుటి గురించి రాసిన సమీక్ష గ్రంథం. అయితే సాధారణంగా సమీక్షలనేవి ఒకటి రెండు పేజీలకు పరిమితమౌతాయి. కాని, శ్రీహస్త గారు మాకినీడి గారి “కలల పెదవుల నవ్వుల్లోకి” అన్న కవితా సంపుటి నందలి కవితల గురించి ఏకంగా “మనసున్న కవి మాకినీడి” అన్న మరో గ్రంథం రాసారు. మాకినీడి గారి కలం వడిగల గుర్రం. రాశిలోనూ వాసిలోనూ తనకు తానే సాటి. ఆయన రాయడమే కాదు వ్రాయిస్తారు కూడా.. ఈ సమీక్షాక్ష గ్రంథం అందుకు ఉదాహరణగా పేర్కొంటారు. “కలల పెదవుల నవ్వుల్లోకి” అన్న కవితా సంపుటి నందలి కవితలు చదివిన క్రమంలో మొదటినుండి చివరివరకూ తనకు కలిగన అనుభూతుల్ని వ్యాఖ్యానిస్తూ “పద్యస్పూర్తిగా స్వీకరించి వ్రాసిన రచనగా గాక ఇందులో నాకు రచయిత (మాకినీడి) యొక్క ఆత్మసంతృప్తి పరవశం కనిపించాయి అంటాడు రచయిత శ్రీహస్త గారు తన ‘మనసున్న కవి మాకినీడి’లో” అని పేర్కొంటాడు రామకృష్ణ గారు.
ఇక రెండవ సమీక్ష కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి ‘నాగేటి గోడు’ అనే దీర్ఘ కవితపై జరిగిన సమీక్ష. దేశానికి కూడు పెట్టే రైతు గోడును ‘నాగేటి గోడు’గా వినిపించిన కర్షక కవి బహుగ్రంథకర్త కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డిగారు. హృదయాన్ని పిడికిట పట్టి పిండుతున్న శోకం నుండి పుట్టిన కావ్యం ‘నాగేటి గోడు’గా చెప్తారు ఆత్మకూరు రామకృష్ణ గారు. కవి-చిత్రకారుడు మరియు విమర్శకుడైన కొండ్రెడ్డి గారు రైతు విముక్త స్వాప్నికుడై తన నిజమైన దృశ్య చిత్ర రచనను అక్షరీకరించి పదచిత్రాలుగా కంటి ముందుంచిన కావ్యంగా చెబుతూ అది నేటి ఆధునిక బాధల ఏకరువుగా పేర్కొంటారు ఆత్మకూరు రామకృష్ణ గారు.
ఇక మూడు, నాలుగు, ఐదవ గ్రంథాలు డాక్టర్ మక్కెన శ్రీను గారిచే రచింపబడ్డ మట్టి కుదుళ్ళు, వెన్నువిరిగిన కంకులు మరియు గోరంత కవిత అనే మూడు కవితా సంకలనాలను గురించి సమీక్ష చేసారు. ఇందులో మొదటిగా మట్టి కుదుళ్ళు కవిత సంకలనాన్ని గురించి పేర్కొంటూ కన్నవారితోనూ మరియు వూరిలో ఉన్నవారితోనూ ఉన్న అనుబంధాల దొంతరను వైయక్తిక సంవేదనలను కదిపి, భావుకతను మెదిపి ఆ సుగంద మకరందాలను మనకందించే ప్రయత్నమే మట్టి కుదుల్లుగా ఆచార్య మక్కెన గారు రచించారని పేర్కొంటారు.
పంట పొలంలో వడ్ల కంకులకు వెన్ను విరిగితే ఇక ఆ రైతుకు మిగిలేది తరకలే. రైతుకే వెన్ను విరిగితే మానవాళి నోటికి మన్నే అంటూ నాలుగు అధ్యాయాల్లో నూట ముప్పై ఏడు చతుశ్పాదాల్లో మెరికల్లాంటి రైతు కవిత్వం అమరిన సమగ్ర రైతు జీవన సారం ఈ కవితా సంకలనంగా పేర్కొంటారు. ఒక రైతుబిడ్డగా అక్షరాల సేద్యం చేసిన కవి – డాక్టర్ మక్కెన గారు పండించిన నాల్గవ పంటగా ఈ వెన్ను విరిగిన కంకులు కవితా సంకలనాన్ని పేర్కొంటారు. మక్కెనగారి ప్రతి కవితాక్షరంలోనూ పల్లెసీమల మట్టి వాసనపరీమళాల గుభాలింపులు పాఠకుడి మస్తిష్క మూలాలను తాకుతాయని వారి కవిత్వం యొక్క గొప్పతనాన్ని కొనియాడతారు ఆత్మకూరు రామకృష్ణ గారు.
మహితోక్తుల్లాంటి నాలుగే నాలుగు పదాలతో ఈగ హనుమాన్ గారు సృష్టించిన కవితా ప్రక్రియకు అతడు నానోలని పేరు పెడితే ఆ కవితా ప్రక్రియకు ఆచార్య మక్కెనగారు అచ్చమైన స్వచ్చమైన పదహారణాల తెలుగు పదంగా ‘గోరంత కవిత’ అని నామకరణం చేసారని పేర్కొంటూ; మక్కెనగారు రాసిన “గోరంత కవిత” సంకలనంలో మక్కెన గారి తొలినానో “నానో/గోరంత/భావం /కొండంత” అని ఉదహరిస్తారు.
ఇక సుప్రసిద్ధ కవి, రచయిత, చరిత్రకారుడు, విశాలాక్షి పత్రిక సంపాదకులు అయిన ఈతకోట సుబ్బారావు గారి “విశాల నయనం” గ్రంథ సమీక్ష చేస్తూ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంపాదకీయ కవిత్వ ప్రక్రియను చేపట్టిన తొలినాళ్ళలో కొత్తగా మరియు కొంత వింతగా అనిపించినా సాహిత్య పత్రికకు సంపాదకత్వం వినూత్న శోభనే తెచ్చింది. సాహిత్య ప్రియులనే గాక రచయితలను కూడ అమితంగా ఆకర్షించిన సంపాదకునిగా సుబ్బారావు గారు కృతక్రుత్యులయ్యారని పేర్కొంటారు.
ఇంకా తూములూరి రాజేంద్రప్రసాద్ గారి “నిశ్శబ్ద నిశీధి”, “సమీక్షా సమీరాలు” అనే రెండు గ్రంథాల సమీక్షలు ఇందులో ఉన్నాయి. 100 పుస్తక సమీక్షలను పాఠకుడు ఒకేసారి వీక్షించేలా వెలువరించిన “సమీక్షా సమీరాలు” అనే గ్రంథం సమీక్షా శాస్త్ర అధ్యయనాభిలషులకు పెద్ద బాలశిక్ష అంటారు ఆత్మకూరు రామకృష్ణ గారు
తర్వాత లలితకళల విశ్వవిద్యాలయంలో తన సహ విధ్యార్థి అయిన ప్రముఖ కవి, శిల్పి, చిత్రకారుడు అయిన గొల్లపల్లి జయన్న గారి కలం నుండి వెలువడిన శ్రీ జయకేతనం గ్రంథంలో తాము విద్యార్థులుగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ తాను ఆనాడే జయన్నలో కవిని గమనించానని అతని పలుకులోనే కవిత్వం ఉందని రాయలసీమ కరకుమట్టే అతనికి కవిత్వాన్ని ఉగ్గుపాల్లా కష్టాలు తన చేతులతోనే కసిగా పట్టించిందేమో అంటారు. జయన్న జీవన సర్వస్వం కవిత్వం, వచనం , శిల్పం, సాధించిన విజయాలను పొందుపరచి జయన్న తన భావాలను బహుద వ్యక్తీకరించినట్లుగా పేర్కొంటారు.
ప్రముఖ చిత్రకారుడు 64 కళలు.కామ్ ఎడిటర్ కళాసాగర్ సంపాదకత్వంలో వెలువడిన గొప్ప గ్రంథం ‘ఆర్ట్ అఫ్ ఆంధ్ర’ కాపీ టేబుల్ బుక్ గురించి సమీక్షిస్తూ లలితకళల్లో మన ప్రాంతీయ కళాకారులు ఎవరికీ తీసిపోరని, అంతర్జాతీయ ప్రతిభాపాటవాలను కలిగి ఉన్నారని చెప్పదలచుకున్న ఓ సంపాదకుని సాహసోపేత ప్రతిభకు తార్కాణంగా చెబుతూనే కళకు ఆదరణ ఉన్నా, లేకున్నా కళాజీవుల కర్తవ్యదీక్షను నిరాశ పరచలేరని; తూలికలెత్తి చాటిన ప్రతిభకు దర్పణం ఈ గ్రంథం అని పేర్కొంటారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో కార్టూనిస్టుల గురించి కళాసాగర్ వెలువరించిన మరో గ్రంథం ‘కొంటె బొమ్మల బ్రహ్మలు’ మరియు ‘టాప్ 100 యూ ట్యూబర్స్’ అనే మూడు గ్రంథాల సమీక్షలతో బాటు ఎల్.ఆర్. వెంకటరమణ గారి కళాసౌందర్యం గురించి వివరిస్తూ ఈ గ్రంథం నందలి వ్యాసాలు ఒక ప్రత్యేక వర్గానికి చెందినవనే భ్రమను మనం వీడగలిగి, ఈ వ్యాసాలు చదవడం ద్వారా మన నిజజీవితంలో కళ ఎలా అంతర్భాగమై ఉందో తెలుసుకునే అవకాశముందని చెప్తారు.
ఈ గ్రంథంలో మరో ముఖ్య సమీక్ష ప్రఖ్యాత చిత్రకారులు వాష్ టెక్నిక్ లో విరివిగా చిత్ర రచనలతో అద్భుత ప్రయోగాలు చేస్తున్న మంచెం సుబ్రహ్మన్యేశ్వర రావు గారు చిత్రించిన శ్రీకూర్మం కుడ్య చిత్రాలపై ప్రచురించిన “మ్యూరల్స్ ఆఫ్ శ్రీకూర్మం టెంపుల్” అన్న గ్రంథం గురించి సమీక్ష చేస్తూ “శ్రీకూర్మం కుడ్యాలపై నాటి చిత్రకారులు ఏ ఆదరణ లభించితే అంతటి ప్రయాసలకోర్చి చిత్రాలను చిత్రించారో తెలియదు గాని ఈ పరుగుల ప్రపంచంలో మూడు సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి శ్రమించి 50 చిత్రాలను రూపొందించి, వాటిని పుస్తకంగా ప్రచురింపజేసి యావత్ చిత్రకళా ప్రపంచాన్ని తనవైపు త్రిప్పు కోగలిగారు మంచెం సుబ్రహ్మన్యేశ్వర రావు గారు” అని పేర్కొంటారు.
ఇంకా ఈ గ్రంధంలో మణిబాబు రచించిన “నాన్న, పాపల ముచ్చట్లు” ఎల్వీ రావు గారు రచించిన “నెల్లూరు సీమ ఖ్యాతిని నిలిపిన నాయకత్వగరిమ, ఎమ్మార్వీ గారి “గోదావరి నవ్వింది”, భమిడిపాటి బాలా త్రిపుర సుందరి గారి “నాయనమ్మ కథలు” “నిండైన నీతి చంద్రికలు” అలాగే మరో రచయిత పెరిసేట్ల శివ కుమార్ గారి “నందమూరి శతకం” లగడపాటి సంగయ్య గారి “వైచిత్రీ విశ్వరూపం” మొదలగు 15 గ్రంథాలను గురించి ఆత్మకూరు రామకృష్ణ గారు చేసిన సహేతుకమైన సమీక్షలు మనం చూస్తాము.
ఇందులో మరో ముఖ్య ఆకర్షణగా ప్రతి సమీక్షకు చివర్లో ఒక ప్రసిద్ధిగాంచిన గొప్పవాళ్ళ అనుభవాలతో చెప్పిన వాఖ్యలు ప్రచురించడం చదివే పాఠకుడికి స్పూర్తిదాయకంగా అనిపిస్తాయి. 144 పేజీలలో భిన్న విభిన్నమైన 15 గ్రంథాల సమీక్షలతో కూర్చిన ఈ సమీక్షాక్షంను సొంతం చేసుకోవడానికి సంప్రదించవలసిన పోన్ నెంబరు 9493405152.
గ్రంథం వెల రు 250/-రూపాయలు
- వెంటపల్లి సత్యనారాయణ
94913 78313
