బొప్పన నరసింహారావు… ఈ పేరు కొద్ది మందికే తెలుసు, ‘బుజ్జి’ అంటే అందరికి తెలుసు. అందరి నోటిలో నానే పేరు బుజ్జి ఆయన నటుడా! అదీ కొందరికే తెలుసు నిర్వాహకునిగా నాటకాభిమానిగా నట హితైషిగా.. అందరి తలలో నాలుకలా నట లోకానికి సుపరిచితుడు. నిష్కల్మష హృదయుడు కళాపిపాసి కళావిపంచి వ్యవస్థాపకులు… బుజ్జి గారి జన్మదిన సందర్భంగా సయ్యద్ జానీబాషా గారి శుభాకాంక్షలు…
సొంత లాభం కొంత మానుకొని పొరుగు వానికి తోడు పడవోయ్ అన్నది గురజాడ మాట కాగా, సొంత లాభము కొంత మానుకొని కళల కోసం పాటుపడవోయ్ అన్నమాట నూటికి నూరు శాతం బొప్పన నరసింహారావు గారికి వర్తిస్తుంది. మనకు జీవితంలో ఎంతో మంది మిత్రులు హితులు సన్నిహితులు ఎదురవుతారు వారిలో కొందరు మాత్రమే కొన్ని ప్రత్యేక సుగుణాలు కలిగి ఉంటారు. అలాంటి వారిలో ఒకరు బొప్పన నరసింహారావు గారు! ఆయన ఉండేది హైదరాబాద్ నేను ఉండేది. గుంటూరు! అయినా మా ఇద్దరికీ పరిచయం యువ కళావాహిని అధ్యక్షులు వై.కె. నాగేశ్వరావు ద్వారా జరిగింది. వారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తనతో పాటుగా నరసింహారావు సహాయ సహకారాలు తీసుకుంటుండేవారు.
నరసింహారావు అలియాస్ బుజ్జి వై.కె. గారు ఆదేశించిన ఏ పనైనా చిత్తశుద్ధితో అంకితభావంతో నిర్వహించేవారు. అందువల్ల బుజ్జి నిర్వహించేవారు. అందువల్ల బుజ్జి గారు అంటే వై.కే. గారికి ఎంతో అభిమానం అలా జరిగిన మా పరిచయం వై.కే. గారి మరణం తదుపరి కూడా అలా కొనసాగుతూనే ఉంది.
నరసింహారావు గారు వారి తండ్రిగారైన ఆంజనేయులు గారి ద్వారా హైదరాబాదులో స్థిరపడి భాగ్యనగర్ ఖాదీ భండార్ ను వారి వ్యాపార కేంద్రంగా చేసుకుని వృత్తితోపాటు ప్రవృత్తిని కూడా ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించే ఒక అపురూపమైన వ్యక్తి, యువకళా వాహిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సాహిత్య సాంస్కృతిక నాట్య నృత్య, నాటక, కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వారి కార్యవర్గంలో బుట్టి గారు చాలా మరుకైన పాత్ర పోషించేవారు. నాగేశ్వరరావు గారి మరణం తదుపరి ఆయన ఆశయాలను ఆశలను నెరవేర్చాలని దీక్షతో, పట్టుదలతో ఆయన “కళావిపంచి” సంస్థను స్థాపించి అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గుంటూరు, ఏలూరు, అనకాపల్లి, కర్నూలు, విజయవాడ, మాజివీడు, మొవ్వ లాంటి… ప్రాంతాలలో నాటకోత్సవాలను వైకే కళాపరిషత్ పేరిట నిర్వహించటం ఆయనకే చెల్లింది. ఎంతోమంది కళాకారులను ఒక చోటుకు చేర్చి నాటకోత్సవాలను రెండు రోజులపాటు మూడు రోజులపాటు, ఐదు రోజులపాటు నిర్వహించటం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యపడదు. హైదరాబాద్ లోని అనేకమంది మిత్రులను ముఖ్యంగా కళ పత్రిక సంపాదకులు మహమ్మద్ గఫీ గారు, యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీ నారాయణ. కార్యదర్శి మల్లికార్జున రావు, ఉపాధ్యక్షులు భాగ శాస్త్రి, జి.వి.జి. శంకర్, రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి. హమీద్, ఆరాధన సంస్థ వ్యవస్థాపకులు లోకం కృష్ణయ్య, మాజీ కేంద్ర సన్సార్ బోర్డు సభ్యులు మాజీ కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు పండిట్ అంజు బాబు, వి.వి రాఘవ రెడ్డి లాంటి మిత్రులను తోడు చేసుకుని వారి సహాయ సహకారాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహించిన ఘనత వారికి చెందుతుంది.
బొప్పన నరసింహారావు గారికి, నాటకాలు అంటే ఎంతో ప్రాణం నటులు అంటే ఎంతో అభిమానం. నాటకం ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ప్రదర్శిస్తున్నా, ఆయన ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి అక్కడ హాజరవుతారు. ఎన్నో నాటక సమాజాలకు నాటక పరిషత్ లకు ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు. జంట నగరాల్లోని ఎంతోమంది కళాకారులకు కళాభిమానులకు ఆయన వ్యాపార స్థానం భాగ్యనగరి ఖాదీ భండారి ఒక కేరాఫ్ అడ్రస్. తన వ్యక్తిగత పనులు కుటుంబ అవసరాలు ఎన్ని ఉన్నా నాటకం అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి బొప్పన నరసింహారావు. తన సంపాదనలో లక్షలాది రూపాయలు కళల కోసం వెచ్చించే వారిలో నరసింహారావు ఒకరు, బొప్పన నరసింహారావు శత వత్సరాలు ఆయురారోగ్యలతో సుఖ సంతోషాలతో గడపాలని మనసా కోరుకుంటూ…
- సయ్యద్ జానీబాషా , (Courtesy: Kala magazine)
