ఎప్పుడో దశాబ్దాల క్రితం… బ్రహ్మదేవుడికి భూమ్మీద భలే జాలేసింది. కష్టాలూ, కన్నీళ్లూ ఎక్కువైపోయాయని పించింది.
అర్జెంటుగా భూమ్మీదకు నవ్వించే శక్తిని పంపాలనిపించింది.
ఆ రోజు… ఫిబ్రవరి 1. బ్రహ్మ… ఈ లోకంలో ‘ఆనందం’ పుట్టించాడు. ఆయనే బ్రహ్మానందం అయ్యాడు! –
ఇదివరకు బ్రహ్మానందం కామెడీ చేస్తే జనం నవ్వేవారు. ఆ తరవాత ఆయన కనిపిస్తే చాలు… నవ్వు ఆగేది కాదు. ఇప్పుడు బ్రహ్మానందం పేరు తలచుకొంటే చాలు.. కితకితలు క్యూ కట్టేస్తు న్నాయి. ఈ రోజు ఈ నవ్వుల మాంత్రికుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా బ్రహ్మానందంతో జరిపిన సరదా … మాటలు… ఆయన కట్ చేసిన జోకుల కేకు.. ఇది!
* నమస్కారమండీ..
నమస్కారాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఎందుకంటే దాంతోనే ‘మస్కా’ వేయడం మొదలవుతుంది.
*పోనీ… పుట్టినరోజు శుభాకాంక్షలు!
శుభాకాంక్షల్లోనూ ఆంక్షలున్నాయి. ఎందుకంటే ఈ పుట్టినరోజు నాదికాదేమో అనిపిస్తుంది. ఎవడిదో పుట్టినరోజు నేను చేసుకొంటున్నానని నా ఫీలింగ్. ఎందుకంటే మా అమ్మానాన్న నా పుట్టిన తేదీని నోట్ చేయలేదు. సర్టిఫికెట్లలో ఫిబ్రవరి 1 అని ఉంది. ఆ రోజుల్లో ఫేస్బుక్ లాంటివి ఉంటే బాగుణ్ను. పుట్టిన వెంటనే పోస్ట్ చేద్దురు.
*పుట్టినరోజుకు మీరిచ్చే నిర్వచనం?
మనిషి పుట్టినప్పటి నుంచీ కనుమూ సేవరకూ పుట్టినరోజే. ఫిలాసఫీలా అనిపించినా అదే నిజం. మీ డైరీలో గుర్తు పెట్టుకోదగిన రోజు?
జంధ్యాలగారిని తొలిసారి కలిసిన రోజును ఎప్పటికీ మర్చిపోను. మా అమ్మమ్మ తమ్ముడు నన్ను చిన్నప్పుడు చూసి ‘వీడు అయితే పరమభ్రష్టుడు అవుతాడు. లేదంటే దేశం గర్వించే వ్యక్తి అవుతాడు’ ఆన్నారట. నాకు ఊహ తెలిశాక మా అమ్మ చెప్పిందీ మాట. పద్మశ్రీ అందుకోవడానికి రాష్ట్రపతి భవన్ లో నడుచుకొంటూ వెళ్తుంటే ఆ మాటలే గుర్తొచ్చాయి.
*ఎత్తు మరో పిడికిలో గుప్పెడో ఉండుంటే.. ఇంకోలా ఉండేదని అనిపిస్తుందా?
అదే ఉంటే నేనిలా ఉండేవాడ్ని కాదు కదా? నేను దిలీప్ కుమార్ లా ఉండాలనుకొంటే ఎలా? ఆ డీ ఒక రున్నారు కదా.
రెండోవాడు పుట్టుకొచ్చినా వేస్టే…
*అందరినీ నవ్వించే మిమ్మల్ని నవ్వించేదెవరు?
నాతోటి హాస్యనటులు. ఒకరా ఇద్దరా.. నలభై మంది ఉన్నారు. సెట్ కెళ్లే జోకులే జోకులు. నేను ఆస్సలు నవ్వు ఆపుకోలేను. ఎవరైనా జోకేస్తే పడీ పడీ నవ్వుతా. ఇంటికొచ్చాక ఆ జోకులే గుర్తుచేసు కొంటే కడుపు నిండిపోతుంది.
*ప్రతి హాస్యనటుడికీ సెంటిమెంట్ పాత్ర వేసి జనాల్ని ఏడిపించాలని ఉంటుంది. మరి మీకో?
ఓసారి ఎమ్మెస్ నారాయణ కాలును చూసుకో కుండా తొక్కేశా. ‘అన్నయ్యా.. పొరపాటున నా కాలు నీ కాలు కింద ఉండిపోయింది. నువ్వు అనుమతిస్తే తీసుకొంటా’ అన్నాడు బాధను దిగమింగుకొంటూ, ఎంత కామెడీగా చెప్పాడో? విషాదంలోని పరాకాష్ఠ నుంచి వినోదం పుట్టుకొస్తుంది. తెర వెనుక, ముందూ.. మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించ డానికే. అందుకే వినోదం, విషాదం రెండూ కలసిన ఓ పాత్ర చేయాలని ఉంది. ప్రస్తుతం నేను చేయాల్సిన పాత్ర ఏదైనా ఉందంటే అది మాత్రమే.