ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

బుచ్చిబాబు గారి జయంతి సందర్భంగా వారి శ్రీమతి సుబ్బలక్ష్మి చెప్పిన విశేషాలు …
తెలుగు సాహితీ జగత్తులో “బుచ్చిబాబు” అన్న పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే స్ఫురణకు వచ్చే నవల “చివరకు మిగిలేది” కేవలం సాహితీ లోకానికే కాదు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థిలోకానికి సహితం బుచ్చిబాబు అన్న పేరు చెప్పగానే వారి నోటి వెంట అసంకల్పితంగా వెలువడే పదం కూడా చివరకు మిగిలేది! ఈ నవల ద్వారా తెలుగు సాహితీ వినీలాకాశంలో “బుచ్చిబాబు” అన్న పేరుతో దృవతారలా నిలిచిపోయిన శివరాజు వెంకట సుబ్బారావుగారు నిజానికి గొప్ప సాహితీ వేత్త మాత్రమే కాదు మంచి చిత్రకారులు కూడా, అయినప్పటికీ అతనిలోని సాహితీ ప్రతిభ తనలోని చిత్రకారున్ని అధిగమించేలా చేయడంతో ఆంధ్రలోకంలో అందరికీ ఒక చిత్రకారుడిగా కాకుండా సాహిత్యకారుడిగా మాత్రమే కనిపిస్తారు.

నక్షత్రాలు స్వయంప్రకాశితాలు. స్వయంప్రకాశితమైన నక్షత్రం తను వెలగడమే కాదు తన చుట్టూ వున్న లోకానికి కూడా వెలుగులను ప్రసాదిస్తున్నపుడు నిత్యం తనలో సగభాగమైన శ్రీమతిపై ఆ వెలుగుజాడలు పడకుండా ఎలా వుంటాయి? చిరు ప్రాయంలోనే తనలో సగభాగమైన ఆమెతో ఆయన చిరకాలం కాకుండా చిరుకాలమే జీవించినా ఒక జీవితకాలానికి సరిపడా తృప్తినిచ్చేలా ఆమెను ఒక రచయితగా చిత్రకారునిగా తీర్చిదిద్ది అచిరకాలంలోనే అమరలోకాలకేగిన ఆ గొప్ప వ్యక్తి ప్రఖ్యాత సాహితీవేత్త బుచ్చిబాబుగారు ప్రఖ్యాతిగాంచిన శివరాజు బుచ్చి వెంకట సుబ్బారావు గారయితే అంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్న ఆయన జీవిత భాగస్వామి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మిగారు.

లలితకళల్లో ప్రధానమైన సాహిత్యం చిత్రలేఖనం రెండింటా ప్రఖ్యాతిగాంచిన వారిలో అలనాటి అడవి బాపిరాజు గారి తర్వాత మరలా రెండింటా సమానస్థాయిలో కృషిచేసిన వారిలో శీలావీర్రాజుగారు కూడా ఒకరు. గత 60 ఏళ్ళవారి చిత్ర కళాకృషికి దర్పణంగా వారు ప్రచురింపబోతున్న చిత్రకళా గ్రంథంలో వారి యొక్క కళను గురించి వివరిస్తూ రాయమని “శీలావి” గారు నన్నుకోరడం, దానిని ఆనందంగా అంగీకరించి ఆయనతో నేను మాట్లాడే క్రమంలో ఇంతవరకూ గొప్ప సాహితీవేత్తగానే ఊహించుకున్న బుచ్చిబాబుగారిని చిత్ర కారుడిగా కూడా తెలుసుకోవడం, అంతేకాక వారి సతీమణి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మిగారు కూడా ఉభయ కళల్లో ప్రావీణ్యురాలుగా శీలావి గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. బుచ్చిబాబు గారి శతజయంతి (1915-2015) సందర్భంగా వారిరువురి చిత్రాలతో ఆమె ఒక గ్రంధం ప్రచురించినారని ప్రస్తుతం సుబ్బలక్ష్మిగారు బెంగుళూరులో నివసిస్తున్నానని వారియొక్క చరవాణిని కూడా శీలావి (శీలావీర్రాజు)గారు నాకు ఈయడం జరిగింది.

నాకు ఊహ తెలిసినప్పటికే పరమపదించి సాహితీ జగత్తులో ఒక శిఖరంగా మేము చదువుకున్న బుచ్చిబాబుగారికి ఇది శతజయంతి వారి సతీమణి సుబ్బలక్ష్మిగారికిప్పుడు 95 ఏళ్లు. భర్తవలెనే ఆమె కూడా చిత్రలేఖన సాహితీ రంగాల్లో ప్రత్యేకమైన కృషిచేసి ఇటీవలనే ఒక ప్రామాణిక చిత్రకళా గ్రంథాన్ని వెలువరించారు అని చెప్పగానే వెంటనే ఆమెతో మాట్లాడాలి. అంతేకాదు గత ఐదున్నరేళ్లుగా 64కళలు.కామ్ లో ప్రతి సం. మార్చిలో వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తప్పనిసరిగా ఒక మహిళా చిత్రకారిణినే పరిచయం చేస్తున్న నేను, ఈ 2016 మార్చి నెల చిత్రకారిణి కోసం అన్వేషిస్తున్న తరణంలో గొప్ప నేపద్యం వున్న సుబ్బలక్ష్మిగారి గురించి తెలియడం మరింత ఆనందాన్నిచ్చింది.

వెంటనే బెంగుళూర్లో ఉంటున్న సుబ్బలక్ష్మిగారికి ఫోన్ చేసాను. అవతలనుండి “హలో అన్న ఒక తీయని ఆత్మీయమైన ప్రతిస్పందన. తదనంతరం గలగలా ప్రవహించే ఒక ఝరిలా వస్తున్న మాటల ప్రవాహం, వింటుంటే నేను ఒక తొమ్మిది పదులు నిండిన బామ్మగారితోనేనా? మాట్లాడుతున్నది అనిపించింది. ఇక ఆ ప్రవాహంలో ఎన్నో విషయాలు ఇలా బయటపడ్డాయి.శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మిగారు శ్రీ ద్రోణంరాజు సూర్య ప్రకాశరావు, సత్యవతి దంపతులకు 1925 సెప్టెంబర్ 17న రాజమండ్రిలోని ఇన్నీసుపేటలో శిష్ట సాంప్రదాయాలు తూచ తప్పక పాటించే కుటుంబంలో ముగ్గురు సోదరులు మరో ముగ్గురు సోదరీమణుల మధ్య రెండవ కుమార్తెగా జన్మించారు. అప్పటికి బ్రిటీషు పాలనలో ఉన్న మన దేశం, స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న ఉ ద్యమంలో గాంధీజీ కీలకశక్తిగా ఎదుగుతున్న రోజులు. కళారంగంలో కూడా మనదైన ప్రత్యేకతను తీసుకువచ్చే కృషిలో ఆధునిక ఆంద్రచిత్రకళకు ఒక ప్రత్యేక ఒరవడిని తీర్చిదిద్ది దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కలలు కన్న గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు 28 ఏళ్లు నిండకుండానే అమరుడయ్యారు. అంతటి గొప్ప వ్యక్తిని తీర్చిదిద్దిన బ్రిటీషు వ్యక్తి కూల్టే సహజంగా గొప్ప కళాకారుడు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఎందరో వ్యక్తులను తీర్చిదిద్దారు. అంతటి మహనీయుని వద్ద తన తండ్రి ద్రోణంరాజు సూర్యం ప్రకాశరావుగారు చదువుకుని ఆ రోజుల్లోనే బి.ఏ. పట్టా తీసుకున్నారని చెప్పారు. ఆ రోజుల్లో అది పెద్ద చదువే అయినా సహాయ నిరాకరణ ఉ ద్యమంలో పాల్గొని సంఘసేవ చేస్తుండేవారట. “ఇప్పనపాడు అనే గ్రామంలో కరణీకం చేస్తూ అనేక పాఠశాలలు స్థాపించి అన్ని కులాలవారికీ ఆయన చదువు చెప్పేవారని చెప్తారు.

సుబ్బలక్ష్మిగారు తండ్రి వద్దనే ఇంగ్లీషు, ఖగోళశాస్త్రం, బడిలో తెలుగు ఇంట్లో ప్రత్యేకంగా గురువు వద్ద సంస్కృతం నేర్పించడంతో చిరుప్రాయంలోనే ఆమె బహు భాషల్లో ప్రావీణ్యతను సాధించారు. రంగవల్లుల పోటీలో చురుకుగా పాల్గొంటూ చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్నారు.

ఇంకా సుదీర్ఘమైన తన అనుభవాల దొంతరలనుంచి ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తనకు ఊహ తెలియని కాలంలోనే చెట్లు ఇలా గీయాలి అని తనచే చార్‌కోలో గీయించిన ఆ వ్యక్తే ఊహ ఎరిగిన కాలంలో ప్రఖ్యాత చిత్రకారుడు, ఆంద్రా టర్నర్ భగీరధి అన్న విషయం తెలుసుకుని పొందిన అనుభూతిని, 1938-39లో భర్త బుచ్చిబాబుగారితో కలిసి సామర్లకోట స్టేషన్లో విశ్వకవి రవీంద్రున్ని సన్నిహితంగా చూడడం, బెంగాలీలా వున్నావంటూ హిందీలో నవ్వుతూ పలకరించడం, 1946లో బుచ్చిబాబుగారితో కలిసి గాంధీజీని చూడడం అదే సమయంలో చిత్రకారులు చామకూర సూర్యనారాయణ గాంధీజి బొమ్మను వేసి 300/- రూపాయలకి వేలంవేసి దానిని స్వాతంత్ర్యనిధి కీయడం, తమ ఊరు ఇప్పనపాడులో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి ఉపన్యాసంలో ప్రార్ధన గీతం పాడడానికి వచ్చిన ఆయన తమ్ముడు కూతురు అప్పటికే ఎంతో పాపులర్ అయిన నటి గాయని టంగుటూరి సూర్యకుమారి పరిచయం కావడం, సుస్వరాలు జాలువార్చే సాలూరువారు, ద్వారం వెంకటస్వామి అంతటి సంగీత కోవిదులు తమ ఇంట బసచేసిన జ్ఞాపకాలు, రేడియో ప్రోగ్రాములకై తరచు బుచ్చిబాబుగారి ద్వారా వచ్చే సీనియర్లు చలం, విశ్వనాద సత్యనారాయణ, కృష్ణశాస్త్రి శ్రీశ్రీ, పింగళి లక్ష్మీకాంతం, సంజీవదేవ్ తదితరుల జ్ఞాపకాలు, యూరోపియన్ సాహిత్యం కోసం తన గాజులమ్మి బుచ్చిబాబుగారికిచ్చిన విషయాలలో పాటు తన లేత చిరుప్రాయంలో తమ పల్లెటూరులోని పంటపొలాలు, కాలువ గట్ల, వెంబడి తిరగడం ఎంతో సరదాగా ఉండేదని, పల్లెల్లోని లేగదూడలు, పక్షుల కిలకిల రావాలు గురించి ఇలా ఎన్నో విషయాలు గుర్తుచేసుకుంటూ ఆనాటి విషయాలను మనకు కళ్లకు కట్టినట్లుగా చెప్తారు.

ఒకనొక రోజున గోదావరికి తూర్పునగల రాజమండ్రిలోని వారింటికి అటు పశ్చిమాన గల ఏలూరు నుండి ఒక యువకుడు తన అన్నతో కలిసి పెళ్లి చూపులకు రావటం, శిష్టసాంప్రదాయాలు పాటించే కుటుంబం కావడంతో అప్పటికే బి.ఎ. చదువుతూ అందరిలో యోగ్యుడనిపించుకుంటున్న ఆ యువకుడితో 12 ఏళ్ళ సుబ్బలక్ష్మిగారితో వివాహం చేయడం జరిగింది.

14.6.1916న జన్మించిన బుచ్చిబాబు గారు సుబ్బలక్ష్మిగారికంటే (9) ఏళ్లు పెద్ద. ఇంకా లోక జ్ఞానం అంతగా తెలియని వయసులో వివాహం కావడంతో బుచ్చిబాబు గారు తన చదువు పూర్తయ్యేవరకూ కాపురానికి తీసుకెళ్లకపోయినా శ్రీమతికి రాసే ఉత్తరాలలో ఏదో పత్రికలో తన కథ ప్రచురింపబడిందని రాస్తే అవి చదువుతూ ఆలోచించడం నేర్చుకున్నానంటారు శ్రీమతి సుబ్బలక్ష్మిగారు. ఇంకా బుచ్చిబాబుగారు తన ఉత్తరాలలో ఏమి చదవాలో ఎలా చదవాలో తెలియజెప్పుతూ కొంట్రొత్త ఆలోచనా సరళిని తనకు అలవర్చారని చెప్తారు.

సుబ్బారావు (బుచ్చిబాబు) సుబ్బలక్ష్మి ఇరువురూ చిత్రకళను ఎక్కడా అభ్యసించలేదు. సహజంగా కవి, కళాహృదయమున్న బుచ్చిబాబుగారిలో తొలుత చిత్రకళపై ఆసక్తి రేకెత్తించింది, రాజమండ్రి నందలి దామెర్ల రామారావు స్మారక చిత్రకళాశాలనందలి చిత్రాలయితే ఆ పిదప ఆరోజుల్లో విరివిగా లభించే యురోపియన్ చిత్రకారుల చిత్ర కళాగ్రంధాలు ఇంకా తనచుట్టూ వుండే ప్రకృతి బుచ్చిబాబుగారికి చిత్రకళలో ప్రేరణ కలిగిస్తే తనకు బుచ్చిబాబు గారు ప్రేరణ అని ఆయన వాడి వదిలేసిన రంగులతో బొమ్మలు ప్రాక్టీస్ చేసే దానినని చెప్తారు శ్రీమతి సుబ్బలక్ష్మిగారు.

ఆయన సహజంగా గొప్ప రచయిత మరియు ఆంగ్ల సాహిత్యాభిలాషి కావడంతో గొప్ప గొప్ప యూరోపియన్ సాహిత్య గ్రంథాలలతో పాటు, చిత్రకళా గ్రంథాలు కూడా డబ్బుకు ఏమాత్రం వెనకాడకుండా సేకరించేవారని ఇంట్లోనే ఒక పెద్ద గ్రంథాలయం ఉండేదని 1967లో బుచ్చిబాబుగారి మరణాంతరం ఆ గ్రంథాలన్నీ తెలుగు అకాడమీ వారికి అందజేసినట్లుగా చెప్తారు. సహజంగా బాల్యంనుండే గల సాహిత్యాభిలాషతో పాటు చిత్రకళపై కూడా వ్యామోహం గల వీరు మొదట పెన్సిల్ లో రేఖాచిత్రాలు, తర్వాతర్వాత రూప మరియు అరూపచిత్రాలు కూడా కొన్ని వేసినా ప్రధానంగా వీరి మనసు ప్రకృతి చిత్రాలపైనే కేంద్రీకృతమైనదని చెప్పడానికి వారు సృజించిన చిత్రాలే తార్కాణంగా చెప్పవచ్చు. వీరి చిత్రాల్లో 90శాతం ప్రకృతి దృశ్యాలే కనిపిస్తాయి. ….వీరిరువురూ పుట్టి పెరిగిన గ్రామీణ ప్రాంతంలోని సుందర ప్రకృతి దృశ్యాలు, చెట్లు చేమలు, పచ్చని పంటపొలాలు, గడ్డివాములు, ప్రవహించే నదులు, పంట కాలువలు కాయకష్టం చేసే పల్లె వాసులు, పల్లెజనాల ఆటల, పాటలు లాంటివన్ని సున్నితమైన కళాహృదయం గల వీరిపై బాగా ప్రభావం చూపించాయని చెప్పవచ్చు. అందుకే వీరు జల, తైల వర్ణాల్లో ఏ మద్యమంలోనైనా చిత్రాలు వేసేందుకు వారు సేకరించినటువంటి యూరోపియన్ చిత్రకళా గ్రంథాలలోని చిత్రకారుల చిత్రాలు మొదట్లో ప్రేరణ నిలిచినప్పటికీ కాలక్రమంలో ఆ ప్రేరణతో మనదైన గ్రామీణ దృశ్యాలను వారు చిత్రించునట్లుగా వీరు వేసిన చిత్రాలను చూసినపుడు అవగతమౌతుంది.

ఉద్యోగరీత్యా చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, పూనే తదితర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సెలవుల్లో తమ సొంత ఊరినందలి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ నదీతీర ప్రాంతాల్లో కూర్చుని స్కెలు వేసుకుని వాటికి మరలా ఇంట్లో కూర్చుని రంగులద్దడం చేస్తూ చిత్రాలను పూర్తి చేస్తుండేవారు. వీరి చిత్రాలలో సుబ్బలక్ష్మి గారు పుట్టి పెరిగిన ప్రాంతమైన ఇప్పనపూడి గ్రామంలోని పంటపొలాలు, ద్వారపూడి పరిసర ప్రాంత దృశ్యాలు, కాలువలు, వంతెనలు, పచ్చనిచెట్లు అలాగే బెజవాడ-బందర్ రోడ్డు ప్రక్కన ఆ రోజుల్లో ఉండే పూరిపాకలు, పచ్చని చెట్లు, పర్వతాలు అలాగే బెజవాడ కృష్ణా బేరేజ్ కి వెనుకన కనిపించే చిన్న చిన్న గుడిసెలు, కూళీలు ఉదయం, సాయం సంధ్యలు, ఇలాంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. యూరోపియన్ చిత్రకారుల ప్రభావంతో కొన్ని న్యూడ్సుని కూడా బుచ్చిబాబుగారు చిత్రించారు. అలాగే కొన్ని పని కార్కానాలు, రైల్వే స్టేషన్ లాంటి ప్రదేశాలను కూడా బుచ్చిబాబుగారు చిత్రించారు.సుబ్బలక్ష్మిగారి చిత్రాల్లో కూడా ప్రధానంగా ప్రకృతి దృశ్యాలే అయినా గాంధీ, ఇందిర, లెనిన్, కాంచనమాల లాంటి కొందరి రూపచిత్రాలు, కొన్ని గ్రామీణ దృశ్యాలను కొన్ని అరూపచిత్రాలను కూడా చిత్రించారు. రూపచిత్రాలతో వీరు చిత్రించిన “కాంచనమాల” చిత్రం చాలా సహజత్వంతో వుంటుంది. అలాగే కొన్ని Rock Areas, Abstract paintings” సృష్టించడానికి వీరు కుంచె పేలట్ నైతో చేసిన ప్రయోగాలు కూడా బాగుంటాయి. వీరి చిత్రాలను గమనించినట్లయితే రంగుల ఎంపికలలోగాని, కుంచె విదిలింపులో గాని కాన్వాసుపై రంగులు అద్దే విధానంలో గాని ప్రఖ్యాత డచ్ చిత్రకారుడు విన్సెంట్ వాంగోను గుర్తుచేసారు.

బుచ్చిబాబు, సుబ్బలక్ష్మి గారు ఇరువురూ కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే చిత్రాలను వేసినప్పటికీ ప్రత్యేకంగా ప్రదర్శనలు చేయలేదని ప్రఖ్యాత నాయకులు బెజవాడ గోపాలరెడ్డి గారి ప్రోద్భలంతో కలకత్తా హైదరాబాద్ లో మాత్రం రెండు మూడు సార్లు తమ చిత్రాలను ప్రదర్శించినట్లుగా చెప్తారు. బుచ్చిబాబుగారు విజయవాడ రేడియో స్టేషన్లో పనిచేసే కాలంలో కొన్ని చిత్రలేఖన పోటీలకు కూడా పంపించే వారని కొన్ని బహుమానాలు కూడా వాటికి అందుకున్నారని సుబ్బలక్ష్మిగారు చెప్తారు.

అటు చిత్రకళతో పాటు సాహితీ రంగంలో కూడా సుబ్బలక్ష్మిగారు బుచ్చిబాబుగారి అడుగు జాడల్లో నడుస్తూ దాదాపు అరవై కథలు, వచన గేయాలు, అదృష్టరేఖ, నీలంరేటు అయ్యగారు, తీర్పు అన్ని మూడు నవలలు కూడా రాసారు. వీటిలో 30కి పైగా ఆనాటి అనేక పత్రికలలో ముద్రితం అయినాయి. ఇటీవలనే వీరిరువురి చిత్రాలతో బుచ్చిబాబుగారి శతజయంతి సందర్భంగా ప్రచురించిన చిత్రకళా గ్రంధంతోపాటు త్వరలో “జ్ఞాపకాలు” పేరుతో మరో గ్రంథాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించబోతున్నారని చెప్తారు. వీరి కృషికి గుర్తింపుగా 2004 మరియు 2013లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతాభాపురస్కారం అందుకున్నారు. అంతేకాక రాష్ట్రంలో పలుసంస్థలు వీరిని సత్కరించాయి.

21-12-1937 తన 12 ఏళ్ళ చిరుప్రాయంలో సుబ్బలక్ష్మిగారి చేయి పట్టుకుని సంస్కృతి, సాహిత్య చిత్రకళా రంగాలన్నింటా తనతో పాటు ముందుకు నడిపించి జీవితంలో ఎన్నో మధురమైన మజిలీలను, స్మతులను మిగిల్చిన బుచ్చిబాబుగారి చేయి 1967 సెప్టెంబర్ 20వ తేదీన శాస్వతంగా తనను వదిలి వెల్లి పోవడం సుబ్బలక్ష్మిగారికి తీరని లోటు. బుచ్చిబాబు గారి మరణాంతరం వీరు తమ్ముడి వద్దనే వుంటూ గత కొన్నేళ్లుగా బెంగుళూరులో తను పెంచుకున్న తమ్ముడి పిల్లల వద్ద వుంటూ 91 ఏళ్ళ ప్రస్తుత వయసులో బుచ్చిబాబుగారి శతజయంతి కార్యక్రమాలను రాష్ట్రంలో హైదరాబాద్, ఏలూరు, విజయవాడ లాంటి ముఖ్య పట్టణాలలో నిర్వహిస్తున్నారు.

చివరగా…. మనిషి జీవనయాణం కొందరికి పరిమితమైనదైతే మరికొందరికి అపరిమితం అవుతుంది పరిమిత కాలంలోనే చేరతాయి అపరిమిత స్మృతులు తమ జీవన యానంలో బుచ్చిబాబు గారి జీవన యానం పరిమితమే…

కానీ అపరిమిత స్మృతులు ఎన్నో వారి జీవనయానంలో సుదీర్ఘమైన సుబ్బలక్ష్మి గారి జీవనంలో కూడా ఎన్నో మరెన్నో స్మృతులు – మరెన్నో జ్ఞాపకాలు

కాసుకోసం కాలాన్ని వెచ్చించే వారికి మిగలవు ఇలాంటి స్మృతులు… కేవలం కళకోసం తపించేవారికే దక్కుతాయి. అలాంటి జ్ఞాపకాలు.
సుబ్బారావు (బుచ్చిబాబు) కళకోసమే తపించారు, జీవించారు. సుబ్బలక్ష్మిగారి జీవనయానం కూడా నేటికీ కళకోసమే.
అందుకే వారిరువురి దాంపత్య జీవనం ఒక గొప్ప సాహితీ శిల్పమే కాదు సౌందర్య భరిత రంగుల వర్ణ చిత్రం కూడా. కళాహృదయులు ఎవరికైనా చివరికి మిగిలేది ఇదే.

-వెంటపల్లి సత్యనారాయణ 

SA:

View Comments (2)

  • ఆమధ్య శివరాజు సుబ్బలక్ష్మి అక్కయ్య గారిని బెంగుళూరు లో వారింట కలవటం ,కలిసి
    కాసేపు కలబోతగా కబుర్లు చెప్పుకోవడం ఒక తీపి జ్ఞాపకం.మా మలి సమావేశం ఇటీవల మా విజయవాడ లోనే.ప్రపంచతెలుగు మహాసభల ప్రారంభోత్సవం సభల నిర్వాహకులు సుబ్బలక్ష్మి గారి చేత జ్యోతిప్రజ్వలన చేయించడంతో మొదలయింది .ఆ సందర్భంగా మేము మళ్ళీ కలుసుకున్నారు.
    మరి వారానికో, పదిరోజులకో నేను వారిని ఫోనులో పలకరిస్తూ ఆ స్నేహం బంధాన్ని నిలుపుకుంటున్నాను.
    సుబ్బలక్ష్మి గారి ప్రతీ మాటలోనూ వాత్సల్యం తొంగి చూస్తూ ఉంటుంది.వయసు భారానికి అతీతం వారి సౌజన్యం.