22-8-2024 ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా “బుడబుక్కల వాడు” కళారూపం గురించి వ్యాసం మీ కోసం…
మనిషి ఈ నేలమీద పుట్టినప్పుడు వాడికి మాట, పాట, ఆట ఏవీ తెలియవు. చెట్టులో ఒక చెట్టుగా, పుట్టలో ఒక పుట్టగా బ్రతికేవాడు. ఆకలేస్తే తినాలి అని మాత్రమే తెలిసేది. గాలి, వాన, ఎండ, నీడ… వీటి తేడాలు అంతగా తెలిసేవి కాదు. అలసిపోతే నిద్రపోయేవాడు. లేకపోతే ఒకటే తిరుగుడు. ఏ పని చేయాలో తెలిసేది కాదు. అసలు పనులు వుంటాయన్న సంగతి కూడా వాడికి తెలియదు. రాత్రి, పగలు ఎందుకు వస్తున్నాయో వాడెపుడూ ఆలోచించలేదు. తనకంటూ ఒక మెదడు ఉందన్న సంగతి గుర్తుకొచ్చేసరికి కొన్ని వేల వసంతాలు గడిచిపోయాయి.
సరిగ్గా ఒకరోజు తెల్లారగానే, వాడి తెలివికి తెల్లారి పోయింది. అంతే మనిషిలో క్రొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. మస్తిస్కం, తాను మూసుకున్న కనురెప్పల్ని తెరచుకుంది. ఇప్పుడు ప్రపంచం మునపటిలా కనిపించటం లేదు. చెట్టూ, పుట్టా, తాను ఇప్పుడు అంతా ఒక్కటి కాదు. తేడాలు బాగా గమనిస్తున్నాడు. తన చుట్టూవున్న సమస్తం తనకోసమే పుట్టిందన్న సత్యాన్ని మొదటిసారి భుజం మీద వేసుకున్నాడు. శరీరం ఇప్పుడు బండరాయిలా లేదు. అవయవాల్లో ఏదో విద్యుత్తు ప్రవహిస్తోంది. ఏదో ఒకటి చేయాలన్న తపన తన వొంటిని ఒక్కచోట వుండనీయటం లేదు. ఇపుడు నడవటం లేదు, పరిగెడుతున్నాడు. నీళ్లకు దూరంగా వుండే మనిషి ఇప్పుడు నీళ్లల్లోకి దూకి ఈతలు కొడుతున్నాడు. బెదిరించే జంతువులకు ఇపుడు భయపడటం లేదు. వాటి మీద తిరగబడుతున్నాడు. మొదటిసారి యుద్ధమంటే ఏమిటో వాటితోనే చూశాడు. తన బలానికి తోడు రాళ్లతోనూ, చెట్టు చెక్కలతోనూ ఆయుధాలు తయారు చేసుకున్నాడు.
ఈ క్రమంలో చెట్టుమీద కోకిల స్వరాలు విన్నాడు. నెమలి నాట్యాలు చూశాడు. ఏదో క్రొత్త అనుభూతి మొదటిసారి వాడి జీవితంలో ప్రవేశించింది. అంతే వికాసం దశ మానవజాతి దిశను మార్చేసింది. పరిణామాల మీద పరిణామాలు పురోగతి చెందుతూనే వచ్చాయి. అరుపులతో మొదలైన వాడి కేకల్లో క్రమంగా రాగాలు చోటుచేసుకున్నాయి. రోజూ నడకకే పరిమితమైన పాదాలు క్రొత్త రీతుల్లో కదలటం మొదలుపెట్టాయి. దాంతో శరీరానికి క్రొత్త వూపొచ్చింది, మనసుకు సరిక్రొత్త వుషారొచ్చింది. కళ కళాత్మకంగా అలా వాడి జీవితంలో ప్రవేశించింది
ఆట, పాట నేర్చుకున్నాక, నేర్పరులైన కళాకారులంతా క్రొత్త కళారూపాల సృష్టిలో మునిగిపోయారు. కళ స్వయానుభూతికే కాకుండా కళను చూసి ఆనందించే ఇతరుల వినోదం కోసం తన కళను అంకితం చేయటం మొదలు పెట్టాడు. అందులో శ్రమను మించిన సంతోషం వాడికి సొంతమై పోయింది. దాంతో ఇక జీవితాన్ని కళకే అంకితం చేశాడు. ఒకతరం నుంచి మరోతరానికి వారసత్వ సంపదగా జానపద కళలు సాకారం చెందిపోయాయి.
జానపదుడి పాదముద్రలే రాబోయే సర్వకాలాల ఆధునిక కళా జగత్తుకు కనిపించని పునాదులుగా మిగిలిపోతాయని మానవ మేధస్సు బహుశా వూహించి వుండదు. ఆనాటి వినోదానికి, అంతర్లీనంగా చెప్పే విజ్ఞానానికి, మంచి, చెడుల మార్గ నిర్దేశకంలో చిటికెన వ్రేలుని పట్టుకొని నడిపించే గురుతర బాధ్యతను, జానపద కళాకారులు ఆనందంగా స్వీకరించారు. కళ, కళకోసం కాదు, కాసులకోసం అంతకన్నా కాదు, కళ కేవలం మనిషికోసం. మానవత్వ ద్వారాలు మూసుకుపోకుండా నైతిక స్వర్గాలు సంస్కారపు సుగంధాలతో శాశ్వతంగా వెలగాలన్నదే జానపద కళాకారుడి ఏకైక లక్ష్యం. అందుకు ఎన్ని తరాలు గడిచినా కళా వారసత్వాన్ని వదులుకోమని రుణదాతలా కాలం మీద సంతకాలు చేసిన కళాకారులెందరో వున్నారు. పేగుల్ని తొలిచివేసే పేదరికం ఎన్నిమార్లు అడొచ్చినా అర్ధాకలినే అంగవస్త్రంగా ధరించి కళకే అంకితమై పోయిన జానపద కళల్లో “బుడబుక్కల వాడు” ఒకటి.
“బుడబుక్కల వాడు” కళారూపంలో ఒక్కడే పాత్ర నిర్వహిస్తాడు. పల్లెసీమల్లో ఇంకా తెల్లవారటానికి కొన్ని గంటలు ముందే, చీకటి తెరల్ని తొలిగించుకుంటూ, కుక్కల అరుపుల మధ్య, చలి పల్లకీల మీద “అంబపలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు” అంటూ వీధుల్లోకి ప్రవేశించి, ఇంటిముందు నిలబడి ఢమరకం మ్రోగిస్తూ… ఆ ఇంటికి భవిష్యత్తులో జరగబోయే సమస్త కష్ట, నష్టాలను లయబద్ధంగా ఇతరులకు సాధ్యం కాని శైలిలో పాడుతూ వినిపిస్తూ వుంటాడు. వాడి మాటల శబ్దానికి మూసివున్న తలుపులు తప్పక తెరుచుకోక తప్పదు.
“బుడబుక్కల వాడు” ప్రస్తావన మనకు చాలా పురాణాల్లో కనిపిస్తుంది. కొన్ని పురాణాల్లో కీలకమైన సన్నివేశాలకు ప్రాణం పోసిన కళ “బుడబుక్కల వాడు”. ఈ ప్రాచీనమైన కళ రామాయణ కాలంనాటికే అంటే త్రేతాయుగం కాలంనాటికే చాలా ప్రాచుర్యంలో ఉంది. తన రామాయణ రచనలో వాల్మీకి మహార్షి ఈ కళను ఒక ఘట్టంలో ప్రధానంగా వాడుకుంటాడు. తండ్రి మాటను నిలబెట్టటం కోసం శ్రీరాముడు అడవులకు వస్తాడు. భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడు ఆయన్ని అనుసరిస్తారు. సీతాదేవి కోరిన బంగారు లేడికోసం శ్రీరాముడు, లక్ష్మణుడు పర్ణశాలనుంచి దూరం కాగానే రావణాసురుడు “బుడబుక్కల వాడు” వేషంలోనే వచ్చి, అక్కడ ఎవ్వరూ లేని సమయంలో సీతాదేవిని అపహరించుకు పోతాడు.
బుడబుక్కల వాడిని గురించి ఒక ప్రధానమైన కథ ప్రచారంలో వుంది. త్రేతాయుగంలో ఢంభికాసురుడనే రాక్షసుడు బలగర్వంతో లోక ప్రశాంతకు భగ్నం కలిగిస్తున్న నేపథ్యంలో సమస్త దేవతల కోరిక మేరకు శివుడు ఆ ఢంభికాసురడ్ని సంహరించి, వాని వెన్నుముకని బుడబుక్కగుల్లగా అమర్చి, వాని నరాలను కాళ్లుగా చేసి చర్మాన్ని మూతలుగా చేసి, వాని మెదడును మైనంగా వుపయోగించి ఢమరుకంగా చేసి దాన్ని వాయిస్తూ, అయోధ్యని పరిపాలిస్తున్న దశరధమహారాజు వద్దకు వచ్చి, అప్పటికీ సంతానం కలగని ఆ మహారాజుకు
తోందర్లో నలుగురు సంతానం కలుగుతారని చెప్పాడట. ఈ కథ సారాంశాన్ని మనం అర్ధం చేసుకుంటే బుడబుక్కలు వాడు సాక్షాత్తు పరమశివుడి స్వరూపమని ఒన వాస్తవ సత్యం మనముందు సాక్షాత్కరిస్తుంది.
బుడబుక్కల వాయిద్యాన్ని ‘ఉడుక్కు పలుడక్క, దుబ్ డబ్ దుక్క’ అనికూడా పిలుస్తారు. బుడబుక్కల వాడి వేషధారణ చాలా ప్రత్యేకంగా వుంటుంది. ఒక్కసారి అతడ్ని చూస్తే జీవితంలో మళ్లీ మరచిపోలేము. బుడబుక్కల వేషధారి సాధారణంగా తెల్లని పంచెను ధరించి నల్లకోటుతో పాటు ఎర్రటి తలపాగా కట్టుకొని నడుముకు గంట కట్టుకొని ఢమరుకం వాయిస్తూ ఇళ్ల దగ్గరికి వస్తాడు. ఆ ఇంటికి జరగబోయే భవిష్యత్తును చెప్పినందుకు భిక్షని స్వీకరిస్తాడు. గ్రామీణ ప్రాంతాలలో వీరికి డబ్బు, దస్కమే కాదు వస్త్రాలను కూడా సమర్పించుకునేవారు.
నాగరికత పెరిగిపోయి, వికృత రూపాల విషవలయాలల్లోకి విసిరివేయబడ్డాక, జానపద కళలు క్రమంగా తమ ఉనికిని కోల్పోతూ వచ్చాయి. ప్రపంచీకరణ భూతం దాడికి సర్వనాశనమైన గ్రామీణ ప్రాంతాల నేఫథ్యంలో జానపద కళల అందమైన కలల గూళ్లన్ని కాకావిలమై పోయాయి. ఎండిపోయిన చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకోలేక ఎండిన డొక్కలతో చివరకు రోడ్డున పడ్డాయి జానపద కళలు. తనను నమ్ముకొన్న కళాకారుడ్ని ఆకలినుంచి బ్రతికించుకోవటం కోసం జానపదకళ నేడు భిక్షాటన పాత్రను అతి దీనంగా పోషిస్తోంది.
జనపదమంటే మన ఉనికికి ఒకప్పటి ప్రాణం. జానపద కళలంటే జాతి అస్తిత్వానికి పురుడు పోసిన తల్లిగర్భం లాంటివి. ఒక్కొక్క కళారూపం దైవాంశ ప్రతీకలు మాత్రమే. కళ, కళాకారుడు లేకపోతే జాతికి వెలుగునిచ్చే దీపాలు లేనట్లే. మనిషి మైనపు బొమ్మలా తయారవుతున్నాడు. కరిగించటానికి విష సంస్కృతులు నిప్పురవ్వలతో మీదికొస్తున్నాయి. ఆ దాడిని ధిక్కరించాలంటే జానపద కళల కవచాలు ధరించక తప్పదు. ప్రజలు, ప్రభుత్వం జానపద కళలకు ప్రాణదాతలు కావాలి. మనిషికి మాట, పాట, ఆట నేర్పిన జానపదుడి పాదాలు కడిగి పట్టాభిషేకం చేయటానికి జాతి మొత్తం సమాయత్తమయిన రోజున, నిత్యం అలజడితో కుతకుతలాడిపోతున్న మనిషి మనసుకు ఒక వూరట లభిస్తుంది. వినోద, విజ్ఞానపు వింజామరలు వీచటానికి జానపద కళలు ఎప్పుడూ సిద్ధంగానే వున్నాయి. అవి లేచి, నిటారుగా నిలబడటానికి వెన్నముకగా మన ఆదరణ కావాలి. కళలు బ్రతికితేనే జాతి బ్రతుకుతుంది, జాతి బ్రతుకుతేనే చరిత్ర బ్రతుకుతుంది, చరిత్ర బ్రతుకుతేనే రేపటి తరానికి మనమంటే ఏమిటో తెసుస్తుంది.
–డాక్టర్ కె.జి. వేణు, 98480 70084