శనివారం (19-7-25) సాయంత్రం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీనివాస ఆడిటోరియంలో స్థానిక చెల్లప్ప మేస్త్రీ స్మారక అంబేద్కర్ భవన్, ఏపీ యస్.సి. వెల్ఫేర్ అసోసియేషన్, బుద్దిస్ట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన బుద్ధుడితో నా (అంబేద్కర్) ప్రయాణం నాటకాన్ని ‘అభ్యుదయ ఆర్ట్స్ హైదరాబాదు’ వారు ప్రదర్శించారు.
తెలంగాణలో గత నెలలో 15 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న ఈ సమాజం వారు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం నుంచి మదనపల్లి మీదుగా తిరుపతిలో 19వ ప్రదర్శన ఇచ్చి, ఆపై ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రదర్శన ఇచ్చే సంకల్పంతో ఉన్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు.
బౌద్ధ బోధనలతో ప్రభావితుడైన అంబేద్కర్ ఆలోచిస్తూ ఉండగా బుద్ధుడు తన వెంట అంబేద్కర్ ను ప్రయాణింప చేస్తూ, తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలియజెప్పే సన్నివేశాలుగా, రెండు గంటలకు పైబడిన నాటకం సాగుతుంది.
పకడ్బందీగా చరిత్రను శోధించి తయారు చేసుకున్న నాటక రచన, ఇతివృత్త బలంతో, మంచి సంభాషణలతో, పాటలు నృత్యాలతో నాటకం నడవడం ఒక ఎత్తు అయితే అందుకు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం.. నాటకాన్ని దృశ్య రూపకంగా మలచడంలో రచయిత దర్శకులు సాంకేతిక కళాకారులు చక్కని కృషి చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ తూము శివ, డాక్టర్ నరేష్ ఇద్దరూ లైటింగ్ సెట్ డిజైన్ ఎక్స్పర్ట్స్ కావడం వల్ల ఈ నాటకం చూసిన వారి మీద చక్కని ఆలోచనాత్మక ప్రభావాన్ని వేసింది.
బుద్ధుని బోధనల సారం ఒడిసిపట్టి ఆయా సన్నివేశాల సందర్భంలో బుద్ధుని ప్రతి చర్య-జ్ఞాన సిద్ధి వలన తనకు కలిగిన స్వీయ అనుభవాలనుంచి, బుద్ధి పరిణతి నుంచి, వచించే వాక్యాలను సంభాషణలుగా మలిచిన చక్కని దృశ్య రూపకంలో మంచి అభ్యాసం చేసి నటించి చూపించడంలో కళాకారులు కృతకృత్యులు అయ్యారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ రిజిస్ట్రార్, స్టూడెంట్స్ కల్చరల్ వెల్ఫేర్ డైరెక్టర్ ప్రొ. మురళీధర్ తో పాటు వివిధ సంస్థలు సమాజాలకు చెందిన వారితో పాటు విద్యార్థులు ఈ నాటకాన్ని ఆసక్తిగా తిలకించారు.
ఇప్పుడు ఈ నాటకంలోని ముఖ్య ఘట్టమైనటువంటి సందర్భంలో బుద్ధుని వచనాలు.. ఆర్య సత్యాలు, అష్టాంగ యోగం గురించి, ‘పాపం పుణ్యం ఆత్మ జీవాత్మ ముక్తి మోక్షం సద్ధర్మాచరణ మొదలైన వాటిపై అంబేద్కర్ ప్రశ్నలకు సమాధానాలు..ఈ ఎంపిక చేసిన నాటక చివరి భాగాన్ని మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను.
–మల్లేశ్వరరావు ఆకుల
