నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా !

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు..డుగ్గు..డుగ్గు..డుగ్గు డుగ్గనీ…అందాల దునియానే జూపిత్తపా చిక్కు..చిక్కు..చిక్కు.చిక్కు బుక్కనీ…

ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే…కారణం…మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోన్కల్ గ్రామంలో జరిగిన ఒక పెళ్ళి బరాత్ లో వధువు వరుడి ముందు చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అయి రాత్రికి రాత్రే ఆ కొత్త జంట ఫేమస్ అయిపోయారు…
నిజంగా ఆ పెళ్ళి కూతురు చేసిన డాన్స్ వల్లే ఆ వీడియో అంత వైరల్ అయ్యిందా…?
అస్సలు కాదు…ఆ పెళ్ళి కూతురు ఈ పాటకు కాకుండా ఇంకో పాటకు డాన్స్ చేసి ఉంటే అది ఇంత వైరల్ అయ్యుండేది కాదు…ఎందుకంటే ఈ పాట గొప్పతనం వల్ల ఆమె చేసిన డాన్స్ కి అందం వచ్చింది…
కారణం ఈ పాటలో అత్తవారింట్లో అడుగు పెట్టే ప్రతి పెళ్ళి కూతురు కనే కలలూ, ఆశలూ, ఆశయాలూ అన్నీ అద్భుతంగా వర్ణించాడు ఈ పాట రచయిత అచ్చ తెలంగాణ యాసలో..

ఈ బుల్లెట్ బండి పాట నేపధ్యం…
ఒక ప్రైవేట్ ఆల్భమ్ గా నాలుగు నెలల క్రితం యూ ట్యూబ్ లో విడుదలై ఇప్పటికీ ముప్పై మిలియన్ వ్యూస్ దాటింది…
ఈ పాట రాసింది లక్ష్మణ్, మ్యూజిక్ ఎస్.కె.బాజీ..
సినీ నేపథ్య గాయని “మనోహరీ” పాట ఫేం (బాహుబలి) మోహనా భోగరాజు పాడి నర్తించింది ఈ పాటలో…ఈ పాట వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఎంతో మంది వీక్షకులను ఆకర్షిస్తోంది…
ఈ పాట క్రెడిట్ ముఖ్యంగా పాట రచయిత లక్ష్మణ్ కు ఇవ్వాలి…
అచ్చమైన తెలంగాణ యాసలో పెళ్ళి కూతురి అందమైన కలలను అందమైన భావ వ్యక్తీకరణతో మామూలు వాడుక పదాలతో రాసిన తీరు అద్భుతం అనే చెప్పాలి..
“నే పట్టూ చీరనె గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా” …”నే టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా…నడుముకు వడ్డాణం జుట్టుకున్నా జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా…”దిష్టీ సుక్కనె దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా”…అనే పల్లవితో మొదలై….పెళ్ళి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగ వస్తావురో చెయ్యి నీ చేతికిస్తానురో…నేను మెచ్చీ నన్నే మెచ్చేటోడా….ఇట్టే వస్తా రానీ వెంటా….నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా…డుగ్గు..డుగ్గు.. డుగ్గు…డుగ్గు డుగ్గనీ…అందాల దునియానె జూపిత్త పా…చిక్కు..చిక్కు.. చిక్కు.. చిక్కు బుక్కనీ…అని కొనసాగుతుంది…
ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే పల్లవి నుండి మొదలుకుని చివరి చరణం వరకూ తెలంగాణ ప్రాంతంలో వాడుక భాషలో వాడే ఒక అద్భుతమైన, ఇంతవరకూ పాటల్లో ఎవరూ వాడని పదబంధాన్ని వాడాడు రచయిత ఆ పద ప్రయోగం పాటలో అందంగా ఒదగడంతో పాటు పాటకు అందాన్ని తెచ్చింది అదే ఈ పాటలో “ఉల్లో” అనే పద ప్రయోగం…

తెలంగాణలో “తిన్నారుల్లా”….”యాడికి వోతుండ్రుల్లా” అని ఆప్యాయంగా (ఒకరికన్నా ఎక్కువ మందిని ఉద్దేశించి) పలకరించడం సహజం…ఈ పాటలో రచయిత ఆ “ఉల్లో” అనే పద ప్రయోగాన్ని అద్భుతంగా వాడేసాడు చెప్పాలంటే అదే ఈ పాటకు అందాన్ని తెచ్చింది…
ఉదా: మొదటి చరణంలో…” మా చెరువు కట్ట పొంటి చేమంతి వనం…బంతివనం..చేమంతి వనం…చేమంతులు దెంపి దండ అల్లుకున్నా… “అల్లుకున్నుల్లో” అల్లుకున్నా…
మా ఊరు వాగంచున మల్లె వనం…మల్లెవనములో… మల్లె వనం…మా మల్లెలు దింపి ఒల్లో నింపుకున్నా…”నింపుకున్నుల్లో”… నింపుకున్నా…
అని రాయడం నిజంగా ఈ పాటకే అందాన్ని తెచ్చింది..

తర్వాత…”మంచి మర్యాదలు తెలిసిన దాన్నీ…మట్టి మనుషుల్లోన వెరిగిన దాన్నీ”….
అంటూ ఆ అమ్మాయి గౌరవాన్ని పెంచాడు రచయిత…
అలాగే…”నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో…పిల్లనయ్యొ ఆడ పిల్లనయ్యో…మా నాన్న గుండెలోన ప్రేమనయ్యో… ప్రేమనయ్యొ నేను ప్రేమనయ్యో…ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో…దాన్నిరయ్యో…ఒక్క దాన్నిరయ్యో…మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో…ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో…
పండు ఎన్నెల్లో ఎత్తుకోని…ఎన్న ముద్దలు వెట్టుకోని…ఎన్ని మారాలు జేత్తూ ఉన్నా…నన్ను గారంగా జేసుకోని….చేతుల్లో పెంచారు పువ్వల్లె నన్నూ….నీ చేతికిస్తారా నన్నే నేనూ”…
అని తన ఇంట్లో అమ్మా, నాన్నా, అన్నల చేతుల్లో ఎంత గారాభంగా పెరిగిందో వర్ణిస్తూ రాసాడు…
తర్వాత…”నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా…వెట్టినంకుల్లో…వెట్టినంకా….సిరి సంపద సంబురం గల్గునింకా గల్గునింకుల్లో గల్గునింకా…నిన్ను గన్నోల్లె కన్నోల్లు అనుకుంటా…అనుకుంటుల్లో…అనుకుంటా…నీ కష్టాల్లో భాగాలు వంచుకుంటా…వంచుకుంటుల్లో వంచుకుంటా….సుక్క పొద్దుకే నిద్ర లేసి…సుక్కలా ముగ్గులే వాకిట్లేసీ…సుక్కలే నిన్నూ నన్నూ చూసీ మురిసిపోయేలా నీతో కలిసీ నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా…నీతోడులో నన్ను నే మెచ్చుకుంటా…నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ…అందాల దునియానే జాపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ..

తాను అత్తారింట్లో కాలు పెట్టగానే సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ, తన అత్తారింట్లో ఎలా మెదులుకోవాలనుకుంటుందో అందంగా వర్ణించాడు రచయిత…
ఐతే ఈ పాటలో తెలంగాణ వాడుక పదాలను ఎలా ఉచ్చరిస్తారో అలాగే యధాతధంగా వాడడం నాకు బాగా నచ్చింది…
ఉదా: వెట్టినంక (పెట్టినంక)…గల్గునింక (కల్గునింక)..జేసుకొని (చేసుకొని) దెంపి (తెంపి) సూపిత్త పా (చూపిస్త పద) వెరిగిన దాన్ని (పెరిగిన దాన్ని) లాంటివి…
ఇక పోతే ఈ పాటకు ప్రాణం పోసిన మరో ముఖ్యమైన వ్యక్తి ఈ పాట పాడి ఈ పాటలో అభినయించిన సినీ నేపథ్య గాయని మోహనా భోగరాజు…ఆమె ఈ పాట పాడిన తీరు, ఆమె అందమైన గొంతు, ఈ పాటకు ప్రాణం పోసాయి అని చెప్పవచ్చు…

మోహనా భోగరాజు స్వస్థలం ఏలూరు ఐనా ఈ పాటలో తెలంగాణ యాసను అద్భతంగా వలికించింది తన గొంతులో…ముఖ్యంగా “ఉల్లో” అని వచ్చిన చోట…ఆమె తెలంగాణ పదాలను చాలా స్పష్టంగా తెలంగాణ యాసలో పలికిన తీరు చాలా బాగుంది…
ఈ పాట మొదటి సారి విన్నప్పుడు ఎవరో జానపద గీతాలు పాడే గాయని పాడిందనుకున్నాను…ఒక సినీ ప్లే బ్యాక్ సింగర్ పాడిందని తెలిసి ఆశ్చర్యపోయాను…

ఆమె సినిమాల్లో, స్వరాభిషేకంలో పాడిన తీరుకూ, ఈ పాట పాడిన తీరుకూ ఎంతో వ్యత్యాసం కనపడింది…కేవలం పాట అద్భతంగా పాడడమే కాకుండా అంతే అద్భతంగా పాటలో నర్తించి తనలో మంచి డాన్సర్ కూడా ఉందని నిరూపించుకుంది మోహన…
గత సంవత్సరం కనకవ్వ పాడిన ” నసపెల్లే గండిలోన గంగధారి…ఆడనెమలీ ఆటలకు గంగధారి” అనే పాటను మంగ్లీ కనకవ్వతో కలిసి పాడిన వీడియో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే…ఇప్పుడు మోహనా భోగరాజు పాడిన ఈ బుల్లెట్ బండి పాట కూడా అంతకన్నా ఎక్కువగా ట్రెండ్ అవుతోంది ఇప్పుడు…
ఈ బుల్లెట్ బండి పాటకు కాపీగా ఎన్నో వీడియోలు యూ ట్యూబ్ లో అప్లోడ్ అయ్యాయి.. ఆ కాపీ వీడియోలకీ మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి కానీ వారెవ్వరికీ రాని పేరు ఈ పాటకు డాన్స్ చేసిన మంచిర్యాల పెళ్ళి కూతురికి వచ్చింది… కారణం మిగతా వారంతా ఆ పాటకు డాన్స్ చేసి యూ ట్యూబ్ లో పెట్టారు…కానీ ఈమె మాత్రం కొత్త ఆలోచనతో తన పెళ్ళి బరాత్ లో పెళ్ళి కొడుకు ముందు ఆ పాటలోని భావానికి తగ్గట్టుగా అద్భుతంగా డాన్స్ చేయడం అనేది అందరికీ బాగా నచ్చింది…అందుకే ఆ పెళ్ళి కూతురు ఒక్క రోజులోనే ఫేమస్ అయిపోయింది….

అందుకే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే అందరిలా కాకుండా కొత్తగా, యూనిక్ గా ఆలోచన చేయాలి అప్పుడే నేమ్, ఫేమ్, వెతుక్కుంటూ వస్తుంది.
నిజానికి ఈ బుల్లెట్ బండి పాట గురించి నెల రోజుల క్రితమే రాద్దామనుకున్నాను కానీ… ఇప్పుడు ఆ పెళ్ళి కూతురి డాన్స్ ఈ అద్భుతమైన పాట గురించి రాసేలా చేసింది.

  • షేక్ చాంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap