బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్

బుర్రకథ కళారూపానికి ఒక గుర్తింపును…గౌరవాన్ని తెచ్చిన స్రష్ట… ద్రష్ట..నాజరు. ప్రజలచేత… ప్రజలవలన… ప్రజలకొరకు కవిత్వం వ్రాసే కవి కలకాలం అజరామరుడని నమ్మిన నాజర్ కలం పట్టింది మొదలు కన్ను మూసే వరకూ ఆ నిబద్దతతోనే బుర్రకథలు వ్రాశాడు… పాడాడు… ఆడాడు.
గుంటూరుకు ఉత్తర దిశగా వున్న పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న షేక్ మస్తాన్, బీబాబీ దంపతులకు జన్మించిన నాజర్ బుడిబుడి నడకలు వేసే సమయంలో సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు. నిరుపేద ఇంటిలో పుట్టిన నాజర్ కపిలవాయి రికార్డులు విని ‘కోరి భజింతు గోవిందు నామది’ అనే పాటను వీధుల్లో పాడుకొంటూ బడికి వెళుతున్నప్పుడు ఆ గానమాధుర్యానికి మెచ్చిన పలువురు కోరికోరి పాడించుకొని పప్పు, బెల్లాలను బహుమతిగా ఇచ్చేవారు. తండ్రితో పాటు పీర్ల పండుగలో వీధి భాగవతాలలో ఆడి పాడేవారు. స్కూలు వార్షికోత్సవంలో ద్రోణం విజయం నాటికలో ద్రోణుని పాత్ర ధరించి తన్నులు తిన్న గురువు చేతనే పుస్తకాలు, పెన్సిల్ను బహుమతిగా పొందారు. శ్రీరామనవమి పందిళ్లలో, కనకతార నాటకంలో నటించి పలువురి దృష్టిని ఆకర్షించారు. హార్మోనిస్టు ఖాదర్ నాజర్లోని ప్రతిభను గుర్తించి పెద్దరామూరులోని బాలరత్న సభ నాటక సమాజంలో చేర్చారు. రామదాసు, తులాభారం, శ్రీకృష్ణలీల, రాధాకృష్ణ నాటకాలలో స్త్రీ పాత్రలను అత్యద్భుతంగా పోషించారు. రామదాసు నాటకంలో చాందిని పాత్ర పోషణకు తెనాలిలో కళావంతుల వద్ద రెండు నెలలు నాట్యం అభ్యసించారు. పెన్నెండేళ్ళ వయస్సులోనే తెనాలి, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, గూడూరు వంటి పట్టణాలలో నాటకాలను ప్రదర్శించి వెండి, బంగారు మెడల్స్ ను బహుమతిగా పొందారు.

నాజర్లోని గాత్ర మాధుర్యానికి మరింత మెరుగులు దిద్దిన మహానుభావుడు నర్సరావుపేటకు చెందిన మురుగుళ్ల సీతారామయ్య. ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటూ కడుపు నింపుకోవడానికి ఇంటింటికీ తిరిగి యాచన చేశాడు. తండ్రి మరణంతో చిన్న వయసులోనే బరువు బాధ్యతలను నెత్తిమీదకు ఎత్తుకొన్న నాజర్ వ్యవసాయ కూలీగా, పొగాకు కంపెనీలో ముఠమేస్త్రీగా పనిచేసి కుటుంబాన్ని పోషించారు. పొన్నెల్లులో కుట్టుమిషన్ కుడుతూ గ్రామంలోని యువకులతో పాదుకా పట్టాభిషేకం, ఖల్చీరాజ్యపతనం నాటకాలను ప్రదర్శించారు. తుళ్ళూరులో జరిగిన కమ్యూనిస్టులు సభల పాటల పోటీలలో పాల్గొన్న సంఘటన నాజర్ కళాప్రస్థానాన్ని ఊహించని మలుపులు తిప్పింది. వేయలపల్లి శ్రీకృష్ణ, కొంపనేని బలరామ్ ప్రోత్సాహంతో నాజర్తో రామకోటి, పురుషోత్తం ఒక బృందంగా కలిసి బుర్రకథను నేర్చుకున్నారు. బుర్రకథ ప్రక్రియలో తనకు ఎన్నో సలహాలను ఇచ్చి తన ఉన్నతికి ముఖ్య కారకుడు రామకోటి అని నాజర్ ఆజన్మాంతం సందర్భానుసారం పేర్కొనడం విశేషం. కాకుమారు సుబ్బారావు రచించిన సోవియట్ వీరవనిత టాన్యాకథను బుర్రకథగా మొదట గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలలో చెప్పారు. రెంటపాళ్ల గుడ్దిజంగం కోటి వీరయ్య, జంగం కథ నాజర్ బుర్రకథ ప్రక్రియకు సరికొత్త జవాన్ని జీవాన్ని కలిగించింది.

కాకుమాను సుబ్బారావు లక్ష్మీకాంత మోహన్, రామకోటి, పురుషోత్తం, నాజర్, మోటూరి ఉదయం కలిసి గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలి దళం ఏర్పడింది. రాష్టదళ దర్శకుడైన గరికపాటి, నాజర్, పురుషోత్తం, రామకోటి రాష్టదళంలో సభ్యులుగా తీసుకొన్నారు. రాష్ట్ర దళం ప్రదర్శించిన మాభూమి నాటకంలో దేశ్ ముఖ్ జగన్నాథరెడ్డి, క్రిపురాయబారం వీధిభాగవంతంలో భూపాల్ నవాబు పాత్రను నాజర్ అత్యద్భుతంగా పోషించారు. మద్రాసు ఆంధ్ర మహాసభలో ఏర్పాటు చేసిన బెంగాల్ కరువు బుర్రకథకు సినీ, నాటకరంగ ప్రముఖులందరూ హాజరయ్యారు. ప్రదర్శనను చూసిన సినీనటులు గోవిందరాజుల సుబ్బారావు ప్రదర్శన అనంతరం నాజర్ ను కౌగిలించుకొని ‘ఇది గుంటూరు గోంగూర దెబ్బ’ అని ప్రశంసించారు. ఈ కథను విన్న ప్రముఖ సినీ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం తాను సినీమా కోసం సేకరించిన పల్నాటి చరిత్ర స్క్రిప్టును నాజర్ కు బహుకరించి బుర్రకథగా రచించి ప్రదర్శించమని ఆశీర్వదించారు.
నాజర్ కళారంగ జీవితంలో పల్నాటి వీరచరిత్ర ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. నాలుగు గంటల కథను అసాంతం ఉత్కంఠగా.. ఉద్వేగంగా చెప్పే తీరు ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేసేది. బుర్రకథ చెప్పే సమయంలో వీర, కరుణరసాల ఆవిష్కరణను భారతీయ కళారంగంలో నాజర్ తర్వాత మరొక కళాకారుని చెప్పవలసి వుంటుంది. 1945లో బాపట్ల హైస్కూలు ఆవరణలో బెంగాల్ కరువు కథను నాజర్ చెప్పే సమయంలో ఆ ప్రదర్శనకు వచ్చిన బళ్ళారి రాఘవ ఉబికి వచ్చే దు:ఖాన్ని ఆపుకొంటూ రంగస్థలం పైకి వచ్చి నాజర్ ను కౌగిలించుకొని బావురమని ఏడ్చారట.
1948లో ప్రజా నాట్యమండలిని మద్రాసు ప్రభుత్వం నిషేదించింది. నిరుపేద ప్రజలను సాయుధపోరాటానికి పురిగొల్పుతున్నది. భారత కమ్యూనిస్టుపార్టీ అని, ఆ పార్టీ దేశమంతటా వ్యాప్తి చెందడానికి నాజర్ బుర్రకథలే కారణమని ప్రభుత్వం ప్రకటించిందంటే పాలకుల గుండెల్లో నాజర్ బుర్రకథ ఎంత శక్తివంతమైన శతఘ్నలను పేల్చిందో తేటతెల్లమవుతుంది. ఈ నిషేధ సమయంలో నాజర్ ను పట్టుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒకవైపు పోలీసులు అణువణువునా గాలించారు. నాజర్ కర్లపూడి, నిడుముక్కల, పొన్నెకల్లు గ్రామాలలోని కొండ గుహల్లో అజ్ఞాతవాసం చేశారు. చివరకు కుటుంబ సభ్యులపై పోలీసుల అరాచకారాన్ని తట్టుకోలేక మంగళగిరి క్యాంపులో లొంగిపోయారు. దాదాపు ఆరునెలలు జైలులో మగ్గిపోయారు. 1949లో జైలునుండి విడుదలైన అనంతరం పార్టీతో సంబంధాలను తగ్గించుకొని స్వతంత్రంగా సాంస్కృతిక పయనం సాగించారు. సుంకర సత్యనారాయణ రచించిన అల్లూరి సీతారామరాజు, కష్టజీవి కథలను వందలాది గ్రామాలలో చెప్పి ప్రజలను ఉర్రూతలూగించారు. డాక్టర్ రాజారావు నిర్మించిన పుట్టిల్లు చిత్రంలో సుంకర రచించిన రాణిరుద్రమ్మ బుర్రకథను వీరరసస్ఫోరకంగా చెప్పి మెప్పులను పొందారు. ఈ సమయంలో ‘ఆసామి’ నాటకాన్ని నాజర్ రచించారు. విజయవాడ ఆంధ్ర ఆర్డు సమాజం మాచినేని వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ‘ఆసామి’ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో విన్నకోట రామన్నపంతులు, కొప్పరపు సరోజిని, కొమ్మినేని హైమావతి, రాఘవాపురం అప్పారావు, తమ్మిన రామారావు, కాకర్లపూడి వెంకటరాజు ప్రభృతులు నటించారు. బి.గోపాల సంగీతాన్ని అందించగా నాజర్ దళం నాటకంలో అంతర్భాగమైన బుక్రకథను చెప్పారు. ఆసామి నాటకానికి ఉత్తమ ప్రదర్శనతోపాటు ఎనిమిది బహుమతులు లభించాయి.

నాజర్ రాయలసీమ కరువు, బొబ్బిలి యుద్ధం, వీరాభిమన్యు’ అనే బుర్రకథలను, పిట్టలదొర, నాచేతిమాత్ర అనే ఏకపాత్రను రచించారు. బొబ్బిలియుద్ధం కథను తొలిసారిగా విజయనగరంలో చెప్పే సమయంలో ప్రేక్షకులు తీవ్రంగా ప్రతిఘటించారు. బొబ్బిలి వారి గొప్పలు విజయనగరం వారిమి వినం అంటూ గొడవ చేయడంతో నేను కటష్టపడి సేకరించి వ్రాసిన కథలో ఏవైనా తప్పులుంటే మీరేమైనా దండన విధించండి అని బ్రతిమిలాడి కథను చెప్పారు. బొబ్బిలి, విజయనగర రాజులకు పోరు కోడిపోరు కాదని, పంట పొలాలకు నీరు పెట్టే విషయంలో ప్రారంభమైన ఘర్షణ అని కథలో చెప్పారు. ఈ చారిత్రక సత్యాలతో తొలిసారిగా బొబ్బిలి కథను విజయనగరంలో చెప్పిన తొలి బుర్రకథకునిగా చరిత్ర కెక్కారు.
అగ్గిరాముడు, భలేబావ, నిలువుదోపిడీ, పెత్తందార్లు, సగటు మనిషి చిత్రాలలో బుర్రకథను చెప్పారు. బుర్రకథ కళారూపం ఇంత గొప్పగా వుంటుందనీ నాకు తెలియదు. ఇలాంటి ప్రదర్శన నా జన్మలో చూడలేదని సినీనటి భానుమతి నాజర్ ను వేనోళ్ళ కొనియాడారు. నాజర్ బుర్రకథల్లో సామాన్య ప్రజల నుడికారాలు, సామెతలు, జాతీయాలను పొందుపరిచారు. అంత్యప్రాసలతో కూడిన హాస్యోక్తులతో నవ్వుల జల్లులు కురిపించారు. వారు బుర్రకథకు నాజర్ జీవం పోశారు. కథకుని వేషం, దుస్తులు, రంగులు, నిర్ణయాలు నాజర్ సొంతమని, ఇప్పుడు బుర్రకథలో నాజర్ యుగం నడుస్తుందని శ్రీనివాస చక్రవర్తి ఆంధ్రదర్శిని గ్రంథంలో పేర్కొన్నారు.

కాకినాడలో రథానికి డెబైజతల ఎడ్లను కట్టి పురవీధుల్లో ఊరేగించి స్వర్ణగండపెండేరాన్ని బహూకరించారు. బుర్రకథా సామ్రాట్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఢిల్లీ ఆంధ్రసంఘం ఆహ్వానంపై ప్రదర్శనలిచ్చారు. ఆగ్రా, బొంబాయి, అహ్మదాబాద్, కలకత్తా, టాటానగర్లలో బుర్రకథలు చెప్పి మెప్పించారు. ‘ఎప్పుడూ జనాన్ని నమ్ముకోవాలి. పెద్దలు, ప్రభుత్వాలు అవన్నీ నీ కళకు చెక్క అవార్డులు ఇవ్వడానికి పనికి వస్తారు. కళాకారునికి పట్టెడన్నం పెట్టేది జనం’ అనే ఆత్మవిశ్వాసంతో బ్రతికిన నాజర్ కు శిష్యురాలైన జమున ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. మర్రిచెన్నారెడ్డి, భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రులుగా నాజర్ను ఘనంగా సన్మానించారు.
1981లో ఉగాది వేడుకల్లో సన్మానానికి ముఖ్యమంత్రి టి. అంజయ్య ఆహ్వానించగా నాజర్ వ్రాసిన లేఖ నాజర్ ఆత్మాభిమానానికి అద్దంపట్టింది. “పూజనీయ పేదల బాధలెరిగిన ముఖ్యమంత్రికి కళాభివందనాలు. మహాశయా! మొదటిసారిగా ప్రభుత్వం వేదిక మీదుగా ఆహ్వానించి శ్రీ కాసు సన్మానించి ఓ చిన్న కానుక ఇచ్చారు. అది మెమెంటో అట. నేను లోనికి రాగానే పేరు రాసిస్తానని పట్టుకెళ్లారు. మళ్లీ ఇచ్చిన పాపాన పోలేదు. ఆ తరువాత జలగం వారు చాటంత రేకిచ్చారు. అది తామ్రపత్రమట. ఆ తర్వాత మర్రిమారేడు చెక్క ఇచ్చారు. అది మెమెంటో అట. అయ్యా! దేశంలో కడుపునిండకనే కీర్తి చాలా పోగొంది. ఇప్పుడు నాకు 51 సంవత్సరాలు వచ్చినా ఇంకా నెలకు రెండు, మూడు కథలు చెబితే తప్ప ఇల్లు గడవదు. ఉగాది రోజున బళ్లారి వద్ద పల్లెలో కథ చెప్పడానికి అడ్వాన్స్ తీసుకొన్నాను. అవకాశం వచ్చినప్పుడు వస్తాను’ అంటూ ఉత్తరం వ్రాశారు. 1986 రిపబ్లిక్ దినోత్సవాలలో అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైలసింగ్ చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొన్నారు. 1986లోనే కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ద్వారా అందుకొన్నారు. 1987 ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. నాజర్కు స్వంత ధనం రూ. 5వేలను బహూకరించారు. ముఖ్యమంత్రి హెూదాలో గుంటూరు పర్యటనకు వచ్చిన ఎన్.టి.ఆర్. ను నాజర్ కుటుంబసభ్యులు కలిసి మేము మీ అభిమానులము అని చెప్పారు. దీనికి ఎన్.టి.ఆర్. పూర్వ స్మృతులలోకి వెళ్లి నేను నాజర్గారి ఫ్యాన్నమ్మా అని చెప్పడం అక్కడ ఉన్న అధికారులు, ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది.

పల్లీయుల కథలను, గాథలను చెప్పి నరనరాన ఉత్తేజాన్ని నింపి పరవళ్లు తొక్కించిన నాజర్ తీవ్ర రక్తపోటుతో 1997 ఫిబ్రవరి 22న గుంటూరు అమరావతి రోడ్ లోని స్వగృహంలో కన్నుమూశారు. ‘పద్మశ్రీలు, ప్రభుత్వ పురస్కారాలు అన్నీ కలిపి జనం వేసే ఒక్క ఈలతో సమానం కాదు’ అని చెప్పిన నాజర్ కలం…గళం… పేదల బాధలు ఉన్నంత కాలం గాలికెరటాలలో లీలగా వినిపిస్తూనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap