(కవి, వక్త, సినీగేయరచయితగా సుపరిచితులయిన అదృష్టదీపక్ ‘సప్తతిపూర్తి ‘ చేసుకున్న సందర్భంగా)
తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు అదృష్టదీపక్! అతడు స్నేహార్తితో అలమటించే వారికి ‘ఒయాసిస్సు’లాంటివాడు! ఔషధ విలువలున్న ‘కేక్టస్ మొక్క’లాంటివాడు! స్వయంకృషితో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పైకి ఎదిగినవాడు!
నేను రామచంద్రపురం హైస్కూల్లో చదివేటప్పుడు, అందరినీ ఇంటి పేర్లతోనే పిలుచు కునేవాళ్లం! ఒరేయ్ భావరాజు, గరికిపాటి, కర్రి, నల్లమిల్లి, గోగినేని, ముద్దంశెట్టి, కటకం….. ఇలా ఉండేవి పిలుపులు.
కానీ పేరుతో పిలిపించుకున్నవాడు ఒక్కడే వాడే అదృష్టదీపక్! దీపక్ అనీ, దీపూ అనీ పిలిచేవారు. మేం ఇద్దరమూ ఒకే బెంచీలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. మా యిద్దరికీ కొన్ని కామన్ టేస్టులుండేవి. ఖాళీ సమయాల్లో విద్యార్థులు అందరూ రకరకాల వ్యాపకాలతో ఉంటే, మేము మాత్రం పత్రికలతోనూ, సినిమాకబుర్లతోనూ కాలక్షేపం చేసేవాళ్లం.
అప్పటికే పత్రికలలో వాడు రాసిన చిన్న చిన్న రచనలు అచ్చవుతూ ఉండేవి. ఏవేవో రాయాలనీ, అవి పత్రికల్లో రావాలనీ నాకు కూడా పెద్ద పెద్ద కోరికలు మొదలయ్యాయి. ఈ విషయంలో వాడే నాకు ఇన్స్పిరేషన్!
ఆ వయసులో మేము పంపిన చిట్టి కథల్నీ, హాస్యరచనల్నీ ప్రచురించి జోకర్, బుడుగు, పకపకలు, నవ్వులు పువ్వులు-పత్రికలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాయి. అలా మా రచనా ప్రస్థానం మొదలైంది. ఇంద్రగంటి హనుమచ్ఛాస్తి మాస్టారు ప్రముఖ కవులెందరినో తీసుకొచ్చి మాస్కూల్లో సాహిత్యసభలు ఏర్పాటుచేసేవారు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ ప్రసంగం – మాకేమీ తలకెక్కలేదు. బయటకొచ్చేసి రాజగోపాల్ థియేటర్ లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు చెక్కేశాం! తరువాత ఒకసారి ఆరుద్రను తీసుకొచ్చారు. ఆయన ఉపన్యాసం మాత్రం బాగా ఎంజాయ్ చేశాం!
దీపక్ మేనమామ మంచి కళాకారుడు. మా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన ప్రభావంతో దీపక్ బాలనటుడిగా రంగస్థలం మీద ఎంతో అనుభవం సంపాదించాడు. మా స్కూల్లో ప్రదర్శించే నాటికల్లో ప్రధాన పాత్రధారి మాత్రమే కాదు -దర్శకుడుకూడా వాడే! గొల్లపూడి మారుతీరావు రచించిన ‘అనంతం’ నాటికలో నాచేత వేషం వేయించి, నన్నుకూడా స్టేజ్ ఏక్టర్ని చేశాడు!
హైస్కూల్ చదువు పూర్తయ్యాక వాడు రామచంద్రపురంలోనే ఉండిపోయాడు. నేను కాకినాడ, ఆ తరువాత హైదరాబాద్ వెళ్లిపోయాను. అయినా అప్పటినుంచీ మాస్నేహం మాత్రం చెక్కుచెదరకుండా ఈ రోజు దాకా ఎంతో ఫ్రెష్ గా ఉంది. దీపక్ కాలేజ్ లెక్చరర్ వృత్తిలో కొనసాగాడు. రాష్ట్రప్రభుత్వంవారి ఉత్తమ అధ్యాపక అవార్డు కూడా అందుకున్నాడు. ఉద్యోగ జీవితంలో స్టూడెంట్స్ తో ఏర్పడిన అనుబంధాల ముందు ఈ అవార్డులు, రివార్డులూ ఎందుకూ పనికిరావు అంటాడు. వాడు సాహిత్యం , నాటకాలవైపు మళ్లితే, నేను మేజిక్, మనసత విశ్లేషణారంగాలవైపు మళ్లాను. మేము ఎన్నుకున్న రంగాలలో చేసిన కృషికి గుర్తింపుగా తెలుగు యూనివర్సిటీవారు హైదరాబాద్ లో మా యిద్దరికీ ఒకే రోజు, ఒకే వేదికమీద ‘శ్రీ, పురస్కారాలు యిచ్చి సత్కరించడం ఒక మరపురాని అనుభవం!
అదృష్టదీపక్ సినిమాపాటలు రాస్తున్న విషయం నాకు చాలా రోజుల తరువాత ఇంకా చెప్పాలంటే “మానవత్వం పరిమళించే
మంచి మనసుకు స్వాగతం”
పాట ఆంధ్రదేశాన్ని పరిమళభరితం చేసినప్పుడు మాత్రమే-ఓ జర్నలిస్టు మిత్రుడి ద్వారా తెలిసింది. వెంటనే వాడికి ఫోన్ చేసి “ఏరా-నువ్వు సినిమాలకు పాటలు రాస్తున్నావా?”అని అడిగితే చాలా కూల్ గా అవును అన్నాడు. “ఈసారైనా మొహమాటం విడిచి పెట్టి నలుగురినీ కలుసుకో!” అంటే “అవసరం లేదు” అన్నాడు. “వాళ్లు పిలిస్తే, వెళ్లి రాసి వస్తున్నాను. అడ్డమైన అవకతవక పాటలూ రాయడం నాకు యిష్టం లేదు. నాకు నచ్చితేనే రాస్తాను. నచ్చకపోతే రాయనని చెప్పి వచ్చేస్తున్నాను. అవకాశాల కోసం సినిమా ఆఫీసులచుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు!” అన్నాడు. ఇదీ వాడి మనస్తత్వం!
కవిగా, వక్తగా, సినీగేయరచయితగా, నాటకరంగ న్యాయనిర్ణేతగా, భాషాపరమైన గళ్లనుడికట్టు నిర్వాహకునిగా దీపక్ కు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. (నేను ఎప్పుడూ అదృష్టదీపుడి అభిమానినే!) ఇన్ని ప్రత్యేకతలున్నా దీపక్ ఎప్పుడూ తనగురించి తాను గొప్పలు చెప్పుకోడు. చాలా ‘
లోప్రొఫైల్’ మెయిన్ టెయిన్ చేస్తాడు. డెబ్బైయేళ్ల నిత్యచైతన్య స్ఫూర్తి, మంచిమనసున్న స్నేహదీప్తి-అదృష్టదీపక్ పరిచయం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తాను. సప్తతి నడుస్తున్నవేళ వాడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
-డా. బి.వి.పట్టాభిరామ్