వడ్డాది పాపయ్య చిత్రాలతో ‘వనిత టీవీ ‘ వారు క్యాలెండర్
క్యాలెండర్ కళకు మన దేశంలో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు వస్తున్నప్పటికీ ఈ క్యాలెండర్ కళకు ఆదరణ తగ్గలేదు నేటికీ. కొత్త ఆంగ్ల సంవత్సరం రాగానే ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ గోడలపై కొత్త క్యాలెండర్లు దర్శనమిస్తాయి. వారి వారి అభిరుచిని బట్టి ప్రకృతి చిత్రాలు, పక్షులు, దేవుళ్ళు – దేవతలు, సినీతారలు ఇలా ఎన్నో రకాల క్యాలెండర్లు గోడలపై అలంకరించుకుంటారు.
ఈ క్యాలెండర్ కళకు ఆధ్యుడుగా భారతీయ చిత్రకళా రత్నం రాజా రవివర్మ ను చెప్పుకోవచ్చు. ప్రజల మనసులోని భావాలు, ఆసక్తిని గమనించిన రవివర్మ క్యాలెండర్ పై దేవుళ్ళ బొమ్మలు వేస్తే ప్రజలు ఆదరిస్తారని గ్రహించి, 1892లో నాటి బొంబాయిలో లిథో గ్రఫీ ప్రెస్స్ ను జర్మనీ నిపుణుల సహకారంతో నెలకొల్పాడు.
ఆ ప్రెస్ లో ఆయన చిత్రించిన ప్రఖ్యాత శ్రీరామ పట్టాభిషేకం, లక్ష్మీ సరస్వతి, వినాయకుడు, దుర్గాదేవి తదితర చిత్రాలు వేల సంఖ్యలో ముద్రించి దేశం నలుమూలలా అమ్మకాల జరిపించాడు. ‘అణా ‘కే ఒక వర్ణచిత్రం దొరికేది ఆ రోజుల్లో. ఆ విధంగా ఆయన చిత్రాలన్నీ ప్రజల పూజా మందిరాల్లో కొలువైనాయి. క్యాలెండర్ కళ ద్వారానే ఆ రోజుల్లో రవి వర్మ చిత్రాలు ప్రజలకు చేరువయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత రోజుల్లో ఈ క్యాలెండర్ ముద్రణలో ఎన్నో అధునాతన యంత్రాలు రావడంతో క్వాలిటీ తో పాటే మార్కెట్ కూడా పెరిగింది.
క్యాలెండర్ లో ప్రస్తుతం ఎన్నో రకాలు ఎన్నో, ఎన్నో సైజులు అందుబాటులోకొచ్చాయి. వివిధ వ్యాపార సంస్థలు నూతన ఆలోచనలతో, మన సంస్కృతి- సంప్రదాయాలు, సామాజిక బాధ్యతను గుర్తెరిగి క్యాలెండర్ ను తయారు చేస్తున్నారు. అలాంటి ఓ సరికొత్త ఆలోచనతో ఈ సంవత్సరం ‘వనితా టీవీ ‘ వారు ఓ కళాత్మక క్యాలెండర్ ను రూపొందించి కళాభిమానుల మెప్పుపొందారు.
అదేమిటంటే అంతరిక్షంలో సూర్యుడుతో పాటు నక్షత్రాలు ఉన్న విషయం మనకు తెలుసు. మానవ జీవితంలో ముఖ్యంగా హిందూమతంలో నక్షత్రాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మన జాతకాన్ని, రాశిని నిర్ణయించేది జన్మ నక్షత్రం. అందుకే నక్షత్రాలకు అంతటి ప్రాముఖ్యత. పురాణాలను బట్టి నక్షత్రాలు ఇరవై ఏడు. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. నక్షత్రాలకు భర్త అయిన చద్రుడు 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. విష గడియలు, అమృతఘడియలు నక్షత్రాల్లో ఉంటాయి. నక్షత్రాలు, తిధులు, వారాలకు అనుసంధానం ఉంటుంది. సప్తఋషి మండలంలో ఉన్న అరుంధతి నక్షత్రం ‘సింహరాశి ‘ లా ఉంటుంది. పెళ్లైన వెంటనే నూతన దంపతులకు అరుంధతి ని చూపించడం హిందూ వివాహ సాంప్రదాయాలలో తప్పనిసరి. మన పురాణాల్లో నక్షత్రాలకు సంబంధించి మరెన్నో వివరాలు-విశేషాలు ఉన్నాయి. ఇంతటి చరిత్ర ఉన్న నక్షత్రాలకు సంబంధించి ఒక రూపాన్ని ఇచ్చిన ఏకైక భారతీయ కళాకారుడు మన తెలుగువాడైన వడ్డాది పాపయ్య కావడం మనకు గర్వకారణం. నక్షత్రాలకు సంబంధించిన లక్షణాలు అవగతమైతే గాని రూపం కల్పించే లేరు. బహుశా అందువల్లనే ఏ కళాకారుడు నక్షత్రాల జోలికి వెళ్లలేదు. 27 నక్షత్రాలకు చక్కని రూపు కల్పించడంతోపాటు వాటి లక్షణాలను అంతర్లీనంగా చాటి చెప్పారు వడ్డాది పాపయ్య.
మహిళల ఆత్మ స్థైర్యాన్ని ఇనుమడింపజేసే ఏకైక టీవీ ఛానల్ ‘వనిత టీవీ ‘. వనిత టీవీ ఈ సంవత్సరం ‘నవ వసంతానానికి నక్షత్ర తోరణం ‘ పేరుతో మూడు వేర్వేరు క్యాలెండర్లు 12 పేజీలతో వెలువరించింది. బల్లలపై పెట్టుకోవడానికి వీలుగా ఒకటి, ఎలాంటి ప్రకటనలు లేకుండా గోడకు అలంకరించుకోవడానికి మరొకటి, ప్రకటనలతో మరో గోడ కేలండర్ ను ముద్రించారు. పన్నేండు నెలలలు పన్నేడు నక్షత్రాలను ఎంచుకొని, ఖర్చుకు వెరవక, అందమయిన ఆర్ట్ పేపరు మీద అత్యాధునిక విధానంలో ముద్రణచేసి కళ పై, వ.పా. పై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలో శతజయంతి జురుపుకోనున్న శుభసమయంలో వర్ణ మాంత్రికుడు వడ్డాది పాపయ్య కు ఇది సముచిత నివాళి. వనితా టీవీ యాజమాన్యనికి కళాభిమానులంతా ఋణపడి వుంటారనడంలో సందేహం లేదు.
-సుంకర చలపతిరావు
వనిత టివి వారికి హృదయ పూర్వక అభినందనలు. వపా గారి కళా వైభవాన్ని ప్రేక్షకులకు.. కళాభిమానులకు దగ్గర చేస్తున్నందుకు మరో సారి శుభాభినందనలు.
Thanks to Vanitha TV for their innovation.
Great tribute