విజయవాడ, పి.బి. సిద్ధార్థ కళాశాలలో కేన్సర్ పై స్మారక ఉపన్యాసం
నానో టెక్నాలజీ, ఇతర సాంకేతికతల ద్వారా కేన్సర్ చికిత్సావిధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అదే సమయంలో మలేరియా నివారణకు ఉద్దేశించిన హైడ్రాక్సి క్లోరిన్ (హైడ్రాక్సి క్లోరోక్విన్) కేన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అడ్డుకుంటుందని అమెరికాలోని శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్, కాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యులు డాక్టర్ గంజి పూర్ణచంద్ర నాగరాజు అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జీవశాస్త్రాల విభాగాలు, కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్త నిర్వహణలో జులై 4, శనివారం వెబినార్ హాలులో ఆంధ్రప్రదేశ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ వారి డాక్టర్ బి.వి. రాజు ఎండోమెంట్ లెక్చర్ లో భాగంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సావిధానాలపై ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో విటమిన్ డి, యాంటీ మలేరియా డ్రగ్ లతో క్యాన్సర్ రోగులకు తాము చేసిన చికిత్స ఫలించిందన్నారు. అవాంఛనీయ కణతుల వృద్ధి కేన్సర్ గా పరిణమిస్తుందని, వ్యాధి నిరోధకత సవాళ్లు, జన్యులోపాలు కేన్సర్ వ్యాప్తి కలిగిస్తున్నాయన్నారు. కీమోథెరపీ మందులు ట్యూమర్ లోపలికి చొచ్చుకు పోయేలా, స్ట్రోమాను నిర్వీర్యం చేసేలా ఔషధాలు ఆవిష్కృతం అవుతున్నాయన్నారు. కేన్సర్ కణాల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించే స్ట్రోమాను లక్ష్యంగా చేసుకుని నూతన వైద్య విధానాలు వస్తున్నాయన్నారు.
ముఖ్యంగా దట్టమైన స్ట్రోమా కలిగిన ప్యాంక్రియాటిక్ కణితులను కూడా సమర్థవంతంగా నాశనం చేసే దిశగా జరుగుతున్న వైద్య పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేశ్ మాట్లాడుతూ ప్రజల్లో కేన్సర్ పట్ల అవగాహన మరింత పెరగాలని, ఎక్కడపడితే అక్కడ ఆహారాలు తీసుకునేవారు జాగ్రత్త పడాలన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు మాట్లాడుతూ నోరి దత్తాత్రేయుడు లాంటి ఎందరో వైద్య ప్రముఖులు కేన్సర్ చికిత్సా విధానానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ వారి జీవన సాఫల్య పురస్కారం (లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు)ను డాక్టర్ గంజి పూర్ణచంద్ర నాగరాజు (అమెరికా)కు కృష్ణా వర్సిటీ రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు, ప్రిన్సిపాల్ డా.మేకా రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, వృక్షశాస్త్ర విభాగాధిపతి డా. పి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.లలితప్రియాంక, ప్రముఖ వైద్యులు డాక్టర్ గంజి సీతారామరాజు (దక్షిణ కొరియా) అందచేసి ఘనంగా సత్కరించారు.
