కార్టూన్ కి భావం ప్రధానం. వ్యాఖ్య సహిత కార్టూన్ హాస్యం, వ్యంగ్యాలని తొక్కొలిచి పండునిచ్చి నవ్విస్తుంది. వ్యాఖ్యరహిత కార్టూన్, సైలెంటుగా వుండి ఆలోచింప చేస్తుంది. పాఠకుడే దాని వ్యాఖ్యను తనకు తోచిన విధంగా తన మనసులో రాసుకుని ఆనందిస్తాడు.
రాతల్లేని గీతలతో ‘నవ్యించే’ కార్టూన్లు: కాప్షన్లెస్ కార్టూన్ గీయాలంటే అదేమంత సులభమైన పని కాదు. అందుకు మేధోమధనం చేయాలి. మాట పలుకు లేకుండా భావం చేతివేళ్ళూపి, కళ్ళు కదిపి, తలాడించి సంజ్ఞల ద్వారా చూపరికి వ్యక్తం చేయవచ్చు. అదే బొమ్మ ద్వారా చెప్పాలనుకుంటే, కార్టూనిస్టుకి బొమ్మ మీద మంచి పట్టుండాలి. అలాగని చిత్రకళా పాండిత్యాన్ని ఒలకబోయాల్సిన అవసరం లేదు.
విదేశీ సైలెంట్ కార్టూన్లు పరిశీలిస్తే మనకి అవగతమయ్యే అంశం ఒఖ్ఖటంటే ఒక్కటే. “టు ది పాయింట్ ” భావం. అనవసరమైన పాత్రలో, వస్తువులో ససేమిరా కనిపించవు. అంటే ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని సూటిగా కంటికింపైన గీతలతో చెప్పడమే తప్పించి డొంక తిరుగుళ్ళుండవు. సైలెంట్ కార్టూన్ లక్షణమే ఇది.
సైలెంట్ కార్టూన్లు ఆబస్ట్రాక్ట్ వి, నాన్సెన్స్ వీ వున్నాయి. ఈ రెండు రకాల వాటిల్లో అర్ధం పర్ధం లేని భావాలు ఇమిడి వుంటాయి. అసహజాన్ని శిఖరాగ్ర స్ధాయిలో చూపిస్తాడు కార్టూనిస్టు. అసలు సిసలు సైలెంట్ కార్టూన్ ప్రధానంగా సందేశాత్మంగా వుంటుంది. వేయి పుటల పుస్తకంలో రాయలేనిది, మూడుగంటల ప్రసంగంలో చెప్పలేనిది కార్టూనిస్టు ఒక చిన్న బొమ్మలో కూర్చి పాఠకుడిని సంభ్రమాశ్చర్యాలకి గురిచేస్తాడు. కళ్ళు తెరిపిస్తాడు. తప్పుచేసినవాడికి చెంపచెళ్ళు మనిపిస్తాడు. నీతి బోధిస్తాడు. లేదా కవిత వల్లిస్తాడు.
కార్టూనిస్టుల్లో ముఖ్యంగా, గ్యాగ్, బాక్స్, స్ట్రిప్, కామిక్ రకాల కార్టూనిస్టులు, పొలిటికల్, సెమి పొలిటికల్ , జోక్ అంశాలమీద క్రుషి చేస్తారు. పత్రికల్లో ఈ కార్టూన్లకే ప్రజాదరణ ఎక్కువ. మూడు నాలుగు సెకన్ల పాటు పాఠకుడు వాటిమీద ద్రుష్టి నిలిపి పేజీలు తిరగేసి ముందుకు సాగి పోతాడు. కాసేపు హాయిగా నవ్వుతాడు. మరిచిపోలేని కార్టూనైతే, దాన్ని మిత్రులతో పంచుకుంటాడు, మరోసారి నవ్వుతాడు.
సైలెంట్ కార్టూన్ లో హాస్యం మోతాదు తక్కువ. వ్యంగ్యం మోతాదు ఎక్కువ. ఆ వ్యంగ్యం తో అంటిపెట్టుకున్న నీడలా, సందేశం కనిపిస్తుంది. అది చిన్న తరహా వెకిలిదీ కావొచ్చు…పెద్ద తరహా ‘సీరియస్’దీ కావొచ్చు.
సాధారణంగా సైలెంట్ కార్టూనోభిలాషులు జనం లో తక్కువ . అయితే , వారికి ఓపిక ఎక్కువ. ఆవిధంగా ఓపికెక్కువుండి చప్పట్లు కొట్టే వాళ్ళకోసమే , కాషన్లెస్ కార్టూన్ చిత్రకారుడు గంటలకొద్దీ , రోజులకొద్దీ శ్రమిస్తాడు. ముఖ్యంగా పోటీల్లో పాల్గొనేప్పుడు, వారాల తరబడి, బొమ్మలు గీసీ, చెరిపీ, ఒకటికి పదిమారులు చూసుకునీ గాని ఉపక్రమించడు.
పోటీ ‘టైటిల్ ‘అనుసరించి కార్టూనిస్ట్ పని చేయాల్సి వుంటుంది. ఒక్కోసారి పని అతిసులభం అనిపిస్తుంది కూడా. ఒక విదేశీ కార్టూన్ పోటీ టైటిల్, sand (ఇసుక). బీటవారిన ప్రదేశంలో ఒకడు బోర్ పంప్ కొడుతుంటాడు. నీటికి బదులు ఇసుక రాలుతుంది. “హానరబుల్ మెన్షన్” కి, నేను గీసిన కార్టూన్ ఎంపికైంది. అయిడియా తట్టిన అరగంటలో ఈ కార్టూన్ గీసేశాను. ఈమెయిల్ సౌకర్యం లేని రోజులవి. మంచి క్వాలిటీ పేపర్ తెచ్చుకుని, బొమ్మ గీసి, కలరింగ్ చేసి, జాగ్రత్తగా ప్యాక్ చేసి, పోస్ట్ చెయ్యడానికి రోజు పట్టింది.
కాప్షన్లెస్ కార్టూన్ గీయాలనుకునే కార్టూనిస్ట్, బొమ్మలు సాధన చేయాలి. విదేశీ కార్టూన్లు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. తన గీతలతో ప్రయోగాలు చేసి చూసుకోవాలి. ఉదహరణకి ఒక టైటిల్ తానే ఎంచుకుని కార్టూన్ వైవిధ్యంగా గీయగలమా ప్రయత్నం చేసి తన విద్వత్తునే, పరీక్షించు కోవాలి. మిత్రులకి చూపించి పోటీలో నెగ్గగలమా తేల్చుకోవాలి.
గ్యాగ్ కార్టూన్లు గీస్తూ, సైలెంట్ కార్టూన్ కి రావాలంటే , ముందు ప్రయత్నంగా, స్ట్రిప్లు గీసి చూసుకోవాలి. ఈ మూడు బాక్స్ ల కోవిడ్ కార్టూన్ ఆలాంటిదే. ఇందులో సందేశం లేదు. హ హ హ, నవ్వు మాత్రమే, ఆ లావుపాటి అమ్మాయి ని చూసి. (ఇది పాత అయిడియానే. కోవిడ్ కి అన్వయించి గీసిన కొత్త అయిడియా.) ఇలా రక రకాలుగా ఆలోచిస్తూ గీసుకుంటూ పోతే నెమ్మదిగా గాడిలో పడిపోవచ్చు.
మన తెలుగు కార్టూనిస్టులు దాదాపు తొమ్మిది వసంతాలుగా మామూలు కార్టూన్లు మాత్రమే గీసుకుంటూ సాగుతున్నాం. మనం తిన్నగా మారాలి. త్వరలో తెలుగు కార్టూన్ శతసంవత్సరోత్సవం జరుపుకో బోతున్నాం. సమయం ఆసన్నమైంది. మనమే అర్ధం చేసుకోగలిగే కార్టూన్లతో బాటు, ప్రపంచంలోని అన్ని భాషల వాళ్ళూ మన కార్టూన్లని మెచ్చుకోవాలన్నదే నా ఆశ.
శుభం భూయాత్ .
–జయదేవ్
కళాసాగర్ గారూ.. ఇటువంటిదే నేను అందరి వద్దనుండీ కోరుకొంటోంది.. మీ దగ్గర నుండి అనుకోకుండా వచ్చింది. అదే.. కాప్షన్ లెస్ కార్టూన్ల గురించి.. అదీ జయదేవ్ గారి నుంచి.. Excellent.. ఎవరి దగ్గరనుండి ఏమి చెప్పించాలో అది చెప్పించారు. కార్టూన్లు అందరూ వేస్తున్నారు. కానీ మన స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగేది కాప్షన్ లెస్ కార్టూన్లు మాత్రమే.. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది నేను నమ్మే సత్యం. జయదేవ్ గారు దానికి బలం చేకూర్చారు. ఆయన ఎంత విపులంగా చెప్పారంటే, ప్రతి కార్టూనిస్టు ఇప్పుడు కాప్షన్ లెస్ కార్టూన్ గురించి ఆలోచించవలసిందే.. థాంక్యూ.. కళాసాగర్ గారూ. మంచి రచన అందించారు. చివరలో మా కార్టూన్లు ఇవ్వడంతో నాకు మరింత ఉత్సాహం వచ్చింది.. ఏంటో ఆనందం వేసింది. చాలా గర్వం కూడా వేసింది. నాకు నా బాధ్యత గుర్తు చేసింది . మనవాళ్ళని మనమంతా కార్టూన్ లెస్ కార్టూన్లు వేయించే వైపుకు drive చేయాలి. తెలుగు కార్టూనిస్టులు ప్రపంచం లో ఏ పెద్ద కార్టూనిస్టుకు తక్కువకాదు అనిపించాలి. అది నా కోరిక.. మీలాగే అందరూ ఈ వైపుగా ఆలోచించాలి. All the Best .. తెలుగు కార్టూనిస్ట్..
చాలా బాగుంది