మురళీధర్ ‘క్యారికేచర్స్’ డెమో

విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘మోటివేషనల్ ప్రోగ్రాం” కార్యక్రమంలో భాగంగా జూన్ 12, ఆదివారం విజయవాడ నల్లూరి వారి కళ్యాణ మండపంలో ప్రముఖ క్యారికేచరిస్టు కార్టూనిస్టు అచ్యుతన్న మురళీధర్ గారు క్యారికేచర్ విశేషాలు, చరిత్ర, తమ అనుభవాలను హాజరైన చిత్రకార మిత్రులతో, కార్టూనిస్టులు, సాహితీ వేత్తలతో పంచుకున్నారు. కొన్ని రాజకీయ నాయకుల క్యారికేచర్స్ అలవోకగా వేసి ఆహుతులను ఆశ్చర్యచకితులను చేశారు.

కళాకారుల మధ్య సంబందాలను పెంపొందించడానికి, చిత్రకళా నైపున్యాలను ఒకరి నుండి ఒకరు అందిపుచ్చుకోవడానికి, ప్రేరణ పొందడానికి విజయవాడ ఆర్ట్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా ఇటీవల దివంగతులైన ప్రఖ్యాత చిత్రకారులు కీ.శే. శీలా వీర్రాజుగారు, కీ.శే. చల్లా కోటి వీరయ్యగార్ల చిత్ర పటాలకు పాల్గొన్న అందరూ పుష్పాంజలి సమర్పించి నివాళు లర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సాహితీవేత్త, చిత్రకారుడు పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారు క్యారికేచర్స్ గురించి కార్టూన్స్ గురించి తమ అనుభవాలతో చక్కని సందేశాన్ని ఇచ్చి అందరిని అలరించారు. పాల్గొన్న చిత్రకారులు, కార్టూనిస్టులు వారి స్పందనను తెలియజేసారు.

విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు అల్లు రాంబాబుగారు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారు, ట్రెజరర్ ఆరేపల్లి అప్పారావుగారు, ఉపాధ్యక్షులు పావులూరి చిదంబరంగారు కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్ గారు, స్ఫూర్తి నివాస్ గారు, రవికుమార్ గారు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆహుతులు ప్రముఖ చిత్రకారులు పినపాక సత్యనారాయణమూర్తిగారు,మాచెర్ల బాబ్ది గారు, మోడరన్ చిత్రకారులు అలెగ్జాండర్ గారు, కార్టూనిస్టులు రావెళ్ళ, బొమ్మన్, ఆదినారాయణగార్లు సాహితీవేత్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Artists and cartoonist
SA:

View Comments (2)