ప్రయోగాత్మక మైన కరోనా వైజ్ఞానికగ్రంథం

“ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతమాత చెట్టు నీడలోకొచ్చి, వీడలేనంటు…” భారత దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొని పట్టువదలని విక్రమార్కుడిలా మన మధ్యనే వుంటూ మనకి కనిపించకుండా మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపింపజేస్తూ ఆయుధాలేవి లేకుండా మనతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధ వాతావరణంలోనే మనకు ఎన్నో గుణపాఠాలని నేర్పించింది కరోనా. అటువంటి కరోనా ఆత్మకథని వైద్యశాలే దేవాలయంగా, రోగులే దేవుళ్ళుగా భావించే కవితా శస్త్ర ప్రవీణులు డాక్టర్ రమణ యశస్వి గారు రాసిన “కరోనా ఆత్మకథ” దీర్ఘకావ్యం చాలా ప్రయోగాత్మకంగా ఆయన సృష్టించిన అద్భుతమైన కవితా ప్రక్రియ. పేరుకి ఇది ధీర్గకావ్యమైనా ఇందులో అనేక కవితా ప్రక్రియలున్నాయి. అంటే “వచన, గేయ, పాట, పేరడీ, వ్యాసం” ఇలా అనేక రూపాల్లో కరోనా మహమ్మారి యొక్క వికృత చేస్టలు, ఇంకా మానవుడు ప్రకృతిని, పంచభూతాలను నాశనం చేస్తున్న తీరుని చాలా అద్భుతంగా మలచి చెప్పారు. ఇంకా తిలోదకాలిచ్చిన సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ బంధాలను, సామాన్యుని ఆకలికేకలను, ఇంకా పర్యావరణ విద్వoస కులకు, చక్కని చురకలు వేస్తు కరోనా ఆత్మ రూపంలో మానవునిలో ప్రవేశిoచి మనకి నేర్పించిన గుణపాఠాల్ని ఈ వైజ్ఞానిక గ్రంధంలో కళాత్మకంగా తీర్చిదిద్దారు. పలికెడిది కరోనా, పలికిoచిoది డాక్టర్ రమణ యశస్వి గారి కలం కత్తిగా మారి.

“కరోనాతో యుద్ధం, యుద్ధం మనము మౌనంగానే చేయుటకు సిద్ధం, సిద్ధం… ” అంటూ కవితలని ఆయుధాలుగా చేసుకొని కరొనపై యుద్ధం మొదలుపెట్టారు ఈ కవి డాక్టర్.
మొదటి కవితలో ఉరుములు లేని పిడుగులా ప్రవేశించి విధ్వoసo సృష్టిస్తు, జనజీవనాన్ని అతలాకుతలo చేస్తుంది. అందుకే నరుడు విశ్వనరుడై కరోనా(“కఠిన రోదన నాశము”) ని ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు కవి. / “నా జన్మ రహస్యం” కవితలో కరోనా ఆత్మ మాట్లాటం అద్భుతం. ఇందులో ప్రకృతిని స్త్రీతో పోల్చి స్త్రీ లోని అందాలు ఈశ్వర విరచితాలే అంటూ “చంపేది ఎవడురా, చచ్చేది ఎవడురా! శివుడాజ్ఞా లేనిదే చీమయినా కుట్టదురా” అని కవి అన్నారు. ” కాని నేను మాత్రం ఎవరి ఆజ్ఞ లేకుండానే నేను పుట్టాను లోకం ఏడ్చింది, నేను కుట్టాను లోకం చచ్చింది” అంటూ “నేను వూహన్ లో పుట్టాను గబ్బిలంగా వున్న నన్ను నానా రకాలుగా హింసించి తినేస్తుంటే నాలోని నిర్జీవ కణాలు బయటకొచ్చి మానవునణ్ణి వెంటాడి, వేటాడి చంపేస్తున్నాయి. నేను సైకోయిష్టుని ” అంటూ కరోనా జన్మ రహస్యాన్ని చాలా చక్కగా చెప్పి డాక్టర్ గా తన పరిశోదనని మన కళ్ళముందుంచారు.

అయన వైద్యపరంగా ఎంతో పరిణతి చెందిన డాక్టర్. అంతకు మించి కవిత్వపరంగా ఈ కరోనా ఆత్మ కథతో మాటల కందనంత గొప్పగా ఆకాశమంత ఎత్తు ఎదిగారు. కరోనా పెను సవాల్ విసిరితే కవి కలo పెన్నుతో పెను సవాల్ విసిరిoదనే చెప్పాలి. / “నా జన్యుపఠనం” కవితలో ఊహకందని రీతిలో పుట్టిoదో పుట్టి ముంచిoదో ఆ గబ్బిలాలకే ఎరుక అంటూనే గబ్బిలo నుంచి వచ్చిందని తేలింది. దీనికి శాస్త్రవేత్తలు మందుకనిపెడుతున్నారని చెప్తుంటే ” మీరు ఏం కనిపెట్టినా నా మూలాల్ని ఏమి చెయ్యలేరు హా.. హా..హా..” అంటూ వికట్టహాసo చేస్తూ ఆత్మ చెప్పడం ఈ కవితకి హైలెట్. ఇంకా కరోనా ఆత్మ ఇలా చెప్తుంది, “మీ అనారోగ్యానికి నేను భరోసా, నాకు మానవులంతా ఒక్కటే. మీరు పంచభూతాలను ప్రేమించి పూజించేవరకు నేను మీ వెన్నంటే వుంటాను. కాని ‘మానవత్వం పరిమళించె మoచి మనసుకు స్వాగతం. బ్రతుకు అర్ధం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం… ” అంటూ కరోనా ఆత్మ చిన్న సడలింపు నిచ్చింది. /

“కరోనా స్వగతం” కవితలో కరోనా మరణించిన మనిషి శరీరంలో పరకాయ ప్రవేశం చేసింది. అతను ఓ గొప్ప వైద్య కోవిదుడు అంటూనే వారి ఆత్మ సౌందర్యం చాలా గొప్పది అంటూ ఇలా పాట రూపంలో…. “అపురూపమైనదమ్మా డాక్టరు జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత నన్ను (కరోనాని) పారద్రోలడమేనమ్మా. పేషెoటు బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, చేయి తిరిగిన శస్త్ర చికిత్సా నిపుణులు ఈ డాక్టర్ ” అంటూ అభివర్ణించింది. ఇంకా అయన తన గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. తాను వారి శరీరంలో చాలా రోజులుండడం వల్ల సామాన్య మానవుని ఈతి బాధల్ని కథలు, కవితలుగా నా ఆత్మకథలోకి తీసుకున్నారు. ఇటువంటి మానవతా మూర్తులవల్లే ఈ భూమాత ఇంకా మనుగడ సాగిస్తుందని కరోనా ఆత్మతో చెప్పించడం ఈ కవి + డాక్టర్ కలం, కత్తి ఎంతపదునైనవో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇంకా ఈ కవి పంచభూతాల మనోవేదనను, వలస జీవుల వెతలు కంట తడిపెట్టే విధంగా పూసగుచ్చినట్లు చెప్తుంటే “సాపాటు ఎటులేదు పాటయినా పాడు బ్రదర్… చావు కూడ పెళ్ళి లాంటిదే బ్రదర్..” అంటూ ఈ కవి రాసిన కవితని చుసిన కరోనా ఆత్మ వలవలా ఏడ్చానని చెప్పడం ఈ కవితకి మరో అద్భుతమైన మలుపు. / ఇంకా “రూకలు రాలిన రెక్కలు”లో వలసపోయిన వలస పక్షులు లాగా రైతులు కూడ వలస జీవాలుగా మారి గమనం లేని గమ్యానికి వెళ్లి పడ్డ కష్టాలను, ఆకలి కేకలను అద్భుతంగా చెప్పి మానవతా సౌరభాలు వెదజల్లారు.

అలాగే “సైనికులకి వైద్యులకి తేడాలు /తొలి ఆకలి రుచి/ కరోనా గ్రహం/ మనిషి స్వాగతం”/ కవితల్లో మానవుని విధి విధానాలు చాలా చక్కగా తెలియజేసారు. ఇంకా ప్రకృతి పర్వదినమైన “శార్వారి ఉగాది సందేశం” కవితలో షడ్రుచుల సమ్మేళనాల శార్వరి ఈసారి చేదు మాత్రలని మిగిల్చి జాతీయ విపత్తుని మోసుకొచ్చి గుణపాఠాలు నేర్పింది అంటారు. ఇంకా “అదివో అల్లదివో శ్రీహరివాసము…” అన్న చందాన ‘అదిగో అల్లదిగొ కరోనా మృత్యుకన్య’ అని చెప్తూ జలుబుగా మన శరీరంలోకి ప్రవేశిoచి చివరికి ఐ సియు.లో ఐసు ముక్కని చేసి అనంత లోకాలకి పంపిందని ఎంతో హృద్యoగా చెప్పారు.

“మనసు అద్దం పగిలిన శబ్దం” కవితలో “ఆగదు, ఆగదు కరోనా రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసినా… ఆఆ…కరోనా మృత్యువు రాక ఆగదు ” అన్న పాట చందాన కరోనా విషపు గాలి సోకి మనుష్యులు ఎంత పోరాడినా కోవిడ్ ఆగ్రహం తగ్గట్లేదు. అద్దం పగిలిన శబ్దంలాగా మృత్యు శకటంలోకి నెట్టివేస్తు “కొరివి కూడ పెట్టనివ్వని భూతాన్ని చూసి మౌన మునిలా ఉండాల్సివచ్చింది…” అన్న ఈ వాక్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాయి.

ఈ కవి పుంగవునికి శ్రీశ్రీ గారంటే ఎనలేని అభిమానం. సప్త స్వరాలు పలికితే ఎంత అద్భుతంగా వుంటాయో అంతకంటే అద్భుతoగా శ్రీశ్రీ గారి మీద చక్కని వ్యాసం రాశారు. శ్రీశ్రీ గారి సాహిత్యాన్ని కరోనాతో మిళితo చేసి అద్భుతంగా మలచారు. ఆరోగ్య వ్యవస్థలో డొల్లతనంపై పాలకులకు శ్రీశ్రీ సిరాచుక్క వేగుచుక్కలా కలం టీకాలతో మానవులకు ప్రజారోగ్యం అందేది” అంటూ అద్భుతమైన పదాల కూర్పుతో శ్రీశ్రీని మళ్ళీ పుట్టించారు. ఈ దీర్ఘకావ్యంలో మరో అద్భుతం బుజ్జి బుజ్జి కవితల్తో చక్కని ఆరోగ్య అవగాహన కలిగించారు. ప్రకృతి ప్రాణమిల్లిన అనుభూతితో కవి గారి మాటల కోటలో నుంచి జాలువారిన రసగుల్లాలు చుడండి — డబ్బు కన్నా- సబ్బు గొప్పది / కాలుష్యం కన్నా – మబ్బు గొప్పది / జీవన నావ కన్నా – జీవ నది గొప్పది/ అన్ని గొప్పలని – గొప్పగా చూపించిన – కరోనా ఆత్మ గొప్పది. / ఇవి ఎంత గొప్ప ఆరోగ్య నగ్న సత్యాలు !

ఈ సాహితీ పిపాసి ఎవరు చేయనటువంటి మరో అద్భుతమైన ప్రయోగం చేశారు. ఇందులో కలహభోజుడు నారదుణ్ణి ప్రవేశ పెట్టడం అద్భుతమైన ప్రక్రియ. అలాగే కరుణ అనే అమ్మాయిని కాష్మోర క్షుద్ర పూజలకు బలి చేస్తుంటే తప్పించుకొని శంకరుని వరం కోరి కంటికి కనిపించని కరోనాగా రూపాoతరo చెంది మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపింపజేస్తూ “అందమైన లోకమని రంగురంగు లుంటాయని అందరు అంటుoటారు అది అంత అందమైoది కానేకాదు ఓ మానవా !” అంటూ కరోనా జన్మరహస్యాన్ని చెప్పడం ఈ కావ్యానికి గొప్ప మలుపు.

ఇంకా ఈ సాహితీ సృజనశీలి పెన్నుతో తెలిసిన విద్యని అక్షరమాలతో, కరోనాపై అవగాహనతో చక్కని పదాలతో ‘అ నుండి క్ష’ వరకు గల అక్షరాలతో ఆరోగ్య ఆణిముత్యాలని పొందుపరిచారు. స్వీయ రక్షణ పొందే విధంగా వీటిని తు.చ. తప్పకుండ పాటిస్తే కరోనా కాదు కదా కరోనా తాతమ్మ కూడ మన చుట్టు పక్కలకి కూడ రాదు. ఇలా ఎన్నో అమూల్యమైన విషయాలను ఈ కావ్యంలో భద్రపరచి కరోనా వైరస్సుతో కవి మానవునికి పాఠాలు, గుణపాఠాలు రెండు నేర్పించారు. ఇంకా ప్రతి అంశానికి చక్కని బొమ్మలతో, కార్టూన్స్ తో కూడ చక్కని అవగాహన కలిగిస్తు ఈ కావ్యాన్ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఈ “కరోనా ఆత్మకథ” ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన అద్భుతమైన దీర్ఘకావ్యం. ఈ కావ్యం నేటి తరానికి, ముందు తరాలకు కూడ ఎంతో ఉపయుక్తoగా ఉండి పరిపూర్ణ ఆరోగ్యకావ్యంగా దీనిని అభివర్ణిస్తున్నాను. ఇంత చక్కని, సుమధుర ఆరోగ్య అవగాహన కలిగించే కావ్యాన్ని మానవాళికి అందించిన కళారత్న డాక్టర్ రమణ యశస్వి గారికి అభినందన చందన మందార మాలలు, నమస్సులు.

డాక్టర్ రమణ యశస్వీ గారు , ఫోన్ : 9848078807
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్ / ప్రజాశక్తి బుక్ హౌస్ అన్ని బ్రాంచీలు.

పింగళి. భాగ్యలక్ష్మి,
కాలమిస్ట్, రచయిత్రి.
ఫోన్ నెంబర్. 9704725609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap