కార్టూన్ కళ అంతరించిపోకుండా పత్రికలు, సేవాసంస్థలు కార్టూన్ల పోటీలు నిర్వహిస్తూ కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం ఎంతో శుభపరిణామని సుప్రసిద్ధ కార్టూనిస్టు ఏవిఎమ్ అన్నారు. మల్లెతీగ సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ నిర్వహిస్తున్న కార్టూన్లపోటీ గోడపత్రికను శుక్రవారం(6-01-2023) విజయవాడ- మల్లెతీగ కార్యాలయంలో ఏవిఎమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కార్టూన్లంటే అందరూ ఇష్టపడతారు కానీ కార్టూన్ కళలో నిష్ణాతులైన వారి సంఖ్య తెలుగులో తక్కువగా వుండటం బాధాకరమన్నారు. కార్టూన్ కళతో జీవించాలనుకుంటున్న వారికి ఆ రంగంలో పూర్తి అవకాశాలు లేకపోవటమే అందుకు కారణమన్నారు. పాఠకులు ఎంతో ఇష్టంగా ఆస్వాదించే కార్టూన్ కళ అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత సేవాసంస్థలతో పాటు ప్రభుత్వంపై కూడా వుందన్నారు.
విద్యార్థి దశనుండే కార్టూన్ కళను నేర్పించేందుకు విజయవాడలో కార్టూనిస్టు నాగిశెట్టి ఆధ్వర్యంలో కార్టూనిస్టుల బృందం పాఠశాలలకు వెళ్ళేందుకు ఒక కొత్త కార్యాచరణ రూపొందించారన్నారు. ఈ కార్టూన్ ఉద్యమంలో పాల్గొనేందుకు కార్టూనిస్టులు మురళీధర్, కళాసాగర్, డాక్టర్ రావెళ్ళ, శ్రీమతి పద్మ, పద్మదాస్ ముందుకొచ్చారన్నారు. కార్టూన్లపోటీ నిర్వాహకులు కలిమిశ్రీ మాట్లాడుతూ- అత్యుత్తమ కార్టూన్ కు 10 వేల రూపాయలు, ఉత్తమ కార్టూన్ కు 5 వేల రూపాయలు, 500 రూపాయల చొప్పున 10 మందికి ప్రత్యేక బహుమతులుంటాయన్నారు. కార్టూన్ల బహుమతుల్ని ఘంటా విజయకుమార్ తన అర్ధాంగి ఇందిరా జ్ఞాపకంగా సమర్పిస్తున్నారన్నారు. కార్టూన్లు పంపేవారు malleteega@gmail.com మెయిల్కు ఫిబ్రవరి 5వ తేదీలోగా పంపాలి. పూర్తి వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో హాస్యానందం రాము, జర్నలిస్టు చొప్పా రాఘవేంద్రశేఖర్ పాల్గొన్నారు.