సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేవి కార్టూన్లే  …

విజయవాడ లో వంద మంది కార్టూనిస్టుల  కార్టూన్ ప్రదర్శన, తెలుగు కార్టూనిస్టుల సంఘావిర్భావ సంబరం…

……………………………………………………………………………………………

సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే గొప్ప ప్రక్రియ కార్టూన్ కళ అని రచయిత, పోలీసు అధికారి డా.కె. సత్యనారాయణ అన్నారు. స్థానిక గవర్నరుపేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కాన్ఫరెన్స్ హాలులో మల్లెతీగ-తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ సంయు క్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమతి ఘంటా ఇందిర స్మారక కార్టూన్లపోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం మరియు కార్టూన్ల ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 11 గంటలకు 100 మంది తెలుగు కార్టూనిస్టుల కార్టూన్లతో ఏర్పాటు చేసిన కార్టూన్ల ప్రదర్శనను డా.సత్యనారాయణ ఐపిఎస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- దినపత్రికల్లో, వార పత్రికల్లో కార్టూన్ల ప్రాధాన్యత ఎంతో వుందన్నారు. ఏ పత్రికైనా అందులో పాఠకులు ముందు చూసేది కార్టూన్లేనన్నారు. సమస్యలు పెరిగే కొద్దీ కార్టూనిస్టులకు ఐడియాలు పెరుగుతాయన్నారు.

తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ కార్యదర్శి కళాసాగర్ మాట్లాడుతూ కార్టూన్ కొన్ని కళల సమాహారం అని, ఒక చిన్న కార్టూన్ వేసి నవ్వించడానికి ఒక కార్టూనిస్టు కి చిత్రకళలో ప్రవేశం, భాష మీద పట్టు, మన సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన సమస్యల మీద అవగాహన వీటితోపాటు సామాజిక స్పృహ కూడా ఉండాలన్నారు. ఇలాంటి భావుకత కలిగిన వంద మంది కార్టూనిస్టుల ఆలోచనల నుండి పుట్టిన వ్యంగ్య చిత్రాల సమాహారంతో ‘తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ ‘ విజయవాడ లో నిర్వహిస్తున్న తొలి కార్టూన్ ప్రదర్శన నేడు ఏర్పాటు చేసామన్నారు.

ప్రస్తుతం ప్రింట్ మీడియా కు ఆదరణ తగ్గుతుందని, దాని స్థానంలో సోషల్ మీడియా పుట్టుకొచిందన్నారు. కాబట్టి కార్టూనిస్టులు సోషల్ మీడియా వైపు మరలి  వెబ్ పత్రికలు, ఫేస్బుక్,  ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సామాజిక మాద్యమాల ద్వారా తమ కార్టూన్లను ప్రజలకు చేరువచేయాలన్నారు. కాలానికనుగుణంగా కార్టూనిస్ట్ అధునిక సాంకేతికతను అందిపుచుకోవాలన్నారు.   తలిశెట్టి రామారావు గారి తొలి తెలుగు కార్టూన్ భారతి పత్రికలో ప్రచురించబడి 2020 నాటికి 90 యేళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంగా 90 మంది కార్టూనిస్టుల పరిచయాలతో ఒక పుస్తకం తీసుకొచ్చే ప్రయత్నం లో వున్నా అన్నారు.

ఈ ప్రదర్శనలో తొలి తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు, బాపు, జయదేవ్, సత్యమూర్తి, బాలి, రాగతి పండరి, చంద్ర, బాబు, సరసి లాంటి సీనియర్ కార్టూనిస్టు లే కాకుండా నేటి వర్ధమాన కార్టూనిస్టులు నాగిశెట్టి ధీరజ సంతోష్ కౌటం, ప్రేమ, హరికృష్ణ, రవి ప్రసాద్, కిరణ్ ల కార్టూన్లు ఇందులో ప్రదర్శిస్తున్నామన్నారు.

అనంతరం సహాయ కార్యదర్శి రావెళ్ళ శ్రీనివాసరావు రెండు రాష్ట్రాలనుండి వచ్చిన కార్టూనిస్టుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన కార్తూనిస్టులకు వర్క్ షాప్ లు, డిగిటల్ మీడియా గురించి శిక్షణా తరగతులు లాంటివి నిర్వహించాలని పలు సూచనలు చేసారు.

సాయంత్రం 5 గంటలకు పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ శంకర్స్ వీక్లీలో శంకర్   కార్టూన్లకు ఆ రోజుల్లో ఎంతో అదరణ వుండేదని, నెహ్రు లాంటి నాయకులు కార్టూన్లను ప్రోత్సహించే వారన్నారు. కార్టూనిస్టులకు అదరణ తగ్గుతున్న సమయలో ‘తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ ‘ ఇలాంటి ప్రదర్శనను ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. అనంతరం కార్టూనిస్ట్ సుభాని ని సత్కరించి జ్ఞాపికను అందజేసారు. విజయవాడ ఆర్ట్ సొసైటి తరపున అద్యక్షులు అల్లు రాంబాబు, అక్కల రమేష్, అబ్దుల్లా, గంగాధర్ లు కూడా  కార్టూనిస్ట్ సుభాని గారిని సత్కరించారు. ఆత్మీయ సత్కారం అందుకున్న డెక్కన్ క్రానికల్ కార్టూనిస్ట్ సుభాని మాట్లాడుతూ- పత్రికల్లో కార్టూనిస్టుల పాత్ర కీలకమని, ఈ రంగంలో పొలిటికల్ కార్టూనిస్టులకు మంచి అవకాశాలు వున్నాయని అన్నారు. కార్టూనిస్టులు అప్డేట్ కావాల్సిన అవసరం వుందన్నారు. ప్రత్యేక అతిథి గా సినీనటులు జెన్నీ హాజరయ్యారు. ఆత్మీయ అతిథి, బహుమతీ ప్రదాత ఘంటా విజయకుమార్ మాట్లాడుతూ- కార్టూనిస్టులకు ప్రోత్సాహం తగ్గుతుందన్నారు. పోటీల పేరుతో వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై వుందన్నారు.

తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు కలిమిశ్రీ, కార్యదర్శి కళాసాగర్ సంస్థ ఆవిర్భావ నేపథ్యాన్ని వివరించి, పోటీకి, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సభలో ప్రధమ బహుమతి ఎం.ఎం.మురళి (బెంగుళూరు) ద్వితీయ బహుమతి భూపతి (కరీంనగర్), మూడవ బహుమతి నాగిశెట్టి (విజయవాడ) లకు, మరో 19 మంది కార్టూనిస్టులకు రూ. 500 చప్పున నగదు బహుమతులు నిర్వాహకులు అందజేశారు. టిసిఏ లోగో రూపకల్పన చేసిన అక్కెర శ్రీనివాస్ ను సత్కరించారు. ప్రదర్శన లో పాల్గొన్న కార్టూనిస్టు లందరికి ప్రశంసా పత్రం నిర్వాహకులు అందజేశారు. టిసిఏ ఉపాధ్యక్షులు కార్టూనిస్టు పద్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ సభలో సహాయ కార్యదర్శి డా.రావెళ్ళ, వి.రామకృష్ణ, శాయిబాబా, చక్రవర్తి తదితరులతో పాటు నగరంలోని ప్రముఖ చిత్రకారులు కూడా ఈ వేదుకలో పాల్గొన్నారు.
-బి.ఎం.పి. సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap