2డి యానిమేటర్ గా పనిచేసాను – సురేష్

సురేష్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు యడపల్లి సురేష్ బాబు. పుట్టింది 1976 నవంబర్ 11న గుంటూరులో. చిన్నప్పటి నుండి చందమామ, బాలమిత్రతో పాటు వారపత్రికలు బాగా చదివే అలవాటు నాకు. వాటిలో బొమ్మలు, కార్టూన్స్ చూసి నేను, మా అన్నయ్య గీసేవాళ్ళం. అప్పట్లో ఆంధ్రజ్యోతి దీపావళి స్పెషల్ సంచికలలో చాలా కార్టూన్స్ వచ్చేవి. అందులో గోపాలకృష్ణ, భగవాన్, బాచిగారి కార్టూన్స్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. నాకూ కార్టూన్స్ ఐడియాలు వచ్చినా ఎలా వేయాలో ? తెలిసేదికాదు. స్వాతి వీక్లీ లో జయదేవ్గారి స్ట్రిప్ కార్టూన్స్, బాబు గారి కార్టూన్స్ మిగతా పత్రికలలో గౌతం-బొబ్బిలి, ఎం.ఐ. కిషన్, యువరాజ్, మౌంట్ క్రిస్టో, ఆకుండి సాయిరాం, రవి, సరసిగార్ల కార్టూన్లు బాగా నచ్చేవి. ఆ కార్టూన్స్ చూసినప్పుడల్లా అలావేయాలి అనుకొనేవాడిని.

Suresh cartoon

ఇంటర్మీడియట్ గుంటూర్లో పూర్తి చేసి, డిగ్రీకి హైదరాబాద్ వచ్చి కాలేజిలో జాయిన్ అయ్యాక, 1995లో ఒక సారి కొన్ని కార్టూన్స్ తీసుకొని ‘ఆంధ్రప్రభ ‘ పత్రికాఫీసులో ‘చిన్నారి’ సప్లిమెంట్ డెస్క్ కు వెళ్ళాను. నా కార్టూన్స్ చూసి ఆ ఫీచర్ ఇన్ చార్జ్ గారు నన్ను ఆర్టిస్ట్ మోహన్ దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ మోహన్ గారు కార్టూన్స్ ఎలా గీయాలి? ఏ సైజులో గీయాలి ? లాంటి సలహాలు ఇచ్చారు. ఆ తరువాత వారి సలహాలు పాటించి గీసిన పది కార్టూన్లు వరకు ఆంధ్రప్రభ ‘చిన్నారి‘లో పబ్లిష్ అయ్యాయి.

1996 సం.లో దాసరి నారాయణ రావుగారి ఆధ్వర్యంలో బొబ్బిలిపులి పొలిటికల్ వారపత్రిక కోసం నిర్వహించిన ఇంటర్వ్వూ లో నన్ను, మృత్యుంజయ్ ని ఎడిటర్ పతంజలిగారు కార్టూనిస్టులుగా సెలెక్ట్ చేసారు. అప్పుడు పరిచయమైన మృత్యుంజయ్ తర్వాత రోజుల్లో నాకు మంచి మిత్రుడయ్యాడు.

కొన్నాళ్ళ తర్వాత మల్టీమీడియా కోర్సులో జాయిన్అయ్యి ‘ఆంధ్రభూమి’ ఆదివారం కవర్ పేజీ డిజైన్లు మంగు రాజగోపాల్ గారి ప్రోత్సాహంతో సంవత్సరం పాటు చేసాను. 2001 సం.లో యానిమేషన్ స్టూడియోలో 2డి యానిమేటర్ గా, 2006 సం.లో వరకు, గుజరాత్ ఆనంద్ లో Sky Work Studio లో 3డి, మాయా టెక్చరింగ్ ఆర్టిస్ట్ గా సంవత్సరం పాటు పనిచేసాను. తర్వాత హైదరాబాద్ వెంచర్ ఎడ్వర్టైజింగ్ ఏజన్సీలో గ్రాఫిక్ డిజైనర్ గా రెండేళ్ళు పనిచేసి, ప్రస్తుతం సర్వీస్ ఆపార్ట్ మెంట్స్ నిర్వహణతో పాటు, వ్యాపారం చేస్తున్నాను.

Suresh cartoon

1996 సం.లో స్వాతి వీక్లీ నిర్వహించిన కార్టూన్ పోటీల్లో మూడవ బహుమతి, 1998 సం.లో హిందూస్థాన్ టైంస్ కార్టూన్ పోటీల్లో కన్సోలేషన్ ప్రైజ్, 2018 సం.లో కార్టూన్ వాచ్ మేగజైన్ లో కన్సొలేషన్ ప్రైజ్. 2017 సం.లో బెంగలూరు ఐ.ఐ.సి. గేలరిలో నిర్వహించిన 125 మంది తెలుగు కార్టూనిస్టుల ‘కార్టూన్ ప్రదర్శన‘లో నా కార్టూన్ కూడా ప్రదర్శించబడింది. కార్టూన్ ప్రదర్శనలకు ఇప్పటికీ కార్టూన్లు గీస్తున్నాను.
-సురేష్

Suresh cartoonist

1 thought on “2డి యానిమేటర్ గా పనిచేసాను – సురేష్

  1. మీ కార్టూన్లు, మీ ప్రయాణం బాగుంది

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link