మీకు తెలుసా బాపుగారు కూడా ట్రేసింగ్ బాక్స్ వాడతారు అన్నాడు ఒక తూర్పు గోదావరి మిత్రుడు తన .. గదిలో మూలనున్న ట్రేసింగ్ బాక్స్ చూపించి. అదేమిటి అన్నా అది అంతే. చించిపడేసిన రఫ్ స్కెచ్ తో ఆయన గదిలో చెత్తబుట్ట నిండిపోతుంది. ఫైనల్ గా ఒకే అనిపించాక ఆ రఫ్ బొమ్మను డ్రెస్సింగ్ బాక్స్ అద్దంపై పెట్టి లైట్స్ ఆన్ చేసి నిబ్ తో స్ట్రోక్ ఇవ్వడమే అన్నాడు.
మరోసారి ఆంధ్రభూమి వీక్లీ పెట్టిన కొత్తలో గోలి అనే ఆర్టిస్ట్…అసలు మీరు పెన్సిల్ వాడద్దు.. డైరెక్ట్ గా పెన్ తో బొమ్మ గీసేయండి. రబ్బర్ తో తుడిచే పని పడకూడదు అని సలహా ఇచ్చాడు. మంచి సలహా అనిపించింది. పాపం ఆయన చిన్న వయసులోనే పోయాడు అన్నారు. ఈ ట్రేసింగ్ బాక్స్ వాడు మటుకు ఇంకా అదే పాముడులో ఉన్నాడు.
నా పూర్తి పేరు ఎ.వి. సుబ్రమణ్యం. నేను పుట్టింది ఫిబ్రవరి 1959లో. మా ఊరు తాడేపల్లి గూడెం దగ్గర మిలిటరీ మాధవరం. నిడదవోలు ఫస్ట్ ఇయర్ ఇంటర్, సెకండ్ ఇంటర్ అమ్మమ్మగారి ఊరు తుని ప్రభుత్వ కాలేజీలో. నేను చదివింది సైన్స్ గ్రూప్, లెక్కలు రాక ఇంటర్ ఫెయిలయ్యా. 1977లో హైదరాబాద్ వచ్చాక ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని ఇంటర్ డిగ్రీ, పీజీ, మాస్ మీడియా.. ఎడిట్ ముల్టిమీడియాలో ప్రింట్ మీడియా డిప్లొమో చేసాను.
కార్టూనిస్ట్ బి.వి. సత్యమూర్తిగారి స్టూడియోలో ఆయనకి అసిస్టెంట్ గా చేరి కమర్షియల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. గురువుగారి దగ్గర పని నేర్చుకున్నాక కొన్నాళ్ళు శీలా వీర్రాజుగారి దగ్గర అసిస్టెంట్ గా చేసి, తరువాత ఇంట్లో ఒక స్టూడియో పెట్టుకొని ఫార్మా కంపెనీలకు ప్రొడక్ట్ డిజైన్స్ చేస్తూ బిజీ అయిపోయా. కొన్నాళ్ళకి కంప్యూటర్స్ వచ్చాక నేర్చుకొని అప్ డేట్ అయ్యాను.
ఇక కార్టూన్స్ పత్రికలు కధలు విషయానికి వస్తే… ఆరోజుల్లో మన బొమ్మ అచ్చు అవ్వాలి అంటే అంతా తేలిక కాదు. సినిమాల్లో వేషం అయినా సంపాదించవచ్చుగాని బొమ్మ మటుకు అచ్చుగాదు. ఏ పత్రికకి వెళ్లినా ఇంకా లైన్ ఇంప్రూవ్ చెయ్యాలి అంటారు. అసలు పురాణంగారు నన్ను ఉదయంలో ఆర్టిస్ట్ గా చేరమంటే వేరే జాబ్ ఉంది వదలడం కుదరదు అని చేరలేదు. ఆంధ్రప్రభ వీక్లీకి విజయబాబుగారు ఎడిటర్‌గా వచ్చాక ఈ కార్టూన్స్ అన్నీ ఆయనకి ఇస్తే మొత్తం కార్టూన్స్ రెండు సంచికల్లో వేసేసి ఆ వారంలొనే డబ్బులు పంపేశారు. మయూరి పత్రిక ఆఫీస్ కి వెళ్లి ఎడిటర్ కిశోర్.జె ని కలిస్తే… ప్రభలో వచ్చిన కార్టూన్ ఫీచర్ ను అదే పేరుతో చాలా కాలం కొనసాగించారు. ఆ తరువాత పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, వాకాటి పాండు రంగారావుగారు నావి రెగ్యులర్‌గా సీరియల్ బొమ్మల కధలు వేశారు.
నన్ను ప్రోత్సహించిన ఎడిటర్స్ పల్లకి విక్రమ్, స్రవంతి హారిక, మయూరి వీక్లీ కిశోర్ జె., ప్రభ పొత్తూరి, వాకాటి, వల్లూరి రాఘవరావు, విజయబాబు, పురాణం, సుప్రభాతం.. ఆంజనేయులుగారు, వీరాజీగారు, AP టైమ్స్ వాకాటిగారు, జ్యోతి ఐ.వెంకటరావు, నవ్య జగనాదశర్మ. అలాగే ప్రింటింగ్ technology లో సలహాలు ఇచ్చిన సత్యం ప్రాసెస్ సత్యంగారికి ఎంతో రుణపడి ఉన్నాను.
నా మొదటి కార్టూన్ ఆంధ్రపత్రిక డైలీలో… సత్య అనే పేరుతో పడింది. మిగతావి అన్ని ఏ.వి.ఎస్. మణ్యం అనే కలం పేరుతో గీసాను. AP timesలో బాబా అనే పేరుతో గీసాను. ఇటీవలే డేస్ ఆఫ్ 1970స్ అనే స్టోరీస్ పుస్తకానికి నా కథలకు నేనే బొమ్మలు గీసి పబ్లిష్ చేసాను. బి.యస్.ఎన్.ఎల్. హైదరాబాద్ లో ఉద్యోగంచేసి 2019 సం.లో రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ మీడియాలోనే పనిచేస్తున్నారు.
-ఎ.వి.ఎస్. మణ్యం