బాలి అనే పేరు తెలుగు చిత్రకళారంగానికి సుపరిచితమైన పేరు. ఏడున్నర పదుల వయసులోనూ అదే రూపం, అదే జోష్… ఏమీ మార్పు లేదు. ఐదున్నర దశాబ్దాలుగా బొమ్మలతో పెనవేసుకు పోయిన అనుబంధం ఆయనిది…
అనకాపల్లిలో పుట్టి, వైజాగ్ ఈనాడులో కార్టూనిస్టుగా అడుగుపెట్టి… తర్వాత విజయవాడ, హైదరాబాద్ మళ్ళీ విశాఖపట్నం ఇదీ బాలి గారి పయణం…. ఎక్కడా రాజీ పడరు. కొంతకాలం ఉద్యోగాలు చేశారు… ఎక్కువ కాలం స్వేచ్చగా బొమ్మలు గీసుకున్నారు. తను మనసులో ఏమనుకుంటారో అదే మాట్లాడతారు. మనసులో ఒకటి అనుకొని బయట ఒకటి చేప్పే లౌక్యం ఆయనకు తెలీదు. అది ఆయన తత్వం. నేడు(16-08-2021) ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు…
……………………………………………………………………………………………………
మిత్రుడు కళాసాగర్ పెనుమాక (అమరావతి) కార్టూనిస్ట్ వన భోజనాల సందర్భంలో కార్టూనిస్టుగా నా అనుభవాలను 64కళలు పత్రిక కోసం రాయమన్నాడు.
నేను నా చిత్రకళా ప్రస్థానంలో గమనించేదీ ఇప్పటికీ ఆచరించేదీ అంటే ఏ బొమ్మగీసినా- (అంటే కార్టూన్ గీసినా) అందులో ఎనాటమీ, పెరస్పెక్టివ్ నెస్, అవసరమున్నంత వరకే గీతలు గీయడం చేస్తాను (బేలన్స్ చేయడం) అంటే ఒక పాటకి శృతి, ఉచ్ఛారణ, గమకం ఎంత ముఖ్యమో బొమ్మకీ అంతే ! నా జన్మ స్థలమయిన అనాకాపల్లిలో ఈ చిత్రకళలో గానీ, లేక వ్యంగ్య చిత్రకళా రచనలో గానీ నిష్ణాతులు లేకపోయినా అప్పటిలో మద్రాస్ నుండి వెలువడు, ఆంధ్రపత్రిక, ప్రభల్లోని రేఖాచిత్రాలు గమినిస్తూ, నేను పడుతూ, లేస్తూ గీసిన రేఖాచిత్రాలు ఆయా పత్రికల్లో ప్రచురించి ప్రోత్సహించడం వల్ల నాకు ఆసక్తి కలిగి, నా సరదాకో చక్కని మార్గం కనపడింది.
వాహనం రోడ్ మీద నడుపుతున్న వ్యక్తి, రోడ్ సెన్స్ ను ఆటోమెటిక్ ఉపయోగిస్తూ ఎలా నడుపుతాడో నేను బొమ్మను గీస్తూనే అది కార్టూన్ కావచ్చు, ఇలస్ట్రేషన్ కావచ్చు, అందులోని ఎనాటమీనీ, బేలన్సనూ, పెర్ ఫెక్టివ్ నూ గుర్తిస్తూ వీలయినంత తక్కువ రేఖల్లో బొమ్మను పూర్తి చేస్తాను.
మొదటిలో నాకు కార్టూన్లంటే చిన్న చూపు ఉండేది. దానికి సమాధానం ఆ చిన్న వయస్సులో నా దగ్గర లేకపోయి ఉ ండవచ్చు. అయితే పత్రికల్లో కార్టూన్లు ఇద్దరు, ముగ్గురువి వస్తూ, వారిచ్చే సింపుల్ లైన్స్ ఎక్స్ ప్రెషన్, దానికి తగ్గ ఫన్నీ డైలాగ్ దేనినీ విడదీయలేని పరిస్థితి! సరే నేనూ ప్రయత్నిద్దామనుకున్నాను. సాధన చేస్తున్న కొద్దీ, దానిలోని లోతు తెలుస్తోంది. అలాంటి ప్రయత్నంలో, నా మొదటి కార్టూన్ ఆంధ్రపత్రిక వారపత్రిక వచ్చింది (సంవత్సరం గుర్తులేదు). తర్వాత ఆంధ్రపత్రిక వారపత్రిక వారు నిర్వహిస్తున్న కార్టూన్ పోటీల్లో వరుసగా మూడు వారాల్లో మూడు సార్లు బహుమతులు అందుకున్నాను.
ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 1974 లో ఈనాడు దినపత్రిక విశాఖపట్నంలో ప్రారంభించినపుడు కార్టూనిస్టుగా చేరి, తర్వాత హైదరాబాద్ కు వెళ్ళి సుమారు సంవత్సరం పాటు కార్టూన్లు గీసి, 1976లో ఆంధ్రజ్యోతి పత్రికకి స్టాఫ్ ఆర్టిస్టుగా వెళ్ళిపోయాను. అక్కడ పురాణం సుబ్రహ్మణ్యం శర్మ గారు నా పేరును బాలి గా మార్చారు. పుట్టింది 16 ఆగస్టు 1941 అనకాపల్లిలో, తల్లిదండ్రులు అన్నపూర్ణ, లక్ష్మణరావు. ‘బాలి’గా పాపులర్ అయిన నా అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. ఉద్యోగరీత్యా హైదరాబాద్, విజయవాడ తిరిగి ప్రస్తుతం విశాఖలో స్థిరపడ్డాను.
1984 లో ఆంధ్రజ్యోతి నుండి బయటకు వచ్చి, ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాను. యానిమేషన్ రంగంలో కలర్ చిప్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్, కంపెనీలో కొంతకాలం పనిచేసాను. అనేక సంస్థల నుండి సత్కారాలు-సన్మానాలతోపాటు 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘హంస‘ అవార్డు అందుకున్నాను.
బొమ్మలుతో పాటు విరివిగా కార్టూన్లు వేశాను. ఏడుపుస్తకాలు తెచ్చాను కార్టూన్ సంకలనాలుగా! ఎన్ని వందలు కార్టూన్లు వేసానో లెక్కచెప్పలేను.
నా కార్టూన్ సంకలనం ఒక దాన్ని పలమనేరు, మా బడి పాఠశాలవారు పబ్లిష్ చేస్తూ, ఈ పుస్తకంలోని కొన్ని కార్టూన్లను వయోజనులకు బాగుంటాయని రంగుల్లో వేరే పుస్తకం వేశారు. ఈ సంగతి నాకు తెలియదు నాకు చెప్పలేదు. తరువాత హైదరాబాద్లో ఏదో షాపులో చూసి వార్ని ప్రశ్నిస్తే అపుడు అసలు విషయం చెప్పారు. ఇదీ మన మార్కెట్ స్థితి, అదొక తమాషా!
పర్యావరణంమీద నేను వేసిన కార్టూన్ జర్మన్ కార్టూన్స్ కనెక్షన్లో ప్రచురించబడి బహుమతి తెచ్చుకుంది, అయితే ఇది కూడా బొంబాయికి చెందిన ప్రఖ్యాత కార్టూనిస్ట్ విన్స్ (విజయన్.ఎన్. సేత్) ద్వారా! ఈయన మన డా. సమరం గారి దూరపు బంధువు, అనుకోకుండా ఆయన నాస్తిక సభలకు విజయవాడ వస్తే పరిచయమయి, ఆయన సలహా మీద పర్యావరణ సబ్జెక్ట్ మీద అప్పటికప్పుడు గీసిన కార్టూన్, ఆ తరువాత ఇక నేను కార్టూన్ పోటీల్లో పాల్గొనలేదు.
ఈ రచనా ప్రపంచంలో ఎన్నెన్నో ప్రయోగాలుంటాయి. ప్రస్తుతం కార్టూనిస్టులు వివిధ పత్రికల్లో, వారికి తోచిన విధంగా వ్యంగ్య చిత్రాలు గీస్తున్నారు. అందుకు వారందరికీ నా అభినందనలు.
– బాలి
క్లుప్తంగా వాఖ్య, సింపుల్ గాబొమ్మ (కార్టూన్)… కానీ హాస్యం మాత్రం అట్ట హాసమే !….ఇది బాలి’ గారి స్టైల్ ! కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా ఆయన చూడని ఎత్తులు లేవు. – పొందని సత్కారాలు లేవు ! లెజెండ్స్ గా పేర్కొనే కొద్దిమంది తెలుగు కార్టూనిస్టుల్లో ఆయన స్థానం కూడా ప్రముఖమైనదే !…వారి స్వపరిచం మరీ క్లుప్తంగా ఉండడం నిరుత్సాహ పరిచినా బావుంది…బాలి గారు మళ్ళీ కార్టూన్లు గీయాలని మా కోరిక !
క్లుప్తంగా వాఖ్య, సింపుల్ గాబొమ్మ (కార్టూన్)… కానీ హాస్యం మాత్రం అట్ట హాసమే! – ఇది బాలి’ గారి స్టైల్ ! కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా ఆయన చూడని ఎత్తులు లేవు. – పొందని సత్కారాలు లేవు ! లెజెండ్స్ గా పేర్కొనే కొద్దిమంది తెలుగు కార్టూనిస్టుల్లో ఆయన స్థానం ప్రముఖమైనదే !…వారి స్వపరిచం మరీ క్లుప్తంగా ఉండడం కొంచెం నిరుత్సాహ పరిచినా – బావుంది!…బాలి గారు మళ్ళీ కార్టూన్లు గీయాలని మా కోరిక !
గాంధీగారు పుట్టిన తేదీలోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మిస్తే భారతదేశమంతా శాస్త్రిగారిని మరిచిపోయినట్లు
బాపూగారుండాగా బాలిగారుకూడా ఉండటంవల్ల ఆయనకు రావల్సినంత పేరు రాలేదని నా అభిప్రాయం.
ఆయన గీత ప్రత్యేకం. ఆయన బొమ్మల్లో కోణాలు ప్రత్యేకం. నా మిత్రుల్లో చాలామందికి బాపుకు బాలికి తేడాతెలియదు.
కాని ఓ సందేహం. బాలిగారి బొమ్మలకు చేతివేళ్ళు మొరటుగా ఉంటాయి ఎందుకని??