సుప్రసిద్ధ రచయిత, కార్టూనిస్టు భువన్ (ఎం.వి.జె. భువనేశ్వరరావు) నిన్న సాయంత్రం (4-01-2025, శనివారం) అనారోగ్యం తో విశాఖపట్నం హాస్పటల్లో కన్నుమూశారు. భువన్ మరణవార్త విని కార్టూనిస్టు మిత్రులు విజయవాడలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవం బాలల వేదికపై తమ సంతాపాన్ని తెలియజేశారు. అనకాపల్లి నివాసి అయిన భువన్ రచయితగా, కార్టూనిస్టుగా, కాలమిస్టుగా సాహిత్యరంగంలో గత మూడు దశాబ్దాలుగా కృషి చేశారు. వృత్తి రీత్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేనేజర్ హోదాలో సేవలందిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. భువన్ కథలు, కార్టూన్లు అన్ని తెలుగు పత్రికల్లో అచ్చయ్యాయి. ఆయన కథల పుస్తకం ఇటీవలే కన్నడంలోకి అనువాదమయ్యింది. తండ్రి గారి పేరు మీద ‘మళ్ళ జగన్నాథం స్మారక కథలు, కార్టూన్ల పోటీలు‘ ప్రతి యేటా నిర్వహిస్తూ ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. భువన్ తను గీసిన కార్టూన్లతో 2022 సం.లో ‘భువన్ నవ్వులు’, 2021 లో, ‘భువన్ ఫన్ బుక్’ పేరుతో కార్టూన్ పుస్తకాలు ప్రచురించారు. వీరి మరణం తెలుగు సాహితీ, కార్టూన్ రంగాలకు తీరని లోటుగా భావిస్తూ… కార్టూనిస్టులు కలిమిశ్రీ, బాచి, కళాసాగర్, రావెళ్ళ, నాగిశెట్టి, పద్మదాసు, చిత్రకారుడు వేణుగోపాల్ వారి సేవల్ని, వారి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని సంతాపాన్ని తెలియజేశారు.
-కళాసాగర్