అందమైన, ప్రకృతి రమణీయమైన చిన్నమెట్ పల్లి గ్రామం కోరుట్ల మండలం జగిత్యాల జిల్లా నా జన్మస్థానం, 1 మార్చి 1982లో పుట్టిన నాపేరు కెంచు చిన్నన్న. అందమైన పల్లె కావడంతో సహజంగానే కళలపై మక్కువ ఏర్పడిందని చెప్పవచ్చు. వాగులు, వంకలు, చెరువులు, ఒర్రెలు, గుట్టలు, పచ్చని పొలాల మధ్య సాగిన నా బాల్యం సహజంగానే నాలోని కళాకారున్ని తట్టిలేపింది.నిరక్షరాస్యులై వ్యవసాయం, గొర్రెలు,మేకల పెంపకం ప్రధాన జీవనాధారంగా కొనసాగున్న నా తల్లిదండ్రులు పూజ్యులు కీ.శే:శ్రీమతి చిన్నమ్మ, చిన్నమల్లయ్యలకు చివరి, ఆరో సంతానంగా జన్మించిన నన్ను అల్లారుముద్దుగా, కాస్త కళాత్మకంగానే పెంచారని చెప్పవచ్చు. చదువంటే ఏ మాత్రం అవగాహన లేకున్నా నేను చేసే ప్రతీ పనిని నా పైనున్న అపార నమ్మకంతో నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించారు నా తల్లిదండ్రులు.ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు నన్ను విద్యారంగంపై అమితాసక్తి పెంచేలా చేసి ఎమ్మెస్సీ, బి.ఇడి. చదువుకునే వరకు తీసుకెళ్లింది. అలాగే నాకున్న సూక్ష్మబుద్ధి, సమాజ పరిశీలనా జ్ఞానం, సృజనాత్మక, కళాత్మక ధోరణిలో ఆలోచించే విధానం కూడా నన్ను కళలపై దృష్టి సారించేలా చేశాయనడంలో సందేహం లేదు.
విద్యార్థి దశ నుండి పుస్తక పఠనం, పత్రికా పఠనాలపై అమితాశక్తి కలిగిన నాకు తెలుగు పద సంపత్తి, వాక్య నిర్మాణాలపై కాస్త పట్టు ఏర్పడటంతో పాటు సమాజంపై కొద్ది అవగాహన కలిగించింది. ప్రాథమిక విద్య దశ నుండే బొమ్మలు గీయడం అలవాటైతే,సెకండరీ విద్య దశ నుండి ఎక్కువ సంఖ్యలో గీసిన నా కార్టూన్లు వివిధ పత్రికల్లో ప్రచురించబడటం ప్రారంభమైంది. నాలో ఉత్సాహం రెట్టింపైంది.విద్యాభ్యాసంతో సమానంగా ఈ కళల ప్రక్రియ కూడా కొనసాగుతూ వచ్చింది.
ఏడో తరగతి చదివేటప్పుడే 1994 లో మొదటి కార్టూను “జాగృతి”లో ప్రచురించబడింది. ఆ తర్వాత శ్రీ గద్దె గారి సూచనలతోనే కార్టూన్లు వేయటం అనేక పత్రికలలో ప్రచురించబడటం జరిగింది. ఎమ్మెస్సి, బి.ఇడి. పూర్తి చేసిన నేను జీవ శాస్త్ర ఉపాధ్యాయుడిగా వృత్తిని నిర్వహిస్తూ ప్రవృత్తిగా 12 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో సాంఘిక కార్టూన్లు గీసిన అనుభవంతో 2006లో అప్పటి ప్రజాశక్తి కరీంనగర్ జిల్లా ఎడిషన్ లో రాజకీయ కార్టూనిస్టుగా చేరాను. కొన్ని నెలల అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ గుంటూరులో చదువుతున్నప్పుడు 2006 నుండి 2008 వరకు అక్కడి గుంటూరు జిల్లా ప్రజాశక్తి ఎడిసన్ లో రాజకీయ కార్టూన్లు గీశాను.
ఆ తర్వాత 2008 నుండి 2009 వరకు ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ కార్టూనిస్టుగా చేరాను. పెళ్లి అనంతరం మళ్ళీ 2014 నుండి నవతెలంగాణ (ప్రజాశక్తి) దిన ఉత్తర తెలంగాణ జిల్లాల ఎడిషన్లకు గీస్తున్నాను.
పలు రాష్ట్ర స్థాయి మొదలు అంతర్జాతీయ స్థాయి కార్టూన్లు పోటీల్లో అనేక బహుమతులు తెచ్చుకున్నాను. 1996 లో ఔరంగాబాదులోని మానవ సమాజ్ వికాస్ కేంద్రం వారి ద్వితీయ బహుమతి, 1997 స్వాతంత్ర్య స్వర్ణొత్సవాలలో భాగంగా మండల స్థాయిలో ప్రధమ బహుమతి,1999 లో ఎన్.ఎస్.ఎస్. జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ లో ప్రతిభా పురస్కారం, 2000 లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచీ ప్రశంసాపత్రం అందుకున్నాను.
2001 లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ దేబబ్రత కంఠ గారి నుండి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.2004 లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి లభించింది.
ఆంధ్రభూమి, బుజ్జాయి, మయూరి, అమృతకిరణ్ లాంటి అనేక పత్రికలలో నా కార్టూన్లు ప్రచురించారు. ఎయిడ్స్, పచ్చదనం పరిశుభ్రత, వరకట్నం, స్త్రీ సమానత్వం, అవినీతి, తెలుగు భాషపై నిర్లక్ష్యం, నీటి పొదుపు … ఇలా నా కార్టూన్లలో ఏదో ఒక సామాజిక అంశం వుండేలా గీస్తుంటాను.
అప్పుడప్పుడు కవితలు రాయడం నాకున్న మరో హాబీ!. ఈ మధ్యే నేను రాసిన కవితా సంపుటి ‘వాస్తవమ్మురా చిన్నన్న’ ఆవిష్కరణకు సిద్ధమైనది.
ఎల్లవేళలా నన్ను ప్రోత్సహించిన నాకు విద్య నేర్పున గురువులు,స్నేహితులు, కుటుంబ సభ్యులు, పత్రికా సంపాదకులు, విలేకరులు, పలు కళా, సాంస్కృతిక సంస్థల అధిపతులు, వాట్సాప్,ఫేసుబుక్ స్నేహితులు, కవిమిత్రులు,నా చిన్నమెట్ పల్లి గ్రామస్తులు తదితరుల ప్రోత్సాహం ఎనలేనిది మరువలేనిదని చెప్పాలి.
ప్రస్తుతం జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా శ్రీ నారాయణ ఈ టెక్నో స్కూల్లో పనిచేస్తూ జగిత్యాలలో నివాసముంటున్నాను. నాకు వృత్తిలో పాఠాలు చెప్పటంలో కూడా కార్టూన్ కళ బాగా ఉపయోగపడుతోంది. పాఠం చెప్పేటప్పుడు బొమ్మలు వేస్తూ పాఠం చెప్తే పిల్లలు పాఠాన్ని శ్రద్దగా వింటారని నా అభిప్రాయం.
-చిన్నన్న
Nice Mithrama. Congratulations
Very good intro. Congrats to cartoonist Chinnanna.
Kadikatla , caroonist