గాంధీ అనే నేను ఎవరో తెలియాలంటే ఇదంతా మీరు తప్పకుండా చదావాల్సిందే. అనంతపురం జిల్లా లో కదిరి అనే టౌన్ వుంది.ఇక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరంలో వున్న బందారుచెట్లపల్లి అనే ఓ కుగ్రామమే మా వూరు. నేను పుట్టింది డిశంబర్ 20, 1968 లో. మా వూర్లో అప్పుడూ ఇప్పుడూ 15 ఇల్లు మాత్రమే వున్నాయి. ఇకపోతే మా అన్నయ్య లేపాక్షి కూడా కార్టూనిస్టు. ఆయన అలవాటే నాకూ అంటుకుంది. దాంతో 30 ఏండ్లుగా కార్టూన్స్ వేస్తూ వున్నాను.
నంబులపూలికుంట, కదిరి, అనంతపూర్ అనే ఈ ఊర్లల్లో నేను నా చదువుని (బి.ఏ.) పూర్తీ చేసి ఆ దరిమిలా ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు ఫార్వర్డ్ అయ్యాను. ఇక్కడ మయూరి, చిత్రభూమి అనే పత్రికల్లో లే అవుట్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యాను. అక్కడ ఓ ఏడాది పనిచేశాక నాకెందుకో సినిమాల్లో చేరాలనిపించింది. అదే విషయాన్ని చిత్రభూమి లో పనిచేసే రాంబాబుగారు అనే సినీ జర్నలిస్ట్ తో చెప్పాను. బ్రహ్మానందం గారిని హీరోగా పెట్టి “ సరసాల సోగ్గాడు” అనే సినిమా చేయబోతున్న నూతన దర్శకుడు సత్యప్రసాద్ గారికి నన్ను తీసుకెళ్ళీ రాంబాబు గారు పరిచయం చేశారు. దాంతో ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత సుప్రభాతం అనే పత్రికలో పనిచేసున్న రామిరెడ్డిగారి ద్యారా రచయిత బ్నిం గారు పరిచయం అయ్యారు. బ్నిం గారు నన్ను తీసుకెళ్ళి బాపుగారికి పరిచయం చేశారు. దాంతో మిస్టర్ పెళ్ళాం, పెళ్లికొడుకు, రాంబంటు తో పాటు ఈ టీవీ భాగవతం కు పనిచేసే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆ తర్వాత నా స్వీయ దర్శకత్వం లో “సారీ నాకు పెళ్లైంది” అనే సినిమా చేశాను. దీని తర్వాత “ప్లీజ్ నాకు పెళ్లైంది, ఏం బాబు లడ్డూ కావాలా, ఆశ దోశ అప్పడం” అనే 4 సినిమాలు చేసాను. వీటితో పాటు కార్టూన్లు కూడా వేస్తూనే వున్నాను. ముఖ్యంగా అప్పుల మీద సినిమాల మీద కార్టూన్లు విరివిగా వేసి ప్రత్యేకమైన గుర్తింపు పొందాను. తెలుగులో చాలా మంది ప్రముఖ కార్టూనిస్ట్ లు నా కార్టూన్లు బాగా ఉంటాయని అంటే చాలా గర్వంగా వుంటుంది.అంతే కాకుండా వాళ్ళ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలన్న ఉద్దేశం తో మంచి కార్టూన్లు వేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. 2019 లో తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్టూన్ పోటీల్లో తలిశెట్టి రామారావు అవార్డ్ అందుకున్నాను.
నా కార్టూన్లు కొన్ని ‘రొమాంటిక్ జోక్స్ ‘ పేరుతో కార్టూన్ పుస్తకంగా వచ్చింది.
– గాంధీ