నా కార్టూన్స్ తో పుస్తకం తేవాలి-గోపాలకృష్ణ

నా పేరు వేండ్ర గోపాలకృష్ణ పుట్టింది అక్టోబర్ 8 న… పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో. నా తల్లిదండ్రులు వేండ్ర వెంకన్న, మంగమ్మగార్లు – చదివింది బి.యస్సీ., యం.ఏ. చిన్నప్పట్నుంచీ చిత్రకళపై అభిరుచి ఏర్పడి చూసిందల్లా గీసేవాడ్ని – పెద్దయ్యాక గొప్ప ఆర్టిస్ట్ ని కావాలన్న ఆశతో…

పత్రికలు చదవటం అలవాటు. బొమ్మలు, కార్టూన్లు ఎక్కువగా చూసేవాడ్ని. బొమ్మలు ప్రాక్టీస్ చేసేవాడ్ని, నవ్వించే కార్టున్లు చూస్తుంటే నాకూ అలాంటి కార్టూన్లు గీయాలన్పించేది. కార్టూన్లు గీయాలనే కోరికకు… ప్రేరణ… గురువు శ్రీ జయదేవ్ గారు. కాని ఎలా, దేనితో గీయాలో తెలియక పెన్సిల్ లో.. పత్రికల్లో ఉన్న కార్టూన్ల సైజు కొలతల ప్రకారం పంపేవాణ్ని కాని తిరిగొచ్చేవి. చాలా నిరాశ పడేవాడ్ని ఇలా… వచ్చి రాని బొమ్మలతో కార్టూన్లు గీయడం, పంపడం, అవి పత్రికలనుండి తిరస్కారం. అయినా ఈ విషయంలో ఘజనీ మహ్మద్ ని ఆదర్శంగా తీస్కుని, పట్టువిడక సాధన చేస్తూ.. పంపగా పంపగా 1982లో ఆంధ్రప్రభ వారపత్రికలో నా మొదటి కార్టూను ప్రచురించబడి పారితోషికం అందడంతో ఎంతో సంతోష పడ్డాను .

వివిధ వార, మాసపత్రికలో ఉదృతంగా కార్టూన్లు గీస్తున్న… గురువులు శ్రీ జయదేవ్ గార్కి.. నా సందేహాలతో ఉత్తరం రాయగా, అనూహ్యంగా వారి నుండి ఎంతో ప్రేమ, వాశ్చల్యంతో నా సందేహాలను నివృతి చేస్తూ.. సూచనలు మంచి సలహాలు నాలోని కార్టూనిస్ట్ కి… ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక వెనుక తిరిగి చూస్కోనవసరం లేకుండా కార్టూన్లు గీయడం అవి పత్రికల్లో రావడం జరిగింది. అదే సమయంలో శ్రీ శంకుగారు ‘ కోక్విల్ హాస్యప్రియ’ మాసపత్రికతో నా ప్రయాణం ఎంతో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యిచ్చి ముందుకు పరుగులు పెట్టించింది.

గొప్ప కార్టూనిస్టు స్వర్గీయ R.K లక్ష్మణ్ గారి కార్టూన్లు .. నాపై మంచి ప్రభావం చూపించాయి. ఆ కార్టూన్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక నా అభిమాన చిత్రకారుడు శ్రీ చంద్రగారి కార్టూన్ల గీతలు నాపై చాలా ప్రభావం చూపించాయి. వారందరికీ కృతజ్జాభివందనాలు.

అలా పాఠకుల అభిమానంతో అన్ని దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో నా కార్టూన్లు ప్రచురింపబడ్డాయి. ఎన్నో స్థానిక, రాష్ట్రస్థాయ, జాతీయస్థాయి, అంతర్జాతీయ కార్టూన్ల పోటీల్లో నా కార్టూన్లు అవార్డులు, రివార్డులు గెలుచుకున్నాయి. అనేక సామాజిక అంశాలపై కొన్ని గ్రంథాలయాల్లో కార్టూన్ల ప్రదర్శనలు కూడా నిర్వహించాను.

మిత్రులు ఆస్కా సెక్రటరీ, ఎడిటర్ శ్రీ కళాసాగర్ గారు ‘ఆస్కా’ సంస్థ తరపున… విజయవాడలో 2005 సం.లో జరిగిన కార్టూనోత్సవంలో నన్నెంతో అభిమానంగా సన్మానించి గౌరవించారు. వారికి కృతజ్ఞతాభివందనాలు. హార్ట్ యానిమేషన్ అకాడెమీ, కలర్ చిప్స్ కంపెనీలలో యానిమేటర్ గా, స్టోరీబోర్డ్ ఆర్టిస్టుగా కొంతకాలం పనిచేసాను. ఆ తర్వాత ETV లో, రామోజీ ఫిలింసిటీ వారి యాడ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసాను. రామోజీ ఫౌండేషన్ వారి తెలుగువెలుగు, బాలభారతం పత్రికలకు artist Cartoonist గా Digital Painter గా పని చేసాను.

చిత్రకారుడుగా, కార్టూనిస్టుగా నా ఈ ప్రయాణంలో ఎంతోమంది గొప్ప కళాకారులతో పనిచేసే అదృష్టం కలిగింది.

నా ఈ ప్రయాణంలో అన్నివేళలా నా వెనుక నుండి సహకరించిన – నా శ్రీమతి బాలస్వప్న నా ‘మనసున మనసైన తోడుకు కృతజ్ఞతలు మనస్సులోనే తెలుపుకుంటున్నాను. నా ఏకైక కుమార్తె స్వాతి తేజస్వి – డెంటల్ సర్జన్ గా పనిచేస్తుంది. అల్లుడు ప్రవీణ్ కుమార్ సాఫ్ట్ వేర్, మనుమరాలు – అక్షయ (3సం.). ప్రస్తుత నివాసం హైదరాబాద్ లో.

చిన్నప్పుడు పత్రికల్లో కార్టూన్లు చూసి అలా కార్టూన్లు వేయాలని ఉబలాటపడి వేయడం ప్రారంభించాక తెలిసింది. అదెంత కష్టమైన విషయమని, సమాజంలోని సమస్యల పట్ల నిశితంగా పరిశీలించి, స్పందించి, దానికి వ్యంగాన్ని, హాస్యాన్ని రంగరించి, కాప్షన్ రాసి, ఆకట్టుకునే విధంగా బొమ్మవేసి, కార్టూన్ రూపొందించడం చిన్న విషయం కాదు – ఎంతో మేధో మథనం జరగాలి, ఎంతో సాధన చేయాలి – అప్పుడే అద్భుతమైన నవ్వించే, అలరించే, గుచ్చుకునే, అలరింపచేసే కార్టూన్లు పుడతాయి.

కార్టూన్ లో బొమ్మలు చూస్తే అర్ధంకాకుండా బొమ్మలతో పాటు Caption కూడా చదివితేనే అర్ధమయ్యేల.. నవ్వు రావాలి. అదే అసలైన కార్టూనని నమ్మి కార్టూన్లు గీస్తున్నాను. స్వర్గీయ శ్రీ వడ్డాది పాపయ్య,

బాపుగార్ల బొమ్మలంటే యిష్టం – చంద్రగారి, బాలి గారి కార్టూన్లు, బొమ్మలంటే ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం. నాకు కాప్షన్ కార్టూన్లంటేనే చాలా యిష్టం! వేలాది కార్టూన్లు గీసినప్పటికీ వాటిని పుస్తకరూపంలో తీసుకురాలేకపోవడం వెలితిగానే వుంది. -గోపాలకృష్ణ

4 thoughts on “నా కార్టూన్స్ తో పుస్తకం తేవాలి-గోపాలకృష్ణ

  1. మిత్రులు గోపాలకృష్ణ గారి పరిచయం చదివితే, వారి ఎదుగుదలకు, ఉన్నతికి చేసిన కృషి తెలిసింది. చక్కటి లైన్ వున్న వీరి కార్టూన్లు నాకెంతో ఇష్టం. మీకు అభినందనలు. మన లాంటి కార్టూనిస్టులకు కళాసాగర్ గారు చక్కటి వేదిక కల్పించి అంతర్జాలం ద్వారా మనకు విశ్వవ్యాప్త కీర్తి తెచ్చిపెడుతున్నారు.
    బొమ్మన్, కార్టూనిస్టు, విజయవాడ

  2. మిత్రులు గోపాలకృష్ణ గారికి అభినందనలు.మీ బొమ్మలు అద్భుతంగా ఉంటాయి.చిత్రకారుడిగా,కార్టూనిస్టుగా…ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ…యువరాజ్ కార్టూనిస్టు

  3. మీ గురించిన విషయాలు తెలుసుకున్నాను . మీ కార్టూన్లు చాలా బాగుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap