నా కార్టూన్‌గేట్రం ‘ హాస్యప్రియ ‘ ద్వారా – ‘గౌతం ‘

‘గౌతం ‘ అనే కలం పేరు తో కార్టూన్లు గీస్తున్న నా పేరు తలాటం అప్పారావు. పుట్టింది 1965 జూన్ 2 న, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం లో. నా కార్టూన్‌గేట్రం 1983 లో క్రోక్విల్ హాస్యప్రియ పత్రిక ద్వారా జరిగింది. అలా మొదలయిన నా కార్టూన్ల ప్రస్థానం 1993 వరకు సాగి దాదాపు గా అని ప్రముఖ వార, మాసపత్రికలలో నా కార్టూన్లు వచ్చాయి.

నిజానికి నా కార్టూన్ హాబీ చిత్రంగా మొదలయింది. చిన్నతనం నుంచి చిత్రకళ మీద నాకు కాస్తో కూస్తో ప్రవేశం ఉంది. దానికి ప్రేరణ చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లాంటి పిల్లల పత్రికలలోని బొమ్మలు. అప్పటిలో ప్రముఖ కార్టూనిస్టులు టీవీ(టీ. వెంకటరావు) మరియు సత్యమూర్తి గార్ల ‘ కార్టూన్లు గీయడం ఎలా? ‘ అనే కార్టూన్ పాఠాలు ఓ రెండు వార పత్రికల్లో (ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి) వచ్చేవి. ఆ పాఠాలు చూసి నాకు చిత్రకళ లో ఉన్న అనుభవంతో కార్టూన్లు గీయడం నాకు నేనుగా నేర్చుకున్నాను.

Gowtham cartoons

డిగ్రీ చేస్తున్నప్పుడు కార్టూనిస్ట్ అంగర వెంకటేశ్వరరావు (కలం పేరు కమల్‌), బొబ్బిలి శ్రీనివాసరావులు నా బెంచ్ మేట్ లు అనడం తో ఆగ్గికి ఆజ్యం పోసినట్టై కార్టూన్లు మేం పోటీ పడి గీశాం.

షరా మామూలే – మొదట్లో నా కార్టూన్లు తిరిగి వచ్చేవి. అయితే మరింత పట్టు వదలని నా ప్రయత్నం వల్లన ఇదిగో ఇలా ఈ నాటికి సుమారు గా 1000 కార్టూన్లు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి.
టీవీ వీక్షణం, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, మొబైల్ ఫోన్లు… ఇలా సాంకేతిక అభివృతి వల్ల పుస్తక పఠనం, పత్రికలు రెండు కనుమరుగు అయిన తరువాత 1993 లో కార్టూన్లు గీయడం మానేశాను. అందరూ కార్టూనిస్టులు తమ కార్టూన్లను ఇపుడు సోషల్ మీడియా లో పెట్టడం చూసి కార్టూన్లు గీయడం పున: ప్రారంభించాను.

cartoon book

ఈ సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది కార్టూనిస్టులు శ్రీయుతులు లేపాక్షి, ప్రసాద్ కాజ, కళాసాగర్, కొడాలి రామ రావు, లాల్(లక్ష్మణ రావు), హరికృష్ణ, అశోక భోగ, TR బాబు… ఇలా చాలా మంది పరిచయం అవడం ఆనందకరమైన విషయం. 80 వ దశకం లో మేము గీసిన కార్టూన్లతో పుస్తకం ప్రచురించాడు మిత్రుడు శ్రీనివాసరావు.

నేను ప్రస్తుతం విశాఖపట్నం లో డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
-గౌతం


Gowtham cartoons
Gowtham cartoon
SA:

View Comments (3)

  • గౌతమ్ గారు మీ అభిమానుల్లో ఒకణ్ణి .మరిన్ని మంచి కార్టూన్లు వేయాలని నా ఆకాంక్ష .