నా మొదటి కార్టూన్ ‘ఆంధ్ర భూమి ‘ లో – గుత్తుల శ్రీనివాసరావు

“నవ్వితే మనం బాగుంటాం, నవ్విస్తే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా బాగుంటారు” నేను నమ్మిన సిద్ధాంతం ఇది.

నా పూర్తి పేరు గుత్తుల శ్రీనివాసరావు. ఇదే పేరుతో నేను కార్టూన్లు గీస్తున్నాను. పుట్టింది జనవరి 2, 1972 లో తూర్పు గోదావరి జిల్లా  కోనసీమలో కాట్రేనికోన మండలంలో దొంతికుర్రు అనే ఒక చిన్న పల్లెటూరు. మా నాన్న గారి పేరు మీరా సాహెబ్. అమ్మ పేరు సత్యవతి.

నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో  ఆంధ్రభూమి వీక్లీ తీసుకునే వారు. నా చేతికి మ్యాగజైన్ రాగానే మొట్టమొదట మల్లిక్ గారి కార్టూన్ల కోసం వెతుకుతూ ఉండేవాడిని. అవి చదువుతుంటే విపరీతమైన నవ్వు పుడుతూ ఉండేది. అలా మల్లిక్ గారి కార్టూన్లు పదే పదే చదివిన తర్వాత ఆయన గీసినట్టుగా కనీసం ఒక కార్టూన్ అయినా గీస్తే బాగుంటుంది అనిపించింది. కార్టూనిస్ట్ గా నాకు స్ఫూర్తి కలిగించింది మల్లిక్ గారే…

చిన్నప్పటినుండి అంటే రెండు మూడు తరగతులు చదివేటప్పటినుండి  చిత్రలేఖనంతో పరిచయం ఉండడం వల్ల కొన్ని ఐడియాలతో ఇంటర్మీడియట్ తర్వాత కార్టూన్లు గీసే ప్రయత్నం చేశాను.
నాకు వచ్చిన ఏవో ఐడియాలతో చాలా కార్టూన్లు గీసి పత్రికలకు  పంపించడం జరిగేది. కానీ పంపించిన కార్టూన్లన్నీ కూడా తిరుగుటపాలో నన్ను వెతుక్కుంటూ వెనక్కి వచ్చేసేవి. కారణం ఏమిటని ఆలోచించగా నాకు అర్థమైన విషయం ఏమిటంటే కార్టూన్ ని ఎలా గీయాలో దాన్ని పత్రికలకి ఎలా పంపించాలో తెలియకపోవడం. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఒకసారి  కార్టూనిస్ట్ శేఖర్(రాజమండ్రి) గారి అడ్రస్ ఆంధ్రజ్యోతి వీక్లీ లో కనిపించింది.

అప్పటికి కొంతకాలం మేము రాజమండ్రిలో ఉండే వాళ్ళం. నేను ఆ అడ్రస్ పట్టుకుని వెళ్లి శేఖర్ గారిని కలవడం జరిగింది. శేఖర్ గారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని కార్టూన్ ఎలా గీయాలి, దానికి కొలతలు ఎలా ఉండాలి?, కార్టూన్ సైజును ఎలా పెంచుకోవాలి?,  పత్రికలకు ఎలా పంపించాలి ? ఇలాంటి విషయాలన్నీ చాలా శ్రద్ధగా వివరించారు. ఇండియన్ ఇంక్ మరియు పాళీల గురించి కూడా తెలియజేశారు. ఆయన చెప్పిన పద్ధతులనే అనుసరిస్తూ మళ్లీ మళ్లీ కార్టూన్లు గీయసాగాను.

1992 జనవరి నెలలో ఆంధ్ర భూమి వార పత్రికలో నా మొదటి కార్టూన్ ప్రింట్ అయింది. అది చూసుకున్న తర్వాత నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.

మొదట్లో నేను కలం పేరుతో కార్టూన్లు గీసే వాడిని. మొదటి కార్టూన్ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే కార్టూన్లు  ప్రింట్ అయ్యేవి. ఐడియాలు మంచివి అనిపించినా కూడా ప్రచురణ కాకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేది. ఒకసారి ఒక పత్రికలో కీర్తిశేషులు కార్టూనిస్టు కాటూరి కృష్ణమూర్తి గారి అడ్రస్ కనిపించింది ఆయన సలహాలు కోరుతూ ఆయనకు ఒక లెటర్ రాశాను. ఆయన దానికి రిప్లై ఇస్తూ కొన్ని సలహాలతో పాటు ఒకసారి కలం పేరు మార్చి నా పేరు కలిసేలా వేరే పేరుతో గీయమని అన్నారు. ఆయన సూచనతో నా పూర్తి పేరు పెట్టి గుత్తుల శ్రీనివాసరావు పేరుతో గీయసాగాను. అలా పంపిన చాలా కార్టూన్ లు ప్రచురణ అవుతూ ఉండేవి, కాటూరి కృష్ణమూర్తి గారి సూచన వల్ల ఇప్పటికీ అదే పేరు కొనసాగుతుంది. ఆ తర్వాత సీనియర్ కార్టూనిస్ట్ బాచి గారు సిగ్నేచర్ లో కాస్త మార్పు చేయమన్నారు. అప్పటినుండి సిగ్నేచర్ ఒక సర్కిల్లో పెట్ట సాగాను. ఈ మార్పు తర్వాత నా కార్టూన్లకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

కార్టూన్ల పోటీలలో అనేకసార్లు బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ప్రారంభంలో కొన్ని పోటీలలో బహుమతులు గెలిచినప్పటికీ వేదికమీద బహుమతి అందుకోవడం మాత్రం మిత్రులు కళాసాగర్ గారు 2005 సంవత్సరం లో  నిర్వహించిన కార్టూన్ల పోటీలలో ప్రోత్సాహక బహుమతి పొందడం ద్వారా జరిగింది. అదే వేదికపై అందుకున్న మొదటి బహుమతి.

తర్వాత అనేక పోటీల్లో బహుమతులు అందుకున్నాను 2017 సంవత్సరంలో విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలో వచ్చిన ప్రథమ బహుమతిని ప్రముఖ చిత్రకారులు,  కార్టూనిస్ట్ బాలి గారి చేతులమీదుగా అందుకోవడం ఓ మధుర జ్ఞాపకం.

ప్రతి సంవత్సరం ప్రపంచ  తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రథమ బహుమతి గా ఇచ్చే శ్రీ తలిశెట్టి రామారావు అవార్డు 2019 లో నేను అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిన సందర్భం.
• 2016 నుండి 2020 వరకూ వరుసగా ప్రతి సంవత్సరం ఈ పోటీలలో బహుమతులు గెలవడం జరిగింది.
• 2018 లో జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి, 2019 జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెలవడం జరిగింది.
• 2020 లో అర్చన ఫైన్ arts (హూస్టన్-USA) వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి దక్కింది.
ఇవికాక రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెలుపొందడం నా అదృష్టం.

ఊహించి ఎన్నో కార్టూన్లు గీస్తూ ఉంటాం కానీ కార్టూన్లలో చూపించినట్టు నిజంగా జరిగితే జరగబోయేది ఊహించినందుకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. అలా 2019 లో చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన ఆక్సీజన్ అమ్మకం పై  కార్టూన్ గీసిన 5 నెలల తర్వాత అలాంటి అమ్మకం ఢిల్లీలో ప్రారంభమైంది.

చదువు పూర్తయ్యాక కొంతకాలం కమర్షియల్ ఆర్టిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత 2008 నుండి ముంబైలో సౌత్ ముంబై చెస్ అకాడమీ ద్వారా చెస్ కోచ్ గా పని చేస్తున్నాను. నా శ్రీమతి పేరు చంద్రకళ. ఇద్దరు అబ్బాయిలు – వినయ్, రామ్ ప్రసాద్ లు బి.టెక్. చదువుతున్నారు.

1992 నుండి ఇప్పటివరకు తెలుగు ఇంగ్లీష్ హిందీ మరాఠి భాషలలో దాదాపు ఎనిమిది వేల కార్టూన్లు గీయడం జరిగింది. మూడు కార్టూన్ సంకలనాలు వెలువరించడం జరిగింది. ఎందరినో నా కార్టూన్ల ద్వారా నవ్వించే భాగ్యం కలగడం నాకు దేవిడిచ్చిన గొప్ప వరం. ఇలాంటి జన్మనిచ్చిన అమ్మ,నాన్నలకు పాదాభివందనాలు.

– గుత్తుల శ్రీనివాసరావు

2 thoughts on “నా మొదటి కార్టూన్ ‘ఆంధ్ర భూమి ‘ లో – గుత్తుల శ్రీనివాసరావు

  1. మీ కార్టూన్లు విభిన్నంగా ఉంటాయి శ్రీనివాసరావుగారూ!అందుకే మీరందుకుంటున్నారు అవార్డులు.

  2. చక్కని పరిచయం… గుత్తుల శ్రీనివాస్ గారూ -మీరు కార్టూన్ రంగంలో మరిన్ని విజయాలు అందుకోవాలిని కోరుకుంటున్నాను !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap