సెలవంటూ వెళ్ళిపోయిన యువ కార్టూనిస్ట్

నన్ను సముద్రపు టొడ్డున ఒదిలేయండి
ముత్యం దొరకలేదని బాధపడను
ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి
ఒక మహాసామ్రాజ్యాన్నినిర్మించుకుంటాను..
నన్ను తూనీగా లాగో, సీతకోకచిలుకలాగో
గాలిలోకి వదిలేయండి పూలు లేవని,
వన్నెల ఇంద్రచాపం లేదని చిన్న బుచ్చుకొను
గాలి భాషకు వ్యాకణం రాసి పారేసి
వర్షాల గురించి వాయుగుండాల గురించి
మీ చెవిలో రహస్యాలను ఊదేస్తాను

  • శిఖామణి

అవును నిజమే కదా! ఎక్కడ ఉన్నా, ఏమైనా కొంతమంది సమున్నతసంకల్పబలంతో, అచంచల ధ్యేయంతో అకుంఠితసాధనచేసి ప్రతిభావంతులుగా రాణిస్తారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని అతి చిన్న వయస్సులోనే అద్భుతాలు సాధిస్తారు. తనచుట్టూ ముసురుకున్ననిరాశ,నిస్పృహలను తరిమికొట్టి, అపూర్వ స్ఫూర్తి కాంతిని దశదిశలా ప్రసరిస్తారు. విషాదాల నిశీధుల్లో ఉషోదయం కలిగిస్తారు.అవరోధాలను అధిగమించి జీవితాన్ని గెలిచే నైపుణ్యాన్నిసమకూరుస్తారు. ఇలాంటి అరుదైన యువ కార్టూనిస్టు నక్కా ఇళయరాజా. పుట్టుకతోనే కండరాలవ్యాధి సంక్రమించినా, పదేళ్లకే వీల్ చైర్ కే పరిమితమైనా లెక్కచేయకుండా, ఇళయరాజా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, నిరంతరకృషితో తన కళాభిరుచికి పుటంపెట్టుకొని వర్ధమాన యువకార్టూనిస్టుగా ఎదిగిఎంతోమంది మన్నలను అందుకున్నాడు. ఇళయరాజా పదిహేనేళ్ల ప్రాయంలోనే వేసిన కార్టూన్ లను చూసి సుప్రసిద్ధ నవలా రచయిత డా. కేశవరెడ్డి అబ్బురపోయాడు. ప్రముఖ చిత్ర కారుడు బాపు, అపురూపమైన ఇళయరాజా కళాగరిమను పరిశీలించి కార్టూనిస్టుగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీస్సులందించాడు. ‘ఇళయరాజా బొమ్మలకథలన్నా, కార్టూన్ లన్నా తనకు చాలా ఇష్టమని ‘చెప్పటమే కాకుండా, ఇళయరాజాను ఇండోనేషియా కార్టూనిస్టు ‘ఆగస్ఎకోసాంటోస్’ తో పోల్చిఅభినందించాడు ప్రఖ్యాత కార్టూనిస్టుజయదేవ్. డా.గురవారెడ్డి, చంద్ర, సినిమాదర్శకుడు పెద్ద వంశీ లాంటి ప్రముఖుల ప్రశంసలందుకున్న నక్కా ఇళయరాజా 1995 జూలై 30 డా. నక్కా విజయరామరాజు, డా. నందిని దంపతులకు జన్మించాడు. ఈ దంపతులిద్దరూ వైద్యవృత్తి రీత్యా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో స్థిరపడ్డారు. డా.నక్కా విజయరామరాజు కేంద్రప్రభుత్వకార్మికశాఖలో చీఫ్ మెడికల్ ఆఫీసర్. అంతే కాకుండా డా.రామరాజు సుప్రసిద్ధ కథారచయిత . మధురమైన ఇళయరాజ సంగీతం పట్ల ఉన్నమక్కువ తో పెద్దకుమారుడికి ఇళయరాజా అని పేరుపెట్టుకున్నాడు. కండరాలవ్యాధిమూలంగా అనారోగ్యం పాలై ఇంట్లోకదలలేనిస్థితిలోవున్నఇళయరాజాకోసం తనకెరీర్ ను త్రోసిరాజని కన్నతల్లి డా. నందిని ప్రతినిత్యం గుండెలమీద పెట్టుకొని కంటికిరెప్పలా కాపాడింది. తల్లిదండ్రులిద్దరూ బాల్యం నుండి ఇళయరాజా అభిరుచిని గౌరవించారు. ఎంతకష్టమైనాసరే కొడుకు ఇష్టాన్నిమన్నించారు. ఇళయరాజా పుట్టినరోజు వేడుకలను ఏఅనాథ శరణాలయంలోనో, చెవిటిమూగపాఠశాలలోనో నిర్వహించి, ఆయాసంస్థలకు దంపతులిద్దరూ తమ కొడుకు పేరుతో విరాళాలు అందించేవారు.ఎంతోమందినిరుపేద విద్యార్థులను దత్తత తీసుకొని కొడిగట్టిపోతున్నవారి జీవితాల్లోకొత్త వెలుగులునింపారు. ఈ వెలుగులతోనే కొడుకు పట్ల తమగుండెల్లో గూడుకట్టుకున్నదిగులు చీకట్లను తొలగించుకున్నారు. బాల్యం నుండి దీనులను,పేదలను, ప్రేమించే సంస్కారాన్ని ఇళయరాజలో నూరిపోశారు. సామాజిక స్పృహను, సృజనకళా స్ఫూర్తిని పెంపోదింపజేశారు.

పువ్వుపుట్టగానే పరిమలించినట్లుగా ఇళయరాజా బడికివెళ్లిన మొదటి రోజునుండే అలవోకగా బొమ్మలు వేయటం ప్రారంభించాడు. బడిలో అక్షరమాల దిద్దకుండా బొమ్మలువేస్తున్న ఇళయరాజాను స్కూల్ టీచర్ బెత్తంతో శిక్షిస్తే, ‘నా బిడ్డ బొమ్మలు వేస్తే మీకొచ్చే నష్టం ఏంటని’ ఇళయరాజా అమ్మగారు డా నందిని ఏకంగా టీచర్ తోనే పోట్లాడింది. అప్పటినుండి ఇళయరాజా తల్లిదండ్రులు అతని రంగులలోకంలో చిత్రాలయ్యారు, అతని బొమ్మల ప్రపంచంలో మమేకమై, బిడ్డచేతిలో పెన్సిల్ గా పేపర్ గా మారిపోయారు. అనుక్షణం ఇళయరాజాను ప్రోత్సహించారు. డా రామరాజు కు చిత్రకళలో ప్రవేశం ఉండడంతో ఇళయరాజాకు తదనుగుణమైన మెళుకువలు నేర్పించాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇళయరాజా బొమ్మలు గీస్తూ చిన్న చిన్న కార్టూన్లు వేస్తూ క్రమక్రమంగా ఈ రంగంలో పట్టుసాధించాడు. గత ఐదు సంవత్సరాలుగా ఇళయరాజా సమకాలీన సామాజిక రాజకీయ పరిస్థితులను వ్యంగంగా వ్యాఖ్యానిస్తూ వందలాది కార్టూన్ లను చిత్రించాడు.కార్టూన్ బొమ్మ గీయటంలో, దానికి అనుబంధంగా హాస్యచతురోక్తి ని పొందుపరచటంలో ఇళయరాజా తనకంటూ ఒక విశిష్ట శైలిని ఏర్పరుచుకున్నాడు. ముందుతరం చిత్రకారులను అనుసరించకుండా స్వతంత్ర కళా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. చిన్న వయస్సులోనే మిక్కిలి లోకానుభవంతో జనరంజకమైన కార్టూన్లను వేసి ఇళయరాజా సీనియర్ కార్టూనిస్టుల అభినందనలు అందుకున్నాడు. కరోనవిపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ యువ కార్టూనిస్ట్ వందకు పైగా కార్టూన్ లు వేసి సామాజిక మాధ్యమాలద్వారా కోవిడ్ పట్ల ప్రజల్లో నిరంతరం చైతన్యం కలిగించాడు. ఇటీవలమహిళలపై పెచ్చుపెరుతున్న అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ఆలోచనాత్మకమైన కార్టూన్ లనుకూడా వేశాడు. ఊరి శిక్షకు సిద్ధమవుతున్నఖైదీ ని ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నిస్తే, ”ఒక సెల్ ఫోన్ ఇవ్వండి వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలి ” అని అన్నట్టుగా ఇళయరాజా వేసిన కార్టూన్ ఎంతోమందిని ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల ప్రభావ తీవ్రతను ఇళయరాజా అద్భుతంగా కార్టూనుల్లోతేటతెల్లం చేశాడు.తన అనారోగ్యాపరిస్థితిని అర్థం చేసుకున్న ఇళయరాజా ”నాకు టైమ్ లేదు మమ్మీ ” ఇంకా మరిన్ని కార్టూన్ లు వేయాలి” అంటూ గత పదిరోజులవరకు అప్రతిహతంగా తన కార్టూన్ కళా యజ్ఞంలోనే ప్రతిక్షణాన్ని గడిపి, జనవరి 16 వతేదీ గుండెపోటుతో మరణించాడు. కేవలం 26 సంవత్సరాల వయస్సులోనే, తనకళాసాధనాస్థావరం ‘వీల్ చైర్’ ను విడనాడి ‘భస్మసింహాసనాన్ని’అధిరోహించాడు. ‘చిన్నారి పూవు రాలిపోతూ కాపు ను వాగ్దానం చేసింది” అని శివసాగర్ అన్నట్లుగా అమూల్యమైన తన కార్టూన్ లను లోకానికి అందించి ఇళయరాజా సెలవంటూ వెళ్లిపోయాడు. ఇళయరాజా వేసిన వందలాది కార్టూన్ లను రమణీయదృశ్యకావ్యంగా వెలువరించటమే అతనికి నిజమైన నివాళి .

డా. కోయి కొటేశ్వర రావు

SA: