96 ఏళ్ళ తెలుగు కార్టూన్ చరిత్ర పుటలను తిరగేస్తే… గత ఆరున్న దశాబ్దాలుగా ప్రతీ పేజీలోనూ జయదేవ్ బాబు గారి నడక పాద ముద్రలు మనకు కనపడతాయి. తనతో నడిచే ఎందరో బుడిబుడి అడుగుల ఔత్సాహిక కార్టూనిస్టుల చేయినందుకొని, పదండి ముందుకు నేనున్నానంటూ… గమ్యం వైపు నడిపించిన మార్గదర్శకుడాయన. తెలుగు కార్టూన్ శతసంవత్సరోత్సవం చూడాలన్న లక్ష్యంతో నేటికీ నిత్యం కార్టూన్లు గీస్తూ ముందుకు సాగుతున్న జయదేవ్ బాబు గారు, సెప్టెంబర్ 13 న 85 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం…
వివరణ అవసరం లేకుండా సూటిగా, సంక్షిప్తంగా, విషయాన్ని పాఠకుడి హృదయానికి హస్తుకునేలా చేసే గొప్ప కళా మాద్యమం కార్టూన్. అందుకే రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాహిత్య, కళా విషయాలతో నిమిత్తం లేకుండా అన్ని రకాల పత్రికలలోనే కాకుండా నేటి సోషల్ మీడియాలోనూ కార్టూన్లకు ప్రత్యేక స్థానముంది. ఇంత శక్తివంతమైన కళాప్రక్రియకు తెలుగులో ఆధ్యుడు శ్రీ తలిశెట్టి రామారావు గారైతే, ఆ తర్వాత తెలుగు కార్టూనను విస్తృత పరచడానికి, ఎందరో యువకార్టూనిస్టులు కలం పట్టడానికి కారకులు అయ్యారు బాపు గారు. ఆ తర్వాత చెప్పుకోవలసిన మరో సీనియర్ కార్టూనిస్టు జయదేవ్ గారు. తనకు తెలిసిన కార్టూన్ కళను ఎంతో ఓపిగ్గా తన తర్వాతి తరాలకు అందివ్వడానికి కృషిచేసిన, చేస్తున్న వ్యక్తి జయదేవ్ గారు. కార్టూన్ రంగంలో తెలుగు’వాడి’తనం చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన జయదేవ్ గారికి తెలుగునాట వున్నంతమంది ఏకలవ్య శిష్యులు బహుశా తెలుగులో మరొకరికి లేరంటే అతిశయోక్తి కాదేమో. తొంభైయేళ్ళ చరిత్ర కలిగిన తెలుగు కార్టూన్ రంగంలో అరవైయ్యేళ్ళ కట్రిబ్యూషన్ జయదేవ్ గారిది.
ఆరు దశాబ్దాల నుంచీ ఆయన ‘గీతా’మృత పానం చేస్తూ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. కుంచె వీడని విక్రమార్కుడిలా గత అరవయ్యేళ్ళలో నలభైవేలకు పైగా కార్టూన్లు పండించారు. ఎందుకంటే కార్టూన్లకు ఆయన గీసే గీత గానీ, రాసే రాత గాని అంత పెర్ ఫెక్ట్ గా వుంటాయి. సునిశితమైన కార్టూన్ వేసినా, ఆటంబాంబు లాంటి జోక్ పేల్చినా, సమాజంపై వ్యంగ్యోక్తి విసిరినా, పురాణ పాత్రలపై సెటైర్లు వేసినా ఏదైనా చాలా సూటిగా, సున్నితంగా ప్రేక్షకుడి మానసాన్ని తాకేలా చేస్తుంది వారి శైలి. పుంఖాను పుంఖాలుగా వేసిన ఆయన ప్రతీ కార్టూన్‌ను కూడా ఇందుకు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సగటు ప్రేక్షకున్నే కాదు తనతోటి కార్టూనిస్ట్ తో పాటు, అభ్యుదయ కార్టూనిస్టులందరికీ కూడా అంతలా నచ్చే, అందరూ మెచ్చే కార్టూనిస్ట్ జయదేవ్ బాబు.
జీవన ప్రస్థానం: జయదేవ్ గా విఖ్యాతి గడించిన సజ్జా జయదేవ్ బాబు కడపలో 1940 సెప్టెంబర్ 13న జన్మించారు. కానీ పెరిగిందీ, చదివిందీ తన తాతగారి ఇంటివద్ద మద్రాస్ లోనే. లైఫ్ సైన్సెస్ లో డాక్టరేట్, పొందిన జయదేవ్ మద్రాస్ సర్ త్యాగరాయ కళాశాలలో బయాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన జయదేవ్ గారికి సంసారభారం మోయాల్సి వచ్చింది. ఒక పక్క ఉమ్మడి సంసార బరువు బాధ్యతలు చూస్తూనే కార్టూనింగ్ ను హాబీగా చేసుకున్నారు. కార్టూనిస్టుగా ఆయన్ను మొదట ప్రోత్సహించింది ఆనాటి ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఎడిటర్ శ్రీ శివలెంక రాధాకృష్ణగారు. 19 ఏళ్ళ వయసులో ఆయన తొలి కార్టూన్ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది 1959లో. ఇహ అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కార్టూన్ క్యారెక్టర్లు రూపుదిదుకున్నాయి. నాటి విజయ, యువ పత్రికలు మొదలుకొని నేటి స్వాతి, హాస్యపు హరివిల్లు లాంటి పత్రికలతో పాటు గోతెలుగు.కామ్., 64కళలు డాట్ కామ్ లాంటి అంతర్జాల పత్రికలలో ఫేస్ బుక్, వాట్స్ యాప్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలలోనూ రెట్టించిన ఉత్సాహంతో నేటికీ కార్టూన్లు గీస్తూనే ఉన్నారు.
ప్రత్యేకశైలి: జయదేవ్ గారు తన మధ్యతరగతి జీవితంలోని కష్టాలనుంచి, సుఖాలనుంచి, ఆనందాలనుంచి, విషాదాలనుంచి ఎన్నో కార్టూన్లు సృష్టించారు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అని నమ్మి, నిరంతర పరిశీలన, సామాజిక మార్పుల అనుశీలనతో ఎప్పటికప్పుడు నిత్య నవీనంగా కార్టూన్లు గీస్తున్నారు.
జయదేవ్ గారి మాట ఎంత మృదువో ఆయన గీత అంత పదును. ఆ గీతకు రాసే వ్యాఖ్యలో ఇన్నేళ్ల అనుభవం తొంగిచూస్తుంది. ఇంతటి సాఫ్ట్ మనిషి ఇంత పంచింగ్ గా కార్టూన్లు ఎలా పేల్చగలుగుతున్నారా అని ఆశ్చర్చపోక తప్పదు. తను విభేదించే విషయాల్ని సైతం ఎంతో నింపాదిగా, నొప్పించకుండా వ్యక్తీకరించటం జయదేవ్ గారి స్పెషాలిటీ. తెలుగువారు గర్వించదగిన మేటి కార్టూనిస్టు జయదేవ్. సోషల్ థీమ్స్ కే తన కార్టూన్లను పరిమితం చేసుకున్నారు. అయినా తెలుగువారి వ్యంగ్య వైభవానికి ఆయన కార్టూన్లు నిలువుటద్దాలు. జంతువుల పైన ఎక్కువుగా కార్టూన్లు గీసిన వారిలో వీరిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
సాధారణంగా చిత్రకారుడు గీసే రేఖలలో(స్ట్రోక్స్) హెచ్చుతగ్గులు చూపించినపుడు మాత్రమే ఆయా రేఖలు సౌందర్యవంతంగా కనిపిస్తాయి. అలా కాకుండా ఏకరీతిలో సాగే రేఖల్లో సౌందర్యం అంతగా కానరాదు. కానీ జయదేవ్ గారి రేఖల స్థాయిల్లో అలాంటి వ్యత్యాసం ఏమీలేకుండా ఏకరీతిలో సాగే వారి సన్నటి గీతల్లో సైతం ఎంతో జీవం కనిపిస్తుంది. డ్రాయింగ్ పై ఆయనకు గల మంచిపట్టు దీనికి కారణమౌతుంది. ఎలాంటి భంగిమనైనా, సన్నివేసాన్నైనా చాలా సింపుల్ గా, చక్కని అమరికతో గీసే కార్టూన్లలో భావయుక్తంగా రాసే వ్యాఖ్యలు చూసే ప్రేక్షకుడి మానసాన్ని హత్తుకునేలా చేస్తాయి. తెలుగు కార్టూన్లు స్వర్ణయుగం అనదగిన 1980-1995 మధ్యకాలంలోని యువకార్టూనిస్టులెందరో జయదేవ్ బాబుగారి ఏకలవ్య శిష్యులే కావడం గమనార్హం.
విజయబావుటా.. 1997 వరకూ మద్రాసు యూనివర్శిటీలో పి.జి. స్థాయి విద్యార్థులకు జూవాలజీ టీచ్ చేసిన ఆయన తెలుగు పత్రికల్లోనే కాక రీడర్స్ డైజెక్టవంటి జాతీయ పత్రికల్లోనూ వేలాదిగా కార్టూన్లు గీశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగిన కార్టూను పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిల్లోనే గాక అంతర్జాతీయస్థాయిలో కూడా కార్టూనిస్ట్ ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచారు. Youmiri simbun (యామిరిసింబన్) Okhotsk లాంటి జపాన్ పత్రికలతో పాటు, ప్రఖ్యాతి గాంచిన Knokkehist (నాకీ హేస్ట్) లాంటి బెల్జియమ్ పత్రికలల్లో సైతం ఎన్నో కార్టూన్లు జయదేవ్ గారివి ప్రచురింపబడ్డాయి.
అంతేగాక ఆస్ట్రేలియా, అర్జెంటైనా, బ్రెజిల్, బల్గేరియా, ఇటలీ, ఇరాన్, సైప్రస్, కొరియా, టర్కీ లాంటి దేశాలలో జరిగే అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో జయదేవ్ గారి కార్టూన్లు ప్రదర్శింపబడడమే గాక ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్నారు. 1986లో ఇటలీలో జరిగే ప్రపంచ ఫుట్ బాల్ పోటీల సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్టూన్ ప్రదర్శనలే కాక, 1986 నుండి 1996 వరకూ వరుసగా ఆయన కార్టూన్లు బెల్జియమ్ దేశంలో ప్రదర్శించబడడం ఎంతో గొప్ప విషయమేగాక 1996లో బెల్జియమ్ లో జరిగిన అంతర్జాతీయ కార్టూన్ పోటీలకు జయదేవ్ గారిని జ్యూరీమెంబర్‌గా ఎంపిక చేయడం తెలుగువాడిగా, భారతీయుడిగా మనం ఎంతో గర్వించదగిన విషయం.
యానిమేషన్ రంగంలో…
1997లో ప్రముఖ చిత్రకారుడు, యానిమేషన్ ఎక్స్పర్ట్, ఉతమ్ జయదేవ్ గారిని హైదరాబాదు కు ఆహ్వానించి హార్ట్ యానిమేషన్ ఎకాడమీకి ప్రిన్సిపాల్ గా నియమించారు. అక్కడ దేశంలోనే ప్రప్రథమ 2డి యానిమేషన్ కోర్స్ మెటీరియల్, అమెరికన్ నిపుణుల సాయంతో రూపొందించడమే గాకుండా, విద్యార్థులకు యానిమేషన్ సూత్రాలను బోదించారు. 2000 సం||లో కలర్ చిప్స్ సంస్థలో చేరి అక్కడ క్రియేటివ్ డైరెక్టర్ గా యానిమేషన్ ఐడియాలను సృష్టించడమేగాకుండా పలు ప్రాజెక్టులను డైరెక్ట్ చేసారు. స్వతహాగా కార్టూనిస్టు కావడంవల్ల ఇది వారికి సులభ సాధ్యమైంది.
అవార్డులు–సత్కారాలు:
ట్రేడ్ ఫేర్ అధారిటీ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ, నిర్వహించిన పోటీలో జయదేవ్ గారి “నోస్మోకింగ్ కార్టూన్” బహుమతి పొందింది. ఢిల్లీకి వీరిని ఆహ్వానించి, TFAI చెయిర్ మన్, మహమ్మద్ యూనస్ గారి ద్వారా బహుమతి అందజేసారు. మరోమారు ‘కేర్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ కార్టూన్ కాంటెస్ట్’లో వీరి “వనదేవతశాపం” బొమ్మల కథ బహుమతి పొందింది. అప్పటి కేంద్రమంత్రి శ్రీ కమలనాథ్ గారు సర్టిఫికేట్ తోపాటు బహుమతినందించారు. ప్రముఖ దర్శకుడు వంశీ నిర్మించిన “లేడీస్ టైలర్’ చిత్రానికి కార్టూన్ ఎడ్వర్ టైజ్ మెంటు పోస్టర్స్ చేసి ప్రశంసలనందుకుని ట్రోఫీ అందుకున్నారు. మరో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మించిన మాయలోడు చిత్రానికి వీరు గీసిన కార్టూనులు చిత్ర విజయానికి (వారి రాజేంద్రుడు గజేంద్రుడు, ఘటోత్కచుడు చిత్రాలకి కూడా)
దోహదపడ్డాయి. ఆ కార్టూన్లతోనే ట్రోఫీలు రూపొందించారు. హైదరాబాదులో జరిగిన ఆ సినిమా వందరోజుల విజయోత్సవ సందర్భంగా వేదిక మీద, వేల సంఖ్యలోని ప్రేక్షకుల మధ్య, హాస్యనట శేఖరుడు రాజేంద్రప్రసాద్ ద్వారా ఫీ అందుకోవడం జయదేవ్ గారికి జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా పేర్కొంటారు. సినిమా ఫీల్డులో కార్టూనిస్టుకు లభించే గుర్తింపు అమోఘం అని ఆరోజు తెలిసిందంటారు జయదేవ్ గారు. ఎన్ని అవార్డులు-సత్కారాలు పొందినా, 2002 సంవత్సరం హైదరాబాదులో మార్చి 11 న ఏ.పి. ప్రెస్ అకాడమీ, ఫోరంఫర్ పొలిటికల్ కార్టూనిస్టులు సంయుక్తంగా నిర్వహించిన కారూ ఉత్సలో ‘శ్రీ బాపూగారి చేతుల నుండి పొందిన సత్కారం, ఆ అనుభూతి వర్ణనాతీతం!’ అంటారు జయదేవ్ గారు. బాపు గారే నా గీతల గురువు అని చెప్పుకొనే జయదేవ్ గారు, బాపు-రమణ అకాడెమీ, హైదరాబాద్ వారి తొలిపురస్కారం జయదేవ్ గారే అందుకోవడం విశేషం.
రచనలు-పుస్తకాలు: వీరి మొదటి కార్టూన్ పుస్తకం ‘స్వాతి’ పత్రిక వారు ప్రచురించారు. రెండవది ‘జయదేవ్ కార్టూన్లు’ పేరుతో మీడియా సూస్ వారు 2002 లో ప్రచురించారు. 2009లో వీరి జీవిత అనుభవాలను, అనుభూతులను ఆత్మకథగా ‘గ్లాచ్యూ మీట్యూ-1’, ‘గ్లాచ్యూ మీట్యూ-2’ పేరుతో రాసారు. ఇది ప్రతీవారు ముఖ్యంగా సృజనాత్మకరంగంలో నున్న వారు తప్పక చదవదగిన పుస్తకం. ఇంకా అనేక మంది మిత్రుల పుస్తకాలకు కార్టూన్లు, బొమ్మలు అనేకం గీసారు.
కుటుంబం: జయదేవ్ గారికి 1964 లో రాజలక్ష్మి గారితో వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు. ‘మా ఇద్దరికీ ఒక కొడుకు పుడితే చాలనుకున్నాం, కాని మాకు నలుగురు కొడుకులు బహుమానంగా వచ్చారు..! అల్లుళ్ళ రూపంలో’ అని చమత్కరిస్తారు జయదేవ్ గారు.
జయదేవ్ గారితో నా అనుబంధం:
2002 సంవత్సరంలో ‘ఆస్కా’ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ‘కార్టూన్ మేళా’ ముఖ్య అతిధిగా జయదేవ్ గారిని మేము ఆహ్వానించడం, వారు ఆనాటి సభకు హాజరుకావడంతో మా పరిచయం ప్రారంభమైంది. తర్వాత రోజుల్లో మేము నిర్వహించిన అనేక కార్యక్రమాలకు వారి తోడ్పాటునందించారు. వారు ‘కార్టూన్ మేళా’ లో పాల్గొన్న నాటి ఫోటో ఇక్కడ చూడవచ్చు. ఒక్క విజయవాడకే కాదు, ఖమ్మం, నెల్లూరు, హైదరాబాదు, బెంగులూరు వంటి అనేక ప్రాంతాలకు వెళ్లి కార్టూనిస్టులను ప్రోత్సహించారు.
1997లో ఆయన ఉద్యోగ విరమణ చేసిన నాటి నుండి 1999 వరకూ అక్కినేని హార్ట్ ఏనిమేషన్లో మూడేళ్ళు ప్రిన్సిపల్ గాను, ఆ తదుపరి 1999 నుండి 2004 వరకూ కలర్ చిప్స్ ఇండియా, హైదరాబాద్లో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి, మరికొంతకాలం ‘ జయం’ భక్తి మాసపత్రికకు సంపాదకులుగా భాద్యతలు నిర్వర్తించి… ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. వరల్డ్ తెలుగు కార్టూనిస్టు వాట్స్ యాప్ గ్రూపు ద్వారా రెగ్యులర్ గా అనేక అంశాలపై కార్టూన్ అసైన్మెంట్స్ ఇస్తుంటారు. ఇందులో ఎందరో కార్టూనిస్టులు ఉత్సాహంతో పాల్గొని తమతమ అభిప్రాయాలను పంచుకుంటూ కార్టూన్ కళను మెరుగుపరచుకుంటున్నారు.
ఎనిమిది పదులు వయసులో సైతం ఆయన తన అందమైన కార్టూన్లకు కంప్యూటర్ సాయంతో వర్ణాలద్ది మరింత సౌందర్యభరితం చేస్తూ పాఠకులను ఉర్రూతలూగించడమేకాక నేటి యువ కార్టూనిస్టులకు తగు సూచనలిస్తూ నిత్య యవ్వనుడిగా కార్టూన్ కళామతల్లికి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమైనది. కోట్టాది తెలుగు వారికి నవ్వులు పంచుతున్న ఈ జీవి… చిరంజీవి కావాలని, చిరకాలం కార్టూన్ కళామతల్లి సేవలో తరించాలని ఆకాంక్షిస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
–కళాసాగర్ యల్లపు (9885289995)
శుభాకాంక్షలు:_______________________________________________________
కార్టూన్లు వేయాలని పత్రికలలో నా కార్టూన్స్ కూడా అచ్చులో చూసుకోవాలని అనిపించింది జయదేవ్ గారి కార్టూన్స్ చూసాకే.. అప్పట్లో ఏపత్రిక చూసినా పుంకాను పుంకాలుగా జయదేవ్ కార్టూన్లే ఉండేవి. వాటిని చూసే చాలామంది కార్టూనిస్టులు తయారయ్యారని నా అభిప్రాయం. ఇప్పటికీ ఆయన జోరు తగ్గలేదు. అదే స్పీడ్. దశాబ్దాలుగా కార్టూన్స్ వేయడం లో ఆయన ఎక్కడా విరామం తీసుకోలేదు. లెక్కలేనన్ని ఇన్ని వేల కార్టూన్స్ వేసిన కార్టూనిస్టులు ఇండియాలోనే ఉండి ఉండరు. కార్టూన్ బొమ్మల్లో అప్పటికి, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన శైలి ప్రత్యేకం. ఆయన ఆలోచనలు కాలానుగుణంగా మారుతూ వస్తుంటాయి. ఈ మధ్య ఆయన వేస్తున్న కొన్ని కార్టూన్స్ చూస్తుంటే ఆ విషయం అర్థం అవుతుంది. మనకి చాలా జాగ్రత్తగా పరిశీలించే విషయ పరిజ్ఞానం ఉండాలి. తెలుగు కార్టూనిస్ట్స్ లకు ఆయన గురువు. గురువు గురించి మనం చెప్పేదేముంది. ఆ గురువు శిష్యులను మెచ్చుకునేలా మనం ఎడగాలిగాని. “కార్టూన్ గురూ” కి జన్మదిన శుభాకాంక్షలు.
-రాజు ఈపూరి, హైదరాబాద్
______________________________________________________________________
కాప్షన్ లెస్ కార్టూన్స్ గీయడంలో మేరు నగధీరులు… సృజనాత్మక ఆలోచనలతో అద్భుతమైన రేఖలతో వ్యగ్యానికి ప్రాణంపోసే అపర గీతా బ్రహ్మ… ఎందరో కార్టూనిస్టులకు ఆయన గురువు. మరెందరో ఆయనకు ఏకలవ్య శిష్యులు. తెలుగు కార్టూన్ చర్చ వస్తే జయదేవ్ గారిని స్మరించకుండా వుండలేము. అంతటి గొప్ప మార్గదర్శకుడాయన…. నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యలాతో విలసిల్లాలని కోరుకునే శిష్య గనకోటిలో ఒకడు ఈ శేఖరుడు…
–శేఖర్, కార్టూనిస్ట్, రాజమండ్రి
_____________________________________________________________________________
కార్టూన్ కళలో అంతర్జాతీయ అవగాహన కల్గిన ఆద్ర్శ కార్టూనిస్ట్ జయదేవ్. తెలుగు కార్టూనిస్టులెందరికో ఆయన మార్గదర్శి గా వున్నారు. నేను విశ్వచిత్రకళ నిర్వహణ సమయంలో కార్టూన్ కళ గురించి ఎన్నో వ్యాసాలు రాసారు. సుప్రసిద్ద మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కి గురువు జయదేవ్ బాబే. వెయ్యి పున్నములు చూసిన ఆయన మరెన్నో పున్నములు చూడాలని, మన కార్టూనిస్ట్ లందరికి మార్గనిర్దేశనం చేయాలని ఆశిస్తూ…
-సుంకర చలపతిరావు,విశాఖపట్నం
______________________________________________________________________________
గురుతుల్యులు డా. జయదేవ్ బాబు గారు కార్టూనిస్టులకు గొప్ప స్ఫూర్తి ప్రదాత. వారి కార్టూన్స్ చూస్తూ ఏకలవ్య శిష్యుడిగా ఎదిగిన వాళ్ళల్లో నేనొకణ్ణి. అడిగిన వారికి ఎంతో ఆదరంతో సలహాలు, సూచనలు ఇచ్చి ఎంతో ప్రోత్సహించే సహృదయులు.వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ…
-బొమ్మన్ కార్టూనిస్ట్ – విజయవాడ.
______________________________________________________________
డా. జయదేవ్ బాబు గురించి నాలుగు మాటల్లో చెప్పలేం. ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది . కార్టూనిస్టులకు ఇష్టుడు. కార్టూన్ల యజ్ఞం చేస్తూ ఎందరికో మౌనంగా సమాధానం ఇస్తున్న సేనాని.
ప్రతిరోజూ సరికొత్తగా గీస్తూ ఆలోచనలకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న వ్యక్తి. నేర్చుకుంటూ నేర్పుతూ అందనంత ఎత్తుకు ఎదిగిన మృదు స్వభావి. ఎంతో నేర్పుతో తన జీవితాన్ని గుదిగుచ్చిదండగా మనకు అందించిన “గ్లాచ్చు మీచ్యు” ఎన్నో కొత్త సంగతులు చెబుతుంది . తెలుగుదనం నిండిన కార్టూన్లు గీయడం జయదేవ్ గారికే సొంతం. వారి ఉత్తరాలు ఎందరికో పాఠాలు. వారికి ఊరూరా శిష్యులే.. పరిపూర్ణ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. వారు ఇంకా గేస్తూనే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 80వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
-డాక్టర్ రావెళ్ల శ్రీనివాసరావు
_________________________________________________________________
తెలుగు వ్యంగచిత్రకారుల కీర్తి కిరీటం ‘జయదేవ్ ‘గారంటే అతిశయోక్తి కాదు…. ఎంత ఎదిగినా ఒదిగి వుండాలనీ, ఎన్ని గీతలు గీసినా, ఇంకా ఎన్నెన్నో ప్రయోగాలు మిగిలే వుంటాయనీ, తరతమ వయో బేధాలు లేకుండా ఎవ్వరితోనైనా స్నేహం చేయవచ్చనీ … వ్యంగ్యచిత్రాలు ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా, వృద్ధాప్యాన్ని సైతం వెనుకకు నెట్టుతాయని నిత్యం ఋజువు చేస్తున్న నిలువెత్తు నిదర్శనం జయదేవ్ బాబు గారు. నా తొలి పుస్తకం ‘భువన్ నవ్వులు ‘కు ముంజేతి కంకణం లాంటి ముత్యాల ముందుమాట రాసిచ్చిన గురువుగార్కి నేను ఎప్పటికీ కృతజ్ఞుడనే. ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ….
డా. భువన్ -కార్టూనిస్ట్, రచయిత, అనకాపల్లి
______________________________________________________________________
పూజ్యులు గురువుగారు డాక్టర్ జయదేవ్ బాబు గారికి 80వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరి ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవునిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకున్న ఏకలవ్య శిష్యులలో నేను ఒకడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మీరు వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలు చదివి నా యొక్క కార్టూన్ స్కిల్ డెవలప్ చేసుకున్నాను. మీరు స్వాతి లో రాసిన విదేశీ కార్టూన్ వివరాలు చదివాను. అర్థం చేసుకున్నాను మీరు వివిధ దేశాల్లో సెలెక్ట్ అయిన మీ సైలెంట్ కార్టూన్లు చూసి అవగాహన చేసుకున్నాను. ఏ కార్టూనిస్టు ఏ ప్రశ్న వేసినా అరటి పండు వలసినంత ఈజీగా సమాధానం చెబుతారు. ఎప్పుడు పాజిటివ్ ఎంకరేజ్ చిరునవ్వుతో అందిస్తారు. గురువుగారు ఇతరుల కార్టూన్స్ చూచి ఎంతో సంతోషిస్తారు. ఎంకరేజ్ చేస్తారు అభినందిస్తారు. మీరు మీ కుటుంబం ఆ దేవుని దయవల్ల చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకుంటూ…
మీ శిష్యుడు
-కొండ రవి ప్రసాద్ కార్టూనిస్ట్, హుజూరాబాద్
____________________________________________________________________________
క్రోక్విలెత్తిన వి ‘జయ్’ డు
వ్యంగ్య గీతల ‘దేవ్’ డు
ఎనభై ఏండ్ల యువకుడు
ఎప్పటికీ చిరంజీవుడు
డా. జయదేవ్ గారితో మల్లెతీగకు మంచి అనుబంధం వుంది. మొదటి నుండి ఆయన ఆశీర్వాదం మల్లెతీగకు కొనసాగుతూనే వుంది. మల్లెతీగ నిర్వహించిన అనేక కార్టూన్ల పోటీలకు జయదేవ గారు న్యాయనిర్ణేతగా వ్యవహరించి, బహుమతీ ప్రదానోత్సవ సభలకు విజయవాడ హాజరయ్యారు. అలాగే మంగళగిరి హైలాండ్ల్లో జరిగిన రేపటికోసం పత్రిక నిర్వహించిన తొలివార్షికోత్సవ వేడుకలకు అతిధిగా హాజరై కార్యక్రమాల్ని ఎంతో విజయవంతం చేసారు. ఆయన ఎందరికో గురువు..ఎప్పటికీ ఒంగిపోని గొప్ప వ్యక్తిత్వపు తరువు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు .
-కలిమిశ్రీ, మల్లెతీగ, విజయవాడ
____________________________________________________________________________
గురుదేవులు శ్రీ జయదేవ్ బాబు సర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు…
శతాధిక సంవత్సరాలు ఇలాగే వారి కార్టూన్
హాస్యౌషధామృత గుళికలు రోజూ అందిస్తూ…
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గురువు గారితో బెంగళూరు లో దిగిన సెల్ఫీ ఎప్పటికీ నాకు మరిచిపోలేని అపురూపమైన కానుకగా భావిస్తున్నాను.ఆ తర్వాత వారిని హైదరాబాద్ తెలుగు మహాసభలు కార్టూన్ ప్రదర్శన లో కలుసుకున్న అపురూపమైన క్షణాలు మదిలో ఎప్పటికీ పదిలం.ఆ సమయంలో నా ఆర్ట్ వర్క్స్ గురువు గారికి చూపించే భాగ్యం నాకు కలగడం వారి సూచనలు సలహాలు స్వీకరించే మహద్భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం …
ఆశోక్ బోగా, ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్
_____________________________________________________________________________
Happy birthday Dr Jayadav Garu.
ఆర్టికల్ చాలా బాగుంది సర్.
గురుదేవులు శ్రీ జయదేవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎందరో కార్టూనిస్టులకు స్ఫూర్తిప్రదాత .ఆ రాత గీత అన్ని వర్గాలకీ ఆమోదయోగ్యం. ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో కూడా ఆ గీతకు తిరిగి లేదు అందరికీ నచ్చే లా. నచ్చే meche simple and great లైన్ gala కార్టూనిస్ట్ మా గురువుగారు శ్రీ జయదేవ్. ఆయన ఏకలవ్య శిష్యుని nenu…నేనేంటి ఇంచుమించు తెలుగులో చాలా మంది కార్టూనిస్టుల ఆయన ఏకలవ్య శిష్యులు .అందుku అందరికీ గర్వంగా ఉంటుంది .ఆ గీత ,రాత చూస్తుంటే ఆయనకు 80 సంవత్సరాలు అంటే నమ్మలేం .. ఆ గీతల్లో jeevan,veegam, రాతల్లో వాడి ,చమక్కులు మెరుపులు …ఐడియా లో కొత్తదనం నూతనత్వం చూస్తుంటే ఆశ్చర్యం ఇంకా ఎన్నో సంవత్సరాలు పుట్టిన రోజులు ఆనందంగా జరుపుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను… ఈరోజు నేను కార్టూనిస్ ga gurtimpuku కారణం మా గురువు శ్రీ జయదేవ్ గారే వారికి నా కృతజ్ఞతలు వందనాలు పాదాభివందనాలు
Super